ఝార్ఖండ్‌లో హేమంతం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కమలానికి ఎదురుదెబ్బ

అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి జయకేతనం
పోటీ చేసిన రెండు చోట్లా గెలిచిన హేమంత్‌ సోరెన్‌

రాంచీ/ దిల్లీ: అధికార భాజపాకి ఝార్ఖండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)- కాంగ్రెస్‌- ఆర్జేడీ కూటమి అధికారాన్ని కైవశం చేసుకుంది. కూటమి నేతగా హేమంత్‌ సోరెన్‌ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించనున్నారు. 81 స్థానాలున్న శాసనసభ ఓట్ల లెక్కింపు సోమవారం రాత్రికి పూర్తయింది.

ప్రభుత్వ ఏర్పాటుకు 41 స్థానాలు అవసరం కాగా జేఎంఎం 30 చోట్ల, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో, ఆర్జేడీ ఒక స్థానంలో గెలవడంతో ఆ కూటమికి 47 స్థానాలు లభించినట్లయింది. ఒంటరిగా పోటీ చేసిన భాజపా 25 స్థానాలకే పరిమితమయింది. మిగిలిన 9 సీట్లు ఇతర పార్టీలకు దక్కాయి. ఆరుగురు మంత్రులు, సభాపతి ఇంటిదారి పట్టారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల భాజపా గెలవలేకపోయింది. గత ఏడాది భాజపా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలను కోల్పోగా ఇటీవల మహారాష్ట్ర, ఇప్పుడు ఝార్ఖండ్‌ చేజారిపోయాయి. దేశంలో ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సొంతంగానో, సంకీర్ణ భాగస్వామిగానో అధికారంలో ఉన్నట్లయింది.

ఏడు నెలల విరామంలో భాజపా ఓట్లలో 22% కోత
2019 మే సార్వత్రిక ఎన్నికల్లో ఝార్ఖండ్‌లో 55% ఓట్లు సాధించిన కమలనాథులు… ప్రస్తుత శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి 33% వద్ద ఆగిపోయారు. గతంలో మహారాష్ట్ర, హరియాణాల్లోనూ దాదాపు ఇలాంటి పోకడే కనిపించింది. 370వ అధికరణం రద్దు, ముమ్మారు తలాక్‌ నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలు ఈసారి ఝార్ఖండ్‌లో తమను విజయానికి చేరువ చేస్తాయని భాజపా నేతలు విశ్వసించినా తుది ఫలితాలు నీళ్లుజల్లాయి. ఫలితాల సరళి వెల్లడైన వెంటనే హేమంత్‌ సోరెన్‌ తన తండ్రి శిబూసోరెన్‌ వద్దకు వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. ఈసారి పోటీచేసిన రెండు స్థానాల్లోనూ హేమంత్‌ గెలిచారు. సాధారణంగా కమలానికి ఓటు వేసే పట్టణ ఓటర్లు ఈసారి ఆ 44లో 29 చోట్ల విపక్షాలవైపే మొగ్గు చూపించారు. తుది ఫలితంపై అది స్పష్టమైన ముద్ర వేసింది.

ఝార్ఖండ్‌లో హేమంతం

ముఖ్యమంత్రి రాజీనామా
ఓటమిని అంగీకరిస్తూ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను సోమవారం సాయంత్రం గవర్నర్‌ ద్రౌపది ముర్ముకు అందజేశారు. నూతన సర్కారు ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్‌ ఆయన్ని కోరారు. విజయం సాధించిన హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని కూటమిని ప్రధాని మోదీ అభినందించారు. తాము ఓటమిని అంగీకరిస్తున్నామని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

ఝార్ఖండ్‌లో హేమంతం

ఫలితాలపై ఎవరేమన్నారు..?
అయిదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసిన అవకాశం నిరుడు భాజపాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హేమంత్‌ సొరేన్‌కు అభినందనలు.
– ప్రధాని నరేంద్ర మోదీ
స్థానిక సమస్యలు, రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న కలహాలే ఓటమికి కారణం. మరోసారి భాజపా ప్రభుత్వం ఎందుకు కొనసాగాలన్న విషయాన్ని రాష్ట్ర నాయకులు ఓటర్లకు సమర్థంగా వివరించలేకపోయారు.
– జీవీఎల్‌ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి
ఇది నా పరాజయం, భాజపాది కాదు
– రఘుబర్‌దాస్‌, ముఖ్యమంత్రి
నిరుద్యోగం సహా తమ సమస్యలను ప్రభుత్వం వినాలని ప్రజలు కోరుకుంటున్నారు. భాజపా మాత్రం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విభజన రాజకీయాలు అమలు చేస్తోంది. వీటికి ప్రజల సమాధానం ఏమిటో వెల్లడయింది.
– ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఇది.
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి
మోదీ-అమిత్‌ షాల అహంకారానికి ఓటర్లు బుద్ధి చెప్పారు.
 శరద్‌ పవార్‌, ఎన్‌సీపీ అధినేత
భాజపా చేసే భావోద్వేగ రాజకీయాలను ఓటర్లు తిరస్కరించారు.
– శివసేన
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలకు అనుకూలంగా భాజపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేసినా ఓటర్లు వాటిని ఆమోదించలేదు.
అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

హేమంత్‌ సోరెన్‌కు సీఎం కేసీఆర్‌ అభినందనలు

ఝార్ఖండ్‌లో హేమంతం

హైదరాబాద్‌: ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత హేమంత్‌ సోరెన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి హేమంత్‌, ఆయన తండ్రి శిబూసోరెన్‌ మద్దతుగా నిలిచారని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకరాష్ట్ర సాధన కోసం పోరాడిన జేఎంఎం నాయకత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో హేమంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2018 మార్చి 28న హేమంత్‌ సమాఖ్య కూటమిపై చర్చించేందుకు ప్రగతిభవన్‌కువచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసిన చిత్రాన్ని ఆయన తన ట్విటర్‌కు ట్యాగ్‌ చేశారు.

RELATED ARTICLES

Latest Updates