అవినీతి లెజెండ్‌! పరీక్ష కిట్ల కొనుగోళ్లలో డొల్ల కంపెనీ మాయాజాలం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ఐఎంఎస్‌ కుంభకోణంలో మరో అక్రమం
ఓమ్ని మెడి సంస్థ బాబ్జీ కార్యాలయాల్లో అనిశా సోదాలు
రూ.130 కోట్ల విలువైన అక్రమాస్తుల పత్రాలు బహిర్గతం

హైదరాబాద్‌: బీమా వైద్య సేవల(ఐఎంఎస్‌) విభాగం కుంభకోణంలో రోజుకోరకం అక్రమం వెలుగు చూస్తోంది. ఈ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ఓమ్ని మెడి సంస్థ యజమాని కంచర్ల శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జీ చేసిన మరో మాయాజాలాన్ని తాజాగా అనిశా దర్యాప్తు బృందం గుర్తించింది. పరీక్ష కిట్ల కొనుగోలు పేరుతో డబ్బు కొట్టేయడానికి ‘లెజెండ్‌’ పేరుతో డొల్ల కంపెనీని సృష్టించి రూ.కోట్లు మాయ చేసిన ఉదంతం బహిర్గతమైంది. అతని కార్యాలయం, ఇళ్లలో అనిశా బృందం జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే అక్రమాలు వెలుగుచూశాయి.  శ్రీహరిబాబు పేరుతో రూ.99 కోట్ల విలువైన షేర్లతో పాటు రూ.24 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాల్ని అనిశా బృందం సేకరించింది. అతని భార్య పేరిట మరో రూ.7 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. 2017-18 సంవత్సరంలో జరిపిన రూ.110 కోట్ల ఐఎంఎస్‌ లావాదేవీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఈ సొమ్మును వెనకేసినట్లు భావిస్తున్నారు. ఆ సొమ్ములో నుంచి ఆదాయపు పన్ను కింద రూ.19 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. లెజెండ్‌ పేరిట డొల్ల కంపెనీని తన సన్నిహితుడు కృపాసాగర్‌రెడ్డి పేరుతో సృష్టించినట్లు వెల్లడైంది. తొలుత లెజెండ్‌ సంస్థకు నిధులు మళ్లించి.. తిరిగి ఓమ్ని మెడి సంస్థకు బదిలీ చేసినట్లు వెల్లడవ్వడంతో శ్రీహరిబాబును అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న లెజెండ్‌ సంస్థ యజమాని కృపాసాగర్‌రెడ్డి, ప్రతినిధి వెంకటేశ్వర్లు కోసం గాలిస్తున్నారు.

స్వీడన్‌ కంపెనీ నుంచి కొనుగోలు పేరుతో గోల్‌మాల్‌
తెల్ల రక్తకణాల సంఖ్య, గ్లూకోజ్‌ స్థాయిని పరీక్షించేందుకు అవసరమైన కిట్ల కొనుగోలు పేరుతో ఈ ముఠా అక్రమానికి పాల్పడింది. స్వీడన్‌కు చెందిన హిమోక్యూ అనే సంస్థ నుంచి పరీక్ష కిట్ల(క్యూవెట్‌ స్ట్రిప్‌)లను కొన్నట్లు రూ.కోట్ల నిధుల్ని దారి మళ్లించింది.
డిస్పెన్సరీల నుంచి ఇండెంట్లు రాకుండానే నేరుగా ఐఎంఎస్‌ సంయుక్త సంచాలకురాలు(సస్పెన్షన్‌) డా.కె.పద్మ కార్యాలయంలోనే కొనుగోలు ఉత్తర్వులను సృష్టించారు. వాటిపై సంచాలకురాలు(సస్పెన్షన్‌) డా.దేవికారాణి సంతకాలు చేశారు.
హిమోక్యూ సంస్థ నుంచి ఆ కిట్లను కొనుగోలు చేసేందుకు లెజెండ్‌ కంపెనీకి ఆథరైజేషన్‌ ఇచ్చినట్లు నకిలీ పత్రాల్ని సృష్టించారు. 2017-18లో 6,291 తెల్ల రక్తకణాల క్యూవెట్‌లను సరఫరా చేసినట్లు రికార్డులు సృష్టించారు.
రూ.11,800 విలువ గల ఒక్కో కిట్‌ను రూ.36,800లకు కొన్నారు. అంటే ఒక్కో కిట్‌ ధర కంటే అదనంగా రూ.25 వేలను వెచ్చించినట్లు రికార్డులు సృష్టించారు. కానీ హిమోక్యూ సంస్థకు మాత్రం రూ.11,800 మాత్రమే చెల్లించారు. అలా ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.54 కోట్లను లెజెండ్‌ సంస్థకు అక్రమంగా చెల్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
రూ.1950 విలువైన గ్లూకోజ్‌ క్యూవెట్‌ను రూ.6,200లకు కొన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. ఈ వ్యవహారంలో ఒకే విడతలో రూ.12.84 కోట్లను దారి మళ్లించారు. కేవలం రూ.27 కోట్ల కొనుగోళ్లలోనే రూ.19 కోట్లు కొట్టేశారు.
మరోవైపు 750 కిట్లనే కొనుగోలు చేసి 1,050 కిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో చూపారు. ఈ అక్రమాల్ని గుర్తించడంతో లెజెండ్‌ సంస్థ కార్యకలాపాలపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates