నలుగురు సభ్యులు.. నాలుగు గంటలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ముగిసిన దిశ నిందితుల రీపోస్టుమార్టం
ఎయిమ్స్‌ బృందం స్వీయ పర్యవేక్షణలో నిర్వహణ
తొమ్మిది తూటా గాయాల గుర్తింపు
కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: ఎదురు కాల్పుల్లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో సోమవారం రీపోస్టుమార్టం పూర్తయింది. దిల్లీ ఎయిమ్స్‌ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల బృందం ఈ ప్రక్రియను పూర్తిచేసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మృతదేహాలను క్షుణ్నంగా పరిశీలించిన నిపుణులు..అనుమానం వచ్చిన చోటల్లా ఎక్స్‌రే తీశారు. కనిపించే గాయాలతోపాటు శరీరంలో కనిపించని గాయాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో అణువణువూ వెదికారు. ఒక్కో మృతదేహానికి దాదాపు గంటపాటు, ఒకరి తర్వాత ఒకరుగా శవ పరీక్ష నిర్వహించిన నిపుణులు ప్రతి అంశాన్ని నమోదు చేశారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ పోలీసులు మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు.

ఈ నెల 6న షాద్‌నగర్‌ శివారు చటాన్‌పల్లి వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్‌, జొల్లు శివ, జొల్లు నవీన్‌, చింతకుంట చెన్నకేశవులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నలుగురి మృతదేహాలకు అదే రోజున ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని కోరుతూ పౌర హక్కుల సంఘాలు పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఎయిమ్స్‌ వైద్యులతో రీపోస్టుమార్టం నిర్వహించి ఈ నెల 23వ తేదీన నివేదిక సమర్పించాలని ఈ నెల 21న హైకోర్టు ఆదేశించింది.

10కి మొదలైంది.. 2 గంటలకు ముగిసింది
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఎయిమ్స్‌ నుంచి వచ్చిన సీనియర్‌ ప్రొఫెసర్‌, ముగ్గురు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం సోమవారం ఉదయం 9:15 గంటలకు గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌తో మాట్లాడిన వారు కంప్యూటర్‌, వీడియో కెమెరా, ఎక్స్‌రే యంత్రం సమకూర్చాలని కోరారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి అభ్యంతరాలను నమోదు చేశారు. వారి సమక్షంలోనే శవ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటలకు పూర్తిచేశారు. రేడియాలజిస్టు, పోస్టుమార్టంలో సహాయపడే ఒకరిద్దరు సిబ్బందిని మినహా ఆసుపత్రికి చెందిన ఎవర్నీ లోనికి అనుమతించలేదు.

అనేక జాగ్రత్తల నడుమ
ఎదురు కాల్పుల వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆ విచారణకూ ఎయిమ్స్‌ బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో ఆ బృందం అనేక జాగ్రత్తలు తీసుకుంది. సాధారణంగా ఒక్కో మృతదేహానికి ఒక్కో వైద్యుడు మాత్రమే పోస్టుమార్టం నిర్వహిస్తారు. కేసు తీవ్రత దృష్ట్యా ఒకరు పర్యవేక్షిస్తుండగా..ప్రతి మృతదేహానికీ ముగ్గురు నిర్వహించారు. ఒక్కో దానికీ దాదాపు గంట సమయం తీసుకున్నారు. మృతదేహాల్లో తూటాల తాలూకూ తొమ్మిది గాయాలను వారు గుర్తించినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ శరీరంలో నాలుగు, శివ దేహంలో మూడు, నవీన్‌ శరీరంలో రెండు, చెన్నకేశవులు ఒంట్లో ఒక తూటా దిగాయని తేల్చినట్టు సమాచారం.

గాయాలన్నీ ఎక్స్‌రేలలో నిక్షిప్తం
మృతదేహాల్లో తూటాలు లేవు. వాటి తాలూకూ గాయాలు మాత్రమే ఉన్నాయి. నిందితులు కాల్పుల్లో మరణించక మునుపు రెండు రోజులపాటు పోలీసుల అదుపులో ఉన్న క్రమంలోవారి శరీరాల్లో ఇతర గాయాలు ఉన్నాయా? ఎముకలు విరిగిన ఆనవాళ్లున్నాయా? అనే అంశాలను నిపుణులు నిశితంగా పరిశీలించారు. అనుమానం ఉన్నచోటల్లా ఎక్స్‌రే తీశారు. ఇలా ఒక్కో మృతదేహానికి ఐదు నుంచి ఏడు ఎక్స్‌రేలు తీసి భద్రపరిచారు. తూటాలు దిగిన ప్రాంతం, బయటకు వచ్చిన ప్రాంతంలోని గాయాల చుట్టుకొలతనూ నమోదు చేశారు.

మృతదేహాలు స్వగ్రామాలకు
ఈ తంతు పూర్తయిన తర్వాత మృతదేహాలను రెండు అంబులెన్సుల్లో మధ్యాహ్నం 3గంటల సమయంలో స్వగ్రామాలకు తరలించారు. మీడియా సహా ఇతరులతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మృతుల సంబంధీకులను కూడా అంబులెన్సులతోపాటు ప్రత్యేక వాహనంలో భారీ బందోబస్తు నడుమ తీసుకెళ్లారు.

ముగిసిన అంత్యక్రియలు
మహబూబ్‌నగర్‌, ఈనాడు డిజిటల్‌: నిందితుల మృతదేహాలు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని గుడిగండ్ల, జక్లేరు గ్రామాలకు సాయంత్రం 6 గంటలకు చేరుకున్నాయి. సంబంధీకులు నేరుగా వారివారి ఇళ్లకు తీసుకెళ్లారు. శ్మశాన వాటికల్లోనే అంత్యక్రియలు జరిపించాలని పోలీసులు సూచించగా చెన్నకేశవులు, శివ, నవీన్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. తమ పొలాల్లోనే ఖననం చేస్తామని పట్టుపట్టడంతో అంగీకరించారు. ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌ మృతదేహాన్ని జక్లేరులోని మసీదులో ఉంచి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు. ఓ డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తంతు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మృతదేహాలు పాడవలేదు
సాధారణంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచినా మృతదేహాలు యాభైశాతం పాడయ్యే అవకాశం ఉంటుంది. వేసవిలో అయితే మూడు రోజులకే చెడిపోతాయి. వాతావరణం చల్లగా ఉండడంతో ఘటన జరిగి ఇన్ని రోజులైనా పాడవలేదు. ఎయిమ్స్‌ బృందం అడిగిన అన్ని వనరులనూ సమకూర్చాం. గత పోస్టుమార్టం నివేదికను వారు అడిగారు. దాన్ని ఇప్పటికే న్యాయస్థానంలో సమర్పించినట్టు చెప్పాం.
శ్రావణ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

(Courtesy Eenadu)

RELATED ARTICLES

Latest Updates