కునుకు పట్టదు.. వణుకు వీడదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
షెడ్లు లేవు.. దుప్పట్లు కరవు

రోడ్లు, కాలిబాటలు, బస్‌స్టాండుల్లోనే బస
నగరంలో నిరాశ్రయులకు వసతి కష్టాలు
సుప్రీంకోర్టు చెప్పినా అరకొరగానే ఏర్పాట్లు
దీనుల అవస్థలు చూసైనా ‘చలించండి..?
డిజిటల్‌, హైదరాబాద్‌

కునుకు పట్టదు.. వణుకు వీడదు

ఉపాధి కరవై ఉన్న ఊరు పొమ్మంటే కన్నతల్లిలా నిత్యం వేలాది మందిని చేరదీస్తోంది భాగ్యనగరం. కుల మత ప్రాంతీయ భేదభావాలేం లేకుండా అమ్మతనం చూపి అక్కున చేర్చుకుంటోంది. ఇలాంటి వారు నగరంలో పగటిపూట ఏదో ఒక పని చేసుకొని పొట్టపోసుకుంటున్నా.. అలసిన బతుకులు రాత్రి వేళ ఆదమరిచి కునుకు తీసేందుకు మాత్రం ఆశ్రయం కరవవుతోంది. వీరి కోసం ఉన్న రాత్రి బస కేంద్రాలు అరకొరగానే ఆశ్రయం కల్పిస్తున్నాయి. బస్‌స్టాండులు, రైల్వేస్టేషన్ల ఆవరణల్లో మునగదీసుకొనేందుకు స్థలం దొరుకుతున్నా.. కప్పుకొనేందుకు మాత్రం వార్తా పత్రికలు, ప్లాస్టిక్‌ సంచులే దిక్కవుతున్నాయి. యాచకులు, అభాగ్యుల పరిస్థితి మరీ దారుణం. పని లేక పస్తులతో.. ఓవైపు కడుపులో పేగులు మెలిపెడుతుంటే నిద్రిస్తూ అయినా ఆకలిని మరిచిపోదామంటే చలి వణికిస్తోంది. నగరంలో నిరాశ్రయులు పడుతున్న బాధలపై ‘ఈనాడు’ పరిశీలన కథనం.


      రోగులు, సహాయకులు ఎక్కడుండాలి

మదీన, న్యూస్‌టుడే: పాతబస్తీలోని పేట్లబురుజు ఆసుపత్రికి రోజూ వేలాదిగా పేద రోగులొస్తుంటారు. చికిత్స నిమిత్తం రెండు మూడు రోజులు ఇక్కడే ఉండాలనుకొనేవారికి ఇబ్బందులు తప్పట్లేదు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న యాచకులు, నిరాశ్రయులకు, రోగులు, వారి సహాయకులకు కేవలం ఒకే బస కేంద్రం ఉంది. ఇక్కడ కేవలం 20 మంది ఉండేందుకు మాత్రమే వీలుంది. మిగిలిన వారికి ఆసుపత్రి
ఆవరణ, కాలిబాటలే దిక్కు.


వస్తోందెవరో.. వెళుతోందెవరో..?

కునుకు పట్టదు.. వణుకు వీడదు

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రంపై పర్యవేక్షణ కొరవడింది. కొత్తగా వచ్చే వారు దుప్పట్లు తెచ్చుకోవాల్సిందే. ఇక్కడకి ఎవరు వస్తున్నారో… ఎవరు పోతున్నారో తెలియడంలేదు. అటు జీహెచ్‌ఎంసీ కానీ, ఇటు స్వచ్ఛంద సంస్థ కానీ పట్టించుకోవడంలేదు. ఇక్కడ కొద్దిమందే ఉన్నారు. మరుగుదొడ్లు లేక, నీటి కొరతతో నిరాశ్రయులు సతమతమవుతున్నారు.


భవనం ఉంది.. వసతులు లేవు

కునుకు పట్టదు.. వణుకు వీడదు

ఉప్పల్‌, న్యూస్‌టుడే: నిరాశ్రయులైన మహిళల కోసం ఉప్పల్‌లోని పాత మున్సిపల్‌ వార్డు కార్యాలయంలో ఆశ్రయ కేంద్రం ఉంది. 20 మంది వరకు ఉంటున్నారు. ఆశ్రయానికి అవకాశం ఉన్నా మరే ఇతర వసతులు కల్పించలేదు. దుప్పట్లు లేవు. దీంతో చలికి వణుకుతూ, దోమలతో పోరాడుతూ నిద్రపోవాల్సి వస్తోంది. వృద్ధులు తరచూ రోగాల బారిన పడుతున్నారు.


