కశ్మీర్‌ క్షోభకు కారకులు ఎవరు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రధాన స్రవంతి కశ్మీరీ నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఆకస్మికంగా మోదీ ప్రభుత్వానికి సమ్మతం కాని వ్యక్తులైపోయారు. రాజ్యవ్యవస్థకు ముప్పు కలిగించే వ్యక్తులుగా ఆ ముగ్గురినీ కేంద్రం పరిగణిస్తోంది. పరిపాలనలో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారనో, ఎన్నికలలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారనో ఆరోపణలు చేస్తే అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా వారిని ఒక్కసారిగా దేశద్రోహులుగా చూడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?

ఎప్పటి విషయాలు అప్పుడే చెప్పాలి. ఎందుకంటే, మనం ‘ఇక్కడే, ఇప్పుడే’ జరిగి తీరాలని సదా ఆరాటపడే కాలంలో జీవిస్తున్నాం కదా. ఈ వ్యాసం ఆరంభంలో ప్రస్తావించిన ఉదంతాన్ని , నిజానికి, భవిష్యత్తులో స్థిమితంగా రాయదలుచుకున్న వృత్తి జీవిత స్మృతుల సంపుటికి వదిలివేయాలని భావించాను. అయితే ఆ ఘటనలు తమ ప్రాసంగికతను కోల్పోక ముందే వాటి గురించి చెప్పడమే ఎంతైనా ఉత్తమం మరి.

2000 సంవత్సరంలో నేను పాకిస్థాన్‌లో పర్యటించాను. కశ్మీర్ లోయను అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాద బృందాల ఉనికి, మనికి తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నాను. నా ప్రయాణాలు రావల్పిండిలోని యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్ళాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ సలాహుదన్‌తో సమావేశమయ్యేందుకే నేను అక్కడికి వెళ్ళాను.

జిహాద్ యోధునితో నా మాటా మంతీ అంత సామరస్యపూర్వకంగా సాగలేదు. సలాహుద్దీన్ భారీ మనిషి. పొడవాటి గడ్డంతో, పఠాన్ దుస్తులలో చూపులకు భీకరంగా కన్పించాడు. నేను పాత్రికేయుడినన్న విషయాన్ని ఆయన విశ్వసించలేదు. నేనూ, నా వెంట వచ్చిన కెమెరాపర్సన్ భారత ప్రభుత్వ గూఢచారులమని ఆయన గట్టిగా విశ్వసించాడు. మా పాస్‌పోర్ట్‌లు, కెమెరాలను గుంజుకుని, మా ఇరువురినీ ఒక గదిలో బంధించాడు.

ఒక గంట అనంతరం సలాహుద్దీన్ మా వద్దకు వచ్చాడు. మా పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాడు. అతని గొంతులో బెదిరింపు ధోరణి ప్రతిధ్వనించింది. అలా కొంత సేపు గర్జిస్తూ హుంకరిస్తూ హఠాత్తుగా శాంతమూర్తి అయిపోయాడు. ఆయన వైఖరి మారిపోయింది. మాట తీరులో మా పట్ల మన్నన వ్యక్తమయింది. మాతో పిచ్చా పాటీ జరిపాడు. ‘నేను 1987లో జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేశానన్న విషయం మీకు తెలుసా?’అని సలాహుద్దీన్ మమ్ములను అడిగాడు. ఆ వెంటనే ఇలా కొనసాగించాడు: ‘నా విజయం ఖాయమని విశ్వసించాను. అయితే చివరి క్షణంలో మీ ఢిల్లీ ప్రభుత్వం ఫరూఖ్ అబ్దుల్లా సర్కార్‌తో కలిసి రిగ్గింగ్‌కు పాల్పడింది. నా లాంటి అభ్యర్థులందరినీ ఓడించడమే లక్ష్యంగా ఫరూఖ్, రాజీవ్ ప్రభుత్వాలు ఆ చర్యకు పాల్పడ్డాయి’. ఒక స్పష్టమైన అసహనంతో ఆయన ఈ మాటలు అన్నాడు. నేను మృదువుగా తల పంకించాను. మా ‘ఆతిథేయి’కి ఇంకెంత మాత్రం ఆగ్రహం కల్గించకుండా వుండేందుకు నేను చాలా జాగ్రత్త వహించాను. శ్రీనగర్‌లోని ఒక మదరసాలో ఇస్లామిక్ ధర్మాల ప్రబోధకుడు ఒకరు ఆకస్మికంగా ఒక కరడుగట్టిన ఉగ్రవాదిగా ఎలా మారిపోయాడన్నది సుప్రసిద్ధ నవీన కశ్మీరీ ఐతిహ్యాలలో ఒకటి (అన్నట్టు 1987లో సలాహుద్దీన్‌కు ఎన్నికల ఏజెంట్లుగా పనిచేసిన వారిలో యాసిన్ మాలిక్ ఒకరు. ఈయనే తదనంతరకాలంలో జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ అయ్యాడు).

పాకిస్థాన్ పర్యటనలో నాకు 1987 కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వాస్తవాలు తెలిశాయి. ఆ ఎన్నికలలో స్వయంగా పోటీ చేసి, వివాదాలకు కేంద్రంగా ఉన్న వ్యక్తే ఆ వాస్తవాలను వెల్లడించాడు. రాజకీయ అపరాధాలు చరిత్ర గతిని ఎలా మార్చివేస్తాయనే విషయమై నాకు గొప్ప నిశిత పరిజ్ఞానాన్ని, అంతర్‌దృష్టిని సలాహుద్దీన్ వెల్లడించిన వాస్తవాలు కలిగించాయి. ‘నేను ఆ ఎన్నికలలో గెలిచివున్నట్టయితే, ఇప్పుడు నేను కశ్మీర్ ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖ మంత్రిగా వుండే వాడినేమోనని’ అంటూ సలాహుద్దీన్ భావయుక్తంగా నవ్వాడు. సందేహం లేదు, పెద్ద నవ్వే నవ్వాడు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌తో నా ముఖాముఖీలో నేను కించిత్ ఆనందంగా ఉన్న క్షణం ఏదైనా ఉందంటే, బహుశా, ఈ నవ్విన వేళే అని చెప్పవచ్చు. ఆ క్షణాన, సలాహుద్దీన్ చుట్టూ వున్న భీకర సాయుధ వ్యక్తుల మీద నుంచి కూడా నా దృష్టిని ధైర్యంగా మరో వైపునకు మరల్చగలిగాను!

సరే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాకు సలాహుద్దీన్‌తో నా అనుభవాల గురించి చెప్పాను. చెప్పి, నిర్మొహమాటంగా ఇలా ప్రశ్నించాను: ‘1987 కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కార్‌తో కలిసి మీ ప్రభుత్వం రిగ్గింగ్‌కు పాల్పడడానికి మిమ్ములను పురిగొల్పిందేమిటి?’ తీక్ష్ణమైన ప్రశ్న. డాక్టర్ అబ్దుల్లా తొలుత తన విలక్షణ రీతిలో ఇలా ప్రతిస్పందించారు: ‘నేను ఎన్నికలలో గెలిచేందుకై రిగ్గింగ్‌కు పాల్పడాల్సిన అవసరం నాకు వుందని మీరు నిజంగా భావిస్తున్నారా? అసలు నా పై రిగ్గింగ్ ఆరోపణలు చేసిన మహానుభావులు ఎన్నికల కమిషన్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు?’ ఆ తరువాత, పసందైన విందును ఆస్వాదించిన అనంతరం అబ్దుల్లా సాబ్ నా ప్రశ్న విషయమై ఆలోచనామగ్నులయ్యారు. ప్రశాంతంగా ఇలా అన్నారు: ‘ముస్లిమ్ యునైటెడ్ ఫ్రంట్ (సలాహుద్దీన్ ప్రాతినిధ్యం వహించిన పార్టీ) ఆ ఎన్నికలలో గెలిచివున్నట్టయితే , కశ్మీర్‌ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించి వుండేది. అజాదీకి పిలుపు నివ్వడమో లేక పాకిస్థాన్‌లో చేరిపోవడమో జరిగివుండేది. ఒక భారతీయ పౌరుడిగా నేను ఇటుంవంటి విద్రోహ, విపత్కర పరిణామాలు సంభవించేందుకు ఎలా అనుమతిస్తాను? ఎట్టి పరిస్థితులలోనైనా నేను అలా చేస్తానా?’

డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాతో నా సంభాషణ జరిగి ఐదు నెలలు గడవక ముందే కశ్మీర్ కథ మరో మలుపు తిరిగింది. డాక్టర్ అబ్దుల్లా గృహనిర్బంధితుడయ్యారు. దాదాపు రెండు నెలలుగా ఆయన ఆ నిర్బంధంలోనే వున్నారు. ప్రజాభద్రత చట్టం కింద ఆయనను గృహనిర్బంధం పాలు చేశారు (శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నాడని భావించిన ఏ వ్యక్తి నైనా సరే ఎటువంటి విచారణ లేకుండా ఆరు నెలల పాటు నిర్బంధించడానికి; జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నాడని భావించిన ఏ వ్యక్తినైనా సరే ఎటువంటి విచారణ లేకుండా రెండు సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచేందుకై ప్రభుత్వానికి ఈ ప్రజా భద్రత చట్టం అనుమతిస్తుంది). చిత్రమేమిటంటే భారత్‌కు ఎనలేని హాని కలిగించిన, కలిగిస్తోన్న సయ్యద్ సలాహుద్దీన్ మాత్రం పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా వున్నాడు. భారత్‌పై విషం కక్కుతూనే వున్నాడు. భారత రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే వున్నాడు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణ 370ని రద్దు చేసిన తరువాత మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ వైఖరి ‘జాతీయవాది’ డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను, ‘ఉగ్రవాద- వేర్పాటువాది’ సలాహుద్దీన్ లిరువురినీ భారత రాజ్యవ్యవస్థకు ‘శత్రువులు’గా పరిగణిస్తోంది! కాకపోతే ఒకరు శ్రీనగర్‌లోని తన సొంత బంగ్లాలో బందీగా వుండగా మరొకరు పాకిస్థాన్‌లో భద్రంగా వున్నారు! ఎందుకిలా జరిగింది? కశ్మీర్ లోయలో నెలకొనివున్న ఆందోళనకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఇదొక యుక్తమైన ప్రశ్న.

కశ్మీర్‌లో ఇప్పుడు జాతీయ వాదం, వేర్పాటు వాదం మధ్య విభజన రేఖలు చెరిగిపోయాయి. ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్లే ఇది చోటు చేసుకున్నది. ప్రతి కశ్మీరీ రాజకీయవేత్తను సమస్యలు సృష్టించే వ్యక్తిగా లేదా రహస్య తిరుగుబాటుదారుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? కశ్మీర్ లోయలో రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. నిరసనలు తెలిపే వారిని, భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే వారిని ‘జాతి-వ్యతిరేకులు’గా పరిగణిస్తున్నారు. ఎటువంటి రాజకీయ ప్రదర్శనలలో పాల్గొనని షరతుపై వేర్పాటువాద హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ చేత ఒక బాండ్‌పై సంతకం చేయించుకుని నిర్బంధం నుంచి విడుదల చేశారు. అయితే భారత రాజ్యాంగాన్ని మనసా, వాచా, కర్మణా శిరసావహించిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను ఇప్పటికీ గృహ నిర్బంధంలో కొనసాగిస్తున్నారు! కశ్మీర్‌లో కల్లోల పరిస్థితులను తొలగించేందుకు ఇవి ఎలా దోహదం చేస్తాయి?

ప్రజాస్వామ్యవాదులందరూ అడగవలసిన ప్రశ్న ఇది. గృహ నిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులలో ఒకరైన డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండిటితోనూ కలిసి పని చేశారు. ఆయన కుమారుడు, మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా వున్నారు. ఇక మెహబూబా ముఫ్తీ ఏడాది క్రితం బీజేపీ భాగస్వామిగా వున్న సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. కశ్మీర్‌లో తమ కుటుంబ పాలనను శాశ్వతంగా నెలకొల్పేందుకు ఆ ముగ్గురూ ప్రయత్నించారని విమర్శిస్తే ఎవరూ కాదనలేరు. వామపక్షాలు మినహా అటువంటి ఆరోపణలకు గురి కాని నాయకులు లేని రాజకీయ పక్షం మరేదైనా మన దేశంలో వున్నదా? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై గుత్తాధిపత్యం వహిచి, స్వప్రయోజనాలకు తమ అధికారాలను దుర్వినియోగం చేశారని ఆరోపించినా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రులు, అధికారంలో వున్న మంత్రులూ, ముఖ్యమంత్రులూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కదా! జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో నిధుల దుర్వినియోగానికి ఫరూఖ్ అబ్దుల్లా బాధ్యుడని ఆరోపించడం న్యాయ సమ్మతమవుతుంది. అలా కాకుండా ప్రజా భద్రత చట్టం కింద ఆయన్ని నిర్బంధించడం సబబేనా? 81 సంవత్సరాల వయస్సున్న డాక్టర్ అబ్దుల్లా భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడం అసంబద్ధగా లేదూ?

డాక్టర్ అబ్దుల్లా గురించిన మరో ముఖ్య విషయాన్ని మనం విస్మరించకూడదు. కశ్మీర్ విషయమై పలు అంతర్జాతీయ వేదికలపై ఆయన భారత్ ప్రతినిధిగా పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సంపూర్ణంగా భారత్‌లో అంతర్భాగమని ఆయన ఎన్నో మార్లు నొక్కి చెప్పారు. ఇలా భారత్ పక్షం వహించిన ఆ నాయకుడిని ఇప్పుడు అకారణంగా గృహ నిర్బంధం పాలుచేయడమేమిటి? కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాకిస్థాన్ ప్రమేయమున్నదని ఆయన ఎన్నిసార్లు ఎలుగెత్త లేదు? అబ్దుల్లాలను గానివ్వండి, ముఫ్తీలను గానివ్వండి రాజకీయంగా ఓడించి తీరాలి. అయితే రాజ్యాంగ విరుద్ధంగా నిర్బంధంలో ఉంచడం ద్వారా మాత్రం కాదు. అలా చేయడం పూర్తిగా అనుచితం. ఇంతకూ అబ్దుల్లాలను, మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధంలో కొనసాగించడం ద్వారా మోదీ ప్రభుత్వం సాధిస్తున్నదేమిటి? వారికి అయోగ్యమైన గొప్పదనాన్ని సంతరింపచేయడమే కాదూ? భారత రాజ్యాంగానికి నిబద్ధమైన ఆ మాజీ ముఖ్యమంత్రులు ముగ్గురినీ నిర్బంధంలో ఉంచడం వల్ల కశ్మీర్‌లో ఒక ప్రమాదకరమైన రాజకీయ శూన్యాన్ని సృష్టించినట్లవుతోంది. ఈ రాజకీయ శూన్యంలో కశ్మీరీలు అనిశ్చితి, నిరాశానిస్పృహల మధ్య కొట్టుమిట్టాడవలసివస్తుంది. సరే, పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా ఉన్న సయ్యద్ సలాహుద్దీన్ కశ్మీర్ లోయలో అధికరణ 370 రద్దు అనంతరం సంభవించిన పరిణామాలు చూసి 1987లో సంభవించిన అన్యాయాలకు బాధితులైన వారికి న్యాయం జరిగిందని భావించకుండా వుంటాడా? 1987లో జమ్మూకశ్మీర్ శాసనసభా ఎన్నికలలో ఆనాటి ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కార్ తో కుమ్మక్కయి రిగ్గింగ్‌కు పాల్పడింది. ఆ అప్రజాస్వామిక చర్యే ఉగ్రవాదాన్ని రగుల్కొల్పింది. ఉగ్రవాద పర్యవసనాలతోనే కశ్మీర్‌కు నేటి దుస్థితి దాపురించింది. ఆనాటి ఆ తప్పు మరెన్ని విషమ పరిణామాలకు దారితీయనున్నదో?

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

RELATED ARTICLES

Latest Updates