ప్రాంతాన్ని కలిపారు, ప్రజల సంగతేమిటి?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 ప్రొ. జి. హరగోపాల్‌

కశ్మీర్‌ కుండే సుసంపన్నమైన సంస్కృతి భారతదేశం లాంటి వైవిధ్యభరిత దేశాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. అంత విశిష్ట సంస్కృతి గల ప్రాంతంపై టెర్రరిస్టుల పేరు చెప్పి బల ప్రయోగం ఉపయోగిస్తే దాని దీర్ఘకాల పర్యవసానమేమిటో ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా? లేక సైనిక బలం ఉంది కదా అని తొందరపడ్డారా?

చరిత్రలో ఒక సంఘటన జరుగుతున్నప్పుడు, దానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, దాని దీర్ఘకాల పరిణామాలని, పర్యవసానాన్ని సరిగ్గా అంచనా వేసే శక్తి పాలకులకు కాని, ప్రజలకు కాని ఉంటే మానవ చరిత్ర చాలా భిన్నంగా ఉండేది. నోబెల్‌ బహుమతి గ్రహీత హర్‌బర్ట్ సైమన్‌ ఈ అంశాన్ని విశ్లేషిస్తూ, ఈ శక్తి పరిమితంగా ఉండడంవల్లే మానవ హేతువు నిరంతరంగా కొన్ని పరిమితులలో పని చేస్తుంది అంటాడు. పరిణామాలని, పర్యవసానాన్ని అంచనా వేసే శక్తి చరిత్రకారులకు, చరిత్ర అధ్యయనం చేసిన వారికి కొంత ఎక్కువ పాళ్ళల్లో ఉండే అవకాశం ఉంది. జవహర్‌లాల్‌ నెహ్రూ మీద ఎంత తీవ్ర విమర్శలు పెట్టినా ఆయన ఒక చరిత్ర అధ్యయనం చేసిన వాడని గుర్తుంచుకోవాలి. భారతదేశ వైవిధ్యాన్ని తన రచనల్లో నిరంతరం చర్చిస్తూ ఇంత వైవిధ్యపూరిత దేశంలో ప్రజాస్వామ్య పాలన, సెక్యులరిజం, సమాఖ్యరాజ్యం అవసరమని అంటూ తనలో నియంత లక్షణాలున్నవని దాన్ని సరిదిద్దకపోతే ప్రమాదకరమని తానే స్వయాన దేశ ప్రజలను, కాంగ్రెస్‌ పార్టీని హెచ్చరించాడు. తమను తాము దైవాంశ సంభూతులుగా భావించే నాయకులున్న కాలంలో తమ లోతులని, లోపాలని చూపుకొనడం ఎంతమందికి సాధ్యం? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన చాలాదేశాల్లో ఉదార ప్రజా స్వామ్య వ్యవస్థ ఎక్కువ కాలం మనలేక పోయింది. దేశం తర్వాత దేశం కూలి పోవడమో, నియంతృత్వ వ్యవస్థలోకి జారుకొనడమో సైనిక పాలనలోకి నెట్టడమో జరిగింది. మన దేశంలో కనీసం ఏడు దశాబ్దాలుగా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ (ఎంత పరిమితిలోనైనా) బ్రతికింది.

స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశం ఒక జాతి రాజ్యం కాదని, ఈ జాతి రాజ్యానికి కేవలం ఏడు దశాబ్దాల వయసే అన్నది గుర్తించుకోవాలి. అంతకు ముందు భిన్న రాజులు, రాజ్యాలు, ప్రెసిడెన్సీలు, భిన్న పాలనా రీతులు ఉండేవి. దాదాపు 560 రాచరిక వ్యవస్థలను (ప్రిన్స్‌లీస్టేట్స్) జాతి రాజ్యంలో కలపడంలో సర్దార్‌ పటేల్‌ పాత్రని వి.పి. మీనన్‌ తన ‘ఇంటిగ్రేషన్‌ ఆప్‌ ఇండియన్‌ స్టేట్స్’ పుస్తకంలో చాలా వివరంగా వివరించారు. అయితే ఈ మొత్తం ప్రక్రియలో నెహ్రూకు గాని, కాంగ్రెస్‌ పార్టీ పాత్రకి తగిన గుర్తింపు ఇవ్వాలి. అప్పటి ప్రధానమంత్రి, అలాగే కాంగ్రెస్‌ పూర్తి మద్దతు లేకుండా పటేల్‌కు వ్యక్తిగతంగా అది సాధ్యమయ్యేది కాదు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతి అవలంబించి చాలా జాగ్రత్తగా, ఏ ప్రతిఘటన లేకుండా ఇది సాధించగలిగారు. ఇక కశ్మీర్‌, జునాగఢ్‌, హైదరాబాద్‌ రాష్ట్రాలలో చిక్కు సమస్యలను ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని కలుపుకోవడానికి సైన్యాన్నే పంపారు. ఒక్క కశ్మీరే ఎడతెగని అత్యంత క్లిష్ట సమస్యగా మారింది.

ముస్లిం జనాభా అధిక సంఖ్యలో ఉన్న పంజాబ్‌ అలాగే బెంగాల్‌ ప్రాంతాలతో పాకిస్తాన్‌ ఒక ఇస్లామిక్‌ రాజ్యంగా వెలసింది. కశ్మీర్‌ లోయలో 97 శాతం ప్రజలు ముస్లింలు. జనాభా మతమే ప్రధానమైతే కశ్మీర్‌ పాకిస్థాన్‌లో భాగం కావాలి. కానీ రాజు హరి సింగ్‌ అలాగే షేక్‌ అబ్దుల్లా భిన్న కారణాల వల్ల భారతదేశంలో చేరడానికి మొగ్గు చూపారు. రాజు హరిసింగ్‌ భారత దేశంతో ఒప్పందం చేసుకుంటున్న క్రమంలో పాకిస్థాన్‌ సైన్యం ప్రేరేపణతో కొన్ని ట్రైబల్‌ ముఠాలు కశ్మీర్‌ను ఆక్రమిస్తూ రావడం కశ్మీర్‌ చరిత్రను ఒక మలుపు తిప్పింది. ఈ ఆక్రమణ వల్ల సమస్య ఐక్యరాజ్య సమితికి పోవడంతో అంతర్జాతీయమైపోయింది. హరిసింగ్‌ ఐనా, షేక్‌ అబ్దుల్లా ఐనా భారతదేశంలో కలవడానికి అది కేవలం వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు కావు, లేదా ఏదో నెహ్రూ ‘లోపాయకారి’ ఒప్పందం అనే తప్పుడు ప్రచారాలు వాస్తవాలు కావు. పాకిస్థాన్‌ తనకు తాను ఇస్లామిక్‌ దేశంగా లేదా మత రాజ్యంగా ప్రకటించుకోవడం, భారత దేశం తనను లౌకిక రాజ్యంగా ప్రకటించుకోవడంతో విశిష్ట నాగరికత (కశ్మీరియత్‌) గల కశ్మీర్‌ ప్రజలు ఇస్లాం మతస్థులైనా భారత్‌ను కోరుకున్నారు. కశ్మీర్‌లోని ఇస్లాం అది ఇతర ముస్లింల జీవన విధానంగా ఉండదు. కశ్మీర్‌ ఇస్లాం వేదాంతం, బౌద్ధం, సూఫీ సంస్కృతులతో సమ్మిళితమైంది. కశ్మీర్‌లో నమాజ్‌ చేసే పద్ధతి నుండి ముల్లాను రుషి అనే దాకా ఆ వైవిధ్యం కనిపిస్తుంది.

కశ్మీర్‌ పండితులకి అక్కడి ఇతర కశ్మీరీల మధ్య స్నేహ సంబంధాలు చాలా ముచ్చటగా ఉండేవి. ఆ విశిష్ట సంస్కృతి వల్లే కశ్మీర్‌ చరిత్రలో మత ఘర్షణలు లేవు. చాలా మంది పండితుల కుటుంబాలు దర్గాలను దర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. నిజానికి దర్గా హిందూ, ముస్లింల సహజీవనానికి ఒక పెద్ద నిదర్శనం. ఒక విశిష్ట సంస్కృతి వల్ల వాళ్లు ఎమోషనల్‌గా భారత లౌకిక వ్యవస్థ వైపు మొగ్గు చూపి తమ సాంస్కృతిక అస్తిత్వం, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కాపాడబడతాయని భావించడం వల్లే, రాజు హరి సింగ్‌ పెట్టిన కొన్ని షరతులతో కూడిన ఒప్పంద ఫలితమే ఆర్టికల్‌ 370, ఆ తర్వాత వచ్చిన 35ఏ. నిజానికి 35ఏ ఒక్క కశ్మీర్‌లోనే కాదు. ఈశాన్య భారతంలోని భిన్న రాష్ట్రాల్లో ఈ రక్షణ ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికి మనందరికీ ‘ఇన్నర్‌ లైన్‌’ పర్మిట్‌ కావాలి. కశ్మీర్‌ లాంటి క్లిష్ట సమస్యే నాగాలాండ్‌. ఈ ప్రాంతం భారత దేశంలో చేరడానికి ఏ మాత్రం సుముఖంగా లేదు. భారతదేశం తమను బలవంతంగా తనలో కలుపుకో చూస్తున్నదని నాగా నాయకులు మహాత్మాగాంధీకి చెబితే గాంధీ ‘నేను మీ వాడిని అనుకుంటున్నాను, అలాగే మీరూ నా వాళ్ళు అనుకుంటున్నాను. ఇది మీకు అంగీకారం కాకపోతే మీ స్వేచ్ఛ కొరకు నేనే పోరాడుతాను’ అని గాంధీ అన్నాడని నాగాలాండ్‌లో చిన్నపిల్లలు కూడా చెబుతుంటారు. అంటే కొన్ని ప్రాంతాలు అప్పుడే జాతి రాజ్యంగా రూపుదిద్దుకుంటున్న భారత దేశంలో భాగం కావటానికి అప్పటి నాయకత్వం చాలా అవరోధాలను ఎదుర్కొన్నది. వాటిని భిన్న పద్ధతుల ద్వారా, నయానా, భయానా భారత దేశంలో భాగం చేశారు. అంతెందుకు 1956 పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ భూములను బయటివారు కొనడానికి వీలు లేదని దానికి తెలంగాణ రీజనల్‌ కమిటీ అనుమతి కావాలనే షరతు ఉంది. దాన్ని ఉల్లంఘించడం వల్ల జరిగిన పర్యవసానమేమిటో మనం తెలంగాణ ఉద్యమంలో చూశాం. ఇవ్వాళ తమకు తోచినట్లుగా మాట్లాడుతున్నవారు అప్పటి చారిత్రక సందర్భాలని విస్మరించి మాట్లాడుతున్నారు.

ఒక జాతి రాజ్య నిర్మాణానికి భిన్న మార్గాలుంటాయి. ఆ మార్గాలు ఆ దేశ చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా భిన్న రాజకీయ వ్యవస్థలు, విభిన్న రాజ్యాంగాలున్నాయి. తమ చరిత్రకు తమ సంస్కృతికి అనుగుణంగా నిర్మితమై, ఆ దేశానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టమైన ప్రజాస్వామ్య దృష్టి ఉంటే ఆ దేశాలు నిలబడతాయి. అమెరికా సివిల్‌ వార్‌ తర్వాత రూపొందించుకున్న వ్యవస్థ బలమైన సమాఖ్య రాజ్యం. అమెరికాలో రెండు పౌరసత్వాలు, రెండు రాజ్యాంగాలు, రెండు న్యాయ వ్యవస్థలు, భిన్న క్రిమినల్‌ చట్టాలున్నాయి. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఏమిటో అనేవారు అమెరికా పాలనా వ్యవస్థను పరిశీలించాలి. అమెరికా నిలబడింది. అదే సోవియట్‌ యూనియన్‌ రాజ్యాంగం అమెరికా కంటే పటిష్ఠమైన సమాఖ్య వ్యవస్థను అంగీకరిస్తూ సోవియట్‌లు ఎప్పుడైనా దేశం నుండి బయటకు పోవచ్చు అని రాజ్యాంగంలో రాసుకున్నారు. భావజాల పరంగా సోషలిస్టు వ్యవస్థ కోరుకున్నా, కేంద్ర నియంతృత్వం పెరగడంతో, పౌరుల స్వేచ్ఛమీద విపరీతమైన పరిమితులు పెట్టడంతో, అంత బలమైన దేశం, ప్రపంచంలో అమెరికాతో పోల్చగలిగిన సైన్యం ఉన్నా, మన కళ్ళ ముందే నిలువునా కూలిపోయింది. సైన్యాలు దేశ సమగ్రతను కాపాడుతాయనుకుంటే సోవియట్‌ అనుభవం నుండి పాఠాలు నేర్చుకోవాలి. మతాలు దేశ సమగ్రతకు దారి తీస్తాయన్నది ఎవరైనా నమ్మితే మనలో నుంచి విడిపోయిన పాకిస్థాన్‌ మతరాజ్యంగా ఆవిర్భవించి రెండు ముక్కలైంది. మతం దేశాలను ఎలా విడదీస్తుందో ఎంత రక్తపాతానికి దారితీస్తుందో ఇస్లామిక్‌ దేశాలు చూస్తే అర్థం కావడం లేదా? కెనడా అంత సువిశాల దేశంలో క్యూబెక్‌ ప్రాంతం తాను విస్మరణకు గురయ్యానని ప్లెబిసైట్‌ (ప్రజాభిప్రాయ సేకరణ) కోరుకుంటే, ఇంతవరకు రెండు పర్యాయాలు ప్లెబిసైట్‌ నిర్వహించారు. చారిత్రక స్పృహ అంటే ప్రపంచ అనుభవం నుండి నేర్చుకొనడం.

ఇవ్వాళా కశ్మీర్‌ మనకు కేవలం మట్టి లాగానే కనిపిస్తున్నదా? లేక అక్కడ మనుషులున్నారన్న స్పృహ, వాళ్ళు ఇంత కాలం ఈ దేశ పౌరులనే స్పృహ కోల్పోయామా? కేవలం టెర్రరిస్టులను అదుపు చేయటానికి మొత్తం ప్రజానీకాన్ని రోజుల తరబడి నిర్బంధంలో పెట్టడమేమిటో? కశ్మీర్‌ ఈ దేశంలో అంతర్భాగమనే పదే పదే ప్రకటించుకున్న ఫరూక్‌ అబ్దుల్లాను, మాజీ ముఖ్యమంత్రులను, ఈ మధ్యే సివిల్‌ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన ఫజల్‌ను నిర్బంధంలో పెట్టడమేమిటో? ఇక కశ్మీర్‌లో ఎవరితో మాట్లాడతారు? రేపు ఎన్నికలు జరిపితే పోటీ ఎవరు చేయాలి? కేవలం చట్టంలో ఒక ఆర్టికల్‌ను తొలగిస్తే సరిపోతుందా? ప్రజల మద్దతు లేకుండా, ప్రజలతో సంబంధాలు లేకుండా ప్రాంతాన్ని ఎలా పరిపాలిస్తారు? అజిత్‌ దోవల్‌ ఎంత కాలం కశ్మీర్‌ను అదుపులో పెట్టగలడు?

కశ్మీర్‌ కుండే సుసంపన్నమైన సంస్కృతి భారతదేశం లాంటి వైవిధ్యభరిత దేశాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది. అంత విశిష్ట సంస్కృతి గల ప్రాంతంపై టెర్రరిస్టుల పేరు చెప్పి బల ప్రయోగం ఉపయోగిస్తే దాని దీర్ఘకాల పర్యవసానమేమిటో ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా? లేక సైనిక బలం ఉంది కదా అని తొందరపడ్డారా? అధికారానికి దాని హద్దులు దానికి తెలియవు. పౌర సమాజం, న్యాయ వ్యవస్థ లాంటి వ్యవస్థలు దానిని అదుపు చేయకపోతే చరిత్ర ఏ మలుపులు తిరుగుతుందో ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాకపోవచ్చు.

(Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates