చంఢగీఢ్ : బేటీ బచావో, బేటీ పడావో.. మహిళల భద్రత అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే బీజేపీ నాయకుల మాటలు నీటిపై రాతలే అని మరోసారి రుజువైంది. యూపీలో ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ లైంగికదాడి అంశం మరవకరముందే ఉత్తరఖండ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగికదాడి ఆరోపణలు చేసింది.
ద్వారహత్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్ నేగి.. తనపై 2016 నుంచి 2018 వరకు పలుసార్లు లైంగికదాడి చేశాడని వివాహిత అయిన సదరు బాధితురాలు తెలిపింది. ఈ మేరకు నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై లైంగికదాడి ఆరోపణలు చేస్తూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నదని రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఆ రెండేండ్లలో ఎమ్మెల్యే తనతో కలిసి ముస్సోరీ, నైనితాల్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, నేపాల్‌తో పాటు అనేక ప్రదేశాలను తిప్పాడనీ, ఈ క్రమంలో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని సదరు మహిళ ఫిర్యాదులో వివరించింది. తనకు కలిగిన సంతానానికి తండ్రి మహేశ్ నేగి అనీ, కావాలంటే డీఎన్ఏ టెస్టు నిర్వహిస్తే అసలు నిజం బయటపడుతుందని పేర్కొన్నది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించడానికి మహేశ్ నేగి ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే తనకు న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గేది లేదనీ బాధితురాలు తెలిపింది.
Courtesy Nava telangana