ఆర్థికశాఖ అంతా కేసీఆర్ చేతుల్లోనే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– హరీశ్‌రావు లేకుండానే సమీక్షలు, సమావేశాలు
– ఉన్నతాధికారులూ నామమాత్రులే

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయలాంటిది ఆర్థికశాఖ. వివిధ శాఖలకు కేటాయింపులు, వాటి ఖర్చును ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం, అత్యవసర సమయాల్లో నిధులను విడుదల చేయటం, ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి.. అందుకను గుణంగా డబ్బును సర్దుబాటు చేయటం తదితరాంశాలు ఆ శాఖ కనుసన్నల్లోనే కొనసాగుతుంటాయి. ఇంతటి ముఖ్య మైన ఈ శాఖ క్రమక్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోయి.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆదేశానుసారమే పని చేస్తున్నదా..? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. వాస్తవ పరిస్థితులు కూడా ఇదే వాదనను రుజువు చేస్తున్నాయి. ఆర్థికశాఖకు ప్రత్యేక మంత్రి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయం లేకుండానే మిగతా వ్యవహాలన్నీ జరిగిపోతుండటం ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. నాలుగు న్నరేండ్ల సమయంలో ఆయన ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. కానీ ఆ కాలంలో ఈటల కేవలం నిమిత్తమాత్రుడిగానే మిగిలిపోయారు. ఒకానొక సమ యంలో బడ్జెట్‌ రూపకల్పనపై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తుండగా.. ఈటల మాత్రం కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాల్లో ఉండిపోయారు.

శాఖలకు నిధుల కేటాయింపులు, వాటిలో ఏయే అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి..? తదితరాంశాల్లో సీఎం ముద్రే కనిపించింది. గత డిసెంబరులో టీఆర్‌ఎస్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఆ వెంటనే పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయక పోవటంతో ఆర్థికశాఖ కొద్ది నెలలపాటు సీఎం వద్దనే ఉండిపోయింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా హరీశ్‌రావుకు ఆ శాఖను కేటాయించారు. అయితే సదరు శాఖకు మంత్రి మారినప్పటికీ… దాని పట్ల సీఎం వ్యవహరిస్తున్న తీరులో మార్పు రాలేదన్నది మాత్రం నిర్వివాదాంశం. హరీశ్‌ మంత్రి పదవి చేపట్టిన కొద్ది నెలలకే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఆ సందర్భంగా శాసనసభ లో ఆయనే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆరే.. శాసనసభలో బడ్జెట్‌పద్దును చదవి వినిపిం చారు. హరీశ్‌కు మండలిలో ఆ అవకాశం దక్కింది.

మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ రూపకల్పనకు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈనెల ఏడున ప్రగతి భవన్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ ఎస్‌కే జోషీతోపాటు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు అందు లో పాల్గొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ నిధులు విడుదల కాకపోవటం, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాను గణనీయంగా తగ్గించటంపై ముఖ్యమంత్రి కూలంకుషంగా చర్చించారు. ఈ క్రమంలో అన్ని శాఖలు పొదుపు చర్యలు పాటిస్తూ నిధులను సమాంతరంగా తగ్గించాలంటూ సూచిం చారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన ప్రధాని మోడీకి అదే రోజు లేఖ రాశారు. ఇలాంటి అంశాలన్నింటిపై తదుపరి నిర్వహించబోయే మంత్రివర్గ సమావేశం (ఈనెల 11న జరిగింది)లో సమగ్రమైన నోట్‌ను అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ఆర్థిక నియంత్రణను పాటించాలంటూ దిశా, నిర్దేశం చేశారు. అంతటి కీలకమైన సమావేశంలో హరీశ్‌ రావు పాల్గొనకపోవటం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్‌ ఆర్థికశాఖపై సమీక్ష చేయటంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు.. కానీ ఆ శాఖ మంత్రిని కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా..? అన్ని ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో విత్తశాఖ మంత్రిగా హరీశ్‌ ఇంతవరకూ ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశం నిర్వహించకపోవటం గమ నార్హం. ఖైరతాబాద్‌లోని అర్థగణాంకశాఖ సంచాల కుల కార్యాలయంలో ఆయన కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ.. అవి కేవలం ప్రణాళికాశాఖకే పరిమితమవుతున్నాయి తప్ప వాటిలో ఆర్థికశాఖకు చెందినవి ఒక్కటీ ఉండ టం లేదు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రధానమైన విత్తశాఖపై ఇప్పటికీ ముఖ్య మంత్రి అజమాయిషీయే కొనసాగుతున్నదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆర్థికశాఖకు చెందిన పలు విషయాలపై ఉన్నతాధికారులను వివరణ అడిగేందుకు ప్రయత్నిస్తే… ‘మా చేతుల్లో ఏం లేదు.. అంతా సీఎం గారే చూసుకుంటున్నారు. అందువల్ల మీ ప్రశ్నలు అక్కడే అడగండి…’ అంటూ వారు చేతులెత్తేస్తుం డటం గమనార్హం. మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ ప్రక్రియ ఊపందుకోనున్న తరుణంలో ‘గల్లా పెట్టె’పై సీఎం ముద్రే ఉంటుందా..? లేక ఆర్థికశాఖ మంత్రి ఆ పెట్టెను అందుకుంటారా? అన్నది వేచి చూడాలి.

Corutesy Nava telangana

RELATED ARTICLES

Latest Updates