-42 నుంచి 25శాతానికి తగ్గిన ప్రాతినిథ్యం
– వివక్ష, లైంగిక వేధింపులు, సామాజిక, సాంస్కృతిక అడ్డంకులే ప్రధాన కారణం
– పాలకులు కేవలం మాటలతో సరిపుచ్చుతున్నారు : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారతదేశంలో మహిళలు అన్నిరంగాల్లో ముందుకెళ్త న్నారని…అనటంలో సందేహం లేదు. వివిధ రంగాల్లో వారు స్ఫూర్తిదాయకమైన పాత్రను పోషిస్తున్నారు. సామాజిక, సాంస్కృతిక అడ్డంకులు, లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు. పురుషులతో పోల్చితే తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నేడు కార్మికశక్తిలో మహిళల ప్రాతినిథ్యం క్రమంగా పడిపోతున్నదని, 42శాతం నుంచి 25శాతానికి(2017-18) తగ్గిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే కార్మికశక్తిలో మహిళల వాటా పెరగాల్సిన అవసరముందన్నారు. ఆదివారం ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ సందర్భంగా పాలకులు కేవలం మాటలతో సరిపుచ్చితే ఫలితం ఉండదని, ప్రభుత్వపరంగా మహిళల కోసం ఏం చేయాలో పాలకులు ఆలోచించాలని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆర్థిక సర్వే చెప్పింది..
గత కొన్నేండ్లుగా ఉపాధి, ఉద్యోగ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నది. దేశ జనాభాలో సగం మంది ఉన్న మహిళలు కార్మికశక్తిలో వారి వాటా కేవలం 25.3శాతమే (2017-18). ఎక్కడా కూడా మహిళలకు ప్రోత్సాహకరమైన వాతావరణం లేనందు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. 2011-12లో మహిళల ప్రాతినిథ్యం 42శాతముంటే…2017-18నాటికి 25.3శాతానికి తగ్గింది. వివిధరంగాల్లో మహిళల పట్ల వివక్ష పెరిగిందేగానీ తగ్గలేదు. ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2019-20 ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
ఎందువల్ల తగ్గింది?
గతంతో పోల్చితే మహిళలకు ఉన్నతవిద్యా అవకాశాలు మెరుగుపడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పడిపోవటం, సాంస్కృతిక, సామాజిక అడ్డంకులు తీవ్రంగా ఉన్నాయి. ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ అంతా కూడా మహిళలపై పడటం కూడా వారిని కార్మికశక్తి నుంచి దూరం చేస్తున్నది. చాలా చోట్ల పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు అందటం లేదు. ఉపాధి అవకాశాలు కూడా తక్కువే. తయారీరంగంలో ఏర్పడుతున్న ఉపాధి అవకాశాలు మహిళలకు అందటం లేదు.
ఉపాధి హామీ చట్టం అమలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించవచ్చు. పీఎం ఉపాధి కల్పన, కుటీర పరిశ్రమలు నెలకొల్పేలా ఆర్థికసాయం, ప్రత్యేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, బాలికా విద్య…మొదలైనవి ప్రభుత్వం మాత్రమే చేయ గలిగేవి. అయితే వీటిపై గతకొన్నేండ్లుగా ప్రభుత్వా లు దృష్టిపెట్టడం లేదు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అడ్డుకోవాలి. సామాజికంగా, సాంస్కృతి కపరంగా సంస్కరణలకు బాటలు వేయటం ద్వారా మహిళలకు సానుకూల వాతావరణం తీసుకురావొచ్చునని నిపుణులు తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టడానికి, మహిళలు సామాజిక స్థితిగతులు మెరుగుపడటానికి ముఖ్యమైన సాధనం ‘కార్మికశక్తిలో మహిళల వాటా’ను పెంచటమేనని నిపుణులు సూచిస్తున్నారు. లింగ అసమానతలు తగ్గటం వల్ల ప్రపంచ వార్షిక జీడీపీ అదనంగా 12 ట్రలియన్ డాలర్లు (సుమారుగా రూ.888 లక్షల కోట్లు) పెరుగుతుందని ‘మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్’ అంచనా వేసింది. భారత ఆర్థికవ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లుగా(రూ.370లక్షల కోట్లు) ఆవిర్భవించటం పెద్ద సమస్య కాదని నివేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు.
- కష్టపడి పనిచేసే శక్తి ఉన్న 15-29ఏండ్ల మధ్య ఉన్న మహిళల్లో 52.3శాతం ఇంటికి సంబంధించిన పనుల్లో నిమగమయ్యారు. గత రెండు దశాబ్దాలుగా వీరి సంఖ్య పెరుగుతోంది.
- 15-59ఏండ్ల మధ్య గల మహిళల్లో 60శాతం మంది పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఇది పురుషుల్లో ఒకశాతంగా ఉంది.
- మహిళల ప్రాతినిథ్యం పదేండ్లలో 42శాతం నుంచి 25శాతానికి క్షీణించిందని, పాలకుల విధానాలే ఇందుకు కారణమని జాతీయ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం పేర్కొన్నది.
Courtesy: NT