కారు బేజారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
 • భాగ్యనగరంలో విరబూసిన కమలం
 • దుబ్బాక తర్వాత కారుకు మరో ఎదురు దెబ్బ
 • అతి పెద్ద పార్టీగా నిలిచినా దక్కని మేజిక్‌ మార్కు
 • మేయర్‌ పీఠానికి పదడుగుల దూరంలో టీఆర్‌ఎస్‌
 • ఎక్స్‌ అఫిషియో ఓట్లు భారీగా ఉన్నా ఫలితం సున్నా
 • అధికారం దక్కాలంటే మజ్లిస్‌ మద్దతు తప్పనిసరి
 • అత్తెసరు మార్కులతో గట్టెక్కిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
 • యువరాజుకు పట్టాభిషేకం ఆలస్యమయ్యే చాన్స్‌
 • టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసిన సిటింగ్‌లపై వ్యతిరేకత
 • వరద ప్రాంతాల్లో బీజేపీకి పట్టంగట్టిన ఓటర్లు
 • ‘వ్యవసాయేతర’ రిజిస్ట్రేషన్‌, ఎల్‌ఆర్‌ఎస్‌తోనూ నష్టం
 • పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
 • ఆరేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన కారు దుబ్బాకలో అదుపు తప్పింది! గ్రేటర్‌ హైదరాబాద్‌లో పల్టీ కొట్టింది!
 • తెలంగాణ సరస్సులో అక్కడక్కడా కనిపించిన కమలం దుబ్బాకలో పూసింది! గ్రేటర్‌ హైదరాబాద్‌లో విరబూసింది!
 • పాతబస్తీ పతంగి మళ్లీ ఎగిరింది! అక్కడ తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది!
 • వరుస పరాజయాల హస్తం.. మరోసారీ రేసులో వెనకబడింది! రాజధానిలోనూ పట్టును పూర్తిగా కోల్పోయింది!
 • ఒకప్పుడు విజయమే ఇంటి పేరుగా మార్చుకున్న హైటెక్‌ సైకిల్‌ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో కనుమరుగైంది!
 • భావోద్వేగాలు.. వరాల జల్లుల నడుమ తడిసి ముద్దయినా.. గ్రేటర్‌ ఓటరు ఎటూ మొగ్గు చూపలేదు! ఎవరికీ పూర్తి మెజారిటీ అందించలేదు!
 • ఫలితం… హైదరాబాద్‌లో హంగ్‌!!

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎ్‌సకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో సిటింగ్‌ సీటును చేజార్చుకున్న ఆ పార్టీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లోనూ ఆధిక్యాన్ని దిగజార్చుకుంది. గత ఎన్నికల్లో ఏకంగా 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌.. ఈసారి 43 స్థానాలను కోల్పోయింది. కేవలం 55 డివిజన్లకే పరిమితమైంది. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కూడా మేయర్‌ పీఠాన్ని దక్కించకోవడానికి కూడా పదడుగుల దూరంలో నిలిచిపోయింది! కీలకమైన ‘గ్రేటర్‌’ పిచ్‌పై ఆ పార్టీ నేతలు చేస్తామన్న ‘సెంచరీ’ మాట దేవుడెరుగు.. హాఫ్‌ సెంచరీ దాటడానికే ఆపసోపాలు పడ్డారు. ఉత్తరాదివారు స్థిరపడిన ప్రాంతాల్లో కారుకు పంక్చర్‌ పడగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించడం విశేషం. ఇక, దుబ్బాక ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సంచలనం సృష్టించింది! ఐదేళ్ల కిందట కేవలం నాలుగు రేకుల కమలం ఇప్పుడు 48 స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీఆర్‌ఎ్‌సతోపాటు ఇతర పార్టీల సిటింగ్‌ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

సీట్లపరంగా అతి పెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించినా.. ఓట్ల శాతం విషయంలో మాత్రం బీజేపీనే పైచేయి సాధించింది. ఇక, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం తానేనని గ్రేటర్‌లో గుద్ది మరీ చాటి చెప్పింది. 150 డివిజన్ల జీహెచ్‌ఎంసీ పాలక మండలికి డిసెంబరు ఒకటో తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్‌ఎస్‌ 55 డివిజన్లలో విజయం సాధిస్తే.. బీజేపీ 48 స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసింది. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో కూడా టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో ఉంది. కానీ, అభ్యర్థి మెజారిటీ కంటే ‘స్టాంపు’ ఓట్లు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఫలితాన్ని నిలిపి వేశారు. మజ్లి్‌సను వెనక్కి నెట్టేసి గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఎన్నికల్లో 44 స్థానాలను సాధించిన మజ్లిస్‌.. ఈసారి కూడా 44 డివిజన్లలో గాలిపటాన్ని ఎగరేసింది. బీజేపీ దూకుడు కారణంగా మూడో స్థానానికి పడిపోయింది. గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్‌ ఈసారి కూడా కేవలం రెండు డివిజన్లకే పరిమితమైంది. ఇక, బరిలో నిలిచిన టీడీపీ, టీజేఎస్‌, ఉభయ వామపక్షాలూ పత్తా లేకుండా పోయాయి.

మేయర్‌.. అంత వీజీ కాదు
గత ఎన్నికల తర్వాత గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని బాజాప్తా గెలుచుకున్న టీఆర్‌ఎ్‌సకు ఈసారి నల్లేరుపై బండి నడక కాదు. ప్రస్తుతానికి ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కలిపితే ఆ పార్టీ మొత్తం ఓట్లు 90 మాత్రమే. గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్‌ మార్కు దాదాపు 100. ఆకర్షించడానికి ఈసారి స్వతంత్రులూ లేరు. దాంతో, గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి మజ్లిస్‌ మద్దతు తీసుకుంటారా లేక ఆపరేషన్‌ కమల్‌కు శ్రీకారం చుడతారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. దాదాపు సగానికి సగం సిటింగ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఇందుకు రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది సిటింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత. గత ఎన్నికల్లో గెలిచిన 99 మందిలో 72 మందికే ఈసారి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. వారిలోనూ 35 మంది ఓటమి పాలయ్యారు. అంటే, సగానికి సగం సిటింగ్‌లు ప్రజాగ్రహాన్ని చవిచూశారు. తమ తమ డివిజన్లలో ఈ ఐదేళ్లలో కార్పొరేటర్లు ఏమీ చేయలేదని, కొంతమంది అయితే కనీసం ముఖం కూడా చూపించలేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయినా, మరోసారి వారికి పార్టీ అవకాశం ఇచ్చింది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించింది.

అలాగే, పార్టీలోని స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు, కొందరు ఎమ్మెల్యేలు, సిటింగ్‌ కార్పొరేటర్లకు పడకపోవడమూ పార్టీకి నష్టం చేసింది. ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సను ముంచేసిన మరో అంశం ఇటీవలి వరదలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మజ్లిస్‌ గట్టెక్కినా.. టీఆర్‌ఎ్‌సకు నష్టం తప్పలేదు. ఉదాహరణకు, ఎల్బీ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ స్థానాలైన 10 డివిజన్లలో ఒక్క దానినీ ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. మొత్తానికి మొత్తంగా వాటిని బీజేపీ కైవసం చేసుకుంది. వరద ముంపునకు గురైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. స్థానిక కార్పొరేటర్లపై వ్యతిరేకతతోపాటు వరదల సమయంలో తమను పట్టించుకోలేదన్న ప్రజల ఆగ్రహమే ఇక్కడ టీఆర్‌ఎ్‌సకు ప్రతికూలంగా మారింది.

ప్రభుత్వం అందజేసిన రూ.10 వేల వరద సాయం అందకపోవడమూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ప్రతికూలంగా మారిన మరో అంశం దాదాపు మూడు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం. ధరణి దెబ్బకు రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది. శివారు డివిజన్లలో ఎక్కువ మందికి ఇదే ప్రధాన ఆదాయ వనరు. దీనికితోడు, ఆస్తులు అమ్ముకునే అవకాశం లేకపోవడం వ్యాపారాలూ వివాహాది శుభకార్యాలూ నిలిచిపోయాయి. దీనికితోడు, ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంతో సంబంధితులపై పెద్ద భారమే పడింది. ఇవి కూడా ప్రజాగ్రహానికి కారణమని చెబుతున్నారు. ఇక, 2016 ఎన్నికల సమయంలో నిరుపేదలు ఆత్మగౌరవంగా నివసించేందుకు లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ఐదేళ్లలో కేవలం 2,500 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు అందజేసింది. 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయలేదు.

టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతకు ఇది మరో కారణమని విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్లలో రోడ్లకు రూ.600 కోట్లు ఖర్చు చేసినా.. వాటిలో నాలుగో వంతు మాత్రమే కాలనీ రోడ్లకు ఖర్చు చేశారు. వరదల దెబ్బకు అవి కూడా రోలర్‌ కోస్టర్ల మాదిరిగా మారాయి. వరదల సమయంలో.. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అసలు దారే లేదు. రోడ్లకు సంబంధించి ప్రజల ఆగ్రహం ఎన్నికల్లో ప్రతిఫలించింది. మరోవైపు, పోస్టల్‌ బ్యాలెట్లలోనూ బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తద్వారా, ఉద్యోగులు, వృద్ధులు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్న విశ్లేషణ వెలువడుతోంది. ఇక, దుబ్బాక తరహాలోనే నిరుద్యోగులు కూడా టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా పని చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

హోరాహోరీ తప్పదా?
గ్రేటర్‌ ఎన్నికల పోరాటం ముగిసిన నేపథ్యంలో పార్టీలన్నీ త్వరలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, వరంగల్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలతోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఆరు నెలల్లో జరగనున్న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలపై దృష్టి సారించనున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక మినహా మిగిలిన చోట్ల టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికల నుంచే డౌన్‌ఫాల్‌
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారం కైవసం చేసుకున్న టీఆర్‌ఎ్‌సకు ఆరు నెలల్లోనే ఎదురు దెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అనుకున్నట్లు 16 స్థానాల్లో కాకుండా తొమ్మిదిచోట్లనే గెలిచింది. బీజేపీ 4 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్‌ మూడు సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడు, దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత సుస్పష్టంగా కనిపించినా.. నిజానికి, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నుంచే టీఆర్‌ఎస్‌ డౌన్‌ఫాల్‌; కమల వికాసం ప్రారంభమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

తర్వాత జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ సిటింగ్‌ సీటును టీఆర్‌ఎస్‌ గెల్చుకున్నా.. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన సిటింగ్‌ సీటును బీజేపీకి సమర్పించుకుంది. మధ్యలో వచ్చిన స్థానిక ఎన్నికలను మినహాయిస్తే, క్రమంగా ‘కమలం’ వికసిస్తుండటం, కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారటం రాజకీయ సమీకరణాల్లో మార్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత టీఆర్‌ఎ్‌సకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండటం కీలక పరిణామంగా మారింది. తాజాగా, గ్రేటర్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను బీజేపీ స్థిరపరచుకుంది. ప్రత్యేకించి తాజా ‘గ్రేటర్‌’ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తీసుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ మధ్యే ఉండనున్నాయనే అభిప్రాయాలు బలపడ్డాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates