ఖైర్లాంజీలో దళిత కుటుంబాల మీద ఆ కక్ష ఎందుకు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రంగనాయకమ్మ
– 8 –
శ్రమలు చెయ్యడంలో తక్కువా, ఎక్కువా విలువల తేడాలు పోకుండా, ‘కులాలు పోయే’ మార్గం ఉండదు. కానీ, అంబేద్కరు, శ్రమలు చేసే-శ్రమలు చెయ్యని’ వర్గాలనేవి ఉన్నాయి-అనే మౌలిక విషయాన్నే గమనించలేదు. దాన్ని వివరించలేదు. ‘వర్గాల్ని’ గురించి తెలుసుకుంటే, వాటిని తీసివేస్తూ, కులాల తేడాల్ని తీసివేసే మార్గం తెలుస్తుంది.

కానీ ఈ పుస్తక రచయిత ఏమంటారంటే, ”కొంతమంది ప్రగతిశీల బుద్ధి జీవులు, ఆలోచనాపరులు, వర్గాన్ని మాత్రమే ప్రధానంగా చూస్తున్నారు” అని! (పేజీ: 94) అంటే ‘అలా చూడడం తప్పు’ అని చెప్పడం! అంతే కాదు, ”భారత సమాజంలో కుల అస్తిత్వం మౌలికమైనది…..అన్ని సమస్యలకూ కులమే మూలం అన్న మాట మరిచిపోకూడదు” అన్నది రచయిత వాదన. ‘పేదరికం’ అనే సమస్యకి, ఏది ప్రధానం? ఏది మౌలికం? ఒక వ్యక్తి చేసే ‘శ్రమ విలువ’ అంతా ఆ వ్యక్తికి అందకపోవడం, ఎక్కువ కాలం శ్రమ చేసి తక్కువ శ్రమ విలువనే తీసుకోవడం ఇది పేదరికానికి కారణమా, లేకపోతే ఆ వ్యక్తి కులం, పేదరికానికి కారణమా? శ్రమలో కొంత భాగాన్ని దోచడం, భౌతిక విషయమా, కులం భౌతిక విషయమా? ఆ ‘పేదరికం’ పోవాలంటే, ఆ కులం పోతే, ‘పేదరికం’ పోతుందా? శ్రమ దోపిడీ జరగడం ఆగకపోతే, పేదరికం పోతుందా? అసలు, ‘కులం పోవడం’ ఎలా జరగాలో, ఈ రచయిత ఈ పుస్తకంలో ఎక్కడా చెప్పలేదు.

‘కుల వివక్ష’కు వ్యతిరేకంగా రాజ్యాంగం తీసుకున్న ఉపశమన చర్యల గురించి, రచయిత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి: ‘పూర్వపు భారత సమాజం దళితుల పట్ల అన్యాయంగా ప్రవర్తించింది గానీ, ఆధునిక భారత రాజ్యాంగం, కుల భేదాలకు వ్యతిరేకంగా ప్రత్యేక రక్షణలు కల్పించింది. షెడ్యూల్డు కులాల మీదా, షెడ్యూల్డు తెగల మీదా జరిగే అత్యాచారాల్ని నిరోధించడానికి భారత ప్రభుత్వం చేసిన చట్టం, దళితుల చేతుల్లో, గొప్ప ఆయుధమని చెప్పవచ్చు. ఈ విధంగా, భారత ప్రభుత్వం గొప్ప చట్టాలు చేసిందని చెపుతూనే, ”ఈ చట్టం, ఆచరణలో, దాదాపు పూర్తిగా విఫలమైందనే చెప్పవచ్చు” అని కూడా అంటారు.

‘శ్రమ దోపిడీ వర్గం’ కోసం ఏర్పడి సాగే ప్రభుత్వం, ఆ విషయాన్నే నిరోధించే చట్టాల్ని నిజమైన న్యాయ దృష్టితో చేస్తుందా? చట్టాలన్నీ, నాటకాలు. కింది కులాలరక్షణ పేరుతోటీ, స్త్రీల రక్షణ పేరుతోటీ, జరిగిన ఏ చట్టమూ, ఆచరణలో పని చెయ్యడం లేదంటే, అర్ధం ఏమిటి? ఆ చట్టాల్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయి అని, ఈ రచయితే చెపుతున్నారు. చట్టాలు, పోలీసుల్లోనూ, కోర్టుల్లోనూ, పని చెయ్యడం లేదంటే, అలా పని చెయ్యకుండా ఉండే అవకాశాల్ని కూడా చట్టాల్లో పెట్టారన్న మాటే కదా? అటువంటప్పుడు, ఆ చట్టాల్ని, న్యాయమైన చట్టాలుగా మొదట వర్ణించడం ఎందుకు?

కింది కులాలవారి మీద, అగ్ర కులాల వాళ్లు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తారో చెప్పారు. వాళ్లని అడ్డుకునే అంశాలు చట్టాల్లో లేవు అన్నారు. ఉదా: దళితుల్ని ఏదో ఫలానా నేరం పేరుతో సామూహికంగా బహిష్కరించడం, జరగరాదు అని చెప్పే చట్టం లేదు అన్నారు. అటువంటి ఎన్నో చట్టాలు లేవు. ఉన్న చట్టాల్లో సరైన అంశాలు లేవు. ఇదంతా రచయిత చెప్పిందే. మరి, రాజ్యాంగం ఇప్పుడైనా గొప్పది ఎలా అవుతుంది?

‘శ్రమ దోపిడీ’తో సాగే సమాజంలో, శ్రామిక వర్గానికి కొంత అనుకూల నటనలతో ఏ చట్టాలైనా ఎందుకు తయారవుతాయి? ఎందుకంటే, సమస్యల్లో ఉన్న వాళ్లు ఆందోళనలు చేస్తూ ఉంటారు. కాబట్టి, వాళ్ల డిమాండ్లు శక్తివంతమైనవిగా లేకపోయినా, వాళ్లని నమ్మించడానికీ, అణచడానికీ, కొన్ని నటనల చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు చేసే ప్రభుత్వపు లక్ష్యం శ్రామిక ప్రజలకు నిజమైన రక్షణ కలిగించాలని కాదు. ఆ చట్టాల్లోనే కొన్ని లోపాలు ఉంచుతారు.

చట్టాల పరిధిలోకి రాని, అనేక విషయాల్ని ఈ రచయిత చెప్పారు. అయినా, ఆ చట్టాలనే గొప్ప చట్టాలుగా మొదట భావించారు. అసలు, ఈ ప్రభుత్వం ఏ చట్టం చేసినా, దాన్ని కొన్ని లోపాలతోనే, అలా కావాలనే, చేస్తుంది. దౌర్జన్యాలకు, ఆ లోపాలే అవసరమవుతాయి. ఆ లోపాల వల్లే, దౌర్జన్యాలు తేలిగ్గా జరుగుతాయి. చట్టాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయని చెపుతూనే, ‘దళితులపై జరిగే నేరాలని పరిష్కరించాలని, న్యాయమైన ఉద్దేశం, ఆ చట్టాల్లో ఉండడం మాత్రం సుస్పష్టం’ అంటారు రచయిత. (పేజీ: 114). చట్టాల్ని చేసేవారు న్యాయంగా చేస్తారు, కానీ, వాటిని అమలు చేసేవారే, ఆ న్యాయాన్ని పాటించరు అన్నట్టు చెపుతారు రచయిత.

ఇంతకు ముందైతే, రాజకీయాధికార్లకీ, పోలీసులకూ, పత్రికలకూ, వెంట్రుక వాసి తేడా కూడా ఉండదు – అన్నారు. ఇప్పుడు, చట్టాలు చేసే రాజకీయాధికారులు (ఎమ్మెల్యేలూ, ఎంపీలూ వంటి వారు) న్యాయస్తులేననీ, చట్టాల్ని అమలు చేసే వారే అన్యాయస్తులనీ’ అంటున్నారు. చట్టాల్లోనే అన్యాయం ఉంటే, వాటిని అలాగే అమలు చేస్తారు. చెప్పాలంటే, చట్టాలు ఎలా ఉంటే, అలాగే అమలు చేసే వారే న్యాయస్తులు. చట్టాల్ని నటనలతో తయారు చేసే వారే అన్యాయస్తులు.

”చట్టాలన్నీ, అమలు చేసే వారి చేతుల్లో, కీలు బొమ్మల్లాంటివని, భారత పాలకవర్గాలకు కచ్చితంగా తెలుసు” రచయిత. ఏమిటిది? పాలక వర్గాలు ఘోరంగా అలా ఉంటే, చట్టాలు చేసేవారు వారే కదా? వారిని న్యాయస్తులుగా వర్ణించడం ఎందుకు?
బ్రిటిష్‌ పాలన నించీ భారతదేశం అధికారాన్ని తీసుకోగలిగిన తర్వాత, అంబేద్కరు ఏర్పరిచిన రాజ్యాంగం గురించి, రచయిత ప్రశంసతో ఇలా చెపుతారు: ‘గత కాలపు హక్కులతోపాటు కొత్త హక్కులు కూడా చేర్చి, ”సర్వ మానవ సమానత్వ వ్యవస్థను ఏర్పర్చాలంటూ మార్గ నిర్దేశనం చేసింది” అంటూ అంబేద్కర్‌ చేసిన రాజ్యాంగాన్ని కీర్తించారు ఈ రచయిత.

అసలు ‘శ్రమ దోపిడీ’ అనే మాట ఎత్తని ఏ మేధావి అయినా, ఎంత న్యాయస్తుడైనా, ‘సర్వ మానవ సమానత్వాన్ని’ ఎలా ప్రతిపాదించగలుగుతారు? అసలు విషయం తెలియకుండానే, ‘అందరూ సుఖంగా జీవించాలి!’ అని చెప్పిన సంస్కర్తలు కొందరు లేరని కాదు. అంబేద్కరు కూడా అటువంటి సంస్కర్త అవుతాడు గానీ, ‘ఆర్ధిక వేత్త’ కాలేడు.

అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్ల, దళితులు గణనీయంగా అభివృద్ధి చెందారనీ, కుల వ్యవస్థ కూడా కొంత బలహీన పడిందనీ, చెప్పారు రచయిత. కుల విధానం కొంత బలహీన పడుతూ వున్నా, అది ఎప్పటిలాగే కొనసాగుతోందని కూడా ఆయనే అన్నారు.
కులానికీ, దాని వృత్తికీ వున్న సంబంధాలు కొంత మారినా, అవి పూర్తిగా మారలేదు – అన్నారు. ఉదాహరణగా, శారీరక శ్రమలన్నీ ప్రధానంగా దళితులే చేస్తున్నారు. మేనేజిమెంటు పనులు అగ్రవర్ణాల వాళ్లు చేస్తున్నారు. ఈ విభజన, కుల విధానాన్ని సజీవంగా ఉంచుతోంది – అన్నారు. అయితే, శ్రమలు చెయ్యడంలో వున్న విభజనని నిర్మూలించడం ఎలాగా-అనే ప్రశ్నని చర్చించలేదు.

కార్మిక సంఘాల్లో దళితులు ఇమడలేక, ‘దళిత కార్మిక సంఘాన్ని’ వేరుగా పెట్టుకున్నారు -అన్నారు. ఈ మార్పు, పూర్వం కన్నా, కుల విధానాన్ని ఇంకా బలపరుస్తుంది. దళితుల్లో గానీ, దళితేతరుల్లో గానీ, కొందరు కుల వృత్తుల్ని వదిలి, ఇతర వృత్తుల్లోకి పోగలుగుతున్నారు. కానీ, నిరుపేదల్లో, ఆ మార్పు జరగడం లేదు. -ఈ రకంగా, కొన్ని రకాల కొత్త మార్పుల గురించి కూడా ఈ రచయిత ప్రస్తావించారు. పూర్వం లేని విధంగా, ప్రతీ కులానికీ, కుల సంఘాలు ఏర్పడుతున్నాయి- అన్నారు. అంటే, కుల విధానం పూర్వం కన్నా గట్టిపడుతోందని అర్ధమే కదా? దీన్ని గ్రహించలేదు.

ఖైర్లంజీ దురాగతాలు ఎందుకు జరిగాయి?-అనే ప్రశ్నకి జవాబు కావాలి. ఒక దళిత కుటుంబానికి చిన్న పొలం ఉండడం వల్లనా? ఇతర కులాల వాళ్లకి పొలాలు లేవా? ఆ దళిత కుటుంబం బుద్ధుడి విధానాన్ని ఇష్టపడడం వల్లనా? ఇతర దళిత కుటుంబాలు కూడా కొన్ని వున్నాయి అదే ఊళ్లో!

ఒక్క దళిత కుటుంబం మీదే ద్వేషం ఎందుకు పుట్టింది? -ఖైర్లాంజీలో దొరికిన ఆధారాల్ని బట్టి చూస్తే, ఆ దళిత కుటుంబం అగ్రకులాలు అనే వాటికి అణిగిమణిగి ఉండడం లేదు. స్వతంత్రులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి మీద, ఇతర కులాల కక్షకు కారణంగా ఇదే కనపడుతోంది. స్వతంత్రులుగా జీవించడానికి తోటి కులాల్లో ఎవరు ప్రయత్నించినా భరిస్తారు గానీ, తమకంటే ”కింది కులాల” వాళ్లు అలా చేస్తే, ‘పై’ కులాల వాళ్లు భరించలేరన్న మాట! ఖైర్లాంజీలో దళితుల మీద దాడి చేసిన వాళ్లు, ఇతర అగ్ర కులాల దృష్టిలో ‘తక్కువ’ కులాల వాళ్లే.

దాడికి, ‘తక్షణ కారణం’ ఏమిటంటే, ఆ దళిత కుటుంబం, తమకన్నా ‘పై’ కులం వారి మీద ఫిర్యాదులు చేస్తే, వారు అరెస్ట్‌ కావడం. తోటి కులస్తులెవరైనా, అటువంటి ఫిర్యాదులు చేస్తే, ఆ కారణంతోనే వారిపై ఆ దాడి జరుగుతుందా?-జరగదు. అంతే కాదు, తమ కంటే ‘పెద్ద’ కులస్తులు ఫిర్యాదు చేస్తే, వారిపై దాడికి పూనుకోరు. కేవలం, తమకంటే ‘కింది’ కులం వాళ్లు స్వతంత్రంగా బతుకుతున్నారు కాబట్టే, తమకు లొంగడం లేదు కాబట్టే, ఈ దాడి.

‘హత్య’ అన్నప్పుడు, ‘ఆత్మ రక్షణ’ కో, ‘ఆత్మ గౌరవాని’ కో, ఉద్యోగ ధర్మానికో, జరిగేది వేరూ, కక్షతో, అసూయతో, అహంకారంతో, జరిగేది వేరూ. ఖైర్లాంజీలో, దాడిలో పాల్గొన్న ఓబీసీల్ని, ఏ క్రూర జంతువులతోనూ పోల్చడానికి కుదరదు. క్రూర జంతువులు, తమ ఆహారాల కోసం మాత్రమే చంపుళ్లు చేస్తాయి. అవి, హత్యలు కావు. ఖైర్లాంజీ దురంతం అటువంటిది కాదు. ఆ నీచుల్ని, ఆ నీచులతోనే పోల్చాలి తప్ప, ఇంకే పోలికా కుదరదు. దళిత కులాల మీద, నీచ హత్యలు గతం నించీ జరుగుతూనే ఉన్నాయి. మేళ వలపు మురుగేశన్‌ని చంపినప్పుడు, తలని నరికి, ఆ తలని నూతిలోకి విసిరేశారు. ‘మానభంగం’ అన్నప్పుడు, అది రహస్యంగా జరుగుతుంది గానీ, నడివీధిలో, ఆడవాళ్ల నవ్వుల మధ్య జరగదు, ఖైర్లాంజీలో జరిగినట్టు!

బీహారులో, రణ్‌వీర్‌ సేన చేసిన నేరాలు ఘోరమైనవే. దళితులకు ఎక్కువ భయాలు కల్పించడానికే అటువంటి నీచాలు జరుగుతాయి. అసలైన కారణం, దాడి చేసే నీచుల అహంకారం. ఆ అహంకారం, ప్రధానంగా ‘పై కులాలు మావి’ అనేది. దానితోపాటు ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఖైర్లాంజీలో ఏ నేరమూ జరగలేదని, ఆ కేసుని మాయం చేయాలని చూశారు పోలీసు అధికారులు. వాళ్లు దళితులే. వాళ్లు ప్రభుత్వాధికారులే. కేసుని పూర్తిగా మాయం చేయడం సాధ్యం కాక, కేసుని తప్పుల తడకగా మార్చారు. సాక్ష్యాధారాలు లేకుండా చేశారు. అయినప్పటికీ, చివరికి నేరస్తులకు శిక్షలు పడితే, వాళ్లు హైకోర్టుకి వెళ్లారు. కేసు ఇంకా అక్కడే ఉంది. చివరికి, భయ్యాలాల్‌ భోట్‌ మాంగేకి తప్ప అందరూ దీన్ని మర్చిపోతారు. గతంలో జరిగిన వాటిని మర్చిపోలేదా?
(ఇంకా ఉంది)

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates