స్వేచ్ఛకు సంకెళ్లు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– టీ-సర్కార్‌ చేతిలో డిజిటల్‌ ఫుట్‌ ప్రింట్స్‌ 
– ఫోన్లు, వాట్సాప్‌, ట్విట్టర్‌తో సహా వివరాలు, సందేశాల సేకరణ 
– సకలజనం కదలికపై రాష్ట్ర ప్రభుత్వ నిఘా 

హలో ఎక్కడున్నావ్‌…ఏం చేస్తున్నావ్‌..ఇలా మనం మొబైల్‌ మాట్లాడినా…వాట్సాప్‌..ట్విట్టర్‌తో సహా ఎవరితోనైనా టచ్‌లో ఉన్నా..మనపై నిఘా నేత్రాలు డేగ కన్నుల్లా పహారా కాయనున్నాయి. పౌరస్వేచ్ఛకు సంకెళ్లు వేయవద్దని ఇటీవల సుప్రీం కోర్టు హెచ్చరికలు చేసినా..పాలకులు బేఖాతరు చేయటానికి వెనకాడటంలేదు. తాజాగా తెలంగాణ సర్కార్‌ వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడానికి 360 డిగ్రీస్‌ తెలంగాణ సిటిజన్‌ ఐడెంటిఫికేషన్‌ డిటైల్స్‌(టీఎస్‌ఐడీ)ని తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీనిపై పౌరహక్కుల సంఘాలు ,మేధావి వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

రోడ్డుపై హెల్మెట్‌ లేకుండా వెళ్తే.. ఏవిధంగా సీసీకెమెరాల్లో చిక్కుకుంటున్నామో…అచ్చం అలానే మనకు తెలియకుండానే మనం వేసే ప్రతి అడుగూ రికార్డ్‌ కానున్నది. వ్యక్తులకు వ్యక్తిగత విషయాలు, అంశాలవేవి ఉండవు. ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా సర్కారుకు ఇట్టే తెలిసిపో తుంది. మొబైల్‌ ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు మనం ఏ ప్రక్రియ చేపట్టినా ప్రభుత్వం పసిగట్టను న్నది. సీక్రెట్‌ అనేది ఇక ఉండబోదు. అంతా నిఘా నేత్రాల్లో బతకాల్సిన రోజులు రాబోతున్నాయి. అంతిమంగా రాష్ట్ర ప్రజల స్వేచ్ఛకు సర్కారు సంకెళ్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం ”360 డిగ్రీస్‌ తెలంగాణ సిటిజన్‌ ఐడెంటిఫికేషన్‌ డిటైల్స్‌”(టీఎస్‌ఐడీ) విధానాన్ని తీసుకురానున్నది. ఈ దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన నిఘా ప్రయత్నాలను షురూ చేసింది. దీనికి అవసరమైన ఏర్పాట్లు, సన్నాహాలు చేసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో పది ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది.

”నో” సీక్రెట్‌ 
ప్రతి మనిషి గోప్యత(ప్రైవసీ) కోరుకుంటాడు. కానీ అటు కేంద్రం,ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రైవసీపై నిఘా పెట్టడానికి వెనుకాడటంలేదు. దీంతో సీక్రెట్‌ అనేదే ఉండదు. 360 డిగ్రీస్‌ ద్వారా సర్కారు ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. మొబైల్‌ ఫోన్‌ ద్వారా పంపే సందేశాలను కూడా సేకరిస్తుంది. ఫోన్‌లో ఎవరెవరితో సంభాషణలు జరిపామనే విషయాలనూ టీఎస్‌ఐడీతో టీసర్కార్‌కు ఈజీగా తెలిసిపోతుంది. ఈ వివరాల సేకరణ కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఒక ప్రత్యేక ఆల్గారిథమ్‌ను రూపొందించినట్టు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సదస్సులో బహిరంగంగానే ప్రకటించారు. ఆల్గారిథమ్‌ ద్వారా 95 శాతం వరకు వ్యక్తుల కదలికలను తెలుసుకుంటామని చెప్పడం గమనార్హం. ఇక దీంతో పాటు మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్ల నుంచి సమాచారం సేకరించేందుకు ప్రత్యేక ”యాప్‌”ను కూడా రూపొందించనున్నట్టు తెలిసింది.

సీఐడీలో వ్యక్తిగత విషయాలు 
తెలంగాణ సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబసమగ్రసర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించిన విషయం విదితమే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న సిటిజన్‌ ఐడీ విధానంలో రాష్ట్రంలోని ప్రతివ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలతో పాటు ఇంట్లో వినియోగించే వస్తువులు, వాహనాలు, రేషన్‌కార్డులు, కుటుంబ సభ్యుల వివరాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ కార్డుల వివరాలను పొందుపర్చనున్నారు. ఫలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు..అతను ఏం చేస్తున్నాడు..అనే వివరాలతో పాటు మరిన్ని విషయాలను కూడా వెంటనే పసిగట్టేందుకు 360 డిగ్రీస్‌ను రూపొందించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆధార్‌ కార్డు తరహాలో ఇక నుంచి అన్నింటికీ సీఐడీ కార్డును తప్పని సరి చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి చరిత్రను సీఐడీలో నిక్షిప్తం చేయనున్నది. ఆధార్‌ కార్డు ఉన్నా రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను లబ్ది పొందాలంటే సీఐడీ క్లియరెన్స్‌ తప్పని సరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఉన్న లబ్దిదారులను కోత పెట్టడంతో పాటు.. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేందుకే తెలంగాణ సర్కార్‌ 360 డిగ్రీస్‌ను రూపొందించిందన్న అభిప్రాయాలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమాన్ని మరిచి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని మరిచి వారి వ్యక్తగత విషయాలపై దృష్టి సారించిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గతంలో చేపట్టిన ”సమగ్ర కుటుంబ సర్వే”లోనే పౌరుల వివరాలను సేకరించింది. కానీ ఇప్పటికీ వాటి వివరాలను బయటపెట్టలేదు. మళ్లీ అదే తరహాలో ప్రజల ఫుట్‌ప్రింట్‌లను తీసుకోవడం వెనుక అంతరార్ధంపై చర్చనీయాంశమవుతున్నది. ప్రజల స్వేచ్ఛను హరించేలా 360 డిగ్రీస్‌ను తీసుకురావడం సమంజసం కాదని మేధావులు అంటున్నారు. ముందున్న సవాళ్లను పట్టించుకోకుండా ప్రజల వ్యక్తిగత విషయాల్లో సర్కారు తల దూర్చడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆధార్‌ కార్డుతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయనీ, మళ్లీ ఈ తరహా కార్డులు తేవడం వల్ల మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నవారు ఉన్నారు.

నేడు సీఎస్‌ సమీక్ష 
సిటిజన్‌ ఐడీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం సచివాలయం లో చర్చించనున్నారు. ముందుగా న్యాయ శాఖ, వ్యవసాయ శాఖ, ఐటీ లాంటి తదితర 10 శాఖలతో సమావేశమై సీఐడీపైన విస్తృతంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఐటీ శాఖ ఉన్నతాధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ సన్నద్ధమైనట్టు సమాచారం.

 

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates