ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎసరు ?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 NREGA– కూలీలు ఉపాధి పనికెళ్లకుండా చేసింది సర్కారే
– పని కల్పిస్తలేరని తీసివేసేదీ అదే
– 40 పనిదినాలు కల్పించకుంటే మంగళం
– సర్క్యూలర్‌ నెంబర్‌ 4779 విడుదల
– అమల్లోకొస్తే ఐదువేల మంది రోడ్డుపాలు
– ఆ జోవోను రద్దు చేయాలి :తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

ఉపాధి హామీ చట్టం అమలులో కీలక భూమిక ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించే కుట్రకు సర్కారు పూనుకున్నది. వేతనాలు సకాలంలో ఇవ్వకుండా…సౌకర్యాలు కల్పించకుండా…సరైన కూలి పడకుండా చేసి కూలీలు ఉపాధి పనులకు వెళ్లకుండా చేసింది రాష్ట్ర సర్కారే. అదే ప్రభుత్వం నేడు జాబుకార్డుపై కనీసం 40 పనిదినాలు కల్పించడం లేదనే సాకుతో ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపునకు ఎసరు పెట్టింది. ఈ మేరకు ఫీల్డ్‌ అసిస్టెంట్లను తప్పించాలని సర్క్యూలర్‌ నెంబర్‌ 4779ని జారీచేసింది. అసలు కూలీలు పనులకు ఎందుకు రావట్లేదు? పనిదినాలు కల్పించకపోవడానికి కారణమేంటి? స్థానికంగా ఉన్న భౌతిక పరిస్థితులేంటి? తదితర విధానపర లోపాలను సవరించుకోకుండా ఫీల్డ్‌అసిస్టెంట్లపైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చినప్పటి నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కూలీలతో ఉపాధి హామీ పనులను విజయవంతంగా చేయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి గ్రామానికో ఫీల్డ్‌ అసిస్టెంటు ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం 7500 మంది లోపే ఉన్నారు. కొత్త గ్రామపంచాయతీలకు ఇంకా నియమించనే లేదు. సీనియర్‌ మేట్లు ఆ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు సర్కారు కన్ను ఫీల్డ్‌ అసిస్టెంట్లపై పడింది. రాష్ట్రంలో 40శాతం పనిదినాలను ఉపాధి జాబ్‌ కార్డుదారులకు చూపనివారిని తొలగించాలని సర్క్యూలర్‌ నెంబర్‌ 4779ని జారీ చేసింది. 39 శాతం పనిదినాలు కల్పించిన వాళ్లు 3600 మంది, 10శాతం లోపల పనిదినాలు కల్పించిన వాళ్లు 1900మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ జీవో యధావిధిగా ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5500 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

విధానపర లోపాలు తొక్కిపెట్టి…
ఫీల్డు అసిస్టెంట్ల మెడపై కత్తి
ప్రభుత్వం అమలు చేస్తున్న విధానపరమైన లోపాలను ఫీల్డ్‌ అసిస్టెంట్లపైకి తోసి తప్పుకోవాలని చూస్తున్నది. జాబ్‌ కార్డు దారులు అడిగిన పదిహేను రోజుల్లో పని ఇవ్వడం, చేసిన పనికి వారం, వారం వేతనాలను కూలీలకు చెల్లించడం, గట్టి పనులు కాకుండా తేలికపాటి పనులు కల్పించి చట్ట ప్రకారం నిర్ణయించిన వేతనాలు కూలీలకు చెల్లించడం, తదితర పనులను ప్రభుత్వం చేయాలి. కానీ, కావాలనే కొలతలు పెట్టి కూలీలకు సరైన వేతనాలు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. మరోవైపు చేసిన పనికి సంబంధించిన వేతనాలను నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నది. ఇంకోవైపు రోజుకు కనీసం వంద కూలి కూడా పడకుండా చేస్తున్నది. కేంద్రం విడుదల చేసిన నిధులను హరితహారం, మిషన్‌ కాకతీయ, శ్మశాన వాటికల నిర్మాణం, గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, ఇంకుడు గుంతలు వంటి వాటికి మళ్లించింది. గతేడాది పని చేసిన కూలీలకు నేటికీ ప్రభుత్వం వేతనాలను పెండింగ్‌ పెట్టింది. ఉపాధి పనులకు పోతే పైసలు రావనే వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించింది. ఇప్పుడేమో పని దినాలను చూపలేదనే సాకు చూపెట్టి ఫీల్డ్‌ అసిస్టెంట్లను దోషులుగా చూపెట్టడం ఆందోళనకరం. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.10 వేల దాకా ఇవ్వాలనీ, అదే వీరిని తొలగించి సీనియర్‌ మేట్లకు ఆ పనిని అప్పగించి వారికి మూడు, నాలుగు వేల రూపాయలు ఇస్తే సరిపోతుందన్న ప్రభుత్వ కుట్ర దీని వెనుక ఉన్నదన్న ప్రచారం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ నిధులలో 49శాతం మెటీరియల్‌ కాంపోనేంట్‌ పేరుతో కాంట్రాక్టర్లకు బదిలీ చేస్తుంటే…మన ప్రభుత్వం విప్పటానికి సిద్ధపడట్లేదు. అంతిమంగా, పాలకుల విధానాలు ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపునకు కారణమవుతున్నాయి.

సర్క్యూలర్‌ నెంబర్‌ 4779ని వెంటనే రద్దు చేయాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్‌, ఆర్‌. వెంకట్రామలు
తక్షణమే ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగింపు కోసం తెచ్చిన సర్క్యూలర్‌ నెంబర్‌ 4779ని వెంటనే రద్దు చేయాలి. పరిపాలనా లోపాల సవరణకు తక్షణం చర్యలు తీసుకోవాలి. పట్టణాలలో పేదలకు ప్రత్యేకంగా పనుల కల్పనకు కేరళ ప్రభుత్వం మాదిరి రాష్ట్ర బడ్జెట్‌ లో ప్రత్యేక నిధులను మంజూరు చేయాలి. నిధుల మళ్లింపును ఆపి ఉపాధి కూలీలకు పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలి. విధానపరమైన లోపాలను సరిదిద్దుకోకుండా మొండిగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగిస్తామంటే చూస్తూ ఊరుకోబోం. ప్రభుత్వ తీరును ప్రజల్లో తీసుకెళ్లి ఎండగడతాం. ఫీల్డు అసిస్టెంట్ల ఉద్యోగ భద్రత కోసం పోరాడుతాం.

(Courtesy: NT)

RELATED ARTICLES

Latest Updates