బుగ్గి అవుతున్న బాల్యం…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం బాల కార్మికుల సంఖ్యను మరింత పెంచుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని బాల కార్మికుల సంఖ్య కోటీ లక్షమంది. దేశంలో నిరుద్యోగం పెరగడం, తల్లిదండ్రుల ఆదాయం తగ్గడం బాల కార్మికుల సంఖ్య పెరుగుదలకు కారణమవుతున్నదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. తమ ఆదాయాలు తగ్గడంతో కుటుంబాన్ని పోషించలేక తమతోపాటు పిల్లల్నీ పనికి తోలుతున్నారని వారు వివరించారు. గత ఐదేండ్లలో స్వచ్ఛంద సంస్థలతో కలిసి పోలీసులు నిర్వహించిన దాడుల్లో పలువురు బాల కార్మికుల్ని గుర్తించిన ఉదంతాల్ని వారు ఉటంకిస్తున్నారు.

డిసెంబర్‌ 8న ఢిల్లీలోని అనాజ్‌మండిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43మంది చనిపోగా, వారిలో ఏడుగురు బాల కార్మికులే కావడం గమనార్హం. తీవ్రంగా గాయపడినవారిలో మరో ఏడుగురు బాల కార్మికులే. అదే భవనంలో మరో 20మంది బాల కార్మికుల్ని పోలీసులు గుర్తించారు. బ్యాగులు కుట్టే పనిలో ఆ బాల కార్మికులకు నెలకు రూ.2000 చొప్పున ఇస్తున్నట్టు తేలింది. ఢిల్లీలో బాల కార్మికులుగా పని చేస్తున్నవారిలో ఎక్కువగా బీహార్‌, యూపీ, జార్ఖండ్‌, రాజస్థాన్‌, ఒడిషా, మధ్యప్రదేశ్‌, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్టు గుర్తించారు.

డిసెంబర్‌ 30న సూరత్‌ వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్న 138మంది బాలకార్మికులను పోలీసుల సాయంతో ఆసరా వికాస్‌ సంస్థాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. వీరికి నెలకు రూ.2000 చొప్పున ఇస్తున్నారు. డిసెంబర్‌ 18న ఢిల్లీలోని షాకూర్‌బస్తీలో 8మంది బాల కార్మికుల్ని గుర్తించారు. వారిలో నలుగురు బాలికలు. డిసెంబర్‌లోనే ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు 70మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. దళారులు వారిని అహ్మదాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీకి తరలిస్తుండగా పట్టుకున్నారు. గత కొన్ని వారాల్లో ఉదరుపూర్‌లోని నగల దుకాణాల నుంచి 27మంది, చెన్నైలోని నగల దుకాణాల నుంచి 61మంది, ఢిల్లీలోని వాజీపూర్‌ పారిశ్రామికవాడ నుంచి 45మంది, నోయిడాలోని ఓ ఫ్యాక్టరీ నుంచి 19మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు.

దేశంలోని బాల కార్మిక వ్యవస్థపై నోబెల్‌ గ్రహీత కైలాశ్‌సత్యార్థి మాట్లాడుతూ ప్రతి 8 నిమిషాలకో చిన్నా రి అదృశ్యమవుతున్నారు, ఒక్క ఢిల్లీలోనే రోజుకు 21 మంది తప్పిపోతున్నారని తెలిపారు. 2017-18లో నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్ట్‌(ఎన్‌సీఎల్‌పీ) ద్వారా 50,000మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. ఎన్‌సీఎల్‌పీ ద్వారా బాల కార్మికులకు పునారావాసం కల్పిస్తున్నారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో చట్ట విరుద్ధంగా పరిశ్రమలను నిర్వహిస్తున్న 187 పారిశ్రా మిక ప్రాంతాలను గుర్తించినట్టు బీబీఏ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.మానవ అక్రమ రవాణా బాధితుల్లో ఎక్కువభాగం బాలికలే ఉంటున్నారన్నది గమనార్హం. పేదరికంలో మ్రగ్గుతున్న తల్లిదండ్రులు మధ్య దళారు లకు రూ.4000కన్నా తక్కువకు వారిని అమ్ముతున్న సంఘటనలు రికార్డవుతున్నాయి. లైంగిక వ్యాపారం కోసం తీసుకెళ్తున్నవారు తల్లిదండ్రులకు రూ.10,000 నుంచి రూ.20,000 వరకూ ఇస్తున్నారు. దేశంలో ప్రస్తుతం 25 ఏండ్లలోపు యువకులు 60 కోట్లమంది ఉండగా, వీరిలో 48 కోట్లమంది 14 ఏండ్లలోపు వారు. 2021 జనాభా లెక్కల్లో వీరి జీవన పరిస్థితులపై వివరాలేమైనా సేకరించి, బహిర్గత పరుస్తారా అన్నది చూడాలి.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates