కుప్పకూలిన థామస్‌ కుక్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • నిధుల కటకటతో మూసివేత
  • ముగిసిన 178 ఏళ్ల చరిత్ర
  • బెయిల్‌ అవుట్‌కు ఆసక్తి చూపని బ్రిటన్‌
  • రోడ్డున పడనున్న 22 వేల మంది ఉద్యోగులు
  • బ్రెగ్జిట్‌ అనిశ్చితే కారణం !

 

 

ఎప్పుడు ప్రారంభమైంది1841లో

కస్టమర్లు..- ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది

టర్నోవర్‌ ఏటా 1000 కోట్ల పౌండ్లు

సంక్షోభం ఎప్పటి నుంచి- మైట్రావెల్‌ కొనుగోలు నాటి నుంచి

మెజారిటీ వాటా ఎవరికి- చైనా సంస్థ ఫోసన్‌కు

బ్రిటన్‌కు చెందిన దిగ్గజ పర్యాటక సంస్థ థామస్‌ కుక్‌ కథ ముగిసింది. 178 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ దివాలా తీస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఆన్‌లైన్‌ పోటీ, బ్రెగ్జిట్‌ అనిశ్చితితో నెమ్మదించిన బ్రిటన్‌ పర్యాటక రంగం కలసి థామస్‌ కుక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. భారీగా ఆఫర్లు ప్రకటించినా ఎవరూ ముందుకురాని పరిస్థితి. చైనాకు చెందిన ఫోసన్‌ సంస్థకు థామస్‌ కుక్‌లో అత్యధిక వాటా ఉంది. ఇప్పటికే గత నెలలో రూ.3,900 కోట్లు (45 కోట్ల పౌండ్లు) థామ్‌సకుక్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది. మున్ముందు మరో 45 కోట్ల పౌండ్లు పెట్టుబడులు పెడతామని, అందుకు ప్రతిగా.. సంస్థలో 75 శాతం వాటాను, విమానయానంలో 25 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.

అయితే.. దీనిపై రెండు సంస్థల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడకు కనీసం రూ.1,763 కోట్ల (20 కోట్ల పౌండ్లు) నిధులు అవసరం కాగా.. ఆ మొత్తాన్ని సమీకరించడంలో సంస్థ విఫలమైంది. బ్రిటన్‌ ప్రభుత్వమైనా ఆదుకుంటుందేమోనని ఆశించిన థామస్‌ కుక్‌కు అక్కడా భంగపాటే ఎదురైంది. బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ఆలోచన లేవీ తమకు లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌ కుండ బద్దలుకొట్టేశారు.

‘‘మా వాటాదారులు, రుణదాతలకు మధ్య చర్చలు విఫలమయ్యాయి. సంస్థ దివాలా ప్రకటించడం తప్ప మరో దారిలేదని బోర్డు తీర్మానించింది’’ అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో థామస్‌ కుక్‌ వెల్లడించింది. 1841లో థామస్‌ కుక్‌ నెలకొల్పిన ఈ ప్రయాణ సంస్థ, తొలుత బ్రిటన్‌లోని ప్రయాణికులను చేరవేసింది. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలకు పర్యాటకులను తీసుకెళ్లే ట్రావెల్‌ సంస్థగా స్థిరపడింది. అయితే.. 2007లో మైట్రావెల్‌ సంస్థను విలీనం చేసుకున్నప్పటి నుంచీ కుక్‌ అప్పుల్లో కూరుకుపోయింది. తిరిగి కోలుకోలేనంతగా సంస్థ పరిస్థితి దిగజారిపోయింది.

చిక్కుల్లో 6 లక్షల మంది పర్యాటకులు!

థామస్‌ కుక్‌ ద్వారా విదేశాల్లో పర్యటనలకు వెళ్లిన సుమారు 6 లక్షల మంది పలు దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 1.5 లక్షల మంది బ్రిటన్‌ వాసులున్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ‘ఆపరేషన్‌ మ్యాట్‌హార్న్‌’ పేరిట అత్యవసర ప్రణాళికలను రచించింది. పదుల సంఖ్యలో చార్టర్డ్‌ విమానాలను ఆయా దేశాలకు పంపించామని వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ చరిత్రలో ఇదే అది పెద్ద తరలింపు ఆపరేషన్‌గా చెబుతున్నారు. మరోవైపు.. ఈ దివాలాతో ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న 22వేలమంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోనున్నారు. వీరిలో 9వేలమంది బ్రిటన్‌లోనే ఉన్నారు.

భారత్‌పై ప్రభావమెంత?

బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలనుంచి థామస్‌ కుక్‌ ద్వారా భారత్‌కు వచ్చే పర్యాటకులు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. కుక్‌ దివాలాతో విదేశీ మారకంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికారిక సమాచారం ప్రకారం 2019 ఏడాదికిగాను ఇప్పటి వరకూ భారత్‌లో పర్యటించిన వారిలో 8.01 శాతంమంది బ్రిటన్‌వాసులున్నారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం మందగిస్తున్న తరుణంలో థామస్‌ కుక్‌ మూసివేత పర్యాటక రంగంపై ప్రభావం చూపించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. థామస్‌ కుక్‌ దెబ్బ ప్రధానంగా గోవాపై పడనుంది. గోవాకు దాదాపు 30 వేల మంది బ్రిటన్‌వాసులు వస్తారు. ఇందులో అత్యధికంగా థామ్‌సకుక్‌ నిర్వహించనున్న చార్టర్డ్‌ విమానాల ద్వారా ఇక్కడకు వస్తారు.

పరిస్థితి ఏమిటి?

థామస్‌ కుక్‌ ఇండియాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ సంస్థ 2012లో కొనుగోలు చేసింది. బ్రాండ్‌ పేరును వాడుకుంటున్నందుకు ఏటా రూ. 2 కోట్లు చెల్లిస్తోంది. తాజాగా మాతృసంస్థ దివాలా ప్రకటించడంతో.. భారత్‌, శ్రీలంక, మారిషస్‌ దేశాలకు గాను ఆ పేరును శాశ్వతంగా కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు ఫెయిర్‌ఫాక్స్‌ తెలిపింది. బ్రిటన్‌లో దివాలాతో భారత్‌లోని థామస్‌ కుక్‌కు సంబంధం లేదని, ఇన్నేళ్లుగా ఉన్నట్లే తమకు ఆదరణ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. దివాలా విషయంపై ఫెయిర్‌ఫాక్స్‌ స్పష్టతనిచ్చినప్పటికీ.. థామస్‌ కుక్‌ ఇండియా షేరు 2.68 శాతం నష్టంతో రూ. 152.30 వద్ద క్లోజైంది.

courtesy Andhrajyothy…

RELATED ARTICLES

Latest Updates