1922 టురిన్ – 2020 జేఎన్యూ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 కొండూరి వీరయ్యImage result for - కొండూరి వీరయ్య"

లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారతాన్ని మిడతలదండు కమ్ముకొంటోంది. జనవరి ఐదో తేదీ ఆదివారం చీకటి సాయంత్రం అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంపై ఈ మిడతలదండు దాడికి దిగింది. సుమారు 700మంది పోలీసులు విశ్వవిద్యాలయం ఆవరణలో పహారా కాస్తుండగా పాతిక ముప్పై మంది యువతీ యువకులు సాయుధులై (విద్యార్థులకు ప్రాణా పాయం కలిగించటానికి సరిపోయి నంత మోతాదులో ఉన్న కర్రలు ఇతరత్రా ఆయుధాలు) మంచుతో కప్పుకున్న దట్టమైన చీకటినే రక్షణ కవచంగా మార్చుకున్న ఆగంతకులు విశ్వవిద్యాలయంలోని విద్యార్థు లపై దాడికి పూనుకున్నారు.

గత నాలుగైదేండ్లుగా జేఎన్‌యూలోకి ఏ మూల నుంచి ప్రవేశించాలన్నా పోలీసు బారికేడ్లు దగ్గర తనిఖీ తప్పనిసరి. విద్యార్థి లేదా యూనివర్సిటీ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది గుర్తింపు కార్డు చూపించాకనే లోపలికి అడుగు పెట్టగలరు. అలాంటిది సాయుధులైన యువకులు నేరుగా హాస్టళ్లల్లో ప్రవేశించారంటే యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం లేకుండా సాధ్యమయ్యే సమస్యే లేదు. ఈ ఘటనకు ముందే గతంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ, జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలోనూ, రాంజస్‌ కాలేజీలోనూ తాజాగా జామియా మిలియా, అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయాల్లోనూ ఇటువంటి రాక్షసకాండకు తెరతీసిన వాస్తవం మన కండ్లముందు ఉంది.

జామియా, అలీఘర్‌ విశ్వవిద్యాలయాల్లో పోలీసుల ప్రత్యక్ష పరోక్ష మద్దతుతో సాగిన అకృత్యాలను దేశం మరువకముందే జేఎన్‌యూ మీద ఎందుకు సంఫ్‌ుపరివార్‌ గూండాలు ఈ పాశవిక దాడికి పాల్పడ్డాయి? క్లుప్తంగా చెప్పుకునే సమాధానం ఒక్కటే. దేశవ్యాప్తంగా సంఫ్‌ుపరివార్‌ భౌతిక భౌద్ధిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా జేఎన్‌యూ ప్రతిఘటనా వేదికగా నిలిచింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఢిల్లీ యావత్తూ మోడీ మాయలో పడ్డా జేఎన్‌యూలో సమరశీల ప్రతిఘటనా గొంతుకలు మందగించలేదు. దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా సాగుతున్న పోరాటాలకు స్ఫూర్తిదాయని గా మారింది. ఈ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థిని విద్యార్థులను దేశం గుర్తు పెట్టుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో రెండో దఫా బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత జరిగిన జేఎన్‌యూ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ మట్టికరవడం సంఫ్‌ుపరివారానికి మరువలేని పీడకలగా మారింది. ప్రజాతంత్ర పద్ధతుల్లో ఎదురవుతున్న ప్రతిఘటనకు బదులివ్వలేని ‘పరివారం’ ప్రతిఘటన గొంతులను భౌతికంగా నులిమివేయటానికి సిద్ధమైంది. ఈ ప్రయత్నంలో భాగమే జేఎన్‌యూపై దాడి. దేశవ్యాప్తంగా బీజేపీ, ‘పరివారం’ ఆధిపత్యానికి సవాలుగా మారుతున్న ఉన్నత విద్యా కేంద్రాల్లో విద్యార్థులకు కూడా ఈ దాడి ద్వారా వారి భవిష్యత్తు గురించి ఓ హెచ్చరిక కూడా చేయ దల్చుకున్నదన్నది ఈ దాడి వెనక ఉన్న మరో కారణం.

ఈ దాడి కేవలం జేఎన్‌యూ మీద జరిగిన దాడి మాత్రమే కాదు. జేఎన్‌యూ ప్రాతినిధ్యం వహిస్తున్న వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర, రాజ్యాంగ, ఉదార విలువలపై ఎక్కుపెట్టబడిన దాడి. జేఎన్‌యూ అంటే వామపక్ష ఉద్యమాల, మేధావుల కేంద్రం అన్న గుర్తింపు ఉంది. ఈ కీర్తికాంతులపై చీకటిని ప్రసరింపచేసేందుకు గత ఐదేండ్లుగా ‘పరివారం’ చేయని ప్రయత్నం లేదు. దేశంలో మారుమూల పల్లెల నుంచి బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చదువుకోగలుగు తున్నారు. అటువంటివారే ఇలాంటి దుర్మార్గమైన దాడులకు వ్యతిరేకంగా తమ ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడి పోరాడుతున్నారు. ఈ ప్రతిఘటన గొంతుకలను మట్టుపెట్టేందుకు ప్రయత్నించటం ప్రజాస్వామ్య భారతానికే మాయని మచ్చ. ఈ ధోరణిని ఇలాగే వదిలేస్తే జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకురాలి తండ్రి ఆవేదన చెందినట్టు ‘రేపు ఎవరి బిడ్డకు ఈ కష్టం దాపురిస్తుందో?’ ఈ కోణంలో చూసినప్పుడు జేఎన్‌యూపై ముష్కర దాడి దారితప్పిన ఆకతాయిల దాడి కాదు. వ్యూహాత్మకంగా నిర్దిష్ట లక్ష్యంతో నిర్దిష్ట ప్రణాళికతో ప్రభుత్వ ప్రత్యక్ష సహాయసహకారాలతో జరిగిన దాడి. ఈ దాడికి ముందు కొన్ని వాట్సప్‌ గ్రూపులు ఉనికిలోకి రావటం, దాడి లక్ష్యాలు, దాడి జరుగుతున్న తీరు, ఎదురవుతున్న ప్రతిఘటన, జేఎన్‌యూ పరిసర ప్రాంతాల్లో గుమడిగూడుతున్న జనం వంటి విషయాలు చర్చించుకున్నారంటే దాడికి ముందు రూపొందించుకున్న పథకం కార్పొరేట్‌ పరిభాషలో రియల్‌టైం అసెస్‌మెంట్‌తో సాగిందని స్పష్టమవుతుంది. ఇది రేపటికి ఓ హెచ్చరిక. ఈ హెచ్చరికకు జేఎన్‌యూ బయట దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్ర శక్తుల స్పందనకు మార్గదర్శనం కోసం 1922 నాటి టురిన్‌ ముష్కర దాడి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి.

టురిన్‌ ఇటలీలో ఓ పారిశ్రామిక నగరం. 1915 -1922 మధ్య యావత్తు ఇటలీ ముస్సోలిని ఫాసిస్టు వ్యూహాలకు లొంగిపోతున్నా టురిన్‌ కార్మికవర్గం ఒక్కటే ప్రతిఘటించి నిలిచింది. 1921లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఫాసిస్టు వ్యతిరేక శక్తులను ఎన్నుకుంది. ఫాసిస్టు ప్రభుత్వ దమనకాండకు వెరవకుండా కమ్యూనిస్టు పత్రిక ఆర్డెయిన్‌ నోవో అచ్చయి ప్రజలకు చేరేలా టురిన్‌ ప్రతిఘటన దళాలు కృషి చేశాయి. దేశవ్యాప్తంగా ఫాసిస్టు దాడులకు గురవుతున్న కుటుంబాలకు సహాయం చేయటానికి మద్దతు శిబిరాలు కూడా నిర్వహించింది టురిన్‌ కార్మికవర్గం. అటువంటి ప్రజాతంత్ర, విప్లవ విలువలకు అంకితమైన కార్మికవర్గాన్ని భయభ్రాంతులను చేసేందుకు టురిన్‌ రాష్ట్ర ఫాసిస్టు శక్తులు పథకం పన్నాయి. 1922 డిశంబర్‌ 18న మొదలు పెట్టి 22 వరకు నాలుగు రోజుల పాటు దొరికిన కార్మిక నేతను దొరికినట్టు హతమార్చారు. ప్రాణభయంతో పారిపోతున్న వారు ప్రాణాంతక గాయాల పాలయ్యారు. ఈ దాడి లక్ష్యం టురిన్‌ ఫాసిజానికి ప్రతిఘటనా కేంద్రంగా ఉన్న టురిన్‌ రాష్ట్ర కార్మికవర్గం, వారికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీని నిర్మూలించటమే. అధికారిక లెక్కల్లో 11మంది మాత్రమే చనిపోయినట్టు ఉన్నా నిజానికి వందలాదిమంది కార్మికవర్గ నాయకులు, ఫ్యాక్టరీ కమిటీ నాయకులు, సభ్యులు, పత్రికా నిర్వహణ సిబ్బంది చనిపోయారని తర్వాత జరిగిన పరిశోధనలు అంచనా వేశాయి.

ఈ కొద్దిపాటి వివరాలు పరిశీలిస్తే జేఎన్‌యూ, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం, పూనే ఫిల్మ్‌ శిక్షణా కేంద్రం, జామియా మిలియా, అలీఘర్‌ వంటి ఉన్నత విద్యా కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని ఎందుకు దాడులు జరుగుతున్నాయో ఓ మేరకు అర్థం చేసుకోవచ్చు. టురిన్‌ ఊచకోతకు, మన దేశంలో ఉన్నత విద్యా కేంద్రాలపై జరుగుతున్న భౌతిక, భౌద్ధిక దాడులకు మధ్య ఉన్న పోలికలు కూడా స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఈ దశాబ్దం ఎవరిదన్న ప్రశ్న దేశం ముందుంది. ఈ దశాబ్దాన్ని ‘పరివారం’ వశం కాకుండా కాపాడుకోగలిగితే దేశం నవోయదానికి ఎదురు చూడగలుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై జరుగుతున్న దాడి మాత్రమే కాదు. ప్రత్యామ్నాయ ప్రగతిశీల ప్రజాతంత్ర దృక్పథానికి, కాలం చెల్లిన చీకటి విలువలకు మధ్య జరుగుతున్న పోరాటం. చీకటి విలువలకు ప్రాతినిధ్యం వహించే శక్తులు కాబట్టే ముఖాలకు మాస్కులు కట్టుకుని, చీకట్లో దాడి చేశారు. మతోన్మాద శక్తుల ఏ దాడి, చర్య, ప్రచారమైనా ప్రభుత్వ యంత్రాంగం మంత్రాంగం మద్దతు లేకుండా జరగదని ప్రఖ్యాత చరిత్రకారులు బిపిన్‌ చంద్ర 1970ల్లోనే హెచ్చరించారు. ఢిల్లీ పోలీసు బలగాలు నేరుగా కేంద్ర హౌం శాఖ అదుపాజ్ఞల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ పోలీసు బలగాలను కనుసైగతో కట్టడి చేస్తోంది అమిత్‌ షా. అమిత్‌ షా ఇటువంటి పరివారానికి పెద్ద బాస్‌. అందువల్ల ప్రత్యక్షంగా ఆధారాలు చూపలేకపోయినా అమిత్‌ షాకు, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలీకుండా ఈ దాడి జరిగిందంటే నమ్మే అవకాశమే లేదు.
టురిన్‌, రీచ్‌స్టాగ్‌ వంటి దురంతాల నుంచి మనం ఏమన్నా నేర్చుకున్నామా లేదా అన్నదే ఇప్పుడు దేశం ముందున్న మరో ప్రశ్న. ఈ దశాబ్దిని జయించిన భావజాలమే ఈ శతాబ్దిలో భారతదేశాన్ని శాసిస్తుంది. ఆరెస్సెస్‌ ప్రేరిత మితవాద చీకటి సైన్యానికి, రాజ్యాంగ ప్రేరిత ప్రజాతంత్ర వెలుగు రేఖలకు మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఈ దశాబ్ది ఎవరిదన్నది నిర్ధారిస్తుంది. గత ఐదేండ్లుగా గొంతు పెగల్చని ప్రజ నెల రోజులుగా దేశాన్ని మరో మారు చీల్చే మతోన్మాద కుట్రలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చింది. జేఎన్‌యూ, జామియా, అలీఘర్‌ రగలించిన ఈ ప్రతిఘటన రవ్వలు ఆరకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత విశాల ప్రజాతంత్ర శక్తులదే. ఈ పోరాట తారాజువ్వల వెలుగు దేశవ్యాప్తంగా విస్తరించటానికి నడుం కట్టాలి. టురిన్‌ అనుభవం వెల్లడించినట్టు ఈ సంక్షోభ సమయంలో ప్రజాతంత్ర ఉద్యమం బతికి బట్టకట్టాలంటే వేర్పాటు వాద చీలికలను అధిగమించి ఐక్యం కావటం ఒక్కటే మార్గం అన్నది టురిన్‌ అనుభవం. యథాతథంగా మనకూ వర్తించే పాఠం ఇది. అటువంటి విశాల ప్రజాతంత్ర లౌకిక వామపక్ష శక్తుల ఐక్యతకు కృషి చేయటమే నిజమైన విప్లవకారులు, దేశభక్తుల కర్తవ్యం. ఈ దశాబ్ది ప్రజాతంత్ర ఉద్యమాల దశాబ్దిగా మిగిలితేనే కనీసం రాజ్యాంగం ఆశించిన ప్రజాతంత్ర భారత నిర్మాణం సాధ్యమవుతుంది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates