విశ్వం ఆవిర్భవించింది. సృష్ఠించబడలేదు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

మాయలతో మంత్రాలతో ఈ భూమి పుట్టలేదు. ఏదో ఓ దేవుడు తీరికగా భోంచేసి కూర్చుని ఈ విశ్వాన్ని, సకల చరాచర జగత్తుని సృష్టించలేదు.

మనిషిగా పుట్టినవాడు మనిషిగా ఆలోచించాలి. తన పుట్టుకను, తన అస్థిత్వాన్ని, సమాజ గతిని అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే సైన్సు తెలుసుకోవాలి. కనీసం కామన్‌సెన్స్‌ (ఇంగితజ్ఞానాన్ని) ఉపయోగించాలి. కామన్‌సెన్స్‌ ఉపయోగించకుండా ఎవరైనా మాట్లాడితే తాము మూర్ఖులమని వారికి వారే ప్రకటించుకున్నట్టు అవుతుంది. అలాంటి వారు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంతటి స్థితిలో ఉన్నా వారి వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు.

ఐదువందల బిలియన్‌ సంవత్సరాల పూర్వం, భూమిపుట్టిన తొలిదశలో భూమి ఉపరితల ఉష్ణోగ్రత అత్యంత గరిష్ట స్థాయిలో ఐదువందల సెంటీగ్రేడ్‌ నుండి ఆరువేల సెంటీగ్రేడ్‌ వరకు ఉంది. కొన్ని మిలియన్‌ సంవత్సరాల తరువాత భూమి కొంత చల్లబడింది. అప్పుడు భూమిలోపల ఉన్న, తక్కువ బరువున్న మూలకాలు హైడ్రోజన్‌, హీలియం, నైట్రోజన్‌, కార్బన్‌ వంటివి భూమి ఉపరితలంపైకి వ్యాపించి ప్రాథమిక వాతావరణం ఏర్పడింది. జీవుల పుట్టుక, మనుగడ కోసం భూమి ఉపరితలంలో జరిగిన పరిణామాల గూర్చి వివరంగా తెలుసుకోవడం ప్రతివారికీ అవసరం.

ఆక్సిజన్‌ ఎలా ఏర్పడింది? ఏకకణ జీవులు ఎలా రూపొందాయి వంటి విషయాలు తెలుసుకున్న తర్వాత, జీవపరిణామం గురించి తెలుసుకోవడం మంచిది. ఒకవైపు ఖగోళ శాస్త్ర విశేషాలు, మరోవైపు జీవ పరిణామం గురించి తెలుసుకుంటే గాని విషయం పూర్తిగా బోధపడదు.

ఈ విశ్వం గురించి, నక్షత్రాల గురించి కొన్ని వాస్తవాలు చెప్పుకుందాం. గెలాక్సీలో కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి. అందులో సూర్యుడు ఒక నక్షత్రం. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి, ఇతర గ్రహాలతో పాటు తానున్న గెలాక్సీ కేంద్రకం చుట్టూ గంటకు 7,20,000 కి.మీ. వేగంతో తిరుగుతుంది. దానికి పట్టే కాలం 225×10(6). దీన్ని ఒక కాస్మిక్‌ యూనిట్‌ అంటారు. భూమి నుండి సూర్యుడి దూరం 14,95,98,500 కి.మీ. దీనిని ఒక ఆస్ట్రానమిక్‌ యూనిట్‌ అంటారు.

గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ తమని ఆకర్షించే వాటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయంటే.. తమను ఆకర్షించే నక్షత్రాలపై పడిపోకుండా! నక్షత్రాలు, వాటిని ఆకర్షించే కేంద్రకాలలో పడిపోకుండా ఉండడానికి! ఉదాహరణకు సైకిల్‌ మీద తొక్కకుండా కూర్చుంటే కింద పడిపోతాం. తొక్కుతూ ముందుకు కదులుతూ ఉంటే పడిపోకుండా ఉంటాం. బాలెన్స్‌ చలనం ద్వారా సాధ్యమవుతుంది.

భూమి గంటకు 1670 కి.మీ. వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ గంటకు 1,08,000 కి.మీ. వేగంతో తిరుగుతూ ఉంది. ఒక రాకెట్‌ భూమ్యాకర్షణ శక్తి దాటుకుని అంతరిక్షంలోకి వెళ్ళాలంటే సెకనుకు 11.2 కి.మీ. వేగం కావాలి. సైన్సు చెపుతున్న ఇలాంటి వివరాలు ఏ మత గ్రంథంలోనూ లేకపోవడం మనం గమనించాలి!

ఈ విశ్వంలో లెక్కలేనన్ని గెలాక్సీలున్నాయి.

అందులో ఎన్నెన్నో నక్షత్రాలు వాటితోపాటు భూమి వంటి ఎన్నో గ్రహాలు, మరెన్నో ఇతర పదార్థాలూ ఉన్నాయి. జీవం కూడా విశ్వంలోనే ఆవిర్భవించింది. అందువల్ల శాస్త్రజ్ఞుల దృష్టిలో విశ్వమే విశ్వాన్ని సృష్టించుకుంది. విశ్వాన్ని గానీ, జీవాన్ని గానీ ఎవరూ సృష్టించలేదు. కాలగమనంలో పరిణామ క్రమంలో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. మనముందు రెండు సిద్ధాంతాలున్నాయి. ఒకటి థియరీ ఆఫ్‌ స్పెషల్‌ క్రియేషన్‌. దీన్ని మత విశ్వాసకులు నమ్ముతున్నారు. తమ తమ దేవుళ్లే ఈ సృష్టికి కారణమని వారు విశ్వసిస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు, రుజువులు వారి దగ్గర లేవు. ఉంటే పరిణామ వాదాన్ని వివరించినట్టుగా ఒక క్రమ పద్ధతిలో వారు తమ సృష్టివాదాన్ని కూడా వివరించగలిగితే బావుంటుంది.

ఇక రెండోది పరిణామ సిద్ధాంతం. దాని ప్రకారంగా అంచెలంచలుగా భూమి ఎలా ఏర్పడింది. భూమిపై వాతావరణం ఎలా ఏర్పడిందీ… క్రమ క్రమంగా జీవులు ఎలా పుట్టుకొచ్చాయనే విషయాలు ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలు ధారపోసి తెలుసుకున్నవి. వారు ఎంతో బాధ్యతతో వాటిని ఈ సమాజానికి అందిస్తూ వచ్చారు. రుజువులు, సాక్ష్యాలు చూపుతూ విషయం స్పష్టంగా చెప్పే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మూఢ విశ్వాసం ఆధారంగా కల్పించుకున్న ఒక భ్రమను ఎలా నమ్ముతాం? ఇది మనిషైన వాడు, మెదడున్నవాడు

ఆలోచించుకోవాల్సిన విషయం. లేదూ మా విశ్వాసంలోనే మాకు ఆనందముంది.. అని ఎవరైనా అనుకుంటే అది వారి ఇష్టం. వ్యక్తి స్వేచ్ఛని కాదనలేం.

అసలైతే ఒక రకంగా సృష్టికర్త మానవుడే. భూమి పుట్టి కోటానుకోట్లు గడిచిపోయినా మనిషికి దేవుడి గూర్చి ఏ మాత్రం తెలియదు. రాతియుగంలో ప్రకృతి వైపరీత్యాలకు భయపడి మనిషి దేవుణ్ణి తనకు తానుగా సృష్టించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో మతాలు రంగప్రవేశం చేశాయి. వివిధ ధర్మాలు జనజీవితంలో ప్రవేశించాయి.

ఐదువేల సంవత్సరాలకు ముందే హిందూధర్మం వర్థిల్లిందని చరిత్ర చెపుతోంది. ధర్మమే మతంగా మారింది. అలా హిందూ మతం ద్వారా అనేకనేక దేవుళ్ళు వెలుగులోకి వచ్చారు. అయితే వారిలో ఏ దేవుడి ద్వారా సృష్టి జరిగిందన్న దానికి స్పష్టత లేదు. హిందూ మతం వారే కాదు, ప్రతి మతం వారు మా దేవుడే ఈ సృష్టికి మూలకారకుడని చెప్పుకుంటున్నారు.

కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే క్రీస్తు పుట్టాడు. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఉన్న ఈ సృష్టిని జీసస్‌ సృష్టించడమేమిటి? ఇది పూర్తిగా అబద్ధం. అసంబద్ధం. అంతే కాదు, అసంభవం. ఒకవైపు ఖగోళశాస్త్రం, మరోవైపు చరిత్ర, ఒకింత జీవశాస్త్ర పరిజ్ఞానం పెంచుకుంటే భ్రమలు వాటంతట అవే తొలగిపోతాయి.

సరే, ఇక అల్లా సంగతి చూద్దాం. ఇస్లాం మతం ఆరో శతాబ్దపు చివరలో స్థాపించబడింది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న ఈ సృష్టిని అల్లా కూడా సృష్టించలేదు. ఆయనకు రూపకల్పన జరగక ముందునుండే ఈ సృష్టి ఉంది. జీసస్‌, మహమ్మద్‌లకు ఒక రూపం రాకముందే జనం యూదుల దేవుడైన యహోవాని పూజించుకునేవారు. యూదుల మతం నాలుగువేల ఐదువందల నుండి ఆరువేల సంవత్సరాల పురాతనమైంది. క్రైస్తవ, ఇస్లాం మతాలకు మూలం యూదుల మతమే! వారి దేవుడైన అల్లా – యహోవా ఇద్దరూ ఒకరే కానీ, వారి ప్రవక్తలు వేరు. క్రైస్తవులు జీసస్‌ని నమ్ముకుని యూదు దేవుణ్ణి కొలిస్తే.. ముస్లింలు మహ్మద్‌ని నమ్మి యూదు దేవుణ్ణే అల్లా అనిపించుకున్నారు. ఇవన్నీ మనిషికి ఊహ తెలిసిన తర్వాత ఏర్పాటు చేసుకున్న మతాలు. చాలా వరకు వీటి చరిత్ర రాజకీయంతో ముడివడి ఉంది.

ఇట్లా ఏ మతానికి, లేదా ఏ దేవునికి సంబంధించిన వివరాలు చూసినా అన్నీ విశ్వం ఏర్పడిన తర్వాత.. పరిణామ క్రమంలో మనిషి రూపొందిన తర్వాత.. ఏర్పాటు చేసుకున్నవే! మనిషే తనకు కావల్సిన మతాలు, ధర్మాలు ఏర్పరచుకుంటూ వస్తున్నాడన్నది అర్థం చేసుకోవాలి.

ఇప్పుడు అనుకుంటున్నట్టు ఈ సృష్టికి ఏ దేవుడూ మూలకారకుడు కాదని కచ్చితంగా తెలుస్తూ ఉంది. ఈ చిన్న ప్రాధమిక విషయం మనిషి ఆలోచించుకోకపోవడం తెలివితక్కువ తనమే కదా? ఒకప్పటి ఆటవిక యుగం నుండి ఇప్పటి అత్యాధునిక యుగం వరకు మనిషి దేవుణ్ణి చూసిందే లేదు. కారణం ఆలోచనని, ఊహని, భ్రమని మనిషి చూసుకోలేడు. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించొచ్చు. అంతే.. మళ్ళీ అవి సక్రమంగా సహేతుకంగా ఉన్నదీ లేనిది సమాజం గమనిస్తూనే ఉంటుంది.

మనకు అందుతున్న వైజ్ఞానిక సమాచారం ప్రకారం ఏకకణ జీవుల నుండి వెన్నెముక లేని (అకశేరుకాలు) జీవుల ఏర్పడ్డాయి. ఇవి ప్రాథమిక జీవ సమూహంలో 350 మిలియన్‌ సంవత్సరాల క్రితం పురాజీవ మహాయుగంలోనివి. ఆ తర్వాత కాలంలో అవశేరుకాల నుండి సకశేరుకాలు (వెన్నెముక గల జీవులు) ఏర్పడ్డాయి. వాటి నుంచి చేపలు ఆవిర్భవించాయి. వీటి నుంచి ఉభయ చరాలు, వాటి నుంచి సరీసృపాలు, మళ్ళీ వాటి నుంచి పక్షులు, క్షీరదాలు, జరాయు క్షీరదాలు (పాలిచ్చే జంతువులు) ఆవిర్భవించాయి.

ఆధునిక జీవ మహాయుగంలో ప్లియోసీన్‌ శకంలోని మానవుడి ఉద్భవం జరిగింది. టూకీగా పరిణామ దశల్ని చెప్పుకోవడమెందుకంటే ప్రాథమిక పరిజ్ఞానంతో మత గ్రంథాలు రాసిన వారెవరూ ఇలాంటి వివరాలు ఇవ్వలేదు. తమను తాము తెలుసుకున్న గొప్ప తత్వవేత్తలెవరంటే శాస్త్రజ్ఞులే! సైన్సు తెలుసుకుంటేనే తమను తాము తెలుసుకున్నట్టు. కళ్ళు, ముక్కూ మూసుకుని దైవప్రార్థన చేయడమంటే ఏమిటీ? మనిషి ప్రాథమిక దశలో ఏర్పరుచుకున్న దైవభావనని ధ్యానిస్తూ కూర్చోవడమన్న మాట! దానివల్ల భౌతిక ప్రపంచంలో ఏ మార్పులూ రావు. శారీరకంగా విశ్రాంతి లభిస్తుంది. ఇతర విషయాలేవీ ఆలోచించకుండా ఉండడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా మనసు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే.. దానివల్ల ఏ అద్భుతాలూ జరగవు.

సైన్సుకు మత గ్రంథాలకూ వైరుధ్యం ఎప్పుడూ ఏర్పడుతూ వస్తోంది. అందుకు కారణమేమంటే సైన్సు ఎప్పుడూ నిరంతరం మారుతూ ఉంటుంది. కాలానుగుణంగా కొత్త కొత్త విషయాలు చేర్చుకుంటుంది. ఒకప్పుడు ఉజ్జాయింపుగా చెప్పిన అంశాల్ని స్పష్టంగా, కచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆదిమానవుడిని సంస్కరిస్తూ ఆధునికుడిగా, అత్యాధునికుడిగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. మనిషి ధర్మంగా బతకడానికి మత గ్రంథాలు గతంలో కొంత వరకు ప్రయత్నించాయి. ఒప్పుకోవల్సిందే.. కానీ ఎప్పుడో ప్రాథమిక అవగాహనతో రాయబడ్డ అన్ని మత గ్రంథాలు ఆధునికుడి మేధో శక్తితో పోటీ పడలేక వెనకబడిపోతున్నాయి. కొత్త ఆలోచనలకు, కొత్త కొత్త ప్రశ్నలకు అందులో జవాబులు దొరకడం లేదు. ఆయా మత విశ్వాసాల్లో బతికేవారు బతకొచ్చు. అది వారి ఇష్టం. కానీ, ఒక విషయం అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మత గ్రంథాల సారాంశం వల్ల గానీ, మత బోధకుల వల్ల గానీ, మత విశ్వాసాల వల్లగానీ ఈ ప్రపంచం ముందుకు రాలేదు. ఇక ముందు కూడా ముందుకుపోదు.

వైజ్ఞానిక శక్తి మాత్రమే మనిషికి తిండిపెట్టి బతికిస్తోంది. జబ్బుచేస్తే నయం చేస్తోంది. అంతరిక్షంలోకి తీసుకెళుతోంది.

అదీగాక, మత బోధకులు నైతికంగా దిగజారి మతాన్ని ఒక వ్యాపారంగా మార్చేశారు. అందువల్ల సామాన్య జనానికి వారి మీద గౌరవం ఉండడం లేదు. పైగా మాయ మాటలు చెప్పే రాజకీయ నాయకులు, మత పెద్దలు ఒకరికొకరు సహాయమందించుకుంటూ అక్రమంగా బలిసిపోతున్నారు. ఇక విలువలూ, గౌరవాలూ ఎక్కడుంటాయి? అందుకే ఆత్మవిశ్వాసం లేనివారే దైవశక్తిని నమ్ముకుంటారన్న అభిప్రాయం బలపడుతూ ఉంది.

డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్‌, సెల్‌: 9573706806

RELATED ARTICLES

Latest Updates