విరసం @50

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

విప్లవ రచయితల సంఘం యాభై ఏళ్ళ వేడుకలు ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా కొందరు రచయితలను, కవులను, విరసం సాఫల్య వైఫల్యాలపై అభిప్రాయం చెప్పమ’ని అడిగాం. దానికి వారి స్పందనలను ఇక్కడ ప్రచురిస్తున్నాం. 
తనని తాను దిద్దుకుంటూ విస్తరిస్తోంది.
విరసం వొక సాహిత్య సంస్థగా యాభై యేళ్ళుగా కొనసాగడం సాహిత్యావసరం. సామాజిక అవసరం. సమాజానికి అవసరం లేనిది యేదైనా దానికదే కనుమరుగై పోతుంది. విరసం దానికి అతీతం కాదు. విరసం అవసరం యివాల్టికీ వుంది కాబట్టే మనగలిగి వుంది. 1970ల నాటి సామాజిక సందర్భాన్ని ఆపై 1975ల నాటి ఎమర్జెనీ కాలాన్ని గుర్తుచేసుకుంటే యివాళ వున్న కాలం దానికి అతీతమైం దేమీ కాదు. రాజ్యం చాలా స్మార్ట్‌ అయింది. ప్రజల్ని బలహీనతల్లోకి నెట్టి ఆ బలహీనతలనే తన బలంగా వాడుకుంటోంది. అందుకనే ప్రశ్నించే విరసం అనివార్యమైన నిర్భంధానికి అప్రకటిత నిషేధానికి గురైవున్నా, అనేకమంది సభ్యులు జైలుపాలైనా కేసులు యెదుర్కొంటున్నా, సాహితీ సృజన నిరంతర ధారగా కొనసాగుతోంది.

విరసం అదెందుకు చెయ్యలేదు? ఇదెందుకు చెయ్య లేదు?- అని ప్రశ్నలు అన్ని సందర్భాలలో సంస్థ యెదుర్కొం టూనే వుంది. తెలీకుండానే విరసానికి ఆ స్థానం యిచ్చి మరీ విమర్శ చేస్తున్నారు. అన్నీ వేదాల్లో వున్నాయన్నట్టు అన్నీ విరసంలో వుండాలని కోరుకుంటున్నారు. అది కూడా బ్రాహ్మణీయ భావజాలమే. ఏ సంస్థకయినా దాని పరిమి తులూ పరుధులూ దానికుంటాయి. అందుకనే స్త్రీవాదం దళితవాదం మైనారిటీవాదం ప్రాంతీయ అస్తిత్వ వాదాలకు కాలసిన భూమికను కాకపోయినా అవి యేర్పడడానికి కావలసిన యెరుకను పరోక్షంగా కలిగించిన తననే నిలదీ స్తుంటే తెలియకనే విరసం ఆత్మరక్షణలో పడింది.

ఆపై అర్థం చేసుకుంది. కలిసి నడిచింది. దానికి తనదైన తాత్విక తను అద్దింది. సాహిత్యం దానికది అక్షరంగా మిగలడం వేరు. ఆచరణగా వుండగలగడం వేరు. ఆచరణలో వున్నప్పుడే విజయాలతో పాటు వైఫల్యాలు వుంటాయి. అలాగే వైయక్తికమైన అంశాల్ని సామాజికాంశాలే ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే విరసం ఆ గీత దాటి మనిషి కేంద్రంగా అంతరంగ ప్రపంచాన్ని సహితం ఆవిష్కరించడంలో సాహిత్య పరిపుష్టినీ సమగ్రతనీ సాధిస్తుందని నమ్మకముంది. విరసం తనని తాను దిద్దుకుంటూ విస్తరిస్తోంది.

బమ్మిడి జగదీశ్వరరావు 

ప్రజల ధర్మాగ్రహానికి ఒక దిక్సూచి
ఉద్యమానికి అంతిమ విజయం అంటూ ఒకటి ఉంటుంది. కానీ అంతిమ విజయానికి ముందు, ఉద్యమం పెరుగుతున్న క్రమంలో, విజయాలు ఉండవా? సమాజంలో ఆర్థిక నేరాలు పెచ్చుపెరిగిపోయినాయి. కానీ, ఈ వ్యవస్థలో ఆర్థిక నేరాలకు శిక్షలు లేవు. ఆర్థిక నేరాలు చేస్తున్నవారే ఎన్నికల బరిలోకి దిగి రాజ్యాధికారం హస్తగతం చేసుకుంటూ వున్నారు. డబ్బు రాజకీయాధికారాన్ని సంపాయించి పెడితే, రాజకీయాధికారం మళ్ళీ డబ్బును సంపాదించి పెడుతుంది. లైంగిక నేరాలకు సరైన శిక్షలు లేనప్పుడు ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సందర్భాలను ఇప్పుడు మనం చూస్తున్నం. ఆర్థిక నేరాలకు సరైన శిక్షలు లేనప్పుడు, ప్రజలు భవిష్యత్తులో ఏ విధంగా ప్రతిస్పందిస్తారో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఇదే జరుగుతూ ఉంది.

ఎన్నికల ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వారు ఏ రాజకీయ వ్యవస్థను కోరుకోవచ్చో దాన్ని విప్లవోద్యమం ప్రజల భావజాలంలోకి బలంగా ప్రవేశపెట్టగలిగింది. ఇది ప్రజల భావజాల వ్యవస్థలో విప్లవోద్యమం సాధించిన మౌలిక విజయం. ఎన్నికల ప్రభుత్వాలు చేసిన భూసంస్క రణల చట్టం, బ్యాంకుల జాతీయం, వెట్టి చాకిరీ నిర్మూలన మున్నగు చట్టాల వెనుక విప్లవోద్యమ ప్రభావం లేదని చెప్పలేం. న్యాయవ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ- ఈ మూడు వ్యవస్థలూ వైఫల్యం చెందిన క్రమంలో విప్లవోద్యమం సామాన్యులవైపు నిలబడి సాధించిన విజయాలు ఈ సమాజానికి తెలుసు. పట్టణాలలోని సామాన్యులుప్రస్తుతం అవినీతిపరులను ఎదుర్కొనే క్రమంలో రెడ్‌ ఆర్మీ నిర్మాణం గురించి కలలు కనడం ఒక పరిణామం. ప్రజల ధర్మాగ్రహానికి ఒక దిక్సూచిని ప్రతిపాదించిన విప్లవోద్యమం విస్మరించలేనిది.

బండి నారాయణస్వామి 

యాభైఏళ్ళ తర్వాతా అదే ప్రశ్న: 
రచయితలారా, మీరెటు వైపు?
విరసం, పైగంబర కవులు 1970 కన్న కవల పిల్లలు. విరసం effulgence చూశాక ఇక జూనియర్‌ అవసరం లేదనిపించింది. అదొక చరిత్ర. నా మటుకు నాకు, విరసం, అది కొమ్ము కాసిన ప్రజాపోరాటాలూ, వాటి ప్రభావాలూ, నా కవిత్వ సారాంశానికి మూలకాల వంటివి. విరసం బయట వుండి, దాని సాఫల్య వైఫల్యాలను ఎంచి చూడడం తేలికే. రెండు మూడు సార్లు పత్రికలలో వి.వి.తో జరిగిన ‘కవిత్వ సంభాషణ’లో నా concern నేను వ్యక్తం చేయడం, ఆయన నన్ను ఓదార్చి, సరిచేసే ప్రయత్నం చేయడం మిత్రులకి గుర్తుండే వుంటుంది. వ్యవస్థాపక దిగ్గజాలు శ్రీశ్రీ, కొ.కు., రావిశాస్త్రి, కె.వి.ఆర్‌. వంటి వారి త్వరిత నిష్క్రమణ, త్రిపుర నేని మధుసూదనరావు వంటి అగ్నికణాల వంటి పండిత మేధావుల నాయకత్వ సమాప్తి, కల్యాణరావు వంటి సృజన కారుడి పరిమిత పాత్ర; మొత్తం భారమంతా దాదాపు వి.వి. భుజాల మీద పడడం, వీటికి తోడు అనేకానేక ప్రతికూల రాజకీయ పరిణామాలు… ఇవన్నీ విరసం అభిమానులకి కొంత అసంతృప్తి కలగడానికి కారణం కావచ్చు. ఒకటి మాత్రం నిజం.
ఈ రోజు తెలుగు సాహిత్యంలో ప్రజారాజకీయాలు, ప్రజాతంత్ర భావనలు సజీవంగా వుండడానికీ, వెలువడుతున్న అధిక భాగం రచనలకి ఆ భావనలే భూమికగా మారడానికీ విరసం రగిలించి, యాభై ఏళ్ళుగా ఆరకుండా అరచేతులు అడ్డుపెట్టి కాపాడుతున్న భావజాలమే, ఆచరణే కారణం. సాహితీ స్రవంతి, అరసం, మంజీర రచయితల సంఘం వంటి అంతో ఇంతో భావసారూప్యం వున్న సంస్థలను కలుపుకుపోవడంలో విరసం మరికొంత చొరవ చూపించి వుండవలసిందేమో. సృజనాత్మక సాహిత్యంలో కూడా, వచనమైనా, కవిత్వమైనా, విరసం దృష్టి సారించ వలసివుంది. ఎందుకంటే విరసం ‘విప్లవ’ రచయితల సంఘం మాత్రమే కాదు, విప్లవ ‘రచయితల’ సంఘం కూడా.

దేవిప్రియ 

అస్తిత్వ రాజకీయాలను అర్థం చేసుకోవటంలో వైఫల్యం
డెబ్బయ్యో దశకంలో సకల రంగాల వైఫల్యం మీద ప్రత్యామ్నాయ పాత్ర పోషించిన ఒకే ఒక సంఘం విరసం. ఐదు దశాబ్దాలుగా నిర్బంధాలకు వెరవకుండా నిక్కచ్చిగా సుదీర్ఘ కాలం ప్రజా రాజకీయాలను నిలబెట్టే క్రమంలో అనుభవించిన ట్రామా, నిర్ధాయక త్యాగమయ పాత్ర చిన్నది కాదు. సాహిత్యానికి, ప్రజా ఆలోచనకూ, రాజకీయ నిర్మాణాలకూ సాహిత్యం ఎవరి పక్షాన ఉండాలనేది నేర్పింది. రాసే కవికి నిబద్ధత ఉండాలనే ఎరుకను ఇచ్చింది. కోట్లాది ప్రజల గొంతుక అయింది.

వైఫల్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. సుదీర్ఘ మైన విప్లవ సాహిత్య ఒరవడి ఉండి, ఆ రాజకీయాలతో విభేదించిన లేదా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వ్యక్తుల పట్ల రాజకీయ సమూహం స్పందించాల్సిన దాని కన్నా దూకుడుగా చేసిన మేధోదాడి విరసం వైఫల్యమే. అటువంటి వారి పట్ల కనీస రిసైప్రొకల్‌ బాంధవ్యాలను కాపాడుకోలేక పోయింది. ముందుతరం కవుల రచనలను ఈ తరానికి అందించడంలో కనీస ప్రజాస్వామిక ధోరణి పాటించ లేదు. రాయని భాస్కరుల అజమా యిషీ ఇంకా ఎక్కువే ఉంది. విప్లవ సాహిత్యం అంటే సాయుధ రాజకీయాల సమాహారమే కాదు, అట్టడుగున పడి కనిపించని కథలు వెలికి తీయాల్సిన బాధ్యత ఆ సంఘం మీద ఉంది.

ఆధునికతను అర్థం చేసుకోవడంలో ఈ నాటికీ నవ్య సంప్రదాయ వాదం దాటి బయటపడలేదు. వాళ్ళు చెబుతున్న నూతన మానవుడి ఆవిష్కరణ గురజాడ కేంద్రీకృత చర్చను ఇంకా అధిగమించాల్సే ఉంది. కథ విమర్శ లాంటి ప్రక్రియల్లో, తాత్విక రంగంలో కళ్యాణరావు, త్రిపురనేని మధుసూదన రావు, ప్రజాబాణీకి ప్రాణం పోసిన శివసాగర్‌ కొనసాగింపు విరసం నుంచి రాకపోవడం వైఫల్యమే. పందొమ్మిది వందల ఎనభైల తర్వాత ముందుకు వచ్చిన కుల చర్చ వల్ల మారిన సామాజిక సంక్లిష్టాలను, ముఖ్యంగా అస్తిత్వ రాజకీయాలను అర్థం చేసుకోవడంలో అది పూర్తిగా విఫలం అయ్యింది. ఇన్ని లోపాలు ఉన్నా ఈ సంక్షుభిత కాలానికి విరసం ప్రాసంగికత కొనసాగింపూ అవసరం ఉంది.

గుర్రం సీతారాములు

విరసం’కు రెడ్‌ శాల్యూట్‌!
వావ్‌. పండగ. చరిత్ర చేసుకుంటున్న సంబరం. జనం బతుకు లోంచి నిత్యం జన్మించే ఒక సంస్థకు ఫార్మల్‌గా యాభయ్యో జన్మదినోత్సవం. పాపను ఉద్వేగంతో వొళ్లోకి తీసుకుంటున్నాను. పాపనై తన వొడిలో వొదుగుతున్నాను. ‘విరసం’ కేవలం భౌతికం కాదు. భావన కూడా. ఈ భావన నాలో ఎన్నాళ్ళుంటుందో అన్నాళ్లు నేను ప్రాణిని. ఒప్పుకోరేమో గాని, ఎవరైనా ప్రాణి అయ్యేదీ అలాంటి అణుశక్తి వల్లనే. ‘విరసం’ గురించి సూత్రబద్ధంగా మాట్లాడలేను. మహాప్రస్థానం దయ్యం పట్టిన చలంలా అనుభవాన్ని పలవరిస్తాను.

‘విరసం’ ఒకేసారి రాజకీయం, అరాజకీయం. ఒకేసారి సంస్థ, అసంస్థ. నా లాగే ‘విరసం’ రాజ్యాంగబద్ధం, రాజ్యాంగ విరుద్ధమున్నూ. ఓర్నీ, నాలాగే అన్నానేమిటీ? రాజ్యాంగం లాగే అని కదా అనాలి! తనకు తాను బద్ధం కాకుండా తనను తాను మార్చుకునేదీ, అవసరమైతే పరిమార్చుకునేదే రాజ్యాంగం. తనకు తాను అంతిమం, పరమం అయినది… అది మతం కావొచ్చు, కులం కావొచ్చు. అది హిట్లర్‌ నాజీయిజం వలె, ముస్సోలినీ ఫాసిజం వలె అ-మానుషం, మరణ యంత్రం. ‘విరసం’ సాహిత్యంలో విప్లవం. రాజకీయం కానిది విప్లవమేమిటి నా బొంద, తల లేని మనిషిలాగ. విరసం అంటే విప్లవమే గాని, రచయితల విప్లవం. చూడు. విశ్లేషించు. ప్రశ్నించు. ఎదిరించు. మార్చు. నువ్వెక్కడైనా వుండు. అడివిలోనైనా, మైదానంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా వుండు. అన్నీ గీసుకున్న గీతలు. వూళ్ళో వుంటూ ప్రశ్నించా ల్సిన దాన్ని ప్రశ్నించని వాడి కన్న ఎక్కడున్నా ప్రశ్నించే వాడే విప్లవకారుడు. రచయితల నిబద్ధతా నిమగ్నతలకు వారి రచనలే గీటురాళ్లు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అనేది పెట్టుబడి పనికేనా, విప్లవానిక్కూడా సాధ్యమే. విప్లవాగ్నిని రగల్చడం నా వంటి పూచిక పుల్లకు కూడా సాధ్యమే. పూచిక పుల్లల నుంచి దండ కారణ్యాల వరకు విప్లవాగ్నులను సమన్వయంచేసి నడిపించాల్సిన ‘విరసం’కు రెడ్‌ శాల్యూట్‌.

హెచ్చార్కె 

వర్ణకుల పీడిత సమాజానికి వర్తించని ‘విరసం’ విజన్‌!
యాభై సంవత్సరాల విరసం పాశ్చాత్య సిద్ధాంతాల దూరదర్శన్‌లను, సూక్షదర్శనలను వాస్తవ భారతీయ సామాజిక పరిస్థితులకు అన్వయించడంలో విఫలమైనా, అన్ని ఆధునిక సామాజిక అస్తిత్వాల, ఉద్యమాలకు వెలుపల్నించి మద్దతు తెలిపింది. ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ల దోపిడీని సమాజమ్ముందుంచింది. విరసం భారతీయ సమాజంలోని అసమానతల విరుగుడుకి, భారతీయ తత్వశాస్త్రంలోని వర్ణకుల నిర్మూలనా వాదాలను తీసుకోవడంలో వైఫల్యం చెందింది. దీనిక్కారణం దళితులు, ఆదివాసీలు, ఎంబీసీలు, అణగారిన మహిళలకు చెందిన రచయితలు, రచయిత్రులు విరసం నాయకత్వంలో లేరు.

భారతీయ వర్ణకుల పీడిత సమాజా నికి వర్తించని ‘విరసం’ విజన్‌లో, మిషన్‌లో లోపాలున్న మాట వాస్తవం. మాదిగ దండోర, తుడుందెబ్బ వంటి అనేక అస్తిత్వ సామాజిక ఉద్యమాలను ముందుగా దర్శించడంలో విఫలమైంది. వెలుపల్నించి సంఘీభావం తెలిపిందే తప్ప ఆ ఉద్యమాల సాహిత్యంగా మారలేదు. తనంతటతానుగా విరసం అస్తిత్వాల సబ్జెక్టివిటీ కలిగిన సంస్థగా ఎందుకు లేదంటే యీ అస్తిత్వ ఎలిమెంట్స్‌తో, వర్గాలతో విరసం నిర్మితమైంది కాకపో వడమే. విరసం అగ్రనాయకత్వం గూడేల నుండి, అడవుల నుండి, చాకిరేవుల్నించి, కుమ్మరి స్మశాన వాటికల మనుషు ల్నించి కాక అగ్రహారాల్నించి, వూరి ఆసాముల్నించి వచ్చింది కావడమే.

అణగారిన సామాజిక కులాల రచయిత్రులు ‘మనలో మనం’ 2009 అనకాపల్లి సభలో కుల జెండర్‌ కోణంగా ముందుకు తెచ్చిన సాహిత్య అస్తిత్వాలను, ప్రశ్నల్ని, అవగాహనల్ని, దృక్పథాల్ని విరసం సభ్యురాల్లే మూసిపెట్టి అవాచ్యం చేశారు. యీ వైఖరులను అణగారిన కులాల రచయిత్రులు ‘మట్టిపూలు’గా బహిరంగంగా ఎదుర్కొన్న ప్పటికీ విరసం సంఘీభావం తెలుప లేదు. విరసం కుల జెండర్‌ వివక్షా నిర్మూలనా చైతన్యాన్ని సాధన చేయాల్సి ఉంది. సాయుధ పోరాటం, కమ్యూనిజం సిద్ధాం తాల్ని సాపేక్షికంగా సడలించి శాంతి యుత పరివర్తన బౌద్ధ సామాజిక ధర్మ కార్యక్రమంగా విరసం అవగాహ నలో చేర్చుకోవాలి.

జూపాక సుభద్ర

నాన్‌సీరియస్‌ రైటింగ్‌ని పక్కన పెట్టించింది
1966లో హైదరాబాద్‌ వొచ్చిన నన్ను విరసం గైడ్‌ చేసింది. విరసం భావజాలం నా తరం వాళ్ళనే కాకుండా, తర్వాత వొచ్చిన నాలుగైదు తరాల వాళ్ళని ప్రభావితం చేసింది. తొలినాళ్ళలో దాని ప్రభావం ప్రత్యక్షంగా ఉండేది. తర్వాత పరోక్షంగా ఉంది. రాను రాను విరసం మార్గదర్శకత్వం అంతర్లీనమవుతూ వచ్చింది. విరసంలో పనిచేసిన చాలా మంది తర్వాత వచ్చిన వాదాల్ని లీడ్‌ చేశారు. విరసం నాన్‌ సీరియస్‌ రైటింగ్‌ని పక్కన పెట్టించింది. ఒక పొలిటికల్‌ థాట్‌ని కవిత్వ వస్తువులోకి ఎలా చొప్పించాలనేది విరసం కాంట్రిబ్యూషన్‌ అనుకుంటాను నేను.

కాలానుగుణంగా వచ్చిన వాదాల్ని ముందుగా పసిగట్ట లేకపోయిందా? తదనుగుణంగా తన్ను సవరించుకోలేక పోయిందా? అనే ప్రశ్నలు ఎప్పుడూ ఉన్నాయి. కాలధర్మం ఒకటుంది కదా! కాలధర్మాన్ని బట్టి వస్తువూ రూపమూ మారుతుంటుంది కదా! విరసం సంఖ్య పరిమితమవటానికి దాని మీదున్న రిప్రెషన్‌, సర్వేలెన్స్‌ ఎక్కువ కారణమనుకుం టాను. విరసం సభ్యుడైతే వచ్చే సవాళ్ళు ఎదుర్కోవటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. యువతరాన్ని ఏ రకంగా ఆకర్షించి తమ సభ్యుల్ని చేసుకోవాలో ఆ రకంగా చేసుకోలేకపోవటానికి దాని కమిటెడ్‌నెస్‌ కారణమనుకుంటాను. సరళీకృతమవుతున్నటువంటి మానవ సంబంధాలు, రాజకీయాలు యువతని అటు మొగ్గకుండా చేసేయేమో! రచనాశిల్పాన్ని శిక్షణా శిబిరాల్లో వ్యాప్తి చేయాల్సినంత వ్యాప్తి చేయలేదేమో. సాధారణంగానే యువతలో రాజకీయాల పట్ల ఉదాసీనత వచ్చింది. విద్యార్థి ఉద్యమాలు బలహీనపడటం ఒక కారణం.

కె. శివారెడ్డి 

అనేక యుద్ధముల ఆరితేరిన యోధ!
విరసం ఈ యాభయ్యేళ్ళ కాలంలో కనీసం మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యాన్ని శాసించింది. భాషనీ, సాహిత్య పరిభాషనీ పునాదులతో సహా పెకలించింది. సజీవ మైన భాషా సంపర్కంకోసం సాహిత్యాన్ని మళ్లీ మళ్లీ ప్రజల దగ్గరికి తీసుకు వెళ్ళింది. శివసాగర్‌ సారథ్యంలో వచన కవి త్వాన్ని ఒక మలుపు తిప్పింది. ప్రజల పాటకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేసింది. గద్దర్‌, వంగపండు సాంస్కృతిక యుద్ధ నౌకలుగా నిలిచారు. మాండలికాలను సాహిత్యంలో సుస్థిరం చేసింది. వచన సాహిత్యంలో అల్లం రాజయ్య తదితరుల కృషి తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసింది. కళ్యాణ రావు ‘అంటరాని వసంతం’ తెలుగు సాహిత్యంలో ఒక తాజా లేండ్‌ మార్క్‌. విరసం విలువలకు వరవరరావు ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌… సాహిత్య విమర్శకు శాస్త్రీయమైన పునాదులను నిర్మించింది.

సాహిత్య సామాజిక శాస్త్రమే (సోషియాలజీ ఆఫ్‌ లిటరేచర్‌) మార్క్సిస్టు సాహిత్య విమర్శ అనే స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇది సరయింది కాదని నా అనుమానం. త్రిపురనేని మధుసూదనరావు గతితార్కిక సాహిత్య భౌతిక వాదం అశాస్త్రీయం అని కొట్టిపారేయడం విరసం చేసిన తప్పిదం అని నా నమ్మకం. సాహిత్య చరిత్ర నిర్మాణంలో ప్రామాణిక పద్ధతులను ప్రవేశపెట్టింది. నిజాన్ని నిర్భయంగా అభివ్యక్తం చేసే నైతిక స్థయిర్యాన్ని ఒక సాహిత్య విలువగా నిలబెట్టింది. విరసం సాహిత్యాన్ని ప్రకృతీకరించింది. గిరిజనీకరించటం ద్వారా సాహిత్యానికి నూతన జవసత్వాలను జత చేసింది. సాహిత్యం, కళల పరిమితులను గుర్తించింది.

రచన ఆచరణకు పూర్వరంగం అని ప్రపంచానికి చాటి చెప్పింది. సాహిత్యంలోనూ రాజకీయాల్లోనూ అనిర్దిష్టత నుంచి నిర్దిష్టతకీ, సర్వనామాల నుంచి నామవాచకాలకీ ప్రయాణించడమే కాదు అడవికీ, వెన్నెలకీ వున్న అర్థాలను పూర్తిగా తలకిందులు చేసింది. విప్లవం అంటే సృజన. విప్లవం అంటే నిర్మాణం. రచన అంటే సృజన, రచన అంటే నిర్మాణం. సంఘం అంటే సృజన, సంఘం అంటే నిర్మాణం. విప్లవ రచయితల సంఘం ఒక సృజన, ఒక నిర్మాణం. ఒక సృజనాత్మకమైన ధిక్కారం.

ఖాదర్‌ మొహియుద్దీన్‌ 

కులాన్ని ఒక ఉపరితల అంశంగా చూడటంతో దళితులు దూరం అయ్యారు
విరసం వివిధ సామాజిక, రాజకీయ సంక్షోభ సందర్భాలలో ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తింది. ప్రజా ఉద్యమాల నిర్మా ణంలో భాగస్వామి అయింది. అనేకమంది కవులను, రచయి తలను సైద్ధాంతికంగా ఏకంచేసి ముందుకు నడిపించింది. సంప్రదాయ విమర్శ, ఆధునిక విమర్శ సిద్ధాంతాలను దాటి మార్క్సిస్టు విమర్శను బలంగా నిలబెట్టింది. వివిధ అంతర్జా తీయ, జాతీయ రాజకీయ సందర్భాల్లో, సామ్రాజ్యవాద, గ్లోబలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ పరిస్థితుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, చైతన్యం పెంపొందించడానికి ప్రజా పోరా టాలు నడిపింది. కరపత్రాలను ఒక ఉద్యమంగా ప్రచురిం చడం విరసం నిరంతర ప్రక్రియగా చేసింది. అరుణతార లాంటి ఒక పత్రికను నిబద్ధతతో సుదీర్ఘ కాలం నడపడం విరసంకే సాద్యమైన విషయం. విరసంలో విశేషమైన సాహిత్యం వచ్చింది.

విప్లవ దృక్పథంతో ఎంత బలమైన సాహిత్యం వచ్చిందో అంత బలహీనమైన మొనాటనస్‌ సాహిత్యం కూడా వచ్చింది. ఒకే రకమైన ఎత్తుగడలు, ముగింపులు, పడికట్టు మాటలతో విప్లవ కవిత్వం పలచబడి పోయి విమర్శలకు గురయింది. ఈ దేశంలో వర్గ బాధితు లంతా కుల పీడితులేనన్న సత్యాన్ని విరసం పట్టించుకోలేద న్నది విరసం మీదున్న పెద్ద విమర్శ. విరసంతో విభేదించి చాలామంది రచయితలు బయటికొచ్చారు. పునాది ఉపరితలం లాంటి చర్చలో కులాన్ని ఒక ఉపరితల అంశంగా చూడటంతో దళితులు విరసానికి దూరం అయ్యారు. దళితవాదం, స్త్రీవాదం లాంటి అస్తిత్వ సాహిత్య ఉద్యమాలు మొదలైన తొలి రోజుల్లో విరసంపై తీవ్ర స్థాయిలో విమర్శ ఎక్కుపెట్టాయి. ఆ తర్వాత విరసం ఆ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినా అవి మంచి ఫలితాన్ని ఇవ్వలేదు.

విమర్శలు ఎలా వున్నా ఈ యాభైఏళ్ళ కాలంలో ప్రజల పక్షాన నిలబడి విరసం చేసిన రాజ కీయ, సామాజిక, సాహిత్య పోరాటం స్ఫూర్తిమంతమైనది. ఒక నిర్దుష్ట సిద్ధాం తాన్ని నమ్మిన సంఘంగా విరసం తన పాత్ర పోషించడంలో సఫలమైందనే చెప్పాలి.

ఎం.ఎం. వినోదిని

సాహిత్యంపై యాభై యేండ్లుగా ఎగురుతున్న విప్లవ పతాక
ఒక రచయితల సంఘం ఇట్లా యాభై యేండ్లు విజయవంతంగా మనగలగడం తెలుగు సాహిత్య చరిత్రలోనే కాక ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అపూర్వం. ప్రజల పక్షాల నిలబడి, రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా, మొక్కవోని నిబద్ధతా, నిజాయితీలతో పనిచేయడం వల్లనే విరసం గత యాభై యేండ్లుగా సజీవంగా ఉన్నది. అనేక విజయాలని సాధించింది. సాహిత్యంలో వస్తువు తనకనువైన శిల్పాన్ని ఎంచుకుంటుందననీ, శిల్పం వస్తువు అస్తిత్వాన్ని బహిర్గత పరిచే అంతర్గత తర్కమనీ, అనేక శక్తివంతమైన రచనల ద్వారా విరసం కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. శ్రామిక వర్గ దృక్పథంతో ఆదివాసీ, రైతాంగ, శ్రామిక ప్రజానీకం జీవితాల్లోని నిర్దిష్టతను సాహిత్యీకరించి, నిర్దిష్టతనుండి విశ్వజనీనతను తాత్వీకరించింది.

రచయితలు కాగితమ్మీద అక్షరానికి నిబద్ధులై ఉండాలనే ప్రమాణం నెలకొలిపింది. విరసం ప్రజాస్వామికవాదులైన రచయితలందరినీ కలుపుకొని, విశాల విప్లవ సాహిత్యోద్యమాన్ని నిర్మించేందుకు తన ప్రణాళి కనూ, కార్యక్రమాన్నీ, ఆచరణనూ మరింత ప్రజాస్వామ్యీకరిం చుకుంటే బాగుండేది. బహుళ అస్తిత్వాల సాహిత్యాలకు ప్రతినిధ్యం వహించి, తానే సాంస్కృతిక నాయకత్వం వహించాల్సి ఉండింది. సాహిత్యమంటే జీవితాన్ని సమాజాన్ని ప్రతిఫలించడమే కాక, విచలించాలని (defflect) గుర్తించి, సందేశాత్మకంగా మాత్రమే కాక సూచితంగా ఉండేందుకు మరింత కృషి చేసి ఉండాల్సింది. ముందే నిశ్చయించిన పరిష్కారాలే కాకుండా, నలుపు తెలుపుల నిర్ధారణగానే కాకుండా, పాఠకుల్లో ప్రశ్నలనీ, ఆలోచనలనీ రేకెత్తించే విధంగా మరింత విస్తృతంగా ప్రజా స్వామిక సాహిత్యాన్ని సృష్టించి, మార్గ నిర్దేశం చేస్తే బాగుం డేది. దోపిడీ, పీడనలు, ఆధిప త్యాలు లేని సమా జం ఏర్పడే వరకూ విరసం సజీవం, ప్రాసంగికం.

నారాయణస్వామి వెంకటయోగి

రాజకీయాలకన్నా సాహిత్యం ఉన్నతమైంది!
సాహిత్యం రాజకీయాలకన్నా ఉన్నతమైనది, విలువైనది. రాజకీయాలకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యసాధన తర్వాత రాజకీయాలు రొటీన్‌గా మారే అవకాశముంది. లక్ష్యసాధన అనంతరం కూడా సాహిత్యం ప్రాధాన్యత ఉంటుంది. సాధించిన లక్ష్యాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్ళడానికి సాహిత్యం అత్యావశ్యం. అయితే అంతా నామ్‌కే వాస్తే నడు స్తున్న ప్రస్తుత దశలో ఒక సాహిత్య సంఘం 50 ఏండ్లుగా మనుగడలో ఉండడమంటే దానికదే ఒక విజయం. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి వివిధ ప్రక్రియల్లో సాహిత్యాన్ని వెలువరించింది విరసం. ఒక కులానికి సంబంధించిన అంశంపై పనిచేయడం ఈ సంఘం లక్ష్యం కాకపోయినప్పటికీ చేనేత కార్మికుల దుస్థితికి స్పందించి ‘చేనేత పాటలు’ అనే పుస్తకాన్ని వెలువరించింది. ఆ మేరకు వారి కృషిని అభినందించాల్సిందే!

నిజానికి ఇండియాలో మార్క్సిస్టు రాజకీయాలన్నీ ‘భూమి’ కేంద్రంగానే నడిచాయి. మారిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో భిన్నత్వాలని, భిన్న అస్తిత్వాలను ఇంకా చెప్పా లంటే కులం, జెండర్‌, మైనారిటీల గురించి సరైన సమయంలో పట్టించుకోవడంలో ‘విరసం’ కొంత మేరకు విఫలమయింది. ప్రాథమిక దశలోనే భిన్న అస్తిత్వాలను అర్థం చేసుకొని ఉంటే ఇంకా మంచి సాహిత్యం వచ్చి ఉండేది. ఆ ఉద్యమాలకు మేలు జరిగేది. ఇవ్వాళ తెలంగాణ సాహిత్యంలో స్తబ్ధత ఉండకుండేది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ‘లౌకిక’ భావనలు పెంపొందిం చేందుకు సంఘం కృషి చేయాల్సిన అవసరముంది.

సంగిశెట్టి శ్రీనివాస్‌

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates