న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: బాలీవుడ్ సూపర్‌స్టార్.. బిగ్ బి.. అమితాబ్‌బచ్చన్ (76) కీర్తికిరీటంలో మరో కలికితురాయి. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా బాలీవుడ్ సినీ ప్రియులను ఉర్రూతలూగించి.. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ‘షహెన్ షా’ను.. దేశంలోనే అత్యున్నత సినీ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘రెండు తరాలకు వినోదం అందించి, స్ఫూర్తినిచ్చిన లెజెండ్ అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
యావద్భారతదేశం, అంతర్జాతీయ సమాజం సంతోషంగా ఉంది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. నిజానికి.. 2019 సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఎప్పుడో ఏప్రిల్‌లోనే ప్రకటించాల్సింది. కానీ, లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యంగా ఇప్పుడు ప్రకటించారు. అమితాబ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించగానే భాషలకతీతంగా అన్ని రాష్ట్రాల చిత్రసీమలకు చెందిన ప్రముఖ నటులు ఆయనపై అభినందనల వర్షం కురిపించారు. కాగా.. జంజీర్, దీవార్, షోలే వంటి చిత్రాలతో అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్‌ను కేంద్రం 1984లో పద్మశ్రీ, 2001లో పద్మ భూషణ్, 2015లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించిన సంగతి తెలిసిందే.
Courtesy AndhraJyothy…