ఎన్నెన్ని ఆరాలో! జనగణనలో ఇంట్లోని సమస్త వివరాలూ నమోదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రతి కుటుంబానికీ 34 ప్రశ్నలు
హిందువులు, బౌద్ధులు, సిక్కుల్లోని ఎస్సీల వివరాలే నమోదు
ఎస్టీలు ఏ మతంలో ఉన్నా పరిగణనలోకి
– హైదరాబాద్‌

ఎన్నెన్ని ఆరాలో!

మీది సొంతిల్లా? అద్దె ఇల్లా? ఫ్లోరింగ్‌కు పాలరాయి వాడారా? గ్రానైటా? ఎన్ని గదులున్నాయి, స్నానాల గదులెన్ని..  మరుగుదొడ్లు పడకగదులతో కలిపి ఉన్నాయా లేక బయటా? మీ ఇంట్లో ఎంతమంది దంపతులు ఉన్నారు?
..ఇలాంటి 34 ప్రశ్నలకు ప్రతి కుటుంబం సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. పదేళ్ల తరువాత చేపట్టబోతున్న జనగణన క్రతువు కోసం ప్రతి కుటుంబం నుంచి సేకరించాల్సిన వివరాల కోసం కేంద్ర జనగణన శాఖ ప్రశ్నావళిని సిద్ధం చేసింది. వచ్చే ఏప్రిల్‌ ఒకటి నుంచి సెప్టెంబరు 30లోగా ఈ గణన చేపడతారు. ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కాదు. దేశంలో నిర్మించిన ప్రతి కట్టడం, అందులో నివసించే కుటుంబం వివరాలను నమోదు చేయనున్నారు. ఒక్కో కుటుంబం వినియోగించే సౌకర్యాల్లో అత్యంత సూక్ష్మ అంశాలను కూడా సేకరిస్తారు. సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రభుత్వ పథకాల అమలుకు ఈ సమాచారమే కీలకం. ప్రభుత్వపరంగా ప్రజల్లో ఎంతమందికి ఏయే సౌకర్యాలు కల్పించాలి? అందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంచనాలకూ ఇదే మూలం. ఎస్సీ కేటగిరీ కింద హిందూ, సిక్కు, బౌద్ధమతాలు అనుసరించే వారినే పరిగణనలోకి తీసుకుంటారు. ఇతర మతాల్లో ఎస్సీ అని చెప్పినా నమోదు చేయరు. ఎస్టీ ప్రజలు ఏ మతంలో ఉన్నా నమోదు చేస్తారు.

ఎన్నెన్ని ఆరాలో!

ప్రతి కుటుంబాన్నీ అడిగే ప్రశ్నలు
*   మీరు ఎన్ని కట్టడాలు నిర్మించారు? ఏ భవనం ఎందుకు వినియోగిస్తున్నారు? దుకాణం లేదా పరిశ్రమ, లేదా ఇతర అవసరాలకు వాడుతున్నారా? ఖాళీగా ఉంచారా?
*   ఇంట్లో మొత్తం ఎన్ని గదులున్నాయి, వంటగదులెన్ని, స్నానపు గదులెన్ని మరుగుదొడ్లు ఎన్ని, అవి ఇంటితో పడకగదులకు ఆనుకుని ఉన్నాయా లేక ఇంటి బయట ఆవరణలో ఉన్నాయా?
*   ఇంట్లో ఎందరు దంపతులున్నారు?
*   మీరు అద్దె ఇంటిలో ఉంటున్నారా? మీకు దేశంలో ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా ?
*   తాగునీరు ఎంత దూరం నుంచి తెస్తున్నారు? (పట్టణాల్లో 100 మీటర్ల నుంచి, పల్లెల్లో 500 మీటర్ల నుంచి తెస్తే తాగునీరు ‘దగ్గర’గా ఉన్నట్లు నమోదు చేస్తారు.)
*   నల్లా నుంచి రక్షిత తాగునీరు వస్తోందా, బావి లేదా చేతిపంపు ఉందా, కాల్వ లేదా చెరువు నుంచి తెస్తున్నారా? రోజూ డబ్బా లేదా సీసా నీరు తాగుతున్నారా?
*   ఇంటి గోడలను కర్రలు, సిమెంటు, మట్టిగోడ, గ్రానైట్‌ ఇలా ఏ సామగ్రితో నిర్మించారు?
*   మరుగుదొడ్డిని డ్రెయినేజీకి అనుసంధానం చేశారా, ఇంటి ఆవరణలోనే మరుగుదొడ్డికి గుంత (సెప్టిక్‌ ట్యాంకు) నిర్మించారా? దాని శుభ్రతకు పారిశుద్ధ్య పనివారిని వినియోగిస్తున్నారా ?
*   వంటకు ఎల్పీజీ కనెక్షన్‌ ఉందా లేక ఇంకా కిరోసిన్‌, పిడకలతో వంట చేస్తున్నారా, కరెంటు లేదా సౌరవిద్యుత్తు పొయ్యిపై వండుతున్నారా?
*   ల్యాండ్‌లైన్‌ లేదా సెల్‌ఫోన్‌ ఉందా, రెండూ వాడుతున్నారా?
*   సైకిల్‌, బైక్‌, కారులో ఏమేం ఉన్నాయి?
*   కుటుంబంలో ఎంతమందికి ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయి ?
*   కుటుంబ పెద్ద సెల్‌ఫోన్‌ నెంబరు?

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates