జేఎన్యూలో..హింసోన్మాదం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ముసుగులు ధరించి ఏబీవీపీ కార్యకర్తల వీరంగం
– ఐరన్‌ రాడ్లు, హాకీ స్టిక్స్‌తో దాడి
– విద్యార్థినుల హాస్టల్స్‌లో దూరి మరీ దౌర్జన్యం
– కొందరిపై యాసిడ్‌ దాడి
– జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌కి తీవ్రగాయాలు
– ఫీజులు తగ్గించాలనడమే మేం చేసిన పాపమా? : అయిషీఘోష్‌
– ఏబీవీపీ – వీసీ ప్రణాళికాబద్ధమైన దాడి : ఏచూరి, చిదంబరం తదితర నేతలు

జేఎన్‌యూ రక్తసిక్తమైంది. ఫీజులు తగ్గించాలని కోరుతూ వామపక్షవిద్యార్థిసంఘాలు రెండు నెలలనుంచి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం అమాంతంగా 50 మందికిపైగా ముసుగు ధరించి వర్సిటీలో చొరబడ్డారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిని తీవ్రంగా గాయపర్చారు. విద్యార్థినీ, విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ మెంబర్లపై దాడులకు పాల్పడ్డారు. ఏబీవీపీకి చెందిన ఓ ఫ్యాకల్టీ గేటు ముందు నిలబడి మరీ.. వామపక్ష విద్యార్థులపై దాడులకు చేసే ఉసిగొల్పడం గమనార్హం. అయితే వర్సిటీ ప్రధానగేట్లకు తాళాలు వేసి ఉంటే..ముసుగులు ధరించిన ఆ దుండగులు పోలీసులను దాటుకుంటు ఎలా లోనికి ప్రవేశించారు.. ఎవరు వారిని అనుమతించారు..అన్నదానిపై సర్వత్రా చర్చ. గంటలపాటు వర్సిటీ లోపల హాహాకారాలు వినిపిస్తున్నా.. ఖాకీలు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించారు. సుమారు రెండు గంటలపాటు ఏబీవీపీ అరాచకకాండ సృష్టించేవరకూ గమ్మునుండిన.. వర్సిటీ యాజమాన్యం ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపు జేఎన్‌యూలో హింసోన్మాదం జరుగుతున్న విషయం తెలుసుకున్న వామపక్ష,ఇతర పార్టీల నేతలు అక్కడికి చేరుకుంటే..లోనికి పోలీసులు అనుమతించలేదు. ఏ అనుమతిలేకుండా జామియా మిలియా,అలీగఢ్‌ యూనివర్శిటీలో చొరబడి నానా బీభత్సం సృష్టించిన పోలీసులు.. జేఎన్‌యూలో మాత్రం ఖాకీలు వ్యవహరించిన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది.
ఏబీవీపీ, సంఘ్ పరివార్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లను బట్టీ ”వైస్‌ చాన్సలర్‌ మనోడు, పోలీసులు లోపలకి రారు. మీరు వెళ్లి కొట్టండి. వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారిని ఎవరిని వదలొద్దు. ఖతం చేయండి” అని వారి సంభాషణాలు జరుగుతుండటం పలువురిని విస్మయానికి గురి చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)పై కేంద్రంలోని అధికార బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ దుండగులు అమానుష దాడికి పూనుకున్నారు. వర్సిటీలోకి మూకలు ముసుగు చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై అతి దారుణంగా దాడి చేశారు. ఐరన్‌ రాడ్లు, హాకీ స్టిక్‌లను ఉపయోగించి దౌర్జన్యానికి దిగారు. అంతే కాకుండా యాసిడ్‌ దాడికి కూడా పాల్పడ్డారు. వీసీ-ఏవీబీపీ కార్య కర్తలు కలిసి ప్రణాళికాయుతంగా వీరంగం సృష్టించారు. ముందుగా జేఎన్‌ యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ను టార్గెట్‌ చేశారు. ఆమెపై దాడికి పాల్పడటంతో. .నుదుటిపై గాటు పడింది. శరీరంపై పలు చోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె తల నుంచి రక్తం కారే దాకా వదిలిపెట్టలేదు. ఆమెతో పాటు అనేక మంది విద్యార్థులు, ప్రొఫెసర్లకూ తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు.

ఈ అరాచకాలు ఆగెదెన్నడు.?
జేఎన్‌యూలో ఏబీవీపీ మళ్లీ హింసకు పాల్పడింది. విద్యార్థులు తమ సమస్యలపై ఆందోళన చేయడమే నేరమన్నట్టు ముసుగుధరించి మరీ హింసోన్మాదనం సృష్టించారు. పెంచిన హాస్టల్‌ ఫీజులు తగ్గించాలనీ, హాస్టల్‌ మాన్యల్‌ వెనక్కి తీసుకోవాలనీ, తమ సమస్యలపై వైస్‌ చాన్సలర్‌ చర్చించాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు గత 65 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే వైస్‌ చాన్సలర్‌(వీసీ) విద్యార్థులతో చర్చించేందుకు ముందుకు రావటం లేదు. వర్సిటీలో విద్యార్థుల సమస్యలపై వారితో చర్చించడం వీసీ ప్రాథమిక విధి. కానీ ఆయన ఇప్పటి వరకూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలవలేదు. అయితే విద్యార్థులు కూడా మొక్కవోని దీక్షత తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎముకలు కొరికే చలికి సైతం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు చేస్తున్నారు. అయితే విద్యార్థుల సమస్యలపై వర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి గానీ, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్డీ) ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఎంహెచ్‌ఆర్డీ ఒక కమిటీ వేసినప్పటికీ అది నామమాత్రమే అయ్యింది. విద్యార్థి సంఘ నేతలతో కూడిన బృందం పలు దఫాలుగా చర్చలు జరిపినా, ఎంహెచ్‌ఆర్డీ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టలేదు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని ఆపాలనీ, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఏబీవీపీకి చెందిన నేతలు శనివారం విద్యార్థులను బెదిరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, ఏబీవీపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబీవీపీ నేతలు దాడి చేసేందుకు ప్రయత్నిం చారు. అయితే విద్యార్థులంతా ఒక్కసారిగా ప్రతిఘటించే సరికి తోకముడుచుకొని ఏబీవీపీ నేతలు వెనుదిరిగారు. అయితే ఆదివారం సుమారు 50 మందికి హిందూత్వ మూకలను బయట నుంచి వర్సిటీకి రప్పించారు. ముసుగులు ధరించిన ఆ మూకలు విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు సబర్మతి టీపాయింట్‌ వద్ద జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (జేఎన్‌యూటీఏ) నేతృత్వంలో వర్సిటీలో శాంతి, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు బహిరంగ సభ జరిగింది. జేఎన్‌యూటీఏ తోపాటు జేఎన్‌యూ ఎస్‌యూ కూడా పాల్గొన్నది. అక్కడకు అక్రమంగా చొరబడిని ఏబీవీపీ దుండగులు ఐరన్‌ రాడ్లు, హాకీ స్టిక్స్‌తో ఒక్కసారిగా విరుచుపడ్డారు. విద్యార్థులు, ప్రొఫెసర్లు చెల్లా చెదురయ్యారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టుకుంటూ వెళ్లారు. రోడ్డుపై పరిగెత్తించుకుంటూ మరీ భయోత్పాతాన్ని సృష్టించారు. హాస్టల్స్‌లోకి దూరిన వారిని కూడా వదలలేదు. తలుపులు బద్దలు కొట్టి మరీ విద్యార్థినీల హాస్టల్‌ల్లోకి వెళ్లి చితకబాదారు. ఒడిగట్టారు. కొంత మందిపై యాసిడ్‌ దాడి చేశారు. సాయంత్రం ఆరు గంటల తరువాత విద్యార్థుల హాస్టల్లోకి మాస్కులు ధరించి చొరబడిన ఏబీవీపీ మూకలు కర్రలతో దాడి చేశారు. జేఎన్‌యూ హస్టల్స్‌ రక్తసిక్తమయ్యాయి.

గాయపడిన వారిని ఎయిమ్స్‌కు తరలింపు
జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌పై సబర్మతి టీపాయింట్‌ దగ్గర దాబా వద్ద దాడి చేశారు. దాడికి గురైనవారిలో జేఎన్‌యూఎస్‌యూ కార్యదర్శి సతీష్‌ కూడా ఉన్నారు. మాస్కులు ధరించిన దుండగులు దాడిలో పీజీ మొదటి చదువుతున్న దీప్తి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు సూరీల కాలు, చేతులు విరిగాయి. ప్రొఫెసర్‌ అమిత్‌ పరమేశ్వర్‌, ప్రొఫెసర్‌ సుచరత సేన్‌లకు తీవ్రంగా గాయపడ్డారు. జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌ తో పాటు 25 మంది విద్యార్థులు, ముగ్గురు ప్రొఫెసర్లును ఎయిమ్స్‌లో చేర్చారు. ముగ్గురు విద్యార్థులకు తలపై బలంగా దెబ్బ తగలడంతో న్యూరాలజీ విభాగంలో చేర్చినట్టు తెలిసింది. దాంతోపాటు మరో నలుగురిని ట్రామా సెంటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయిషీఘోష్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

వర్సిటీ యాజమాన్యం అనుమతితోనే దాడి?
ముందస్తు ప్రణాళిక ప్రకారం.. శనివారం నుంచే యూనివర్సిటీ యాజమాన్యం అనుమతితోనే ఏబీవీపీ కార్యకర్తలు వర్సిటీ ప్రాంతంలో ఉద్యమిస్తున్న విద్యార్థులను కర్రలతో కొట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ఏబీవీపీ దుండగులు, సంఫ్‌ుకు చెందిన ప్రొఫెసర్లు బయట నుంచి కొంత మంది దుండగులను వర్సిటీలోకి తీసుకొచ్చారు. హెచ్‌సీయూ నుంచి వచ్చిన సీపీఎస్‌లో కొత్త ఫ్యాకల్టీ తపన్‌ బీహారీ.. దీనంతటికి ప్రణాళికలు వేసిన వారిలో ఒకరు. ఆయనే బయట నుంచి దుండగులను తీసుకొచ్చాడు. తపన్‌ బీహారీ అనే ఫ్యాకల్టీ గేటు వద్ద నిలబడి, ఎవరైతే వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఉన్నారో, గుర్తించి కొట్టడం ప్రారంభించారు. అలా జేఎన్‌యూటీఏ నిర్వహిస్తున్న సభ వరకు కొట్టుకుంటూ వెళ్లి, ఆ సభపై విరుచుకుపడ్డారు. కాగా, ఈ వ్యవహారమంతా వీసీ జగదీశ్‌ కుమార్‌ కనుసన్నల్లో జరిగినట్టు వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై వీసీ ఇప్పటివరకూ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులపై దాడిని ఖండించిన ఎస్‌ఎఫ్‌ఐ
జేఎన్‌యూ విద్యార్థులపై జరిగిన దాడిని స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వావ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ వీసీ జగదీశ్‌ కుమార్‌తో అపాయింట్‌మెంట్‌ స్కాంలో భాగస్వామ్యమున్న ఏబీవీపీ సంఘం.. వర్సిటీలో ఫీజుల పెంపుపై పోరాడుతున్న విద్యార్థి ఉద్యమంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడిందని బిశ్వాస్‌ తెలిపారు.గత కొద్ది రోజులుగా వర్సిటీ యాజమాన్యమే జేఎన్‌యూను ఒక యుద్ధభూమిగా మార్చేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు.

మెరుపు వేగంతో ఏబీవీపీ దుండగులు దాడి: అయిషీఘోష్‌
సబర్మతి దాబా వద్ద ఉన్న తమపై మెరుపు వేగంతో ఏబీవీపీ దుండగులు దాడికి పాల్పడ్డారని జేఎన్‌యూ ఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌ తెలిపారు. రాడ్లు, రాళ్ళతో దాడి చేస్తూ ముందుకు సాగారనీ, మాస్కులు వేసుకొని వచ్చి దాడులు చేశారని విమర్శించారు.

ఢిల్లీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద బైటాయింపు
ఈ అమానుష దాడిని ఖండిస్తూ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఢిల్లీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఆందోళనకు దిగారు. విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడికి పూనుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యమాలకు భయపడే.. : ఏచూరి
ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడుతున్న జేఎన్‌యూ విద్యార్థులపై దాడిని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా ఖండించారు. విద్యార్థి ఉద్యమాలకు భయపడే మోడీ సర్కారు తన అనుబంధ సంస్థలతో దాడులు చేయిస్తున్నదని ఆగ్రహంవ్యక్తం చేశారు. వ్యతిరేకతను ఎదుర్కొనలేకనే ఈ విధంగా దాడులు చేస్తున్నదని విమర్శించారు. జేఎన్‌యూలో జరిగిన ఘటనలు వర్సిటీ యాజ మాన్యం, ఏబీవీపీ సంయుక్తంగా ప్రణాళిక ప్రకారం చేసినట్టు కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా, కేంద్ర మాజీ హౌంశాఖ మంత్రి చిదంబరం స్పందిస్తూ.. ఢిల్లీ పోలీసులు జేఎన్‌యూ గేట్‌ వద్దే ఉండి ఏవీబీపీ కార్యకర్తలను కర్రలతో లోపలికి పంపించారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌ అసలు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ ఘటనను పలువురు ఖండించారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates