దోపిడీ ‘రాజ్యాంగం పూతలకు, రాకాసి పుండ్లు మానవు’!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

Image result for khairlanji hatyakand"రంగనాయకమ్మ
– 6 –
ఖైర్లాంజీ హత్యల దురంతాన్ని బైటికి లాగ గలిగింది ఎవరు? ‘విదర్భ జనాందోళన్‌ సమితి’. ఈ సమితి అక్టోబరు 6న, తనకు అందిన కొన్ని వాస్తవాల్ని బైట పెట్టింది. ఒక పోలీసు కానిస్టేబులు, తన పేరు బైట పెట్టవద్దని, కొన్ని భయంకర విషయాలు చెప్పాడని ఆ సమితి రాసింది, ఈ విధంగా: ”ప్రియాంక, సురేఖల జననాంగాల్లో, కర్రలు గుచ్చారు. ఇద్దరు కొడుకుల జననాంగాలనూ కోసి వేసి, వాళ్ల ముఖాలను నుజ్జునుజ్జు చేసి, చనిపోయే వరకూ గాలిలో విసిరేస్తూ ప్రదర్శన చేశారు. శవాలపై పిడిగుద్దులు కురిపించారు.” కానిస్టేబులు చెప్పిన ఈ వాస్తవాల్ని, ఆ సమితి ప్రచార మాధ్యమాలకు విడుదల చేసింది. స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరింది. స్థానిక పాలనా యంత్రాంగం, రాజకీయ నాయకులూ, ఈ సంఘటనలను బైటికి పొక్కనీయడం లేదని, ఆ సమితి ఆరోపించింది. రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నారని చెప్పడం చాలదు. దాని వల్ల, వాళ్ల ప్రయోజనాలేమిటో గ్రహించాలి. వాళ్ల ప్రయోజనం, శ్రమలు చేసే జనాన్ని, ఎప్పుడూ భయ భక్తుల్లో ముంచి ఉంచడం! ప్రధానమైన గురి, అతి తక్కువ కులాలుగా ఉన్న దళిత కులాల మీదే ఉంటుంది.

ఖైర్లాంజీ హత్యలు సెప్టెంబరు చివర్లో జరిగితే, వార్తా పత్రికలు, ఆ హత్యలు చేసిన నిందితుల్ని సమర్ధిస్తూనే రాశాయి. ‘అక్రమ సంబంధం’ వల్లనే అలా జరిగిందని! అంతేగానీ, ‘ఒక కుటుంబం’లో జరిగే అక్రమ సంబంధంతో, ఇతర కుటుంబాలకు ఏమిటి బాధ్యత?’ అనే ప్రశ్న ఒక్క పత్రిక కూడా వెయ్యలేదు. సురేఖతో సంబంధానికి సిద్ధార్ధ వచ్చేవాడనీ, అతన్ని గ్రామస్తులు పలుమార్లు మందలించినప్పటికీ అతను వినలేదనీ, అందుకే ఆ దాడి జరిగిందనీ, పత్రికల కధనాలు! ఒక కుటుంబంలో జరిగే విషయాలు, ఇతర కుటుంబాలకు నచ్చలేదనుకుంటే, నచ్చని కుటుంబాల్ని హత్యలు చేసే హక్కు ఇతర కుటుంబాలకు ఉంటుందా? ఈ ప్రశ్నని ఒక్క పత్రిక కూడా అడగలేదు. అంటే, దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? హత్యలు చేసిన వాళ్లకూ, రాజకీయ నాయకులకూ, పోలీసులకూ, డాక్టర్లకూ, పత్రికలకూ, వెంట్రుక వాసి తేడా అయినా లేదని తెలుస్తోంది అంటారు రచయిత.
నాగపూర్‌ సిటీకి 3 గంటల దూరంలో మాత్రమే ఉన్న ఖైర్లాంజీ గ్రామ కుటుంబంలో జరిగిన ఘోరం ఎవరికీ పట్టనిదైపోయింది. అక్టోబరు 2న, బుద్ధుడి పండుగ రోజు కోసం, నాగపూరుకి చేరిన వేలాది మంది దళితుల్లో, అంబేద్కర్‌ వాద ఉత్తేజంతో కూడా, ఖైర్లాంజీ హత్యల గురించి ఒక్క కన్నీటిబొట్టు రాలలేదు. (ఈ పుస్తకం రాసిన ఆనంద్‌ ‘దళితుడే’ అయినా, తోటి దళితుల పట్టనితనం గురించి, చాలా నిర్మొహమాటమైన విమర్శలతోటే రాశారు.)

