రోహిత్ వేముల చనిపోయిన నాలుగేళ్ల తర్వాత కూడా పబ్లిక్ యూనివర్సిటీ ఇంకా ఎన్నో పాతవీ,కొత్తవీ సమస్యలతో సతమతమౌతూనే ఉంది.

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  సతీశ్ దేశ్ పాండే.Related image

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపే యూనివర్సిటీ స్వయంప్రతిపత్తిని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఐతే ఆ ప్రయత్నాల్లో రాజకీయ నాయకులూ,అధికారుల ప్రమేయం కన్నా విద్యావంతుల ప్రమేయమే ఎక్కువగా ఉంది.

ప్రజలకి ఏదీ ఎక్కువకాలం గుర్తుండదు,ఇప్పటికే చాలామంది రోహిత్ వేముల పేరు కూడా మర్చిపోయి ఉంటారు. పేరుతో పాటే ఆ సమయంలో దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలూ,ఉన్నత విద్యా వ్యవస్థలో రోహిత్ మరణం ఎత్తిచూపిన లోపాలనీ మర్చిపోయే ఉంటారు. రోహిత్ వేముల నాలుగో వర్థంతి సందర్భంగా మన విశ్వవిద్యాలయాలకి జరిగిన హాని గురించి మాట్లాడుకోవడం సరైన సమయంలో చర్చించడమే ఔతుంది. ఐతే ఈ హాని పోలీసుల చేతిలో లాఠీలో,ముసుగులు వేసుకుని వచ్చిన ఆగంతకుల చేతిలో ఐరన్ రాడ్ లో చేసింది కాదు. కారణాలు మరింత లోతుగా పరిశీలిస్తే అర్థమౌతాయి.

మన విశ్వవిద్యాలయాలని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఓ మూడు మాత్రం పైకి కనిపించకపోయినా దీర్ఘకాలంలో అవి చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

సామాజిక న్యాయం దిశగా కృషి చేసే ప్రయత్నాల్లో ఎప్పుడూ ముందుండే విశ్వవిద్యాలయాలపై దుష్ప్రచారం ద్వారా వాటి ప్రాముఖ్యతని తగ్గించడం అనేది నేడు మనం ప్రతిచోటా చూస్తున్నాం. సామాజిక అసమానతలు చాలా ఉన్న మన దేశంలో ఉన్నత విద్య ద్వారా ప్రజలకి వాటిపై అవగాహన కల్పించి వాటిని రూపుమాపేందుకు తోడ్పడే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరగడం కూడా ఈ ఆశయం మరింత త్వరగా వాస్తవరూపం దాల్చడానికి అనుకూలమైన పరిస్థితులే అని చెప్పొచ్చు.

ఐతే ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో తేలినట్టుగానే ఇక్కడా విద్యాసంస్థల సంఖ్య మాత్రం పెరిగింది గానీ నాణ్యమైన విద్యని అందించడంలో మాత్రం వెనుకబడిపోతున్నాయి. ఆధిపత్య వర్గాలు నాణ్యమైన విద్యని అందించే విద్యా సంస్థలని తమ గుప్పిట్లోనే ఉంచుకుని అందరికీ ఉన్నత విద్య అనే అత్యున్నత ఆశయాన్ని నీరుగార్చాయనే చెప్పొచ్చు. కొంతకాలం వరకూ మన దేశంలో ఉన్న బలమైన రిజర్వేషన్ ప్రక్రియ వల్ల ప్రపంచవ్యాప్త ట్రెండ్ ఇక్కడ పునరావృతం కానివ్వదేమో అనిపించేలా విద్యార్థి సంఘాలలో విభిన్న వర్గాల ప్రాతినిధ్యాన్ని తీసుకొచ్చింది.

ఐతే ఎంతోకాలం ఈ విభిన్న వర్గాల మధ్య ఐక్యత అందరం ఆశించినట్టుగా మార్పు దిశగా కృషి చేయడంలో మాత్రం కనిపించలేదు. ఇదే సమస్యని రోహిత్ వేముల కూడా ఎదుర్కొన్నాడు. విద్యాసంస్థల్లోకి ప్రవేశం వరకే తప్పితే వారందరినీ తమలో కలుపుకోకుండా ఆధిపత్య వర్గాలు ఏవిధంగా కుట్రలు పన్నుతాయనే విషయం రోహిత్ వేముల ఉదంతం గమనిస్తే మనకి అర్థమౌతుంది. ఇంకొక బలమైన శక్తేమో రాజ్యం. ఓ చేత్తో మిమ్మల్ని పైకి తీసుకొస్తున్నాం అని మభ్యపెడుతూ మరో చేత్తో అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం సామాజిక న్యాయం కాగా ఆర్థికంగా వెనుకబడిన వారికీ అవి వర్తింపజేయడం ద్వారా రిజర్వేషన్ పాలసీని పలుచన చేయడం రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా కనబడుతోంది. అప్పుడప్పుడూ గ్రాంట్లు తగ్గించడం,ఫీజుల పెంపు ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఈ విధానం సరైనది కాదని ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆధారాలతో సహా జరిగిన పరిశోధనల్లో తేలింది. విద్యాసంస్థలు కూడగట్టే ఆదాయంలో విద్యార్థులు కట్టే ఫీజుల మొత్తం చాలా తక్కువే ఉంటుంది,అలాంటప్పుడు ఫీజుల పెంపు ద్వారా ఆర్థికంగా బలమైన విద్యార్థులకి తప్ప ఇంకెవరికీ మేలు జరగదు‌.

ఇక మన విశ్వవిద్యాలయాలకి జరిగిన ఇంకో హాని అవి వ్యాప్తి చేస్తున్న స్వేచ్ఛతో కూడిన ఆలోచనా దృక్పథాలకి అడ్డుకట్ట వేయడం. భిన్నమైన ఆలోచనల మధ్య సమాజానికి మేలు చేసే ఆశయాలూ,భావజాలాలూ పుట్టుకు రావాలంటే వాటి మధ్య భావపరమైన సంఘర్షణలు జరగాలి,అందుకు గానూ స్వేచ్ఛతో కూడిన వాతావరణం విశ్వవిద్యాలయాల్లో ఉండాలి. అప్పుడే రోహిత్ రాసినట్టుగా విద్యార్థులు నీడల చాటు నుంచి చుక్కలని అందుకునేంత ఎత్తుకి ఎదగగలుగుతారు.

విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని క్రమక్రమంగా హరించివేసే ప్రయత్నాల్లో ప్రభుత్వాలకి విద్యావంతుల సహాయం కూడా బాగానే అందుతోంది. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం మెల్లిమెల్లిగా విశ్వవిద్యాలయాలన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు ఆ పరిధి ఆర్థికపరమైన అంశాల్ని దాటి విశ్వవిద్యాలయాల అంతర్గత వ్యవహారాల్లోకీ చొచ్చుకుపోయింది. ప్రభుత్వం తన భావజాలానికి అనుకూలంగా సోషల్ సైన్సెస్,హ్యూమానిటీస్ సిలబస్లలో మార్పులూ,చేర్పులూ చేసేంత వరకూ పరిస్థితులు దిగజారాయనే చెప్పుకోవచ్చు‌.

ఇక విశ్వవిద్యాలయాలకి మూడోది,అన్నింటికన్నా ప్రమాదకరమైన హాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ద్వారా జరుగుతోంది. ప్రజల్లో విశ్వవిద్యాలయాల పట్లా,మేధావుల పట్లా వ్యతిరేకతని పెంపొందించేలా చేయడం ద్వారా ఎలాంటి చర్చలకూ ఆస్కారం లేని నియంతృత్వ,రైట్ వింగ్ పాలనా విధానాలని ఆహ్వానిస్తున్న గ్లోబల్ ట్రెండ్ ని ఇక్కడా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మన దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య వల్ల ఉన్నత విద్యపై గౌరవం కూడా నానాటికీ తగ్గిపోతోంది.

వర్తమానాన్ని విమర్శించడం గతమేదో గొప్పగా ఉండేదేమో అన్న అనుమానాన్ని రేకెత్తిస్తుంది‌. కానీ గత ప్రభుత్వాలు కూడా విశ్వవిద్యాలయాలని నిర్వీర్యం చేసే ప్రక్రియలో ఏమాత్రం తీసిపోలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో విద్యావంతుల పాత్ర కూడా చాలా ఉంది. ఐతే అవేవీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం హేతువాద,ప్రగతిశీల చర్చలని పూర్తిగా అణచివేసేంత స్థాయికి దిగజారలేదనేది మాత్రం స్పష్టం.

ఒక్కోసారి అనిపిస్తుంది రోహిత్ చనిపోయిన నాలుగేళ్లకి కూడా ఏమీ మారలేదని. ఏ విధంగా ఐతే రోహిత్ ని చిత్రహింసలు పెట్టారో,అణచివేయాలని చూసారో అదే ఇప్పుడూ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని వినిపించే వారందరినీ ప్రభుత్వాలూ,వాటి ఆధ్వర్యంలో నడిచే మీడియా సంస్థలూ దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నాయి.

ఒక్కోసారేమో అంతా మారిపోయిందనిపిస్తుంది “నా పుట్టుకే ప్రమాదవశాత్తూ జరిగింది” అని రోహిత్ ఓచోట రాసుకున్నారు. ఇప్పుడు అతనిలాగే వెనుకబడిన కులాలూ,వర్గాలకి చెందిన అనేకమంది విద్యార్థులూ అనుకునే పరిస్థితులు వచ్చాయి.

“ఇక్కడెవరూ మనిషిని ఓ ఆలోచనాపరుడిగా గుర్తించరు” అని రోహిత్ ప్రస్తుత పరిస్థితులకి అద్దం పట్టేలా ఇంకోచోట రాసారు. విశ్వవిద్యాలయాల్లోనే ఆలోచనలకి బీజం పడేది,ఇప్పుడు ఆ ఆలోచనలు చేసే బుద్ధిని కలిగి ఉండడమే నేరమని దబాయించే పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం విద్యార్థుల్లో మాత్రమే మన పోరాటం పటిమ ప్రతిఫలిస్తోంది ఎందుకంటే వారి ఆలోచనలే మన భవిష్యత్తుని రూపొందించేవి కాబట్టి.

RELATED ARTICLES

Latest Updates