న్యాయస్థానం ముందు నిలబడుతుందా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఆర్టికల్‌ 370తో ఆర్టికల్‌ 370 వేటు కరెక్టేనా?

– మోడీ సర్కార్‌ అనుసరించిన వివాదాస్పద ప్రక్రియపై సందేహాలు
– ఆర్టికల్‌ రద్దు కాలేదు…నిర్వీర్యం చేశారు: రాజ్యాంగ నిపుణులు
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’పై మోడీ సర్కార్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్‌ను రద్దు చేశారనీ, ఆర్టికల్‌ను రద్దు చేసే అవకాశం లేదనీ, ఆర్టికల్‌ను సవరి చారనీ…ఇలా అనేక మాటలు సోమవారమంతా వినబడ్డాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో మాట్లాడిన మాటలకు, రాష్ట్రపతి గెజిట్‌కు తేడా ఉండటమూ రాజ్యాంగ, న్యాయ నిపుణులను సైతం గందరగోళానికి గురిచేసింది. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర విభజన తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెడుతూ, ‘ఆర్టికల్‌ 370 రద్దు’ చేస్తున్నామని అమిత్‌ షా ప్రకటించారు. అయితే ఇది రద్దు కాదు, ఆర్టికల్‌ను నిర్వీర్యం చేయటమని నిపుణులు చెబుతున్నారు.
దొడ్దిదారిలో వెళ్లారు!
ఆర్టికల్‌ 370ని రద్దుచేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి లేదా మార్చాలి. అప్పుడు ఆర్టికల్‌ 368 ద్వారా వెళ్లాలి. అలా వెళ్లాలంటే, రెండింట మూడొంతుల మెజార్టీతో పార్లమెంట్‌లోని ఇరు సభలు ఆమోదం తెలిపితేనే రాజ్యాంగ సవరణ సాధ్యం. అయితే మోడీ సర్కార్‌ ఈ మార్గంలో వెళ్లలేదు. ఆర్టికల్‌ 370లోని క్లాజ్‌ (3)ని మోడీ సర్కార్‌ వాడుకుంది. గతంలో కాంగ్రెస్‌ ఇలాగే వాడి ఆర్టికల్‌ 35ఏ, బీ తీసుకొచ్చింది, తామూ అలాగే దొడ్డిదారిన దెబ్బకొట్టామని స్వయంగా అమిత్‌ షా అసలు విషయం బయటపెట్టారు. అంటే ఆర్టికల్‌ రద్దు కాదు, నిర్వీర్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్‌ను నిర్వీర్యం చేశామన్న సంగతి ఆలస్యంగా చెప్పారు. ఇక్కడ కూడా ఒక చిక్కుంది. ఇది కూడా న్యాయ సమీక్షకు అవకాశం కల్పిస్తోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం సిఫారసు చేసినప్పుడు మాత్రమే ఆర్టికల్‌ 370లోని క్లాజ్‌(3)ని రాష్ట్రపతి వినియోగించగలరని నిపుణులు అంటున్నారు.
ఆర్టికల్‌ 370 రద్దు చేయలేరు!
రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జమ్మూకాశ్మీర్‌కు లభించిన స్వతంత్ర ప్రతిపత్తిని కేంద్రం దెబ్బతీసింది. ఇందుకోసం ఆర్టికల్‌ 370లోని క్లాజ్‌ (3)ను వాడుకున్నారు. దీనికంటే ముందు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 367ను సవరించారు. దీనిని అడ్డుపెట్టుకొని ఆర్టికల్‌ 370 క్లాజ్‌ (3)లోని కొన్ని పదాల్ని కేంద్రం మార్చింది. ‘రాజ్యాంగ అసెంబ్లీ’ అనేదానికి బదులుగా ‘రాష్ట్ర అసెంబ్లీ’గా భావించాలని చెప్పింది. ఇలా రాజ్యాంగాన్ని మార్చేందుకు రాష్ట్రపతికి సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయి. కాదని ఎవరూ అనటం లేదు. ఈ మార్పులు చేయాలన్నా, జమ్మూకాశ్మీర్‌ రాజ్యాంగ అసెంబ్లీ ‘సిఫారసు’ చేయాలి. అది 1957లోనే రద్దైంది. కాబట్టి ఇక్కడ సిఫారసు చేసే అర్హత జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి ఉంటుందన్నది న్యాయ నిపుణుల మాట.
ఎవరు సిఫారసు చేశారు?
ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వంగానీ, అసెంబ్లీగానీ లేదు. రాష్ట్రపతి పాలన నడుస్తోంది. కాబట్టి సిఫారసు లేదా అమోదం అన్నది పార్లమెంట్‌కు దఖలు పడుతుందని మోడీ సర్కార్‌ చెబుతోంది. జమ్మూకాశ్మీర్‌ చీఫ్‌ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం సిఫారసు చేశారన్న మాట కూడా వినిపిస్తోంది.
ఇది సుప్రీంకోర్టులో నిలబడుతుందా ? అన్నది అనుమానమే. ఇంకో విషయం, ఆర్టికల్‌ రద్దుకుగానీ, రాష్ట్ర విభజనకుగానీ ఎక్కడ్నుంచీ సిఫారసు రాలేదు…అన్నది మొదటి అభ్యంతరం. రెండోది…ఆర్టికల్‌ 370తో ఆర్టికల్‌ 370ని మార్చడాన్ని న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో నిలబడే అంశం కాదని వారు అంటున్నారు. ఆర్టికల్‌ 370 తాత్కాలికం కాదని స్వయంగా సుప్రీంకోర్టు 2016లో చెప్పింది. రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీ సిఫారసు చేసే వరకు అది ‘పర్మినెంటే’ అని చెప్పింది. మరి జమ్మూకాశ్మీర్‌లోని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి అలాంటి సిపారసు రానప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్‌ 370 క్లాజ్‌(3) ద్వారా ఉత్తర్వులు ఎలా ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
నన్ను చంపేందుకు కుట్ర : ఫరూక్‌ అబ్దుల్లా
శ్రీనగర్‌: తమను చంపేందుకు కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా కుట్ర పన్నుతున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ప్రజాస్వామ్య, లౌకిక దేశమనీ.. జమ్మూకాశ్మీర్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని అన్నారు. శ్రీనగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో ఉద్వేగంతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌ ప్రజలను జైలుకు తరలిస్తున్నారనీ, తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ‘మేం ఆందోళనకారులమో.. విధ్వంసకారులమో కాదు. జమ్మూకాశ్మీర్‌ సమస్య శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. నన్ను నిర్బంధించారు. నా కొడుకు ఒమర్‌ అబ్దుల్లాను జైళ్లోపెట్టారు. మెహబూబా ముఫ్తీతో పాటు పలువురు కాశ్మీరీ నాయకులను నిర్బంధించారు. ప్రజలను జైళ్లోకి నెడుతున్నారు. మమ్మల్ని చంపడానికే ఈ కుట్ర పన్నుతున్నారు. గహనిర్బంధం నుంచి బయటకు రాగానే న్యాయపోరాటం చేస్తా” అని ఫరూక్‌ చెప్పారు.
ఆర్టికల్‌ 370కి సంబంధించి మరో సమస్య కూడా ఉంది. ఈ ఆర్టికల్‌ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమా? కాదా? అన్నది సుప్రీంకోర్టే తేల్చాలి. ఒకవేళ ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైతే…మోడీ సర్కార్‌ ఇప్పుడు చేసిన రద్దు చెల్లదు. ఎందుకంటే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో మార్పుకు అంగీకరించమని అనేక సందర్భాల్లో సుప్రీం స్పష్టంచేసింది.

Courtesy navatelangana

RELATED ARTICLES

Latest Updates