పగలే రేయిలా..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • చందమామ చాటున సూరీడు
  • ఆకాశంలో మెరిసిన ‘అగ్ని వలయం’
  • సూర్య గ్రహణాన్ని ఆసక్తిగా చూసిన ప్రజలు

సూర్యోదయమైన రెండున్నర గంటలకే సూర్యాస్తమయం! అంతలోనే.. ఆకాశమంతా అలముకున్న చిమ్మచీకటి! ఆ వెంటనే మళ్లీ సూర్యోదయం! ఆ రెండింటి మధ్యలో కనుల విందుగా ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’! ఈ దశాబ్దం చివర్లో ఆకాశంలో కనిపించిన అద్భుతమిది! కేవలం మూడు గంటల్లోనే పగలూ రాత్రీ.. సూర్యోదయం.. సూర్యాస్తమయం ఆవిష్కృతమయ్యాయి! ఆకాశంలో కణకణమండే నిప్పుల ముద్దలా కనిపించే సూర్యుడు.. పాక్షిక సూర్య గ్రహణం సందర్భంగా గురువారం కాసేపు చంద్రుడి చాటుకు వెళ్లిపోయాడు! చంద్రుడి చుట్టూ అగ్గి వలయమై కనువిందు చేశాడు! గురువారం సంభవించిన ఈ దశాబ్దపు ఆఖరు సూర్య గ్రహణ దృశ్యాలను దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆసక్తిగా వీక్షించారు.

అరుణం.. అద్భుతం! : పాక్షిక సూర్య గ్రహణం దేశంలో సంపూర్ణంగా కనువిందు చేసింది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆసక్తిగా, ఉత్సాహంగా చూశారు. గ్రహణ సూర్యుడిని నేరుగా చూస్తే కంటికి ప్రమాదమన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని వీక్షించారు. సోలార్‌ ఫిల్టర్‌ కళ్లజోళ్లు, బైనాక్యులర్ల సహాయంతో తిలకించారు. గ్రహణంలో భాగంగా ఏర్పడిన ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ను చూసినప్పుడు ఆనందంతో కేరింతలు కొట్టారు. తెలంగాణలో ఉదయం 8.04 గంటలకు మొదలైన గ్రహణం.. అద్భుతంగా కొనసాగి ఉదయం 9.24 గంటలకు శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. సరిగ్గా 9.26 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. పగలే చీకటి అలముకుంది. సూర్యుడికి సరిగ్గా మధ్యలోకి చందమామ వెళ్లడంతో సూర్యుడు రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లా కనిపించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసినవారు పులకించిపోయారు. ఆ తర్వాత 9.27 గంటలకు మళ్లీ చందమామ సూర్యుడి నుంచి పక్కకు జరగడం మొదలైంది. 11.05 గంటలకు సూర్యగ్రహణం ముగిసింది.

గ్రహణం సందర్భంగా పట్టు, విడుపు స్నానాలు చేశారు. బాసర గోదావరి తీరంలో భక్తులు పెద్ద సంఖ్యలో గ్రహణ దోష పూజలు చేశారు. మంత్రానుష్ఠానాలు ఉన్నవారు జపతపాదులు చేశారు. గ్రహణ దోషాలు ఉన్నవారు గ్రహణం అనంతరం బ్రాహ్మణులకు దానాలు ఇచ్చారు. శివాలయాలకు వెళ్లి పూజలు చేశారు. గంగ, యమున, గోదావరి, కృష్ణ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్య నదుల్లో, హరియాణాలోని కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మ సరోవరంలో ప్రజలు గ్రహణ స్నానాలు చేశారు. ఇక, గ్రహణం సందర్భంగా ఆలయాలన్నింటినీ మూసివేశారు. విడుపు తర్వాత శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జన విజ్ఞాన వేదిక ఎక్కడికక్కడ గ్రహణం వీక్షణానికి ఏర్పాట్లు చేసింది. గ్రహణాలపై అవగాహన కల్పించింది. గ్రహణ సమయంలో తింటే ఏమీ కాదంటూ సూర్యాపేట జిల్లా కోదాడలో నేస్తం సామాజిక వేదిక సభ్యులు రహదారిపై టిఫిన్‌ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అభిషేకాలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం శాస్త్రోక్తంగా గ్రహణ కాల అభిషేకం నిర్వహించారు. సూర్య గ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధానాలయాలను మూసివేసినా.. శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని మాత్రం తెరిచే ఉంచారు. ఉదయం నుంచే పూజలు కొనసాగడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. రికార్డుస్థాయిలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు జరిగాయి.

నిలబడిన రోకలి
పాలకుర్తి: జనగామ జిల్లాలోని పాలకుర్తి గౌడ కాలనీలో గురువారం సూర్య గ్రహణం సందర్భంగా రోకలి నిలబడింది. తాంబాలంలో నీళ్లు పోసి ఏ ఆధారం లేకుండానే రోకలిని నిలబెట్టారు. సూర్య గ్రహణం ప్రభావంతోనే రోకలి నిటారుగా నిలబడిందని స్థానికులు విశ్వసిస్తున్నారు. దానిని వీక్షించడానికి పెద్దఎత్తున వచ్చారు.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates