
* పలాయనం చిత్తగించిన ‘పినాకిల్’ – ఆళ్లగడ్డ (కర్నూలు):
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని యాదవాడలో ఐదు రోజులుగా చేపట్టిన యురేనియం అన్వేషణ పనులను సంస్థ సిబ్బంది నిలిపేశారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకూ అన్వేషించిన యంత్రంతోపాటు మిగిలిన సామగ్రిని ప్రయివేటు సంస్థ తీసుకెళ్లింది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలున్నాయని నిర్ధారించుకున్న ప్రయివేటు సంస్థ ఈస్ట్, వెస్టు పినాకిల్ వారం రోజుల క్రితం యాదవాడ గ్రామంలో తవ్వకాలు చేపట్టింది. యురేనియం నిక్షేపాల కోసం యాదవాడ గ్రామ ప్రజలను బోరు తవ్వకాల కోసమని చెప్పి పనులు ప్రారంభించారు. తహశీల్దార్ అనుమతి కూడా లేకుండా పనులు చేపట్టారు. దీంతో, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. యాదవాడలో తవ్వకాలపై ఈనెల 27న ప్రజాశక్తిసహా పలు పత్రికలు, ఛానళ్లలో వార్తలొచ్చాయి. ఈ నెల 28న మాజీమంత్రి భూమా అఖిలప్రియ యాదవాడ, ఓబులంపల్లె గ్రామస్తులతో సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. విజయవాడలో అఖిలపక్షం ఆధ్వర్యాన యురేనియంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో నాయకులు యురేనియం తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కూడా యురేనియం తవ్వకాలను అంగీకరించబోమని చెప్పారు. ఈ పనులను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ యురేనియం తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలపై ప్రజలు, రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రయివేటు సిబ్బంది యురేనియం అన్వేషణ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలను, సామగ్రిని సోమవారం వెనక్కి తీసుకెళ్లారు. ఈస్టు, వెస్టు పినాకిల్ ప్రయివేటు సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు బయటపడితే భారీగా నిధులు సమీకరించుకోవచ్చన్న ఆశలు నీరుగారాయి. నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ, శిరువెళ్ల, రుద్రవరం మండలంతోపాటు మహానంది మండలాల్లో 17 ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల ప్రాంతాలను ప్రయివేటు సంస్థ వారు గుర్తించారు. యాదవాడలోనే రెండు చోట్ల యురేనియం తవ్వకాల ప్రాంతాలను గుర్తించారు. ఈ విషయంలో అటు గ్రామస్తులకు, ఇటు అధికారులకు సమాచారం లేకుండా తవ్వకాలు చేపట్టడం ప్రయివేటు సంస్థ తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ప్రజలు, రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.
డిఎస్‌పి వివరణ…
యాదవాడలో ఓ ప్రయివేటు సంస్థతో చేపట్టిన తవ్వకాలు కేవలం తహశీలార్ద్‌కే పరిమితమయ్యా యని, ప్రయివేటు సంస్థ వారు కలెక్టర్‌కు, ఎస్‌పికి సమాచారం ఇవ్వకపోవడం సమంజసం కాదని డిఎస్‌పి పోతురాజు తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలోని ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు సమాచారం లేకుండా పనులు సాగవన్నారు. యాదవాడ గ్రామస్తుల, జిల్లా ఉన్నతాధి కారుల అనుమతులు ఇచ్చే వరకూ తవ్వకాలు చేపట్టరాదని సిబ్బందికి, సంస్థ యాజమాన్యానికి సూచించా మన్నారు. ఈ విషయాలపై లోతుగా ఆలోచించిన సంస్థ యాజమాన్యం యంత్రాలను, పని ముట్లను యాదవాడ నుంచి తీసుకెళ్లిపోయారని వివరించారు.
Courtesy Prajasakthi..