ప్రజాతంత్ర పరిరక్షణోద్యమానికి వేగుచుక్కలైన విద్యార్థులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
 ప్రభాత్‌ పట్నాయక్‌
అనువాదం : కొండూరి వీరయ్య
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న పోరాటం విద్యార్థి అంటే ఎవరు, విశ్వవిద్యాలయం అంటే ఏమిటి అన్నది నిర్వచించేందుకు జరుగుతున్న పోరాటమే. విద్యార్థులు కేవలం తమ సంగతి వరకే చూసుకునేవాళ్లుగా ఉండాలనీ, విద్య కొనుక్కునేవాళ్లుగా ఉండాలని, సామాజిక అంశాలతో సంబంధం లేనివాళ్లుగా ఉండాలనీ, వేతన శ్రామికులుగా పని చేయటానికి సిద్ధమయ్యే వాళ్లుగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకొంటోంది. భిన్నమైన అవగాహన మరోటి ఉంది. విద్యార్థులు అంటే సామాజిక స్పందన కలిగినవారు, రాజ్యాంగం నిర్మించ తలపెట్టిన ప్రజాతంత్ర లౌకిక, ఆధునిక భారతావని నిర్మాణంలో విద్యను సాధనంగా మల్చుకోగలిగిన వాళ్లు, ప్రభుత్వ విధానాలతో అన్నింటినీ తరచి తరచి ప్రశ్నించే వాళ్లే విద్యార్ధులు అన్నది. విశ్వవిద్యాలయం అంటే ఏమిటన్న విషయంలో కూడా ఈ రెండు అవగాహనల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. పాలకవర్గం అభిప్రాయంలో విశ్వవిద్యాలయం అంటే నైపుణ్యం కలిగిన శ్రమను అమ్ముకునే కేంద్రాలు అని భావిస్తే, యిందుకు భిన్నంగా విశ్వవిద్యాలయాలను దేశాన్ని కుదిపేస్తున్న సమస్యల పట్ల చైతన్యవంతమైన అభిప్రాయాలు పాదుకొల్పే కేంద్రంగా భావిస్తోంది. దేశంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లోని విద్యార్థులు ఈ రెండో కోవకు చెందిన వారే.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాపిత ఉద్యమంలో ఈ విద్యార్థులే కీలక పాత్ర పోషించటం కాకతాళీయం కాదు. ఈ విద్యార్థులే విశ్వవిద్యాలయాలు అంటే దేశాన్ని కుదిపేస్తున్న సమస్యల పట్ల సరైన అవగాహన పెంపొందించే కేంద్రాలని భావించిన వారే. జేఎన్‌యూ, హెచ్‌సీయూ పూనేలోని ఫిల్మ్‌, టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌, బరోడా సాయాజీరావ్‌ విశ్వవిద్యాలయం లలితకళల విభాగం విద్యార్ధులు వంటి వారంతా ఈ కోవకు చెందిన వారు. సామాజిక సమస్యలపై స్పందించే ఇటువంటి విద్యార్ధులను కేవలం అంతర్ముఖులుగానూ, నైపుణ్యాలు కొనుక్కునేవారిగానూ మార్చాలని ప్రయత్నిస్తోంది. నిజానికి ఈ స్పందించే గుణాన్ని అలవరుస్తున్నందునే ఈ విద్యాలయాలు కీర్తి ప్రతిష్టలు సంపాదించగలుగుతున్నాయి.
విద్యాలయాలు రాజకీయాలకతీతంగా మార్చటం అంటే…
ప్రభుత్వం తన లక్ష్యాలు చేరుకోవటానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తోంది. జేఎన్‌యూ తరహాలో ఫీజులు పెంచటం ద్వారా కేవలం ఉన్నత వర్గాలు, కులాలకు చెందిన విద్యార్థులు మాత్రమే నాణ్యమైన విద్యను అందుకునేలా చేయటం, మానవాభివృద్ధి విభాగాలు, సామాజిక శాస్త్రాలు, జీవ శాస్త్రాల పాత్రను కుదిస్తూ అనేక కొత్త కొత్త విభాగాలు ఏర్పాటు చేయటం, సామాజికంగా వెనకబడిన కులాలకు రాజ్యాంగం అందిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేయటం ద్వారా విశ్వవిద్యాలయాలు వివిధ సామాజిక ఆర్థిక తరగతులు, వర్గాలకు చెందిన విద్యార్థుల కలబోతకు కేంద్రాలుగా మారకుండా నియంత్రించేందుకు ప్రయత్నించటం ప్రభుత్వం తన లక్ష్యాలు సాధించుకునేందుకు అనుసరిస్తున్న ఓ మార్గం. విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా, సంఫ్‌ుపరివారానికి నచ్చని మేధావులతో సంప్రదింపులు జరపకుండా చేయటం ప్రభుత్వం అనుసరిస్తున్న మరో మార్గం. ఈ రెండూ కాక మరో మార్గానికి కూడా ప్రభుత్వం తెరతీసింది. విశ్వవిద్యాలయాలను పోలీసు పహారాలో ఉంచటం, విద్యార్థులపై దమనకాండ సాగించటం, పాలకమండలికి, ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిన విద్యార్థులపై తప్పుడు కేసులు బనాయించటం, లేదా ఇప్పటి వరకు వినియోగించని కఠినమైన చట్టాలు ఉపయోగించటం వంటివి ఈ మూడో కోవకు చెందిన ప్రయత్నాలు.
నిబద్ధత కలిగిన సంఫ్‌ుపరివారం సైనికుల్ని ఇటువంటి విద్యాసంస్థలకు అధిపతులుగా పాలకమండళ్లుగా నియమించటం ద్వారా ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాల్లో పైన చెప్పిన అన్ని పద్ధతులూ ప్రయోగాలకూ సిద్ధమవుతోంది. ఇటువంటి వాళ్లకు విద్యార్థుల పట్ల ఏ మాత్రం సానుభూతి లేదు. తాము ప్రాతినిధ్యం వహిస్తూ నాయకత్వం వహిస్తున్న విద్యాసంస్థల కీర్తి ప్రతిష్టలతో వారికి పని లేదు. విశ్వవిద్యాలయంలో పని చేసే వేలాదిమందితో వీరికి ఎలాంటి సంబంధమూ లేదు. ఉదాహరణకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు తర్వాత కూడా ఫీజు పెంపుదల విషయంలో జేఎన్‌యూలో పాలకమండలి ఎన్నికైన విద్యార్థి సంఘాన్ని కూడా గుర్తించటానికి సిద్ధంగా లేదు. (కనీసం ఈ నిపుణుల నివేదికకు విడుదలకు కూడా యాజమాన్యం సిద్ధంగా లేదు). విద్యార్థి సంఘాన్ని గుర్తించటం, వారి దృక్ఫథాన్ని అంగీకరించటం విద్యార్థుల పట్ల బీజేపీకి ఉన్న అవగాహనకు పూర్తి విరుద్ధం.
ఈ పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలను రాజకీయాల కతీతంగా నడిపించాలని ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందన్న ప్రశ్న ముందుకొస్తోంది. ఎందుకంటే నిరంకుశ ప్రభుత్వాలకు ప్రశ్నించే విద్యార్థులు అక్కర్లేదు. గొర్రెల్లా తలొంచుకుని పోయేవాళ్లే కావాలి. అందువల్లే భావి నిరంకుశ ప్రభుత్వాల ఏర్పాటుకు కావల్సిన రంగాన్ని సిద్ధం చేయటంలో భాగంగానే జేఎన్‌యూ మొదలు అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోనూ ప్రభుత్వం యిలా వ్యవహరిస్తోంది.
నిర్హేతుకతతో ఘర్షణ
వర్తమానంలో మన పరిస్థితి ఇదే. రెండు విలక్షణ శక్తుల కలయికే బీజేపీకి పట్టం కట్టింది. ఒకటి కేంద్రీకృతమైన ద్రవ్య పెట్టుబడికి నాయకత్వం వహించే శక్తులు. లౌకిక ప్రజాతంత్ర రాజ్యాంగాన్ని కూలదోసి దాని స్థానంలో హిందూరాష్ట్ర నిర్మాణానికి అంకితమైన హిందూత్వ శక్తులు. రెండోది, హిందూరాష్ట్రను సమర్థించే ప్రయత్నం యావత్తూ హేతురాహిత్యంతో కూడుకున్న ప్రయత్నమే. అంటే ఓ సత్యాన్ని ఆవిష్కరించటానికి కావల్సిన సాక్ష్యాలు, ఆధారాలకు హిందూత్వ శక్తులు వీసమెత్తు విలువనివ్వవు. ఈ రకంగా కార్పొరేట్‌ ప్రయోజనాలు, హేతురాహిత్యం మధ్య అపవిత్ర కలయికతో కూడిన శక్తులు అధికారంలో ఉన్న దశలో మనం ఉన్నాం. అన్ని రకాల ఫాసిస్టు ప్రభుత్వాల్లోనూ కనిపించే ఉమ్మడి లక్షణమే ఇది.
ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని నిర్మించటం కార్మికవర్గం, రైతాంగం, చిన్న ఉత్పత్తిదారులు, వ్యవసాయ కార్మిక వర్గాల ముందున్న కర్తవ్యమే. అయితే చరిత్ర స్థానంలో పురాణాలు, వాస్తవాలకు బదులు నమ్మకాలు, శాష్ట్రవిజ్ఞానానికి బదులు మూఢనమ్మకాలకు పెద్దపీట వేస్తున్న ఈ శక్తులకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో మేధోవర్గం కూడా కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. హిందూత్వ హేతురాహిత్యానికి వ్యతిరేకంగా పోరాటంలో మేధోవర్గానికి ముఖ్యమైన పాత్ర ఉంది. బీజేపీ ప్రభుత్వం ఈ శక్తివంతమైన సైద్ధాంతిక ప్రతిఘటనను నిర్వీర్యం చేయటానికి పూనుకొంటోంది. బతుకుదెరువుకి అవసరమైన ఉద్యోగం సంపాదించుకునేందుకు చదువుకుంటున్న విద్యార్థులతో హిందూత్వశక్తులకు ఏ సమస్యా లేదు. కానీ సామాజిక సమస్యల పట్ల స్పందించే లక్షణం, అలవాటు ఉన్న విద్యార్ధులు, ప్రజాతంత్ర, లౌకిక విలువల పట్ల నిబద్ధత ఉన్న విద్యార్థులే ఈ హిందూత్వ శక్తుల్ని నిలువరించే సామర్థ్యం కలిగినవారు. నేడు ప్రతిఘటిస్తోంది కూడా వారే. ఈ విద్యార్థులు సమకాలీన ఉద్యమాలకు నూతనోత్తేజాన్ని అందించటంతో పాటు ఆధునిక విద్యావ్యవస్థతో అందివచ్చే పునరుజ్జీవనానికి కూడా ప్రతినిధులుగా ఉన్నారు.
విద్యారంగాన్ని వ్యాపార విలువలతో నింపటం వెనక ఉన్న ఉద్దేశం ఈ విద్యారంగం ద్వారా భావితరాలకు అందుతున్న పునరుజ్జీవన విలువలు అందకుండా చేయాలన్న పాలకవర్గాల సంకల్పంలో భాగమే. పెరుగుతున్న ఫీజులు, ప్రయివేటు విద్యా సంస్థల కారణంగా విద్యకు దూరమయ్యేది కేవలం నిమ్నవర్గాలు, అణగారిన సామాజిక తరగతులకు చెందిన కుటుంబాలు మాత్రమే కాదు. అంతో ఇంతో సంపన్నులమను కుంటున్న కుటుంబాలు కూడా ఉన్నత విద్యకు, నాణ్యమైన విద్యకు దూరమవుతాయి. ఈ ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్ధులకంటే పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సామాజిక వాస్తవాలకు దగ్గరగా ఉంటారు. ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్ధులు సామాజిక సమస్యల పట్ల పేద విద్యార్థులు స్పందిస్తున్నంత తీవ్రతతో స్పందించలేరు. జేఎన్‌యూ పాలకమండలి ఫీజులు పెంచినట్టే మిగిలిన విద్యా సంస్థలు కూడా ఫీజులు పెంచుకుంటూ పోతే జేఎన్‌యూ స్థితికి చేరుకోవటానికి ఎంతో కాలం పట్టదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి ఉన్నత విద్యకోసం బ్యాంకులోన్లు తీసుకున్న విద్యార్థులు నెలసరి కిస్తీలు చెల్లించటానికే తలమునకలవుతున్నారు. సామాజిక సమస్యల గురించి ఆలోచించేంత తీరిక వారికి లేదు. ఉన్నత విద్య కోసం బ్యాంకులోన్లు తీసుకోవటం విద్యార్థుల క్రియాశీల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవటానికి అమెరికా అనుభవాలు పరిశీలిస్తే సరిపోతుంది. వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో సామాజిక సమస్యలపై విద్యార్థులు దాదాపుగా కదలటం లేదనే చెప్పాలి. చదువుల రుణభారమే దీనికి కారణం అనటంలో సందేహం లేదు.
దేశంలో అదృష్టవశాత్తూ సంఫ్‌ుపరివారం తరఫున పనిచేసే వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నా విద్యార్థులు సామాజిక చైతన్యాన్ని కోల్పోవటం లేదు. సంఫ్‌ుపరివారం చేస్తున్న దుశ్చర్యల వల్ల విద్యార్థులు అంతకంతకూ సామాజిక చైతన్యం నింపుకుంటున్నారు. విద్యాలయాల్లో ప్రజాస్వామ్యం నినాదం నుంచి విశాల జాతీయ జనహిత సమస్యలైన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి సమస్యలపై ఈ విద్యార్థులు స్పందిస్తున్నారు. ఈ ఉద్యమాల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎటువంటి కలబోత సమాజం కావాలని కోరుకుంటున్నారో ఈ ఉద్యమాల నిర్మాణం, నిర్వహణలో అటువంటి కలబోత స్వభావాన్ని అమలు చేస్తున్నారు. వివిధ మతాలకు చెందిన విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం విద్యార్థులతో భుజం భుజం కలిపి పోరాడుతున్నారు. సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పేద విద్యార్థులు సాగించే పోరాటంలో అడుగులో అడుగేస్తున్నారు. ఈ కాలంలో అద్భుతమైన సంఘీభావం, సహౌదరత్వం ఈ ఉద్యమాల్లో కనిపిస్తోంది.
తలొగ్గటానికి విద్యార్థులు సిద్ధం కాకపోవటంతో ప్రభుత్వ అండదండలతో విశ్వవిద్యాలయ పాలకమండలి మరింత రాక్షసత్వంతో వ్యవహరిస్తోంది. కేంద్ర హౌం శాఖ ఆధీనంలో ఉన్న ఢిల్లీ పోలీసులు జామియా విద్యార్థులపై తుపాకీ గుండ్లు కురిపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని రణక్షేత్రంగా మార్చారు. జేఎన్‌యూలో ఎవరెవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలో లోగుట్టు తెలిసిన విద్యార్థులు సహకరిస్తే ముసుగేసుకొచ్చిన గూండాలు స్వైర విహారం చేసారు. ఇదంతా ఢిల్లీ పోలీసుల కండ్లముందే జరిగింది. ఈ దాడుల సమయంలో యూనివర్సిటీ భద్రతా సిబ్బంది కంటికి కనిపించకుండా పోవటం గమనించాల్సిన విషయం.
పాశవిక దాడుల మధ్య కూడా ఆధునిక భారత నిర్మాణానికి పునాదిగా ఉన్న రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం విద్యార్ధులు సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమైనది. ఈ విలువలనే హిందూత్వ శక్తులు ధ్వంసం చేయబూను కుంటున్నాయి. ఈ పోరాట స్ఫూర్తిని చూశాక తాత్కాలిక ఇక్కట్లు ఎదురైనా దేశ భవిష్యత్తు నవతరం చేతుల్లో సురక్షితంగా ఉండబోతోందన్న విశ్వాసం కలుగుతోంది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates