పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలైనా అధిగమించి నిలబడవచ్చు అని మంచి సందేశం ఇస్తున్న మల్లేశం సినిమా నేటి యువతకి స్ఫూర్తిదాయకం.
ప్రతి చిన్న విషయానికి, అపజయానికి ఆత్మహత్యలకు పాల్పడే, డిప్రెషన్లకి గురైపోయే యువతకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. బయోపిక్ కాబట్టి కథకోసం ఎక్కువ కష్టాలు అవసరం లేదు. చేనేతలో కష్టాన్ని తగ్గించే సమయాన్ని కుదించే ఆసులాంటి ఓ గొప్ప పనిముట్టుని కనిపెట్టిన శ్రామికుడి పరిశోధనే ఈ సినిమాని నడిపించిన కథ. ఈ కథకి సినిమాకి వన్నె తెచ్చేలా చేసింది మాత్రం పెద్దింటి అశోక్ కుమార్ అచ్చమైన తెలంగాణా మాటలు. ఆయన కథలు, నవలల్లాగానే జీవితాన్ని ఒడిసిపట్టిన సినిమా ఇది.
అసలు నిజానికి సినిమా చూసినట్టు లేదు, నేను చాలాసార్లు విద్యార్థులను చేనేత కార్మికుల కష్టాలని చూపించడానికి సిరిసిల్లకి తీసుకొని పోతుంటాను, అక్కడ మల్లేశం ఇంట్ల కూర్చొని కథ ఇన్నట్టుంది, వాళ్ళ గోస ఇన్నట్టుంది. చలనంలేని జీవితాలు, వొత్తిడికి తట్టుకోలేక నిరంతరం తాగి ఉండే కార్మికులు, కుటుంబం గడవడానికి బీడీలు చుట్టే ఆడవాళ్ళు, బడి మధ్యలోనే ఆపేసి చిన్న చిన్న కుట్టు పనులు చేసే ఆడపిల్లల దృశ్యాలాంటి నిజజీవితమే ఈ సినిమాలో కనిపించలేదు. పవర్ లూమ్ మోగే మోతల వల్ల చాలా మందికి వినికిడి సమస్యలు, దళారుల దోపిడీ, మార్కెట్ మాయాజాలం, ఆగని ఆత్మహత్యలు ఇప్పటి వాస్తవాలు. బయోపిక్ కాబట్టి వీటిగురించి ప్రస్తావన లేదనుకుంటా.
డబల్ మీనింగ్ డైలాగ్స్, ఐటెం సాంగ్స్, రొమాన్స్ ప్రేమ పేరుతో చూపించే జుగుప్సాకర మసాలా, మాస్, హీరోయిజాన్ని చూపించే ఫైట్స్ కానీ లేకుండా ఒక పేద నిరుద్యోగి జీవితాన్ని, తల్లితండ్రుల భాధలు తీర్చే కలలు కంటు, అలసి, సొలసి ఉన్న తెలంగాణ యవ్వనాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించే సినిమా ఇది. చాలా రోజుల తరువాత సినిమా మొత్తం తెలంగాణ యాసతో కూడుకున్న తెలుగు భాషలో జీవితంతో నిండిన సినిమా చూడాలన్న కోరిక మాత్రం తీరింది .. హాట్స్ ఆఫ్ టు టీమ్.
Dr. Surepally Sujatha