అక్టోబరు 14న, ఒక సమావేశంలో దళిత మాయావతి పాల్గొన్నా, అక్కడ కూడా, అప్పుడు కూడా, ఖైర్లాంజీ సంగతి రాలేదు! అంబేద్కర్‌, తోటి దళితులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరించిన స్థలం ‘చంద్రపూర్‌’. అక్కడ అక్టోబరు 16న జరిగిన సభ కూడా ఖైర్లాంజీ హత్యల గురించి నోరు మెదపలేదు. ఒక దళిత కుటుంబం మీద హత్యలు, ఇతర దళితుల్ని ఎందుకు కలిచి వేయలేదు? వాళ్లకు అసలైన వార్తలే అందలేదా? వార్తలు చేసిన ఒక ఘోరం ఏమిటంటే, ‘హత్యలు జరిగాయి’ అని ప్రకటించాయి గానీ, ‘అవి దళితుల మీద హత్యలు’ అని వివరించలేదు. అలా చెబితే, అది సంచలన వార్తగా అవుతుందని పత్రికలు అలా చెప్పలేదట! అది, పత్రికల యజమానుల జవాబులు! అసలు విషయాల్ని ఒకేసారి చెప్పకుండా, ఒక్కో ముక్కా, ఒక్కోసారిగా, దశల వారీగా మాత్రమే బైటికి రానిచ్చారు. ఇది, ప్రభుత్వపు ఎత్తుగడ!

సాధారణ దళితుల సంగతి కాదు, దళిత నాయకుల సంగతే. వారు కూడా ఖైర్లాంజీని పట్టించుకోలేదు. చివరికి బుద్ధుడి పండగ తర్వాత దళితులు కొంత కదలడం ప్రారంభమైంది. నాగపూరు నించి, ఖైర్లాంజీ వరకూ, ‘లాంగ్‌ మార్చ్‌’ చేయాలని నవంబరు 12న నిర్ణయించారు. అక్టోబరు 13న ప్రకాశ్‌ అంబేద్కర్‌ (బి.ఆర్‌.అంబేద్కర్‌ మనవడు) ఒక సభలో రాజకీయాలలో పాల్గొనాలని మాట్లాడాడు గానీ, ప్రజల న్యాయమైన డిమాండ్ల మాట ఎత్తలేదు. దళిత నాయకులు, ప్రజల నుంచి వ్యతిరేకతనే ఎదుర్కొంటున్నారు. ముంబైలో, రమాబాయి హత్యాకాండ సందర్భంలో, రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాందాస్‌ అథావలే మాట్లాడుతోంటే, అతన్ని ప్రజలు తరిమి కొట్టారు. ఖైర్లాంజీ గురించి జరిగిన కొన్ని ఆందోళనల్లో, జనం, కాళ్లూ చేతులూ విరిగి, గాయపడ్డారు. పోలీసుల లాఠీల పని అది. వాళ్లు దళితవాడలపై కూడా దాడులు చేశారు. దళితులపై రకరకాలుగా కేసులు పెట్టారు. అంటే, ‘ప్రజలు, తమ న్యాయమైన హక్కుల కోసం అడిగితే, ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని’ రాజ్యం చెపుతుంది అన్నారు రచయిత. ప్రజల ఆందోళనల్ని ఆపడానికి, రాజ్యం ఎటువంటి ఎత్తుగడలతో ప్రవర్తిస్తుందో, రచయిత, చాలా వివరాలతో చెప్పారు. ప్రజలు, తమ మీద వున్న కేసులతో, ఏళ్ల తరబడీ కోర్టులకు తిరుగుతూనే ఉండడం చూస్తూనే ఉన్నాం. ”ఇంత జరుగుతోన్నా దళితులు, రాజ్యాంగం పట్ల విశ్వాసాన్నే కనపరుస్తారు. తమ నాయకుడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారమే రాజ్యం నడుస్తోందని వాళ్లు నమ్ముతున్నారు. అయినా, వాళ్లు మళ్లీ మళ్లీ మోసగింపబడుతున్నారు.” (పేజీలు: 55-56)

రాజ్యం, దళితులనే కాదు, అన్ని కింది కులాల ప్రజల్నీ, రకరకాలుగా హింసలు పెడుతూనే ఉంది. ముఖ్యంగా, అట్టడుగు శారీరక శ్రమలు చేస్తూ జీవించే దళితులపై చేసే హింసలు అనేక రకాలూ, అతి ఎక్కువగానూ. ”తమ నాయకుడు రాసిన రాజ్యాంగం ప్రకారం రాజ్యం నడుస్తోందని వాళ్లు (దళితులు) నమ్ముతున్నారు” అనడంలో అర్ధాలు ఏమిటి? దీనికి 2 అర్ధాలు వస్తాయి. (1) ‘తమ నాయకుడు, ఎంతో మంచి రాజ్యాంగాన్ని, మంచి చట్టాలతో రాశాడనీ, కానీ, రాజ్యం అలా నడవడం లేదనీ చెప్పడమా? (2) లేకపోతే, తమ నాయకుడు రాసిన రాజ్యమే, అన్ని కష్టాలకూ అవకాశాలు ఇచ్చేదిగానే ఉందనీ, దాన్ని విశ్వసించనక్కర లేదనీ, దాన్ని నమ్ముకుంటూ కూర్చుంటే, మోసాలకూ, కష్టాలకూ, మళ్లీ మళ్లీ గురవుతూనే ుంటామనీ’ చెప్పడమా? – ఆనంద్‌ చేసిన ఈ రచనలో, ఆయన ఏ అర్ధంతో చెప్పారో, ఆ అర్ధం స్పష్టంగా తెలియడం లేదు. అయినా, రెండో అర్ధంతోనే చెప్పినదనీ, అది మొదటి అర్ధంతో కాదనీ, నమ్మవలిసి వస్తుంది. అంబేద్కర్‌ దళితుడు, తోటి దళితుల మీద కక్షతో చెడ్డ రాజ్యాంగాన్ని రాశాడని కాదు. అసలు ‘రాజ్యాంగం’ అనేది, పాత కాలం నించీ చెడ్డదే! అంటే, శ్రమ దోపిడీ వర్గం, తమకి అనుకూలంగా, చెడ్డ చట్టాలతోనే పెట్టుకున్న రాజ్యాంగం అది. ఈ విషయాలేవీ అంబేద్కర్‌ గ్రహించలేదు. పైగా, బ్రిటీషు వాళ్లు పోయాక అప్పటికే ఉన్న రాజ్యాంగాన్ని కాస్త పరిశీలించి చూడడం, అంబేద్కర్‌ ఒక్కడే చేయలేదు. భూస్వాములు, పెట్టుబడిదారీ వర్గాల పెద్దలతో కూడా కలిసి సమిష్టిగా చెయ్యడం వల్లే అది జరిగింది.

అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీతో వ్యతిరేకించిన అంబేద్కర్‌, వాళ్లతోనే కలవడం మొదటి తప్పు! దాన్ని ‘అమాయకత్వం’ అనుకుంటే, ఆ అమాయకత్వం వల్ల, దోపిడీ రాజ్యాంగాన్నే తయారు చేస్తున్నట్టు తెలియక, దోపిడీ ప్రముఖులతో జట్టు కట్టి, వాళ్ల అభిప్రాయాలతోనే కలిసి చేసిన పని అది. దాని వల్ల, పాత రాజ్యాంగమే నిలబడింది! కానీ, దాన్ని అంబేద్కరే కొత్తగా చేసినట్టు ప్రచారం జరిగింది. ‘మన నాయకుడు రాసినదే కదా?’ అని దళితులందరూ ఈ రాజ్యాంగానే నమ్ముతున్నారు. అయితే, శ్రామిక ప్రజలు చేయవలిసిందేమిటంటే, ‘ప్రస్తుత రాజ్యాంగాన్ని నమ్మము’ అంటే చాలదు. ‘అది, దోపిడీవర్గం, తమ కోసం రాసుకున్న, నడుపుతోన్న రాజ్యాంగం’ అని మొదట గమనించాలి. రాజకీయ నాయకులూ, వారి పోలీసులూ, అదే దృష్టి గల డాక్టర్లూ, అదే దృష్టి గల పత్రికలూ- వంటివన్నీ, శ్రామిక ప్రజలకు అనుకూలంగా ఎప్పటికీ నడవవని గ్రహించాలి.

ఇప్పుడు అంబేద్కర్‌ అమాయకత్వం మీద, నేరం ఆరోపించి ప్రయోజనం లేదు. ఆయన, దళితుల క్షేమాన్ని కోరిన మనిషే గానీ, వారికి వ్యతిరేకి కాదు. కానీ, ఆయన రాజ్యాంగం పనిలో కలవడం వల్ల, ‘ఈ రాజ్యాంగాన్ని మన నాయకుడే రాశాడు’ – అనే దృష్టితో, దళితులు ఇంకా ఉండనక్కరలేదు అని, రచయిత ఆనంద్‌ చెపుతున్నట్టు వివరంగా తెలియడం లేదు. ‘అంటరాని వారికి పత్రికా స్వేచ్చ ఉండదు’ అని అంబేద్కర్‌ 1945లో నిరసనగా చెప్పిన మాటల్ని ఆధారం చేసుకుని, దానికి ఈ రచయిత కొన్ని నిజమైన ఉదాహరణలు చూపించారు. ‘దేశంలోని ప్రసార మాధ్యమాలలో, కింది కులాలకు స్థానం లేదు’ అనడానికి ఆధారాలు చూపించారు రచయిత. పత్రికల్లో, దళితులు, గోడౌన్‌ కార్మికులుగా, ముద్రణా యంత్రాల దగ్గిర కార్మికులుగా, డ్రైవర్లుగా, పేపర్‌ బోయిలుగా ఉన్నారే తప్ప, ఎడిటర్లుగా గానీ, విలేకరులుగా గానీ, దాదాపుగా లేరనే విషయం చూపించారు. కానీ దానికి మూలం ఏమిటో చెప్పలేదు.

ప్రచార సాధనాలన్నీ (పత్రికలూ, రేడియో, టీవీలూ -వంటివి), దోపిడీ వర్గం చేతుల్లోనూ, ఆ వర్గం పెట్టుకున్న ప్రభుత్వం ఆర్డర్ల కిందా మాత్రమే ఉంటాయి. సమాజమేమో, శతృ వర్గాల సమాజం. దోపిడీ మీద ఆధారపడి బతికే వర్గం, ఒక వేపూ, శ్రమ మీద ఆధారపడి బతికేవర్గం, ఇంకో వేపూ! పైగా శ్రామికవర్గం, సమాజంలో ఉన్న అసమాన, దోపిడీ శ్రమ విభజన కారణంగా అనేక కులాలుగా విడిపోయి ఉంది. ఆ కుల భేదాలు, ప్రసార సాధనాల్లో కూడా కనిపిస్తాయి. ఆ భేద భావం, శారీరక-మేధా శ్రమలు చేసే ఉద్యోగుల్ని నియమించడాల్లో కూడా కనిపిస్తుంది. అందుకే తరతరాలుగా శారీరక శ్రమలు చేసే కుటుంబాల నుంచి పత్రికా వృత్తిలోకి వచ్చిన వాళ్లు, తక్కువగా కనిపిస్తారు. పై స్థానాల్లో అయితే, దాదాపుగా అసలు ఉండరు. దళిత కులాలపై ప్రేమతోనే జరుగుతోన్న ఈ రచనలో, అసలు, ఈ ‘కుల విభజన’ ఎలా ఎందుకు ప్రారంభమై ఉంటుంది?- అనే ప్రశ్న లేదు. ఈ విషయం గ్రహించి ఉంటే, కుల విభజనని నాశనం చేసే విధానం కూడా తెలిసి వుంటుంది.

అట్టడుగు శారీరక శ్రమలు చేయడమే వృత్తులుగా, వేల సంవత్సరాలుగా సాగుతోన్న విధానం ఎలా ఏర్పడి ఉంటుంది? మానవులు కొన్ని బృందాలుగా వేరువేరు శ్రమలు చెయ్యడమే ‘శ్రమ విభజన’. పాత కాలపు శ్రమ విభజన వల్లనే, ఈ కుల విధానం ఏర్పడిపోయి ఉందని తెలుస్తుంది. ఈ విషయం తెలిస్తే, దీన్ని తీసివేసే విధానం కూడా తెలుస్తుంది.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates