తుపాకీ మోతతో బిక్కుబిక్కుమంటున్న అమెరికన్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆయుధాల కట్టడిలో ట్రంప్‌ సర్కారు వైఫల్యం

వాషింగ్టన్‌: కొద్దిరోజుల్లో ముగింపునకు చేరుకుంటున్న 2019 వ సంవత్సరంలో అమెరికన్లు తమ ప్రాణాలు గుప్పెట పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 404 తుపాకీ కాల్పుల కేసులు నమోదయ్యాయని గన్‌ వయొలెన్స్‌ ఆర్కైవ్‌ (జివిఎ) అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి.అంటే రోజుకో సారి కన్నా ఎక్కువగా ఎక్కడో ఒక చోట తుపాకీ మోతలు వినిపించాయని అర్ధం చేసుకోవచ్చు. 2013లో ఈ సంస్థ పని ప్రారంభించిన నాటి నుండి ఇదే అత్యధికం కావటం విశేషం. కాల్పుల ఘటనలో నలుగురు అంతకన్నా ఎక్కువ మంది (సాయుధుడు మినహా) ప్రాణాలు కోల్పోతే దానిని ‘మాస్‌ షూటింగ్‌’ ఘటనగా ఈ సంస్థ నిర్వచించింది. ఈ నెల 22వ తేదీ వరకూ ఈ సంస్థ సేకరించిన లెక్కల ప్రకారం ఈ ఏడాది ఈ మాస్‌ షూటింగ్‌ ఘటనల్లో 14,801 మంది ప్రాణాలు కోల్పోగా, అంతకు రెట్టింపు సంఖ్యలో 28, 613 మంది గాయపడ్డారని తెలుస్తోంది. సగటున రోజుకొకటి వంతున చోటు చేసుకున్న ఈ ఘటనలతో అమెరికన్లు తీవ్రస్థాయిలో భయకంపితులయ్యారని ఈ సంస్థ వ్యాఖ్యానించింది. అయితే మీడియా ద్వారా వెలుగు చూస్తున్న ఈ కాల్పుల ఘటనల వార్తలతో తాము రాటు తేలిపోయామని టెక్సాస్‌లో దాదాపు 25 ఏళ్లు ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన గెయిల్‌ మెక్‌కానెల్‌ చెబుతున్నారు. దేశంలో పశ్చిమ ప్రాంత రాష్ట్రాల ప్రజలు ఈ ‘తుపాకీ సంస్కృతి’కి అలవాటు పడిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రంలో 5.7 లక్షల జనాభా వున్న మాంటెగోమెరీ కౌంటీని అధికారులు ‘గన్‌ శాంక్చువరీ’ గా ప్రకటించేశారు. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రజలు ఆయుధాలు కలిగి వుండేందుకు అనుమతించే ప్రతిపాదనను కౌంటీ కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదించి అమలులోకి తెచ్చారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా దాదాపు 200 కౌంటీలు, 11 నగరాలు తమకు తాము ‘గన్‌ శాంక్చువరీ’లుగా ప్రకటించేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది అత్యంత తీవ్రస్థాయిలో జరిగిన కాల్పుల ఘటన గత ఆగస్టు మొదట్లో మెక్సికో సరిహద్దు పట్టణం ఎల్‌పాసోలోని వాల్‌మార్ట్‌ మాల్‌లో జరిగిన కాల్పుల ఘటన. ఇందులో 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసును ‘విద్వేష నేరం’గా నమోదు చేసిన అధికారులు దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇటువంటి విద్వేష నేరాలు అమెరికన్‌ చరిత్రలో కొత్తేమీ కాదని మేధావులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో విద్వేషం, ప్రతీకారంతో ఈ కాల్పులు ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కట్టడిలో ‘నో ప్రోగ్రెస్‌’
ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట చేసుకుంటున్న ఈ కాల్పుల వార్తలు ప్రజలను తీవ్ర భావోద్వేగాలకు గురి చేయటంతోపాటు ఈ మారణకాండకు తెరదించటం ఎలా అన్న అంశంపై వాడి వాడి చర్చలు జరుగుతున్నాయి.కొన్ని రకాల మారణా యుధాలను నిషేధిస్తూ ఆయుధ నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకురావాలని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ కట్టడిలో ఇప్పటి వరకూ సాధించిన పురోగతి శూన్యమేనన్న అంశాన్ని ఈ కాల్పుల ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పుడైనా తీవ్ర స్థాయిలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నపుడు వెంటనే ఆయుధాలను కట్టడి చేయాలంటూ ఆందోళనలు తలెత్తుతాయని, కొద్ది రోజుల తరువాత అవి కనుమరుగైపోతాయని మేరీలాండ్‌యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు క్లే రామ్‌సే చెబుతున్నారు. ఈ సమస్యపై ఆందోళనలు చల్లారిపోతే వైట్‌హౌస్‌ కూడా ఆ ప్రతిపాదనలను అటకెక్కించటం అలవాటుగా మార్చుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ తుపాకుల కట్టడి విషయంలో రాజకీయాలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని ఆయన చెబుతున్నారు. అధ్యక్షుడు సమర్ధించే విధంగా వైట్‌హౌస్‌ ఆయనకు నచ్చచెబితే తప్ప ఇటువంటి ప్రతిపాదనలను ఓటింగ్‌కు పెట్టలేమని సెనేట్‌లో మెజార్టీ పక్ష నేత మెక్‌ కానెల్‌ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. గత వేసవిలో చోటు చేసుకున్న ఘోర ఘటనల నేపథ్యంలో తుపాకీలను కట్టడి చేసేందుకు చట్టాన్ని ఆమోదించే విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అటార్నీ జనరల్‌ నవంబర్‌లో చెప్పారు. అయితే అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియ తెరపైకి రావటంతో ఈ ప్రయత్నాలు అటకెక్కాయి. డెమొక్రాట్స్‌ ఈ అభిశంసనకు ప్రయత్నించకుంటే తుపాకీల కట్టడికి అవసరమైన కీలక చట్టాలను అమలులోకి తెచ్చే వారిమని అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులు కూడా చెబుతున్నారు. తుపాకీ సంస్కృతిని కట్టడి చేసేందుకు కఠిన చట్టాలు తేవాలని కోరుతూ అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలు అమెరికన్‌ కాంగ్రెస్‌కు గత సెప్టెంబర్‌ 12న లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎల్‌పాసో, టెక్సాస్‌, డేటన్‌, ఓహియో వంటి ప్రాంతాలలో కాల్పుల ఘటనలు జరిగిన తరువాత వారు ఈ లేఖ రాశారు.

ఇప్పుడేం చేయాలి?
తుపాకీ సంస్కృతితో అమెరికా ఏటా దాదాపు 22,900 కోట్ల డాలర్లకు పైగా ఆర్థిక భారాన్ని మోస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. ఇది అమెరికా స్థూల దేశీయ ఉత్పాదకత (జిడిపి)లో 14 శాతానికి సమానం. అమెరికా రాజ్యాంగ పరిధిలో తుపాకీ హింసను తగ్గించేందుకు అనేక మార్గాలున్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ఈ సమస్యను కట్టడి చేసేందుకు ఎటువంటి క్విక్‌ఫిక్స్‌లు వుండవని స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో తుపాకీ సంస్కృతిలో ఎటువంటి సానుకూల మార్పులూ వుండబోవని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లోనయినా తుపాకీ వినియోగంపై విస్తృత స్థాయి చర్చ జరిగి, సమస్యను పరిష్కరించకుంటే అమెరికాలో ఇక తుపాకులే రాజ్యమేలుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

Courtesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates