యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఎరువుల కంపెనీల తరఫున రైతులకు అంటగడుతున్న మార్క్‌ఫెడ్‌ పైగా బయటి ధర కంటే బస్తాకు రూ. 100 అదనపు భారం కమీషన్ల కుంభకోణం తెలిసినా.. చోద్యం చూస్తున్న యంత్రాంగం

ఎరువుల సంస్థలో అవినీతి ఏపుగా పెరిగింది. మార్క్‌ఫెడ్‌కు మరక అంటింది. రైతులకు సరిపడా యూరియాను సిద్ధం చేయలేని ఆ సంస్థ, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను అనవసరంగా అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు కొనాల్సిందేనని అధికారులు ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్‌)పై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా యూరియా కొరతను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారని, ఒక జిల్లాకు చెందిన మార్క్‌ఫెడ్‌ అధికారి సంబంధిత కంపెనీతో ఘర్షణకు దిగారనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ ఖరీఫ్‌లో ఎరువుల పంపిణీ వ్యవసాయ లక్ష్యం -19.40 లక్షల మెట్రిక్‌ టన్నులు
ఇందులో యూరియా – 8.50 లక్షల మెట్రిక్‌ టన్నులు
డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు – 10.90 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై..
ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద డీఏపీ 14,900 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 2,800 మెట్రిక్‌ టన్నులు, యూరియా 10,200 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కంటే ఇతర ఎరువులనే మార్క్‌ఫెడ్‌ అధికారులు ఎక్కువగా అందుబాటులో ఉంచడం గమనార్హం. యూరియా కొరత ఉన్నందున లింకు పెడితే రైతులు కొంటారని అధికారులకు కంపెనీలు నూరిపోస్తున్నాయి. అలా చేస్తే పర్సంటేజీలు ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి. యూరియా కోసం గత్యంతరం లేక ప్యాక్స్‌లు, అక్కడి నుంచి రైతులు డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను కొనుగోలు చేయక తప్పడంలేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం గమనార్హం.

ఇష్టారాజ్యంగా ధరలు…  జూలై, ఆగస్టులోనే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం వాటికి డిమాండ్‌ లేదు. అయినా రైతులతో కొనిపిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ధరల ప్రకారం ప్యాక్స్‌కు ఇచ్చే డీఏపీ బస్తా ధర రూ.1,250 కాగా, డీలర్లకు కంపెనీలు ఇచ్చే ధర రూ. 1,150 నుంచి రూ. 1,190 మాత్రమే. కాంప్లెక్స్‌ ఎరువులకు మార్క్‌ఫెడ్‌ ఇచ్చే ధర బస్తా రూ. 980 కాగా, డీలర్లకు ఇచ్చే ధర రూ. 900 నుంచి రూ. 940 మాత్రమే. డీఏపీ బస్తా ధర మార్క్‌ఫెడ్‌ వద్ద రూ. 50 నుంచి రూ. 100, కాంప్లెక్స్‌ ఎరువుల ధర రూ.40 నుంచి రూ.80 అధికం.

Courtesy Sakshi..

RELATED ARTICLES

Latest Updates