దాతల సహకారంతో..

కునుకు పట్టదు.. వణుకు వీడదు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: నిరాశ్రయులైన ఒంటరి మహిళల కోసం సికింద్రాబాద్‌ సర్కిల్‌లోని సీతాఫల్‌మండి డివిజన్‌ నామాలగుండు వార్డు కార్యాలయంలో ఆశ్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. 30 మంది ఉండొచ్చు. ఇరవై మంది ఆశ్రయం పొందుతున్నారు. దాతలు అందించే సహకారంతో నడుస్తోంది. చలికి ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు వాపోతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చే వారికి చోటు కల్పిస్తోంది హైదరాబాద్‌ మహానగరం. నిత్యం లక్షల మంది నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ పనులపై ఇక్కడికి చేరేవారితో పాటు ఇక్కడే పనిచేస్తున్న దినసరి కూలీలు, పేద కుటుంబాలు, యాచకులు తల దాచుకునేందుకు నీడలేక.. సరైన వసతులు లేక రోడ్డు పక్కన, దుకాణాల అరుగులపై దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. రోజురోజుకు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతుండటం వీరి జీవితాలను జటిలం చేస్తోంది. నగరంలో తగినన్ని నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్న జీహెచ్‌ఎంసీ ప్రకటనలు ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.


  చలికి తాళలేక… స్థలం చాలక

కునుకు పట్టదు.. వణుకు వీడదు

బేగంపేట, న్యూస్‌టుడే: బేగంపేట పైవంతెన కింద జీహెచ్‌ఎంసీ రెండు రాత్రి బస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకదాన్ని అమన్‌ వేదిక అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారు, నగరంలో కార్మికులుగా పనిచేస్తూ పొట్టపోసుకొనే వారు, నిరాశ్రయులు ఇక్కడ తలదాచుకుంటున్నారు. దీనికి అనుకొనే మరో రాత్రి బస కేంద్రం నిర్మాణానికి స్థలం చేయించారు. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తయ్యేసరికి మరో రెండు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈలోగా చలికాలం పూర్తవుతుంది. ఉంటున్న వారికి పడకలు చాలక, చాలా మంది నేలపైనే నిద్రపోతున్నారు.


సర్వోన్నత న్యాయస్థానం మాటా చెవికెక్కలేదు!

కునుకు పట్టదు.. వణుకు వీడదు

* 13, జనవరి 2010.. ‘‘అయ్యా, మేం నిరాశ్రయులం. ప్రతి రాత్రి చలి, దోమలతో పోరు చేస్తున్నాం. తట్టుకోలేక వందలమంది చనిపోతున్నారు. మీరే దయ చూపాలి..’’ ఇది దిల్లీలో నిరాశ్రయులు సుప్రీంకోర్టుకు రాసిన లేఖ. స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
* 25, జనవరి 2010న మళ్లీ ఓ లేఖ. ఈ సమస్య ఇక్కడే కాదు దేశంలోని ప్రతి నగరంలోనూ ఉందనేది దాని సారాంశం. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది సుప్రీం. విచారణలో దేశవ్యాప్తంగా ఎక్కువమంది ఆకలితో కాదు ఆశ్రయం లేక చనిపోతున్నారనే విషయం వెల్లడైంది. వెంటనే దీనికి పరిష్కారం చూపి.. ప్రతి నగరంలో నిరాశ్రయులను గుర్తించి వారికి సౌకర్యాలు కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంతంత మాత్రంగానే పాటించాయి. చాలా రాష్ట్రాలు వసతిగృహాలను అరకొరగానే ఏర్పాటు చేశాయి.


200 మందికే ఆశ్రయం

కునుకు పట్టదు.. వణుకు వీడదు

బంజారాహిల్స్‌లోని ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద ఉన్న వసతి గృహం కాకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ఎన్జీఓల నిర్వహణలో ఉన్న 12 ఆవాస గృహాల్లో 380 మందికి వసతికి సదుపాయం ఉంది. అయితే 200 మంది కూడా వాటిల్లో ఉండడం లేదు. ఎక్కువ మంది ఎక్కడ పని కోసం వచ్చామో అక్కడే చలిలో గడుపుతున్నారు. చాలా మంది ఆసుపత్రుల వద్ద ఉంటున్నట్లు నాలుగేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో అధికారులు గుర్తించారు. ఆయా ఆసుపత్రుల వద్ద రాత్రి ఆవాస గృహాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కోఠి ప్రసూతి, ఈఎన్‌టీ, ఉస్మానియా, నిలోఫర్‌, గాంధీ, పేట్లబుర్జు, మహావీర్‌ ఆస్పత్రుల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. గాంధీ ఆస్పత్రి వద్ద స్థలం ఇచ్చేందుకు పాలక వర్గం నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మిగతా ఆసుపత్రుల్లో మహావీర్‌, నిలోఫర్‌ వద్ద మాత్రం ఆవాస గృహం పూర్తికాగా, ఉస్మానియా, నిమ్స్‌, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రుల వద్ద త్వరలో పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అదికారులు చెబుతున్నారు.


ఆదుకొనే నాథుడు లేడు
– లక్ష్మమ్మ

కునుకు పట్టదు.. వణుకు వీడదు

ఉపాధి కోసం నగరానికొచ్చా.. నా కుమార్తెలు, కోడలు ఉప్పుగూడలోని ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. కొంతకాలం క్రితమే ఓ కుమార్తె, కోడలు చనిపోయారు. మరో కుమార్తె నేను మిగిలాం. నిరాశ్రయులమయ్యాం. పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రి వద్దనున్న పాదబాటపై కాలం వెళ్లదీస్తున్నాం. ఉదయం కుమార్తె పనికి వెళ్లి సాయంత్రం ఇక్కడికే వస్తుంది. ఇక్కడ పెట్టే ఉచిత భోజనంతో కడుపు నింపుకొంటున్నాం. రాత్రయితే దోమలు, చలితో నరకం చూస్తున్నాం.


అడ్డా కూలీలుగా మారిన వ్యవసాయ కూలీలు

కునుకు పట్టదు.. వణుకు వీడదు

ఇది అమీర్‌పేట కూడలిలోని మైత్రీవనం ఎదురుగా ఉన్న కాలిబాట.. దానిపై పడుకున్న వాళ్లంతా ఒకప్పటి వ్యవసాయ కూలీలు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వారు. పొలం పనులు సరిగా దొరక్క నగరానికొచ్చారు. కాలిబాటే ఇల్లు.. ఇక్కడే నిద్ర.. ఉదయాన్నే దుకాణాలు తెరిచే సమయానికల్లా సంచులు సర్దుకొని ప్రజా మరుగుదొడ్లలో కాలకృత్యాలు తీర్చుకొని కూలీల అడ్డామీదికి చేరుకుంటారు. పని దొరికితే ఆరోజు కడుపు నిండినట్టే.. లేకుంటే బయట ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ చీకటి పడ్డాక దుకాణాలు మూసేసే సమయానికి ఇక్కడికే చేరుకుంటున్నారు. ఇదే వారి దినచర్య. వసతి లేక ఒక్కో రోజు ఉపాధి దొరక్క అటు చలి.. ఇటు పస్తులతో రోజులు వెళ్లదీస్తున్నారు.


బతకడం కోసం తప్పడంలేదు: వెంకాయమ్మ

మా అందరిదీ పిడుగురాళ్ల ప్రాంతం. అక్కడ పొలం పనులు లేకపోవడంతో ఉపాధి కోసం నగరానికొచ్చాం. నగరమే కడుపు నింపుతుందని నమ్మాం. ఇక్కడ మేం అనుకున్నట్లు లేదు. ఇంత పెద్ద నగరంలో ఎక్కడికెళ్లాలో తెలియదు. రోడ్ల పక్కనే రోజూ గడిపేస్తున్నాం. ఇల్లు పిల్లల్ని వదిలి రావడం బాధగా ఉన్నా.. బతకడం కోసం తప్పట్లేదు.


భయంభయంగా గడుపుతున్నాం: శ్రీనివాసులు

హైదరాబాద్‌ అంటే పెద్ద నగరం కదా ఎక్కడో ఓచోట బతికేయొచ్చు అనుకుని భార్యతో కలిసి వచ్చాను. ఊర్లో ఏ పని లేదు. ఇక్కడ ఉచితంగా వసతి ఇచ్చే గదులుంటాయని విన్నాను. ఎక్కడ అడిగినా అలాంటివేం ఉండవన్నారు. అందుకే ఇక్కడ ఉంటున్నాం. రాత్రిపూట పోలీసులొస్తే ఏమంటారోనని భయంభయంగా గడిపేస్తున్నాం.


కొంచెం ఆలస్యమైనా పని దొరకదు: లక్ష్మీ

పని కోసం ఉన్న ఊరు, కన్న పిల్లల్ని వదిలేసి వచ్చా. రాత్రంతా చలి, దోమలతో కష్టంగా ఉంది. అయినా తప్పట్లేదు. ఉదయాన్నే అడ్డా మీదికి వెళ్లేందుకు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. కొంచెం ఆలస్యమైనా ఆరోజుకు ఇక పని దొరకదు. పగలంతా ఎక్కడో ఓ చోట గడిపేసి రాత్రికి ఇక్కడికే రావాలి. డబ్బులొస్తే ఏదైనా కొనుక్కొని తింటాం. ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. పదిరోజుల్లో తిరిగి వెళ్లిపోదామనుకుంటున్నాం.


ఉండాల్సింది వంద.. ఉన్నవి 12

కునుకు పట్టదు.. వణుకు వీడదు

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఓ వసతి గృహం ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన కోటికి చేరిన నగర జనాభాకు వందకు పైగా అవసరం. నగరంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కేవలం 12 మాత్రమే ఉన్నాయి. వీటిని పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి. చాలా వాటిల్లో ఏవో ఒక సమస్యలు తిష్ఠ వేశాయి. కొన్నింటిలో నిర్వహణ సరిగా లేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


రాత్రికి రోడ్డే దిక్కు..

కునుకు పట్టదు.. వణుకు వీడదు

మాది ఉత్తరప్రదేశ్‌. ఉపాధికని ఏడాది క్రితం వచ్చాం. ఇక్కడ నా అనే వాళ్లెవరూ లేరు. ఎర్రగడ్డలోని ఓ మసీదులో చిన్నచిన్న పనులు చేస్తున్నాం. కొన్ని రోజులు అక్కడ వసతి దొరికినా రెండు నెలలు కిందట బయటికొచ్చేశాం. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. స్థానికంగా ఏదో దుకాణం వద్ద రాత్రిళ్లు గడిపేస్తున్నాం. రోడ్డు పక్కనే నిద్ర. ఎవరైనా ఆహారం ఇస్తేనే కడుపు నిండేది. బతుకు భారమవుతోంది.


ఒక్కటంటే ఒక్కటీ లేదు

కునుకు పట్టదు.. వణుకు వీడదు

కుత్బుల్లాపూర్‌, న్యూస్‌టుడే: కుత్బుల్లాపూర్‌, గాజులరామారం సర్కిళ్ల పరిధిలో అత్యధికంగా నిరాశ్రయులున్నారు. ఆలయాల ఆవరణలో వీరికి వసతినిస్తున్నాయి. పదేళ్ల క్రితం ఇక్కడ వసతి గృహం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది అటకెక్కింది. రెండు సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం 19 మంది నిరాశ్రయులున్నట్లు అధికారులు చెబుతున్నా వాస్తవంగా అంతకు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సామాజిక కార్యకర్త 50కి పైగా దుప్పట్లు పంపిణీ చేశారు. గతంలో ఇక్కడే అనాథ వృద్ధులు చలి తీవ్రత తట్టుకోలేక మృత్యువాత పడిన సందర్భాలున్నాయి.

కునుకు పట్టదు.. వణుకు వీడదు


తాగునీరు లేదు

కునుకు పట్టదు.. వణుకు వీడదు

డిఫెన్స్‌ కాలనీ, న్యూస్‌టుడే: మల్కాజిగిరి సర్కిల్‌ ఆర్‌కే పురంలోని రాత్రి బస కేంద్రంలో 16 మంది ఆశ్రయం పొందుతున్నారు. గత ఏడాది అందజేసిన దుప్పట్లనే వాడుకుంటున్నారు. ఈ ఏడాది అందించాల్సిన దుప్పట్లు, చలికోట్లు ఇంకా అందలేదు. తాగునీటి సరఫరా లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని నిరాశ్రయులు వాపోతున్నారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates