ఆంధ్రప్రదేశ్‌లోని గని పరిసర ప్రాంతమంతా విషపూరితం
కాలుష్య నిబంధనలు తుంగలో తొక్కిన కేంద్ర సంస్థ
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆందోళన
ఇదేం నిర్వాకమంటూ షోకాజ్ నోటీసు జారీ
తెలంగాణలోనూ తవ్వకాలకు కేంద్ర సంస్థ సన్నాహాలు
ప్రగతి పరుగులెత్తాల్సిందే.. ఆధునికతను అందిపుచ్చుకోవలసిందే.. ఎలాంటి అభివృద్ధి అయినా అది ప్రజల జీవితాలను మరింత మెరుగుపరిచేదిగానూ.. వారి ఉన్నతికి పనికివచ్చేదిగానూ ఉండాలే తప్ప ఊరికి ఉరి వేసేదిగానూ.. పొలాలను పాడుబెట్టేదిగానూ.. జనం ఊపిరి తీసేదిగానూ ఉంటే ఎలా?
అణువిద్యుత్తు కర్మాగారాలను నడిపేందుకు యురేనియం అవసరం. ఆ ఖనిజం కోసం భూమిని తవ్వి వెలికి తీయాల్సిందే కానీ.. ఆ క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి? భూమిని.. భూగర్భాన్ని కూడా విషపూరితం చేసేస్తే ఎలా? ప్రభుత్వరంగ సంస్థల నిర్వాకమే ఇలా ఉంటే ఎవరికి మొరపెట్టుకోవాలి? ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లాలో భారత యురేనియం సంస్థ గనిని, ప్రాసెసింగ్ కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ఎం.తుమ్మలపల్లె ప్రాంతం వద్ద కనిపిస్తున్న పరిస్థితులు సరిగ్గా ఇలాగే ఉన్నాయి.
భూగర్భాన్ని అత్యంత ప్రమాదకర కాలుష్యం ఆక్రమిస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మీ పరిశ్రమపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఈనెల 7న యురేనియం కార్పొరేషన్‌కు షోకాజ్ నోటీసును జారీ చేసింది.
దేశంలో యురేనియం ఉత్పత్తిని భారీగా పెంచే లక్ష్యంతో తాజాగా యురేనియం సంస్థ తెలంగాణలోనూ తవ్వకాలకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ప్రజల నుంచి, మేధావుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికి ఏడేళ్ల కిందటే ఉత్పత్తి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై ‘ఈనాడు మీడియా’ పరిశోధన చేస్తే దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి.
ఉరేనియమే..
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేముల మండలం ఎం.తుమ్మలపల్లె ప్రాంతంలో భారత యురేనియం సంస్థ (యూసీఐఎల్) జరుపుతున్న తవ్వకాలు, నిర్వహిస్తున్న ప్రాసెసింగ్ కర్మాగారం స్థానిక ప్రజలకు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఖనిజం విషయంలో చూపుతున్న శ్రద్ధను ఆ సంస్థ ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణ విషయంలో తీసుకోకపోవడం ప్రజాజీవితానికి శాపమైంది. వారికి ప్రాణాధారమైన బోర్లు కలుషితం అవుతున్నాయి.
ఎం.తుమ్మలపల్లె ప్రాంతంలోని పలు బోర్లలో యురేనియం గాఢత నిర్ణీత పరిమితి కంటే అనేక రెట్లు ఎక్కువగా చేరింది. దీన్ని తేల్చింది సాక్షాత్తు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి. మండలి ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. జల కాలుష్య నియంత్రణ, నిరోధ చట్టం కింద ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఈనెల 7న యురేనియం సంస్థకు షోకాజ్ నోటీసిచ్చింది. వారంలో సమాధానం రాకపోతే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా పరిశ్రమ మూసివేత వంటి చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. కేంద్రప్రభుత్వ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇలా నోటీసివ్వడం అరుదు. దాని ప్రతిని ‘ఈనాడు మీడియా’ సంపాదించింది. నోటీసుకు కేంద్రప్రభుత్వ సంస్థ ఇంకా స్పందించిన దాఖలాలు లేవు.
భూగర్భంలో కాలుష్యం.. పనికి రాకుండా పోతున్న పొలం
‘మాది మంచి పొలం. ఒకప్పుడు మా నాన్న దీనిలోనే ఏటా అరటి తోటలు సాగు చేసి డబ్బు సంపాదించాడు. ఆయన పోగుచేసిన పది లక్షలతో ఊళ్లో ఇల్లు కట్టుకున్నాం. మాపొలం చివరన ఉన్న కొండ వెనక యురేనియం వ్యర్థాల చెరువు ఉంది. దానివల్ల మూడేళ్ల కిందట బోరులోని నీళ్లు పాడయ్యాయి. మొదట్లో ఇది అర్థం కాక మరో మూడుబోర్లు కూడా వేయించా. వాటికి రెండులక్షలు ఖర్చయింది. అరటి వేస్తే బోర్లలోని నీళ్లవల్ల తోటలు పెరిగినా కాయలు తినడానికి పనికిరానివి కాస్తున్నాయి. చాలా చిన్న కాయలు.. చేతి వేళ్ల సైజువి వస్తున్నాయి. అందుకే మూడేళ్ల నుంచి ఈ పొలాన్ని బీడుగానే వదిలేశా. ఇప్పుడు జిల్లేడు వంటి పిచ్చి చెట్లు పెరుగుతుంటే బాధనిపిస్తోంది.’ అని ఎం.తుమ్మలపల్లె సమీప గ్రామమైన మబ్బుచింతలపల్లె రైతు మహేశ్వరరెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. యురేనియం ఉత్పత్తి ద్వారా వచ్చిన వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకడం వల్ల బోర్లు పాడై వ్యవసాయం దెబ్బతినడం మొదటగా మహేశ్వరరెడ్డి భూమిలోనే జరిగింది. ‘ఒకప్పుడు మాబోరు నీటిని ఊళ్లో చాలామంది తీసుకుని వెళ్లి తాగేవారు. ఇప్పుడు తాగడానికి పనికి రావు. నోట్లో కాసిని పోసుకుంటే ఉప్పగా తగులుతాయి’ అని ఆయన వాపోయారు. మహేశ్వరరెడ్డి చవిచూసిన అనుభవం ఇప్పడు చాలామంది ఎదుర్కొంటున్నారు.
* మహేశ్వరరెడ్డి పొలంలానే మబ్బుచింతలపల్లె, కె.కె.కొట్టాల, కణంపల్లె గ్రామాల పరిధిలో 100 ఎకరాల వరకూ గత మూడేళ్లలో ఇది విస్తరించింది.
* ఇది కేవలం పంటలకు సంబంధించిన అంశమేకాదు. భూగర్భంలో ప్రమాదకర కాలుష్యం ఇలా విస్తరించడం పర్యావరణంపై.. ఆ ప్రాంత ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నదో తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తున్నది.
* ఈ విషయమై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి అధ్యయనాన్ని నిర్వహించలేదు.
ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు ఇవీ నిబంధనలు..
ముడిఖనిజం తవ్వకం, యురేనియం ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వ్యర్థాల నిర్వహణలో యురేనియం సంస్థ ప్రమాణాలను పాటించలేదని కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. ఈ విషయాన్ని తన నోటీసులో స్పష్టంగా పేర్కొంది. అందులో ఈ కింది వివరాలున్నాయి.
భారత అటవీ పర్యావరణ శాఖ ఎం.తుమ్మలపల్లె సమీపాన గని తవ్వకానికి, యురేనియం ప్రాసెసింగ్ కర్మాగారం నిర్మాణానికి 2007లో అనుమతి ఇచ్చింది. అందులో నిర్దిష్టంగా ఒక నిబంధనను పొందుపరిచింది. దాని ప్రకారం.. వ్యర్థాలను (కొంత బురదలా, కొంత నీటిలా వెలువడుతాయి) నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసే చెరువుకు భూగర్భజలం కలుషితం కాని రీతిలో లైనింగ్ చేయాలి. చెరువు నిండే క్రమంలో అందులోని నీటిని సేకరించి కర్మాగారంలోనే శుద్ధిచేయాలి. వ్యవసాయానికి పనికివచ్చే ప్రమాణాలతో ఈ శుద్ధి ప్రక్రియ జరగాలి. ఈ క్రమంలో వెలువడే బురదను మళ్లీ చెరువులోకి పంపాలి. శుద్ధి అయిన నీటిని పారిశ్రామిక అవసరాలకు వాడాలి.
ఞగని తవ్వకానికి, కర్మాగారానికి తాను ఇచ్చిన అనుమతిలో రాష్ట్ర పర్యావరణ మండలి స్పష్టమైన నిబంధన పెట్టింది. వ్యర్థాలను నింపేందుకు తయారు చేసే చెరువు అంతటా ‘బెన్టోనైట్’ (ఇదో రకమైన మట్టి. ఖరీదు ఎక్కువ. నాణ్యతను బట్టి కిలో రూ. 5 నుంచి 10 వరకూ ఉంటుంది)తో 500 మిల్లీమీటర్ల మందంతో పొరను ఏర్పాటు చేయాలి. తర్వాత 250 మైక్రాన్ ఉండే పొలియాథిలిన్ పొరను ఏర్పాటు చేయాలి. తర్వాత 250 మిల్లీమీటర్లతో ఇసుక లేదా మట్టితో మరో పొరను అదనపు రక్షణగా కల్పించాలి.
ఉల్లంఘన ఇలా..
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన మేరకు వ్యర్థాలు నింపే చెరువుకు యురేనియం సంస్థ 250 మైక్రాన్ ఉండే పొలియాథిలిన్ పొరను ఏర్పాటు చేయలేదు. దీనిపై మండలి గత ఏడాది మార్చిలో షోకాజ్ నోటీసును జారీచేసింది. దీనికి యురేనియం సంస్థ సమాధానం ఇస్తూ తాము అణుశక్తి మండలి మార్గదర్శకాల ప్రకారం తగిన మట్టితో అవసరమైన మందంతో వ్యర్థాల చెరువుకు లైనింగ్ ఏర్పాటు చేశామని పేర్కొంది. అయితే అదనపు జాగ్రత్త కోసం పొలియాథిలిన్ పొరను ఏర్పాటు చేసి ఉండాల్సిందని మండలి గట్టిగా అభిప్రాయపడింది.
ఞవ్యర్థాల చెరువుకు లైనింగ్ విషయంలో మండలి ఇచ్చిన మార్గదర్శకాలలో సవరణలు కోరుతూ యురేనియం సంస్థ ఎన్నడూ లేఖ రాయలేదు.
ఞతదుపరి చర్యగా మండలి గత ఏడాది నవంబరు 19న పరిశ్రమకు అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుత వ్యర్థాల చెరువును భూగర్భంలోకి కాలుష్యం వెళ్లని రీతిలో బాగు చేసేందుకు కాలవ్యవధితో కూడిన కార్యచరణ ప్రణాళికను తమకు సమర్పించాలని అందులో కోరింది. ఇందుకోసం సమీపాన మరో చెరువును ఏర్పాటుచేసి ప్రస్తుతం ఉన్న చెరువునుంచి వ్యర్థాన్ని అందులోకి మార్చాలని పేర్కొంది.
అయితే ఇవేమీ జరగకపోవడంతో తాజాగా తీవ్రమైన హెచ్చరికతో నోటీసు ఇచ్చింది.
బయటపడింది ఇలా..
యురేనియం కర్మాగారం సమీపంలోని బోర్లలోని నీరు పాడైపోయి తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, పంటలూ దెబ్బతింటున్నాయని గోడు వెళ్లబోసుకుంటూ అక్కడి ప్రజలు కాలుష్య నియంత్రణ మండలికి లేఖలు రాశారు. అలాగే స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డి, ఈ సమస్యపై తొలినుంచి పోరాడుతున్న పర్యావరణ వేత్త కె.బాబురావు విజ్ఞాపనలు పంపారు. దీంతో మండలి ఆ గ్రామాల పరిధిలో వివిధ బోర్ల నీటిని పరీక్షలు చేయించింది. భూగర్భజల్లాల్లో యురేనియం గాఢత, అధిక క్షారత్వం (హై ఆల్కలిటి) పరిమితికి మించి అనేక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఆ పరీక్షలలో తేలింది. యురేనియం సంస్థ ఖనిజ ఉత్పత్తిలో భాగంగా చేసే క్షారయాన నిక్షాళన ప్రక్రియ (ఆల్కలైన్ లీచింగ్ మెథడ్) ఇందుకు కారణం అయి ఉండొచ్చని కాలుష్యనియంత్రణ మండలి అంచనా వేసింది.
అసాధారణ స్థాయిలో నిర్లక్ష్యం
బోర్లలోని నీటికి కాలుష్య నియంత్రణ మండలి చేయించిన పరీక్షల్లో తేలిన అంశాలు..
1 అణుశక్తి నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం తాగునీటిలో 60 పీపీబీ (పార్ట్స్ పర్ బిలియన్) వరకూ యురేనియం గాఢత ఉండవచ్చు. మబ్బుచింతలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి అనే రైతు బోరులో అత్యధికంగా 4000 పీపీబీ యురేనియం గాఢత నమోదైంది.
2 అధిక క్షారత్వం, కాఠిన్యం, మెగ్నీయం, సల్ఫేట్లు, సోడియం, నీటిలో కరిగే ఘనవ్యర్ధాల (టిడిఎస్)తో పాటు కాపర్, క్రోమియమ్, నికెల్ వంటి భారలోహాలు (హెవీ మెటల్స్) బోర్లలోని నీటిలో ఆమోదనీయమైన పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నాయి.
3 మబ్బు చింతలపల్లి గ్రామానికే చెందిన కె.రామాంజనేయులు అనే రైతుకు చెందిన బోరులో 690 పీపీబీ యురేనియం గాఢత బయటపడింది. అంతేకాదు ఇదే బోరులో బీఐఎస్ ప్రమాణాలు దాటి ఉంటున్నాయి.
![]() ‘భూగర్భ కాలుష్యం వల్ల మా భూములను సాగుచేసుకోలేకపోతున్నాం.. ఏదో ఒక సహాయం అందించాలని మేమంతా అధికారుల చుట్టూ తిరిగాం. అయినా ఫలితం లేదు.’ అని మబ్బుచింతలపల్లెకే చెందిన రైతు సుధాకరరెడ్డి వాపోయారు. ‘నాకున్న ఎకరంన్నర పొలం వల్ల ఉపయోగం లేకుండాపోయింది. ఆదాయం లేక అప్పులు పెరుతున్నాయి. ఎలా తీర్చాలో తెలియడం లేదు.’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. |
![]() కణంపల్లెలోనే మధునాయక్ కుటుంబానికి అయిదు ఎకరాల భూమి ఉంది. అందులో ఒకప్పుడు అరటితోటలు బాగా సాగయ్యేవి. డ్రిప్ పరికరాలు ఏర్పాటు చేసి వాటికి నీరందించేవారు.బోరులోని నీరు విషతుల్యం కావడంతో 20 నెలల నుంచి భూమిని బీడుగా వదిలేశారు. డ్రిప్ పరికరాలనీ తీసేసి పక్కన పెట్టారు. ‘ఒకప్పుడు లక్షల ఆదాయం ఇచ్చే ఆరటి తోటలు వేసిన భూమి ఇది. ఇప్పుడు బీడుగా వదిలేశాం. తుమ్మచెట్లు పెరుగుతుంటే చూసేందుకు చాలా బాధగా ఉంది’ అని మధునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. |
![]() ‘మాకు రెండు ఎకరాల పొలం ఉంది. ఒకప్పుడు అరటి వేసేవాళ్లం. అది ఇప్పుడు దిగుబడి రావడం లేదని ఈసారి టమోటా వేశాం. మామూలుగా అయితే మూడునెలలకే కోతకు రావాలి. మేం వేసి నాలుగునెలలైంది. ఇప్పడు చిన్న పిందెలే కాస్తున్నాయి. పంట వస్తుందనే నమ్మకంలేదు. ఏంచేయాలో అర్థం కావాడం లేదు’ కణంపల్లెకే చెందిన లలిత వాపోయారు. |
(Courtacy Eenadu)