భయంతో వణికిపోయాం…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థులే లక్ష్యంగా దాడి సాగింది
– 150 మంది ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు
– అంధ విద్యార్థుల్ని సైతం కొట్టారు..
– జేఎన్‌యూ హాస్టల్‌ వార్డెన్ల నివేదిక

న్యూఢిల్లీ : పక్కా ప్లాన్‌ ప్రకారమే ఆ రోజు (జనవరి 5న) జేఎన్‌యూలో దాడి జరిగిందనీ, వామపక్ష విద్యార్థి సంఘానికి (జేఎన్‌యూఎస్‌యూ) చెందినవారిని లక్ష్యంగా చేసుకున్నారనీ జేఎన్‌యూ హాస్టల్‌ (సబర్మతీ హాస్టల్‌) వార్డెన్లు తమ నివేదికలో తెలిపారు. జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థుల్ని, చివరికి అంధ విద్యార్థుల్ని సైతం తీవ్రంగా కొట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో వర్సిటీలో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయనీ, హాస్టల్‌ గదుల్లోకొ చొరబడి ఆస్తుల్ని ధ్వంసం చేశారనీ వార్డెన్లు తెలిపారు. ఈనివేదికలో పేర్కొన్న విషయాల్ని మీడియాకు తాజాగా విడుదల చేశారు. ఇందులో ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..

40-50మంది మాస్కులు ధరించి హాస్టల్‌లోకి రావటం సబర్మతీ హాస్టల్‌ మెస్‌ వార్డెన్‌ స్నేహ తొలుత చూశారు. ఎవరికొసమో వెదుకుతున్నట్టుగా వారు కనపడ్డారు. ఈవిషయం మిగతా వార్డెన్లకు తెలిసింది. వెంటనే అత్యవసరంగా సమావేశమై (సాయంత్రం 5:30) చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు విషయాన్ని తెలిపారు. అయితే వారు కోరినట్టు చీఫ్‌ సెక్యూరిటీ అధికారి ఏర్పాట్లుచేయలేదు. పోలీసులు కూడా రాలేదు.

సాయంత్రం 7 గంటల సమయంలో ముసుగులు ధరించిన మూక మళ్లీ వచ్చింది. అయితే ఈసారి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 150మంది దాకా ఉండొచ్చు. కర్రలు, రాడ్లు పట్టుకొని ఇష్టమొచ్చినట్టు విధ్వంసానికి దిగారు. 30 గదుల్ని ధ్వంసం చేశారు. అక్కడున్న అంధ విద్యార్థుల్ని సైతం కొట్టారు. జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఇదంతా కూడా మా కండ్ల ముందు జరిగింది….అని నివేదికలో ముగ్గురు వార్డెన్లు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటనపై సరైన విచారణ జరిపి, దాడికి పాల్పడ్డవారిని శిక్షించాలని వారు కోరారు.

‘ఆ నలుగురు’ మాత్రం రాలేదు
జేఎన్‌యూ విద్యార్థులు అక్షత్‌ అవస్తీ, రోహిత్‌ షా, ఢిల్లీ వర్సిటీ విద్యార్థి కోమల్‌ శర్మ, ఏఐఎస్‌ఏ కార్యకర్త గీతా కుమారిలు ముసుగువేసుకొని దాడి జరిపారని ‘ఇండియా టుడే’ స్టింగ్‌ ఆపరేషన్‌లో తేలింది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. ఇప్పటివరకూ జరిగిన విచారణలో వీరిని పోలీసులు ప్రశ్నించలేదని తెలిసింది.
ఢిల్లీ పోలీసులు సోమవారం సుచేతా, ప్రియా రంజన్‌ అనే ఇద్దరు జేఎన్‌యూ విద్యార్థుల్ని విచారించింది. ఘటనకు సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు చూపి అందులో ఉన్నది వారేనా అని పోలీసులు అడిగినట్టు తెలిసింది. ఒకవేళ వారు కాకపోతే, వారెవరో గుర్తించగలరా? అని ప్రశ్నించారట. ఫోటోలు స్పష్టంగా లేకపోయేసరికి వాటిలో ఉన్నదెవరో తమకు తెలియదని ఇద్దరూ కూడా చెప్పారని సమాచారం.

విద్యార్థుల పట్ల ఇలాగేనా?
– ఢిల్లీ పోలీస్‌ బాస్‌ను ప్రశ్నించిన పార్లమెంట్‌ కమిటీ
ఢిల్లీలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసనలు జరుపుతున్నారు. దీంట్లో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ (హోం శాఖ) ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్‌ నాయకుడు ఆనంద్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ ముందు ఢిల్లీ పోలీసు చీఫ్‌ అమూల్య పట్నాయక్‌ సోమవారం హాజరయ్యారు. జేఎన్‌యూ, జామియా మిలియా, అలీఘర్‌ వర్సిటీల పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ, విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సునిశితంగా పరిశీలిస్తున్నామని కమిటీ తెలిపింది. వర్సిటీల్లో నిత్యం 144 సెక్షన్‌ అమలుజేస్తున్నారని, దీనివల్ల సామాన్యులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు..ఇది సరైన పద్ధతి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates