క్యాంపు రాజకీయం షురూ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • శిబిరాలకు తెరలేపిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌
  • బెంగళూరు, గోవాకు మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్‌ అభ్యర్థులు
  • రామగుండం కార్పొరేషన్‌ అభ్యర్థులు హైదరాబాద్‌కు
  • నా భార్యకు మద్దతు ఇస్తే రూ.10 లక్షలు, క్రిస్టాకారు
  • సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ నేత బంపర్‌ ఆఫర్‌

మంచిర్యాల : మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. పలు ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. శనివారం కౌంటింగ్‌ జరగనుండడంతో అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్‌ మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గురువారం బెంగళూరు, గోవా, నాగపూర్‌ క్యాంపు కోసం పంపుతున్నారు.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు ఫలితాల అనంతరం పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఉద్దేశ్యంతో క్యాంపులు పెడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్‌ దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో గురువారం సమావే శమయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థులతో మాజీ ఎంఎల్‌సీ ప్రేంసాగర్‌రావు సమావేశమయ్యారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థులు కౌన్సిలర్‌లకు రూ. 2లక్షల చొప్పున ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని కొన్ని చోట్ల ప్రచారం సందర్భంగానే అప్పగించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీలోనూ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించారు. శనివారం జరిగే కౌంటింగ్‌కు తర్వా త గెలిచిన అభ్యర్థులను ఆయా పార్టీలు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నాడే క్యాంపు నుంచి నేరుగా మున్సిపాలిటీ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

ఎమ్మెల్యే కోరుకంటి ఆధ్వర్యంలో క్యాంపు: పెద్దపల్లి జిల్లా రామగుండం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి క్యాంపునకు తరలించారు. 50డివిజన్లలో 25 నుంచి 30 డివిజన్లు గెలుస్తామని ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌ మేయర్‌ పీఠం కోసం ముందస్తు వ్యూహం సిద్ధం చేసింది. రామగుండంలో రెండో స్థానంలో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ఉండే అవకాశం ఉండడంతో కార్పొరేటర్లను పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఓట్ల లెక్కింపు తరువాత గెలిచిన అభ్యర్థులను క్యాంపులోనే ఉంచుకుని మిగిలిన వారిని పంపించే అవకాశం ఉంది. వీరిని తొలుత రాజధానికి తరలిస్తున్నారు. మరోవైపు.. టీఆర్‌ఎస్‌ రెబల్స్‌గా పోటీ చేసి గెలుపు అవకాశాలున్న పలువురు రామగుండంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి టచ్‌లోకి వస్తున్నారు. పార్టీ గెలిచే అవకాశాలు ఉండడంతో మధ్యవర్తుల ద్వారా రాయబారాలు పంపుతున్నట్టు సమాచారం.

మద్దతిస్తే 10లక్షలు, క్రిస్టా కారు: రూ. 10లక్షల నగదు.. ఒక ఇన్నోవా క్రిస్టాకారు.. సంగారెడ్డి మునిసిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవడానికి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులకు సంగారెడ్డి మునిసిపాలిటీ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఆ పార్టీనేత ఒకరు ఇస్తున్న బంపర్‌ ఆఫర్‌ ఇది. 38 వార్డులున్న సంగారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిక సీట్లు గెలుచుకుంటుందన్న ధీమాతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నది.

అందుకే చైర్‌పర్సన్‌ కుర్చీపై కన్నేసిన టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలి భర్త, పార్టీ నాయకుడు తమ పార్టీ తరఫున గెలుస్తారని భావిస్తున్న కౌన్సిలర్లను నజరానాలతో ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడి చైర్‌పర్సన్‌ పదవిని టీఆర్‌ఎ్‌సలోనే ఇద్దరు నేతలు ఆశిస్తుండడంతో ఆయన ఈ ఆఫర్‌ ప్రకటించినట్లు తెలిసింది. ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ కౌన్సిలర్లతో నాయకత్వం జరిపేన సమావేశంలో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా తన భార్య పేరును ప్రతిపాదించాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ క్యాంప్‌!: నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నియోజకవర్గంలోని చిట్యాల మునిసిపాలిటీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడ పోరు నువ్వానేనా అన్నట్టు ఉండటంతో క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. చిట్యాలలో మొత్తం 12వార్డులు ఉండగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెబల్స్‌, సీపీఎం కూటమిగా ఏర్పడ్డాయి. ఆరు వార్డుల్లో కాంగ్రెస్‌, ఐదు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఒక వార్డుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి నకిరేకల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్‌, మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ కూటమి తన అభ్యర్థులను జిల్లా సరిహద్దులు దాటించింది.

బెట్టింగ్‌ జోరు: మునిసిపాలిటీ ఎన్నికల్లో గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో అధికార టీఆర్‌ఎ్‌సతో ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున మాజీ మంత్రి జూపల్లి అనుచరులు హోరాహోరీ తలపడడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. పది లక్షలవరకు బెట్టింగ్‌లు సాగుతున్నాయి. యాదాద్రి జిల్లా, కుమ్రంభీం, ఖమ్మం జిల్లాల్లోనూ పలు వార్డుల విజయావకాశాలపై పందేలు సాగుతున్నాయి. సిరిసిల్ల మునిసిపాలిటీ ఐదో వార్డులో ప్రలోభాలతో ఏకగ్రీవం చేశారని, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఓటర్లు కలెక్టరేటు ఎదుట ధర్నా చేశారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates