ప్రయివేటీకరణను నమ్ముకుంటే ..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– వేల సంవత్సరాలైనా ఆర్థిక వ్యవస్థ బాగుపడదు : ఆర్థిక విశ్లేషకులు
– ఉపాధి కల్పన భారత్‌లో ముఖ్యమైన సమస్య
– అసంఘటిత రంగంలో సమస్యలు పరిష్కరించాలి

మనదేశంలో నెలవారి వేతనం, పీఎఫ్‌, వైద్యబీమా, పెన్షన్‌…పొందుతున్న ఉద్యోగులకన్నా… పొందనివారే ఎక్కువ. కార్మికశక్తిలో 85శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతకు దూరమైన వీరంతా అష్టకష్టాలు పడుతున్నారు. అందువల్లే కొనుగోలు శక్తి దెబ్బతిని దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ విధానాల్ని నమ్ముకుంటే వేల సంవత్సరాలైనా ఉపాధి, ఉద్యోగరంగాలు మెరుగుపడవు. – ఆర్థిక విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న వారికి సైతం ఉపాధి, ఉద్యోగం అన్నది నేడు ఒక పెద్ద సమస్యగా మారింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మేకిన్‌ ఇండియా…అంటూ ప్రతి బడ్జెట్‌లో దేశ ప్రజల్ని పాలకులు ఊరిస్తూనే ఉన్నారు. ఇదిగో..ఇన్ని లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చాం…అదిగో…అన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్టే అనే ఊహాజనిత అంచనాలతో ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయి. నయా ఉదారవాద విధానాలు కోట్లాది మందికి అభద్రత కూడిన ఉద్యోగ జీవితాల్ని తెచ్చిపెట్టాయి. ప్రయివేటీకరణను నమ్ముకొని పాలకులు ఇలాగే ముందుకు వెళితే…వేల సంవత్సరాలైనా ఉపాధి, ఉద్యోగ సమస్యలు పోవని ఆర్థిక, రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచబ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థల గణాంకాల ప్రకారం, 1990లో ఇండియాలో ఉపాధి, ఉద్యో గాలున్నవారు 31.76కోట్లు. 2019నాటికి ఇది 51.74కోట్లకు చేరుకుంది. నేడు మొత్తం కార్మికశక్తిలో… సంఘటిత రంగంలో పని చేస్తున్నవారు 15శాతముంటే, అసంఘటితరంగంలో పనిచేస్తున్నవారు 85శాతమున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సంఘటిత-అసంఘటితం మధ్య ఇంత తేడా రావడానికి కారణం 1980లో వచ్చిన నయా ఉదారవాద విధానాలు. ప్రయివేటీకరణకు తెరలేపారు కాబట్టే ప్రతిఏటా కార్మికశక్తిలో వృద్ధి కేవలం 1.69శాతానికి పరిమితమైంది.

విప్లవాత్మకమైన మార్పులు రావాలి..
ఇప్పుడున్న విధంగానే కార్మికశక్తిలో వృద్ధి నమోదైతే వేల సంవత్సరాలైనా ఉపాధి, ఉద్యోగ కల్పన పూర్తిస్థాయిలో జరగదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ‘అసంఘటిత రంగం’లో విప్లవాత్మకమైన మార్పులు రావాలని వారు సూచిస్తున్నారు. అంటే, ఈ రంగంలో ఉపాధి పొందుతున్నవారి సమస్యలు పోనంతవరకు ఆర్థిక వ్యవస్థ ఎదగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్మిక శక్తిలో సంఘటిత రంగం వాటా పెంచుకునేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates