కస్టడీలో పోలీసుల క్రూరత్వం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై దాష్టీకం

లక్నో, కోల్‌కతా, అలీగఢ్‌ : సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న పలువురు ప్రభుత్వ మాజీ ఆధికారులు, సామాజిక కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు.. కస్టడీలో తమను లాఠీలతో కొట్టారనీ, పిడిగుద్దులు కురిపిస్తూ.. తన్నారనీ బాధిత కార్యకర్తలు మీడియాకు వెల్లడించారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, మానవహక్కుల కార్యకర్త ఎస్‌ఆర్‌.ధరపూరి మీడియాతో మాట్లాడుతూ.. ‘యూపీ పోలీసులు కస్టడీలో మమ్మల్నీ కొట్టారు. తన్నారు. కొంత మంది పోలీసులు ముస్లిం ఖైదీలను కొట్టిన విధానం చూస్తే.. రాష్ట్రంలోని బీజేపీ సర్కారు పోలీసులను విభజించిందని నాకు అనిపించింది. ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిలో ముస్లింలు, దళితులు, ఓబీసీలను టార్గెట్‌ చేసి కొట్టారని’ చెప్పారు. అలాగే నిబంధనలు పాటించకుండా హింసిస్తున్నారనీ, తమపై తప్పుడు ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారనీ తెలిపారు.
అలాగే, సామాజిక కార్యకర్త, ప్రముఖ విశ్రాంత ప్రొఫెసర్‌ పవన్‌రావు అంబేద్కర్‌ మాట్లాడుతూ.. ముస్లిం, ముస్లింయేతర ఖైదీల మధ్య తారతమ్యాలు చూపిస్తున్నారనీ, హింసలో పాల్గొన్న ఆందోళన కారుల్లో ఆరెస్సెస్‌ సంబంధీకులు వుంటే.. బీజేపీ నేతలను సంప్రదించి వారిని వదిలి పెడుతున్నారనీ ఆరోపించారు. ఇలా వర్గీకరణలు చూపిస్తుంటే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన శరణార్థులకు దేశంలో గౌరవం ఇస్తారా? వారికి భూమి, మంచి విద్య ఇవ్వడం జరుగుతుందా? అంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. మరో సామాజిక కార్యకర్త దీపక్‌ కబీర్‌ మాట్లాడుతూ.. జాతీయ గీతం, పలు ఇతర పాటలను పాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దాడికి తెగబడి.. మమ్మల్ని అరెస్టు చేశారని చెప్పారు. నిర్బంధంలో చాలామంది అధికారులు తమను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ‘అర్బన్‌ నక్సల్‌’ అని పిలుస్తూ.. జుట్టుపట్టుకుని హింసించారనీ తెలిపారు. ఏదేమైనప్పటికీ ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

నిరసనలతో పండుగ
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా సంక్రాంతి పండుగ రోజు సైతం ఆందోళనకారులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కోల్‌కతలోని పార్క్‌ సర్కస్‌లో ఓ మహిళ ప్రారంభించిన నిరసన పొరాటం ఇంకా కొనసాగిస్తున్నారు. దీనికి వందల మంది మహిళలు సంఘీభావం తెలుపుతూ.. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కాగా, పార్కులో ఇలాంటి సమావేశాలు జరపడానికి అనుమతి లేదనీ పోలీసులు తెలిపారు.

మహిళలు వందల సంఖ్యలో చేరి, శాంతియుతంగా నిరసన తెలుపుతుండటంతో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నిరసన కార్యమ్రాన్ని ప్రారంభించిన అస్మత్‌ జమీల్‌ మాట్లాడుతూ.. ఎన్నార్సీ, సీఏఏ, యూపీలో నెలకొన్న హింస, దేశ వ్యాప్తంగా పలు వర్సిటీల్లో విద్యార్థులపై దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని చెప్పిన మోడీ.. అదే బాలికలు వర్సిటీల్లో హింసకు గురవుతుంటే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా ఈ దేశ పౌరులు ప్రతిఒక్కరూ.. హక్కుల రక్షణకు పోరాడటం అవసరమని తెలిపారు.

యూపీ పోలీసులపై ఏఎంయూ ఫిర్యాదు
గత నెల 15న రాత్రి యూనివర్శిటీలోకి చొరబడి, విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేయడంపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ(ఏఎంయూ) ఫిర్యాదు చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఏఎంయూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన సమయంలో.. యూనివర్శిటీ హాస్టల్లో పోలీసులు ప్రవేశించి లాఠీచార్జి చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన నెల రోజుల అనంతరం యూపీ ఉన్నతాధికారులకు ఏఎంయూ ఫిర్యాదు చేసింది. వర్శిటీ ప్రధాన రహదారిని క్లియరెన్స్‌ చేసి సాధారణ పరిస్థితి తీసుకురావాలని మాత్రమే కోరాం తప్ప, ఏ హాస్టల్లోకి ప్రవేశిం చేందుకు అనుమతిని ఇవ్వలేదంటూ ఏఎంయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ తారీఖ్‌ మన్సూరీ తెలిపారు. తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయ లేదని ఏఎంయూ అధికార ప్రతినిధి రహత్‌ అబ్రర్‌ తెలిపారు.

సీఏఏ, ఎన్నార్సీతో ఉద్యోగాలు సృషించలేం : శివసేన
ముంబయి : పౌరసత్వ సవరణ చట్టాలైన (సీఏఏ, ఎన్నార్సీ)లు దేశంలో ఉద్యోగాలు సృష్టించలేమంటూ కేంద్రంపై శివసేన నిప్పులు చెరిగింది. కొత్త ఉద్యోగాలు సృష్టించే ప్రణాళికలు లేవని, ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా తమ ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయోనన్న ఆందోళన కలుగుతున్నదని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టాలపై ఆందోళనలు చేపడుతున్న వారిని ‘దేశ వ్యతిరేకులు’గా చిత్రీకరించేందుకు మోడీ మద్దతుదారులు యత్నిస్తున్నారని విరుచుకుపడింది.

భీమ్‌ ఆర్మీ చీఫ్‌కు బెయిల్‌
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) వ్యతిరేకిస్తూ ఆందోళనల్లో పాల్గొని అరెస్టయిన భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది. ఢిల్లీలోని జామా మసీదు ముందు నిరసనల్లో పాల్గొన్నందుకు గత నెల 20న ఆజాద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు ఆజాద్‌కు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 25వేల నగదు పూచీకత్తుతోపాటు, ఫిబవ్రరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 24 గంటల్లో ఢిల్లీ విడిచి వెళ్లాలనీ, మరో నాలుగువారాలపాటు ఢిల్లీకి రావొద్దని కోర్టు ఆదేశించింది. చికిత్స నిమిత్తం ఢిల్లీ ఆస్పత్రి రావాల్సివస్తే ముందే ఫతేపూర్‌ డీఎస్పీకి సమాచారం అందించాలని కోర్టు చెప్పింది. వచ్చే నాలుగు శనివారాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని సూచించింది. అలాగే.. పోలీసులు చార్జిషీటు నమోదుచేసేవారకూ ప్రతీ నెలా చివరి శనివారం అదే పోలీసు స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో ఆయనకు సురక్షితంకాదని వాదించిన ఆజాద్‌ తరఫు న్యాయవాది మహమూద్‌ ప్రచా, న్యాయవాది నివాసంలో ఉంచేందుకు అనుమతించాలని కోరారు.

సుప్రీంలో ఐయూఎంఎల్‌ పిటిషన్‌
న్యూఢిల్లీ : సీఏఏ విషయంలో జోక్యం చేసుకుని అది అమలు కాకుండా తక్షణమే స్టే ఉత్తర్వులు జారీ చేయాలని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) గురువారం సుప్రీం కోర్టును అభ్యర్ధించింది. ‘ఇది ఇప్పటికే అమలులోకి వచ్చింది. దానిపై ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టే విధించాలి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిమేతర అక్రమ వలసదారులను సేకరించి సీఏఏ కింద పౌరసత్వం ఇప్పించే ప్రక్రియను ప్రారంభించారు’ అని అడ్వకేట్‌ హరీస్‌ బీరన్‌, పల్లవి ప్రతాప్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఏఏ అమలుకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 10న నోటిఫై చేసిన సంగతి తెలిసిందే.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates