తీవ్రతరమౌతున్న నిర్భంధం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
Image result for telangana activists arrest"Image result for haragopal"జి. హరగోపాల్‌

ఆర్థిక అసమానతలు, సామాజిక ఆధిపత్యాలున్నంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో జరుగుతూనే ఉంటాయి. చారిత్రక స్పృహ కలిగిన ప్రభుత్వాలు ఉద్యమాలకు రాజకీయ పరిష్కారాలు కనుక్కోవడానికి కృషి చేయాలే తప్ప, మాట్లాడితే ఉపా చట్టంలో ఇరికించడం అవివేకం. ఈ నిర్బంధాన్ని గురించి ఒక మీటింగ్‌ పెడితే నలభై ప్రజా సంఘాలు హాజరయ్యాయి. ఈ ప్రజాస్వామ్య శక్తులను ప్రోత్సహించడం, వాళ్ళు లేవదీసే చర్చను మరింత ముందుకు తీసుకపోవడం తెలంగాణకే కాదు దేశానికీ అవసరం.

తెలంగాణలో భిన్న కారణాల వల్ల మావోయిస్టు పార్టీ కార్యక్రమాలు తగ్గి ఆ పార్టీ గిరిజన ప్రాంతాల్లో జరిగే పోరాటాలలో పాల్గొంటున్నది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళవైపు నుండి ఎలాంటి చర్యలు లేవు. నిజానికి వాళ్ళు తెలంగాణలో బలంగా ఉన్న రోజుల్లో కూడా ఇన్ని ప్రజాసంఘాల మీద, ఆ సంఘాల కార్యకర్తల మీద ఉపా చట్టాన్ని ఉపయోగించిన దాఖలాలు లేవు. గత ఒకటి, రెండు నెలలుగా దాదాపు పన్నెండు ప్రజాసంఘాలకు చెందిన యాభై ఒక్క మంది కార్యకర్తల మీద విచక్షణా రహితంగా ఉపా చట్టాన్ని ప్రయోగిస్తూ, అందరిమీద ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు చేసారు. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఇంత మంది కార్యకర్తల మీద, సంఘ బాధ్యుల మీద ఈ చట్టాన్ని ఉపయోగించిన దృష్టాంతాలు లేవు. మావోయిస్టు పార్టీని అదుపులో పెట్టాం అని మళ్ళీ మళ్ళీ ప్రకటిస్తున్న పోలీసులకు, అకస్మాత్తుగా ఇంత మందిని కేసుల్లో ఇరికించే ఐడియా ఎందుకు వచ్చిందో అంతుపట్టడం లేదు. ముఖ్యమంత్రి అమిత్ షాను కలిసివచ్చిన తర్వాత ఈ నిర్బంధం పెరిగిందనేది కొంతవరకు నిజం.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉపా ఒక క్యాన్సర్‌ పుండులాంటిది. రాజ్యం ఎవ్వరిపైన అయినా.. తనకు విధేయంగా లేనివారిపైన, తనను ప్రశ్నిస్తున్న వారిపైన, రాజకీయ విశ్వాసాలున్న వారిపైన సునాయాసంగా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నది. ఈ చట్టం తెచ్చిన పాపం కాంగ్రెస్‌ వారిదే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఇది ‘యమపాశంగా’ దొరికింది. నేరాలు చేసే వాళ్ళ మీద ఉపయోగించడానికి చాలా ఇతర చట్టాలున్నవి. అవి ఏవీ కాకుండా ఈ చట్టమే ఉపయోగించడానికి కారణం.. దీని ద్వారా పోలీసు యంత్రాంగానికి ఏ శ్రమ లేకుండా కార్యకర్తలని, రాజ్యానికి ఇబ్బంది అనిపించిన వారిని ఏ సాక్ష్యాధారాలు లేకుండా సరాసరి ఆరు నెలలు జైలుకు పంపవచ్చు. దేశం మొత్తంలో ఉపా చట్టం మీద అరెస్టు ఐన వాళ్ళల్లో 90% మంది నిరపరాధులని న్యాయస్థానాలు తేల్చాయి. ఈ చట్టం కింద ఆరు నెలలే కాక ఈ చట్టం కింద కొత్త కేసులు పెట్టి ‘జైలు శిక్ష’ను పొడిగించవచ్చు. తీరా వాళ్ళు నేరస్థులు కారు అని కోర్టులో కేసులు కొట్టివేయవచ్చు. కాని ఆరు నెలలకు పైగా జైల్లో పెట్టినందుకు పోలీసుల మీద ఎలాంటి చర్యలు తీసుకునే వీల్లేకపోవటం ఈ చట్టంలోని తీవ్రమైన లోపం. గతంలో టాడా, పోటాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లాంటి ఉద్యమం ఈ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రేమికుల మీద ఉంది.

మళ్ళీ తెలంగాణకు వస్తే గత వారం రెండు వారాలుగా విచక్షణా రహితంగా తెలంగాణ ప్రజాఫ్రంట్‌, తెలంగాణ విద్యార్థి వేదిక అలాగే చైతన్య మహిళా సంఘ బాధ్యుల ఇళ్ళల్లోకి చొరబడి, ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేస్తున్నారు. మావోయిస్టులకు సహాయపడుతున్నారని, తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కనిపించకున్నా పక్క రాష్ట్ర ఉద్యమానికి తోడ్పడుతున్నారనేది వీళ్ళ మీద ఆరోపణ. పోలీసులు చేస్తున్న ఆరోపణలలో విప్లవ సాహిత్యం దొరికిందనేది విచిత్రమైన ఆరోపణ. వాళ్ళ దగ్గర లభించింది అని చెపుతున్న సాహిత్యం నిషేధించబడింది కాదు. తెలంగాణలో ఏ కవి, రచయిత, ఉపాధ్యాయ, అధ్యాపకులు కొంచెం చదువుకున్న వాళ్ళ ఇళ్ళు వెతికినా ఈ సాహిత్యం దొరుకుతుంది. చాలా పుస్తకాలు చదివాననే ముఖ్యమంత్రి గారు కూడా ఏదో సందర్భంలో ఈ సాహిత్యాన్ని చూసారనే అనుకుంటున్నాను.

ఈ మధ్యే మహారాష్ట్ర అగ్రనాయకుడు శరద్ పవార్‌ దేశవ్యాప్తంగా భీమా కోరేగాం కేసులో వరవరరావుతోసహా అరెస్టు అయిన పదిమంది ప్రజాస్వామ్యవాదుల అరెస్టులనూ తప్పుపట్టడమే కాక, పూనా పోలీసుల మీద చర్య తీసుకోవాలని పూనాలో ఒక ప్రెస్‌ మీటింగ్‌లో అనడమే కాక, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరేను కలిసి ఈ అంశంపై చర్చించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నక్సలైట్ల సాహిత్యం ఉండడం నేరమెలా ఔతుందని ప్రశ్నించారు. శరద్ పవార్‌ రాజకీయాలకు కొత్త కాదు. రెండు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే కేంద్ర క్యాబినెట్‌లో పని చేసిన అనుభవముంది. ఒక దశలో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి కూడా అనుకున్న రోజులున్నవి. ఇంత అనుభవం ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అలా భావించాడంటే, తెలంగాణలో 50 మంది మీద ఉపా కేసులు పెట్టడాన్ని తెలంగాణ రాజకీయ నాయకత్వం ఎలా సమర్థించుకుంటుందో తెలియదు.

శ్రుతి, సాగర్‌ ఎన్‌కౌంటర్ల తర్వాత వచ్చిన అనూహ్య స్పందనతో ముఖ్యమంత్రి ఎన్‌కౌంటరు లేని తెలంగాణ అని అన్నారు. మళ్ళీ మొన్న దిశ సంఘటనలో నలుగురిని ఎన్‌కౌంటర్‌ చేశారు. దాని మీద మొత్తంగా హై కోర్టు, సుప్రీంకోర్టులు స్పందించడంతో ఒక న్యాయ సమీక్ష జరుగుతున్నది. ‘దిశ’ మీద జరిగిన అమానుష దాడికి తెలంగాణ సమాజం చాలా పెద్ద ఎత్తున స్పందించింది. దోషులకు కఠిన శిక్ష వేయండి అని అడగడంలో తప్పులేదు. అడగాలి కూడా, కాని సరాసరి నరకండి, చంపేయండి, మేమే చంపుతాం అనే స్పందన ప్రజాస్వామ్య సమాజానికి, చట్టబద్ధ పాలనకు ప్రమాదం. వందల సంవత్సరాల పరిణామ క్రమంలో నాగరికత ముందుకు వెళ్తున్న క్రమం నుండి చట్టబద్ధ పాలననే ఒక ప్రజాస్వామిక ప్రక్రియను సమాజాలు అభివృద్ధి పరచుకొన్నవి. గొంతు దాకా ఆయుధాలుగల రాజ్యానికి, నిరాయుధులైన పౌరులకు మధ్య సమతౌల్యం కొరకు రాజ్యాంగాలు, హక్కులు, చట్టబద్ధ పాలన అనే విలువలు, ప్రమాణాలు వచ్చాయి, రాజ్యానికి విచ్చలవిడి అధికారమిస్తే హిట్లర్‌ లాంటి దుర్మార్గులు దానిని ఎలా ఉపయోగిస్తారో, ఆ మానవ విషాదాన్ని ప్రపంచం చూసింది. అందుకే చంపేయండి, ఎన్‌కౌంటర్‌ చేయండి అని సమాజమే అడగడం ప్రారంభిస్తే, రాజ్య అధికారం సమాజం పెట్టిన అన్ని పరిధులు, ప్రమాణాలు దాటితే, అప్పుడు ఇదే ప్రజలు చేయగలగటానికి ఏమీ మిగలదు. సమాజం సంక్షోభ సమయాల్లో కూడా తన సంయమనాన్ని, హేతుబద్ధతని కోల్పోకూడదు. అలా కోల్పోవడం సమాజానికే చాలా ప్రమాదం.

మావోయిస్టు ఉద్యమ రాజకీయాలు ఎందుకు పుట్టాయో, ఆ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయో అవగాహన చేసుకొనడానికి గత అర్ధ శతాబ్దకాలం చాలా ప్రయత్నాలు జరిగాయి. మన రాష్ట్రంలోనే చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక క్యాబినెట్‌ సబ్‌ కమిటీని వేసారు. హింస ప్రతిహింసల వలయం నుండి సమాజం బయట పడటానికి పౌర స్పందన వేదిక దాదాపు ఒక దశాబ్ద కాలం తీవ్ర కృషి చేసింది. విప్లవోద్యమ నాయకులతో సరాసరి ప్రభుత్వ ప్రతినిధులే నాలుగు రోజులు చర్చలు జరిపారు. ఆర్థిక అసమానతలు, సామాజిక ఆధిపత్యాలున్నంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో జరుగుతూనే ఉంటాయి. చారిత్రక స్పృహ కలిగిన ప్రభుత్వాలు ఉద్యమాలకు రాజకీయ పరిష్కారాలు కనుక్కోవడానికి కృషి చేయాలే తప్ప, మాట్లాడితే ఉపా చట్టంలో ఇరికించడం అవివేకం. అలాగే ‘దిశ’ లాంటి అమానుష సంఘటనలు జరిగినప్పుడు తక్షణ చర్యలు ఏవి తీసుకున్నా ఇలాంటి నేరాలు సమాజంలో ఎందుకు జరుగుతాయి, నేరంలేని సమాజాన్ని మనం నిర్మించలేమా… అన్న తాత్విక, చారిత్రక కోణాలలో చర్చ జరగాలి. ఒక దశాబ్దన్నర క్రితం వరంగల్‌లో ‘దిశ’ లాంటి సంఘటనే జరిగినప్పుడు బాలగోపాల్‌ ఒక ప్రామాణికమైన విశ్లేషణ చేస్తూ కొన్ని మౌలికమైన ప్రశ్నలు చర్చకు పెట్టాడు.

సమస్యలు తీవ్రతరమౌతున్నప్పుడు వాటిని లోతుగా చర్చించడానికి ఒక విస్తృత ప్రజాస్వామ్య వాతావరణం సమాజాలకు, అలాగే ప్రభుత్వాలకు అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో పౌరస్పందన వేదిక, శంకరన్‌ గారి ఆధ్వర్యంలో కొన్ని మౌలికమైన సవాళ్ళను పౌర సమాజం ముందే కాక, మావోయిస్టు పార్టీ ముందూ అలాగే ప్రభుత్వం ముందూ పెట్టింది. ఆ కాలంలో జరిగిన చర్చ మూడు సంపుటాలుగా వేదికే ప్రచురించి దేశం ముందు పెట్టింది. నిర్బంధ వాతావరణంలో ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు సాధ్యం కావు. ఇప్పుడు ఉపా చట్టం ప్రయోగించిన ప్రజా సంఘాలన్నీ ఒక ప్రజాస్వామిక ప్రయోగంలో భాగం. ‘తెలంగాణ ప్రజా ఫ్రంటు’ ప్రజాస్వామ్య తెలంగాణ గురించి, ‘తెలంగాణ విద్యార్థి వేదిక’ శాస్త్రీయ ప్రజాస్వామ్య విద్య గురించి, ‘చైతన్య మహిళా సంఘం’ పేద మహిళల మధ్య పని చేస్తూ మహిళల సమానత్వం కొరకు కృషి చేస్తున్నారు. ఇపిడబ్ల్యూ స్థాయిలో ‘వీక్షణం’ పత్రికను నడుపుతున్న ఎడిటర్‌ వేణుగోపాల్‌ మీద కూడా ఉపా కేసు పెట్టారు. ఇవేవీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కావు. వాళ్ళకు రాజకీయ విశ్వాసాలుండవచ్చు. విశ్వాసాలు వాటంతకవే నేరం కావని అత్యున్నత న్యాయస్థానామే ఒక జడ్జిమెంట్‌ చెప్పి ఉంది.

దిశ లాంటి దుర్ఘటనలు పునరావృతం కావద్దంటే అందరికి విలువలతో కూడిన విద్య, అలాగే మహిళల పట్ల మగవాళ్ల ప్రవర్తన గురించి, మహిళల ఆత్మగౌరవం గురించి, సమానత్వాన్ని గురించి చర్చ కాదు; సమాజ చైతన్యం పెంచే కృషి జరగాలి. నిజానికి ఇన్ని ప్రజాసంఘాలుండడమే తెలంగాణ విశిష్టత. ఈ నిర్బంధాన్ని గురించి ఒక మీటింగ్‌ పెడితే నలభై ప్రజా సంఘాలు హాజరయ్యాయి. ఈ ప్రజాస్వామ్య శక్తులను ప్రోత్సహించడం, వాళ్ళు లేవదీసే చర్చను మరింత ముందుకు తీసుకపోవడం తెలంగాణకే కాదు దేశానికీ అవసరం. తెలంగాణ ప్రజలు పోరాడింది కేవలం భౌగోళిక తెలంగాణ కొరకు కాదు, ఒక మానవీయ ప్రజాస్వామ్య తెలంగాణ దిశగా ఈ ప్రాంత ప్రయాణం ఉండాలి.

(Courtesy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates