ఎగబాకుతున్న నిరుద్యోగం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– 8.5శాతానికి చేరిన నిరుద్యోగిత రేటు : సీఎంఐఈ
– ఆర్థిక మందగమన పరిస్థితులే కారణం
– కీలక రంగాలు తిరోగమనంలో..
– కొనుగోళ్లు లేక కంపెనీల్లో పేరుకుపోతున్న వస్తు నిల్వలు
న్యూఢిల్లీ: పాలకుల్లో దక్షత లోపించడం, ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా నిర్మాణాత్మక చర్యలు లేకపోవడంతో దేశంలో నిరుద్యోగం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. తాజాగా ”సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ” (సీఎంఐఈ) శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం గత అక్టోబరు మాసంలో దేశంలో నిరుద్యోగిత రేటు 8.5 శాతానికి ఎగబాకింది. గత మూడేండ్లలో నిరుద్యోగం ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి అని నివేదిక తేల్చింది. ఆగస్టు 2016 తర్వాత ఈస్థాయిలో నిరుద్యోగిత గణాంకాలు నమోదుకావటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సెప్టెంబరులో నిరుద్యోగ రేటు 7.2శాతంగా నమోదైంది. సీఎంఐఈ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత 8.9 శాతానికి పెరగ్గా.. గ్రామీణ ప్రాంతంలో ఇది 8.3 శాతంగా నిలిచింది. దేశ వ్యాప్తంగా విశ్లేషించి చూస్తే త్రిపుర, హర్యాణా రాష్ట్రాల్లో నిరుద్యోగతి స్థాయి 20 శాతానికి మించి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మరోవైపు తమిళనాడుతో అత్యల్పంగా 1.1% నిరుద్యోగిత నమోదయింది. 2018తో పోలిస్తే 2019 సంవత్సరానికి గాను రాజస్థాన్‌లో నిరుద్యోగిత దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, కొత్తగా పెట్టుబడులు రాకపోవడం, ఉన్న సంస్థలు ఉత్పత్తిని తగ్గించేస్తుండడ తదితర పరిస్థితుల కారణంగా కొత్తగా కొలువులు అందుబాటులోకి రావడం లేదు. దీనికి తోడు ఉన్న సంస్థలు కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అంది పుచ్చుకొనే ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగిత పెరిగిపోతోంది.
తిరోగమనంలో తయారీరంగం..
దేశంలో కీలకరంగాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబరులో అన్నిరంగాల్లో ఉత్పత్తి 5.2శాతం క్షీణించింది. దశాబ్దంలోనే ఇది అత్యంత క్షీణత కావటం గమనార్హం. గతేడాది ఇదే నెలలో కీలకరంగాల ఉత్పత్తిలో 4.3శాతం వృద్ధి నమోదైంది. మార్కెట్‌ డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వటం లేదనీ, ఉద్యోగాలు తగ్గిపోవడం మాంద్యం ప్రభావమేననీ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో తయారీరంగ కార్యకలాపాలు అక్టోబరులో బలహీనంగా ఉన్నాయి. సెప్టెంబరులో మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్ఛేజింగ్‌ మేనేజర్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 51.4గా నమోదుకాగా, అక్టోబరులో ఈ సూచీ రెండేండ్ల కనిష్టానికి తగ్గి 50.6కు పడిపోయింది. కొనుగోళ్లు లేకపోవడంతో కంపెనీల్లో ఉత్పత్తి నిల్వలు పేరుకుపోయి తయారీరంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో కొత్త ఉద్యోగాల కల్పన కూడా ఆరునెలల కనిష్టానికి తగ్గింది. ఫలితంగా నిరుద్యోగం తీవ్రతరమైంది. ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూపు పేలవ పనితీరు కనబరుస్తోంది. ఎనిమిది రంగాల్లో ఏడింటిలో క్షీణత కనిపించింది. దీనినిబట్టి మందగమన ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Courtesy Navatelangana…

RELATED ARTICLES

Latest Updates