
* యురేనియం కోసం తవ్వకాలు పూర్తి
* నిల్వలున్నాయని నిర్ధారణ?
* తాగునీటి కోసమంటూ స్థానికంగా ప్రచారం
-మాచర్ల
తెలుగు రాష్ట్రాల్లో యురేనియం కోసం జరుపుతున్న తవ్వకాలు కలకలం రేపుతుండగా, గుంటూరు జిల్లాలో మాత్రం అధికారులు ఆ పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేశారు. ఈ జిల్లాలోని నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అణు ఇంధన విభాగం తవ్వకాలు నిర్వహించడమే కాకుండా నిల్వలున్నాయని కూడా నిర్ధారించింది. స్థానికుల దృష్టిలో మాత్రం ఇక్కడ జరిగిన తవ్వకాలు తాగునీటికి బోర్లు వేయడానికి మాత్రమే! అధికారులు స్థానికులను అలా నమ్మించారు. హెలికాప్టర్లతో జరిపిన అన్వేషణను సైతం రంగురాళ్ల కోసం చేస్తున్న గాలింపుగా స్థానికులను నమ్మించడం విశేషం. అయితే, గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన తవ్వకాల్లో ఈ జిల్లాలోని మాచర్ల మండలం కొప్పునూరు గ్రామ పరిసర ప్రాంతంలో భారీ ఎత్తున యురేనియం నిల్వలున్నట్లు తేలిందని సమాచారం. కడప, గుంటూరు జిల్లాల్లో 1.22 లక్షల టన్నుల యురేనియం ఆక్సైడ్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారని తెలిసింది. ఇది 1.04 టన్నుల యురేనియం ఖనిజంతో సమానం. కొప్పునూరులో 2,761 టన్నుల యురేనియం ఆక్సైడ్ నిల్వలను కనుగున్నట్లు సమాచారం. ఇది 2,341 టన్నుల ఖనిజంతో సమానంగా చెబుతున్నారు. అణు ఇందనశాఖకు చెందిన ఆటమిక్ మినరల్స్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రిసెర్చ్ వెబ్‌సైట్‌లో ప్రధాన కార్యక్రమాల కింద గుంటూరు జిల్లాలోని కొప్పునూరు తవ్వకాలను పేర్కొన్నారు. అయితే, నిల్వలను మాత్రం అధికారికంగా నిర్ధారించలేదు.
ప్రైవేటు భూముల్లోనూ..
మాచర్ల నియోజకవర్గంలో తాగునీటి కోసం చాలా లోతుకు డ్రిల్లింగ్ చేయాల్సిఉంటుంది. దీనిని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రైవేటు భూముల్లోనూ తవ్వకాలు జరిపారు. బోర్లు ఉచితంగా వేసి ఇస్తామని చెప్పడంతో రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చేవారు. తమ భూముల్లోనూ తవ్వకాలు జరపాలని కోరేవారు. దీంతో మాచర్ల నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ఈ తవ్వకాలు సాగాయి. ఇక్కడి నమూనాలను విజయపురి సౌత్‌లో ఏర్పాటు చేసిన ఆటమిక్ మినరల్స్ డైరక్టరేట్ తాత్కాలిక కార్యాలయానికి తరలించినప్పుడు మాత్రం స్థానికులకు కొంత అనుమానం వచ్చింది. తవ్వకాలను జరుపుతున్న వారిని ప్రశ్నిస్తే ఏదోఒకటి చెప్పి జవాబు దాటవేసేవారని స్థానికులు చెప్పారు. అప్పుడప్పుడు కేబుల్‌డిష్‌లాంటి పెద్ద పరికరంతో హెలికాప్టర్‌లు ఈ ప్రాంతంలో చక్కర్లు కొట్టేవని, రంగురాళ్లు కోసం వచ్చి వెళ్తున్నారని అనుకునేవారమని చెప్పారు. అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని బలపరిచేలా వ్యవహరించేవారు. ఇలా వెల్దుర్తి, మాచర్ల మండలాల్లోని నల్లమల గ్రామల్లో 200 చోట్ల తవ్వకాలు నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. కొప్పనూరు గ్రామంలో చివరిసారిగా తవ్వకాలు జరిగాయని వీరు అంటున్నారు. ప్రస్తుతం విజయపురి సౌత్‌లోని కార్యాలయం ఖాళీగా ఉంది. కొందరు సెక్యూరిటీ సిబ్బంది మాత్రం కాపలాగా ఉన్నారు.
బోర్ల కోసమని నమ్మించారు…
ఈ తవ్వకాల పనులకు సహాయకులుగా పనిచేసిన స్థానికులు జల్లెల సైదులు, గుండాల రాముడు ప్రజాశక్తితో మాట్లాడుతూ బోర్లకోసమని తమను నమ్మించారని చెప్పారు. . బోర్లు వేసే సమయంలో మట్టి మునాలను పరిశీలించి అవసరం అనుకుంటే మిషన్ల సహాయంతో ఆ బోరుకు సమీపంలోనే డ్రిల్లింగ్ జరిపి శ్యాంపిల్స్ సేకరించే వారని చెప్పారు. ఆ తవ్వకాలు యురేనియం కోసమేనని అప్పట్లో తమకు తెలియదన్నారు. సహాయకులుగా ఉన్నందుకు కొంత జీతం ఇచ్చేవారిని చెప్పారు. గ్రామాలక దూరంగా అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తవ్వకాలు జరిగేవని వారు చెప్పారు. ఆప్రాంతంలో పనిచేసిన ఒక విఆర్‌ఒ మాట్లాడుతూ తవ్వకాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అటామిక్ ఎనర్జీ శాఖ ఆద్వర్యంలో జరుగుతున్నందున తాము ఏమీ చేయలేకపోయామని అన్నారు.
Courtesy Prajasakti..