కొలువు రాకపాయే…

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for tspsc building"నిరుద్యోగ భృతి ఇయ్యకపాయే!
సర్కారు తీరుపై యువత ఆగ్రహం
– 16 నెలలుగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు లేవు
టీఆర్టీ, గ్రూప్‌-2 నియామకాలకే పరిమితం

కొలువుల భర్తీపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నుంచి ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థమవుతున్నది. చివరి నోటిఫికేషన్‌ ములుగు అటవీ కాలేజీలో 24 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి 2018, సెప్టెంబర్‌ 10న విడుదలైంది. అంటే 16 నెలల నుంచి టీఎస్‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ జారీ కాలేదు. అయితే టీఎస్‌పీఎస్సీ ఏర్పడి ఐదేండ్లు అవుతున్నది. ఈ ఐదేండ్లలో 36,602 పోస్టుల భర్తీకి 101 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 28,893 నియామకాలు చేపట్టింది. ఈ ఏడాది టీఆర్టీ, గ్రూప్‌-2 నియామకాలకే టీఎస్‌పీఎస్సీ పరిమితమైంది. వాటితోపాటు డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు నిర్వహించింది. ఇంకోవైపు కొలువులను భర్తీ చేయకపోయినా టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి అమలవుతుందని అందరూ ఆశించారు. ఒకవైపు కొలువులు రాకపాయే ఇంకోవైపు నిరుద్యోగ భృతి అమలు కాకపాయే. దీంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. వారి ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అసలు నిరుద్యోగులను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి.

నిరుద్యోగ భృతికి అర్హులెందరు?
కొలువులు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగుల ఓట్లు పొందడం కోసమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే 2019-20 ఓటాన్‌ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయించారు. ఈ పథకం అమలు కోసం విధివిధానాల ఇంత వరకూ ప్రకటించలేదు. తీరా తుది బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కేటాయించలేదు. అంటే నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని చెప్పకనే చెప్పారు. ఎంప్లారుమెంట్‌ ఎక్స్చేంజీల్లో నమోదు చేసుకున్న నిరుద్యోగులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. టీఎస్‌పీఎస్సీ వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌)లో 29 లక్షల మంది వరకు పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ఎంత మంది నిరుద్యోగులు అర్హులు, ఏ ప్రాతిపదికన నిరుద్యోగ భృతి అమలవుతుంది అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు : విప్లవ్‌కుమార్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు
నిరుద్యోగులు కోరుకున్న ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రభుత్వం అనుకున్న పనులనే చేస్తున్నది. నిరుద్యోగ భృతి హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు. లక్ష పోస్టులైనా భర్తీ అవుతాయని ఆశించారు. ఉద్యోగుల విరమణ, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడడంతో కొత్త ఉద్యోగాలు వస్తాయని అనుకున్నాం. అవేవీ రాలేదు. నోటిఫికేషన్లు రాకపో వడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates