తిరోగమనంలో ఐటి రంగం..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఖాళీ అవుతోన్న విశాఖ మిలీనియం టవర్‌
కాండ్యుయెంట్‌ ఐటి నుంచి వైదొలగుతున్న ఉద్యోగులు
చెన్నరుకు హెచ్‌సిఎల్‌ తరలివెళ్లడంతో ఐటికి గడ్డు పరిస్థితి

విశాఖలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి)కి నిలువెత్తు నిదర్శనమమైన మధురవాడ ఐటి సెజ్‌ నేలచూపులు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటి వృద్ధి రేటు నెమ్మదించడం ఒకటైతే.. ఐటి కంపెనీల ఆదాయాల మాంద్యం ఒత్తిడి, ప్రభావానికి లోనుకావచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో విశాఖ ఐటి మూలనపడే పరిస్థితి నెలకొంది. మధురవాడ రుషికొండపైకి వస్తుందని ప్రచారం జరిగిన ప్రపంచ ఐటి దిగ్గజ సంస్థ హెచ్‌సిఎల్‌ తన ప్రతిపాదనను విరమించుకుని చెన్నరుకి తరలిపోయింది. ఇది వస్తే ప్రారంభంలోనే వెయ్యి ఐటి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఫార్మా, టెక్స్‌టైల్స్‌, బయో టెక్నాలజీ వంటి కార్యకలాపాల దేశంలోనూ, పొరుగు దేశాలతోనూ ఐటి నెట్‌ వర్క్‌ నెరపడంలో ప్రపంచంలోనే హెచ్‌సిఎల్‌కు పెట్టింది పేరు. ఇది కాస్త చేజారిపోయింది. ఉన్న అతిపెద్ద కంపెనీ కాండ్యుయెంట్‌లో ఉన్న ఉద్యోగాల నుంచి ఉద్యోగులు బయటకు వెళ్లే పరిస్థితులు దాపురించాయి. పలు ఐటి కంపెనీల నుంచి ఉద్యోగులు బయటకు వెళ్లే వాతావరణం నెలకొందన్న చర్చ అంతటా జరుగుతోంది.
ఆచరణ ఏం చెబుతోంది.. ?
గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విశాఖలో ఐటికి పెద్దపీట వేస్తూ రుషికొండ హిల్‌ నెంబరు 1, 2, 3లలో పలు ఐటి సంస్థల రాకకోసం ఎంఒయు కుదుర్చుకున్నా అవి నేటికీ సాకారం కావడం లేదు. మిలీనియం టవర్‌ నిర్మాణం చేసినా అందులోకి రావాల్సిన ఐటి కంపెనీలు రాకపోవడం, కొత్త ఐటి ఉద్యోగాలు లేక విశాఖ ఐటి పరిశ్రమ డీలా పడింది. 2019 ఫిబ్రవరి 15న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాండ్యుయెంట్‌ ఐటి సంస్థతో ఎంఒయు కుదర్చుకుంది. ఈ కాండ్యుయెంట్‌ సంస్థకు హిల్‌ నెంబరు మూడులో ఒక చదరపు అడుగు స్థలాన్ని ఏటా కేవలం రూ.30కే మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల మిలీనియం టవర్‌ను చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. మిలీనియం టవర్‌లో టవర్‌ ఎ, బి రెండు భాగాలుండగా ‘ఎ’ భాగంలో కాండ్యుయెంట్‌కు ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో అంటే 2020 సంవత్సరం లోపు ఐదు వేల ఉద్యోగాల సృష్టి జరుగుతున్నట్లు ఎంఒయులో చంద్రబాబు పేర్కొన్నారు. 500 కార్ల పార్కింగ్‌ కోసం ఈ టవర్‌ ‘ఎ’ లోనే రెండు ఫ్లోర్లను అప్పట్లో టిడిపి ప్రభుత్వం కేటాయించింది. కానీ వచ్చిన ఉద్యోగులు 500 మంది మాత్రమే. వీరిలో గడచిన నెల రోజులగా ఈ కాండ్యుయెంట్‌ ఐటి కంపెనీ నుంచి పదుల సంఖ్యలో ఉద్యోగులు బయటకు పోతున్న వైనం తాజాగా గుప్పుమంటోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో భాగంగా ఎపికి హెచ్‌సిఎల్‌ వంటి ప్రపంచ దిగ్గజ ఐటి సంస్థను తీసుకొస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా గాలిలో కలిసిపోయింది. ఎందుకంటే హెచ్‌సిఎల్‌ ఐటి సంస్థ చెన్నైకు తన పరిశ్రమను ఎపి నుంచి తరలించేసింది. ఆటోమేషన్‌, ఐటి ఎనలిటిక్స్‌ వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు హెచ్‌సిఎల్‌ ఎపిలో ముఖ్యంగా విశాఖకు ఈ ఐటి కంపెనీ వస్తుందని ఆయా వర్గాలు భావించగా ఈ ఆశలు అడియాశలయ్యాయి.
రూ.150 కోట్లతో మిలీనియం టవర్‌
ఐటి మిలీనియం టవర్‌ కోసం విశాఖ జిల్లా మధురవాడ ఐటి సెజ్‌ రుషికొండ హిల్‌ నెంబరు మూడులో రూ.150 కోట్లు ఎపిఐఐసి ద్వారా ఖర్చు చేయించి అప్పటి సిఎం చంద్రబాబు టవర్‌ను 2018లో ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. ఈ స్థలాన్ని ఐటి దిగ్గజ కంపెనీలకు చదరపు అడుగు కేవలం రూ.30కే ఇవ్వడం పట్ల విశాఖ మేథావుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఉద్యోగాల కల్పన జరుగుతుందని, స్థలాలు చౌకగా ఇవ్వడం అన్నది విషయమే కాదంటూ గత ప్రభుత్వం కొట్టిపారేసింది. మధురవాడ ఐటి సెజ్‌ హిల్‌ నెంబర్‌-3, ఐటి పార్కు హిల్‌ నెంబరు-2, హిల్‌ నెంబరు-1 రుషికొండల్లోనే ఐటి సంస్థలకు పనిలేకుండా పోయిన నేపథ్యంలో కొత్తగా ఎనిమిది నెలల క్రితం కాపులుప్పాడ రెండు కొండలపై 1800 ఎకరాలను ఐటి కోసం ఇచ్చేసింది. ఇక్కడ కూడా పని ప్రారంభం కాలేదు.
ఐటి ఆదాయంపై ప్రచారం
2018-19లో ఐటి ఆదాయం రూ.2300 కోట్లకు చేరొచ్చన్న అంచనాలు గాలిలో కలిసిపోయాయి. రూ.1500 కోట్ల నుంచి రూ.1800 కోట్లు ఐటి విశాఖ టర్నోవర్‌గా ఉంది. 2023 సంవత్సరం నాటికి రూ.10 వేల కోట్లకు తీసుకెళ్లే అవకాశాలు ఇక్కడ ఉన్నాయంటూ గత ప్రభుత్వం అనేక ఎంఒయులను కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఒరాకిల్‌, టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, అమేడ్యూస్‌ ఐటి హోల్డింగ్స్‌, సిఎ టెక్నాలజీస్‌ వంటి ప్రపంచ ఐటి సంస్థల కార్యాలయాలు విశాఖ రుషికొండలో ఏర్పాటు చేస్తాయని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి.

Courtesy Navatelangana

RELATED ARTICLES

Latest Updates