
ఈ మధ్య కొంత మంది మిత్రులు డీక్లాస్, డీక్యాస్ట్ కావడం అంటే ఏమిటని అడుగుతున్నారు. ఈ అంశాలు చర్చకు కూడా ఉపయోగమని భావించి నాకు తోచిన విషయాలు చెపుతున్నాను.
డీక్లాస్,డీక్యాస్ట్ గురించి తెలుసుకునే ముందు …..
డీక్లాసంటే వర్గరహితంగా ఆలోచించడం,ఆచరించడం.వర్గరహితసమాజంకై పోరాడటం. అదే విధంగా డీ క్యాస్టంటే కులరహితంగాఆలోచించడం,ఆచరించడం,కురహితసమాజం కై పోరాడటం. ఈ దేశంలో వర్గముందని వామపక్షాలన్ని గుర్తించడం , దాని నాసరా చేసుకొని విశ్లేషణ చేయడం జరిగింది.
కాబట్టి డీక్లాస్ గురించి ఇక్కడ పెద్ద గా చర్చించాల్సిన అవసరంలేదు. వర్గంతో పాటు కులం వుందని గుర్తించడం చాలా వామపక్షాలు చేయలేదు.కొందరు గుర్తించినట్లు చెపుతున్నారు. కాని అలా ఉందని గుర్తిస్తేనే సరిపోదు,అవి వుండటానికి కారణాలు విశ్లేషించాలి. వాటిని పోగొట్టడానికి స్పష్టమైన కార్యాచరణ వుండాలి. వాటికెతిరేకంగా నిరంతర పోరాటముండాలి.
దేశంలో సిపియం, లిబరేషన్,యంసిపిఐ(u) లాంటి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు వర్గసమస్య తో పాటు కులసమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రయత్నిస్తున్నాయి.కులరహిత-వర్గ రహిత సమాజం లక్ష్యంగా ప్రకటించుకున్నాయి. పై మూడు పార్టీలతో పాటు ఇంకా ఇతర అనేక సంస్తలలో ఆంతరంగిక చర్చలు జరుగుతున్నాయి , మన దేశ ప్రగతి శీల వుద్యమంలో ఇది నేడు చాలా ముఖ్యమైన డిబేటుగా వుంది.
వామపక్ష పార్టీలలో డీక్లాస్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా వుండే అవకాశం వుంది. కాని డీక్యాస్ట్ అయ్యే వారు చాల స్వల్పంగా మాత్రమే వుంటున్నారు.కారణం డీ క్యాస్ట్ పై ఒక అవగాహన లేకపోవడమే.
ఆధిపత్య కుల నేపద్యం నుండి వచ్చిన వారికి సామాజిక అణచివేత తీవ్రత అర్థంకాదు . కాబట్టి నాయకత్వ స్థానాలలో వున్న వారు అర్థం చేసుకోవడం కష్టమవుతుందని, ఈబలహీనత నుండి బయట పడటానికి తీవ్ర కృషి చేయాల్సి వుందని సిపియం విశాఖ మహాసభల్లోను కలకత్తా ప్లీనం లోను నిజాయితిగా, నిఖార్సుగా ఆత్మ విమర్శ చేసుకొన్నది.
దాని నుండి బయటపడటానికి తీవ్ర కృషిచేస్తుంది. “సాంస్కృతికరంగంలో కర్తవ్యాలు” అనే విప్లవాత్మక మైన డాక్యుమెంట్ లో ప్రకటించారు. అందులో అనేక ఆచరణాత్మక కార్యక్రమాలు నిర్దేశించారు.. ఆర్థిక పోరాటాలు కామ్రేడ్ల ను డీక్లాస్ కావడానికి తర్పీదునిస్తుంది. ఆర్థికేతర వర్గపోరాటాలైన ,సామాజిక,సాంస్కృతిక, సైద్ధాంతిక రంగాల్లో పోరాటాలు డీ క్యాస్ట్ కావడానికి తోడ్పడుతాయని బావిస్తుంది సిపియం.
అందుకే మనువాద ప్రమాదాన్ని ఎలుగెత్తి చాటుతుంది. మనువాదానికెతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ పోరాటం లో ముందుకు పోయిన కొద్ది డీ క్యాస్ట్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుంది.
డీ క్యాస్ట్ కావాలనుకొనే వారికి ముందు కుల వివక్ష , అంటరానితనం సమాజంలో వుందని అర్థం కావాలి. అది అనుభవించేవారు ఎంత క్షోభ పడతారో అర్థంకావాలి. వారికి ఆధిపత్యకుల వ్యవస్థంటే ఎంత వ్యతిరేకతుంటుదో , ఎందుకుంటుందో అర్థంకావాలి.
సమాజం లో రోజురోజుకి చదువు పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. మద్యతరగతి పెరుగుతుంది. ఈమద్యతరగతి లో ఎస్సీ ,ఎస్టీ, బీసీలే అత్యధికమనేది గమనంలో వుండాలి.
పేదరికం తగ్గిన కొద్ది, ఆర్దికవెసులుబాటు కలిగిన కొద్ది, ఆత్మగౌరవ సమస్య మరింత ముందుకు రావడం సహజమనేది కూడా గమనం లో వుండాలి.
సామాజిక అణచివేతకు గురైన వారు కులసమస్యపై గట్టిగా పోరాడాలని ఎందుకంటారో అర్థమవుద్ది.
కులసమస్య పై పోరాడే వారినే కుల వాది అంటే భాద, ఆవేదన, కోపం ఎలా వస్తుందో,ఎందుకొస్తుందో అప్పుడర్థమవుద్ది.
డీక్యాస్ట్ ఎందుకు కావాలో, కాకుంటే మనమెంత అపరిపక్వమో,అసంపూర్ణమో అప్పుడు మాత్రమే అర్థమవుద్ది.
చీకటిలో ఉండి చీకటిలోవుండే దృశ్యాల కొన్నిటినైనా చూడగలం. వెలుతురులో వున్నవాటిని మాత్రం స్పష్టంగా చూడగలం. కాని వెలుతురులో వున్నవాడు చీకటిలో వున్న వాటిని ఏమాత్రం చూడలేడు.వెలుతూరులో వున్నవి మాత్రమే చూడగలడు.
కుల అవమానాల అనుభవమున్న వానికి కుల గౌరవాల మదురానుభూతులు అట్టే తెలుస్తాయి. కాని కుల అవమానాలంటే తెలియనివారికి కుల అణచివేత , కుల వివక్ష , అంటరానితనంతో పడే బాధ అర్థం కాదు.జీవితంలో కుల వివక్ష కు కనీసం ఒక్కసారైనా గురై వుంటే ఆలోచనలోనే మార్పు వుండే అవకాశముంది.తనకు కులం సమస్య లేకపోతే ఎవరికి సమస్య లేదనుకుంటారు. పైగా కుల మింకెక్కడ వుందనే అజ్ఞానంతో వాదనలు పెడుతారు. తాము పుట్టుకతోనే కుల రహితంగా, కుల అస్థిత్వం లేకుండా పుట్టామనే భ్రమల్లో వుంటారు. వారికి భారతీయ సమాజం అర్థం కావడమసాద్యం.
ఎవరో కొందరు డీ క్లాస్,డీ క్యాస్ట్ అయిన అరుదయిన మహనీయులనడ్డం పెట్టుకొని వారి చాటున దాటిపోవాలనుకుంటారు. కమ్యూనిష్టు పార్టీ లకు చెందిన ముఖ్య నాయకులంతా కుల సమస్య, సామాజిక అంశం తీసుకొని గొప్ప ప్రజానాయకులుగా ఎదిగిన వారే.
కుల సమస్య తీవ్రంగా వుందని బాధ పడే వాళ్లు, ఆవేదన పడే వాళ్లు,రాసే వాళ్లు 99% అణగారిన కులాలవాళ్లే ఎందుకుంటున్నారు?
ఇలాంటి వారిని కులవాదులు, అస్థిత్వ వాదులని ముద్రలు వేసే వారంతా దాదాపు అగ్రకులాల నుండే ఎందుకుంటున్నారో అర్థమయితే భారతీయ సమాజం అర్థంకావడం గాని ,డీక్యాస్టంటే అంటే ఏమిటో అర్థంకావడం గాని మరింత సులువవుద్ది.
గమనిక : ఏమైనా సందేహాలు ఉంటే మిత్రులు చర్చించగలరు.
ఈ అంశం ఆధిపత్య కులాలకు చెందిన అభ్యుదయ వాదులకు మరింత అర్థంకావాలంటే చిన్న చిట్కా పాటించంచండి.
మిమ్మల్ని ఏ మాత్రం గుర్తుపట్టని ఏదైనా మారుమూల గ్రామానికెళ్లండి.
ఒక దళితునికి బంధువునని చెప్పి ఊళ్లో అగ్రకుల నివాసాల మధ్య తిరగండి. అప్పుడు మీకు కులమంటే ఏమిటో అర్థమవుద్ది.