గల్లా పెట్టె ఖాళీ..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ప్రతిష్టాత్మక పథకాలకు నిధుల లేమి
రైతుబంధు, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి పరిస్థితీ ఇదే 
కార్పొరేషన్ల ద్వారా వచ్చే రుణాలూ వెనుకపట్టు 
ఈ యేడాది ఇప్పటికే రూ.6,319 కోట్ల అప్పు
మొత్తంగా రుణభారం రెండున్నర లక్షల కోట్లు 
ఈనెలాఖరు లేదా సెప్టెంబరు మొదటి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌
బి.వి.యన్‌.పద్మరాజు

టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రతిష్టాత్మకంగా పేర్కొన్న రైతుబంధు పథకానికి సంబంధించి ఈ యేడాది ఇప్పటి వరకూ దాదాపు 18 లక్షల మందికి చెక్కులు రాలేదు. ఇంతే ప్రాధాన్యతగల మరో పథకం ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1500 కోట్లు పేరుకుపోయాయి.దీంతో గురువారం అర్థరాత్రి నుంచి సేవలను బంద్‌ చేస్తామంటూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రకటించాయి. కళ్యాణలక్ష్మి పథకానికి డబ్బుల్లేవంటూ పత్రికల్లో వరస కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకింత కునారిల్లుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాలను ఆరాతీయగా.. ఖజానా ఖాళీ, గల్లా పెట్టెలో పైసల్లేవ్‌ అనే సమాధానాలు వస్తున్నాయి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వెబ్‌సైట్‌ సైతం ఇదే అంశాన్ని ధృవీకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్‌ 2019) నుంచి ఇప్పటి వరకూ మొత్తం రూ.6,319 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో కలిపి మన అప్పు మొత్తం రెండున్నర లక్షల కోట్లకు చేరింది. వీటన్నింటికీ కలిపి నెలకు సగటున వెయ్యి కోట్ల నుంచి రూ.1500 కోట్ల దాకా వడ్డీలు చెల్లిస్తున్నారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు (గతేడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ) ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పుడు సర్కారును సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతున్నాయని సమాచారం. రైతుబంధు, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి తదితరాంశాలు వీటిలో ముఖ్యమైనవి. వీటి అమల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తా మంటూ సీఎం అప్పట్లో చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కడా అది కనబడటం లేదు. పెన్షన్లు ఎప్పుడూ నెలాఖరులోనే వస్తున్నాయంటూ పలు జిల్లాలకు చెందిన లబ్దిదారులు చెబుతున్నారు. ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న కారణంగానే ఇవన్నీ ఆలస్యమవుతున్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. తాము కూడా అదే మాదిరిగా పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతామంటూ చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురావటం లేదు. అయితే ఎప్పటికైనా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి కాబట్టి.. ఈనెలాఖరులోనో లేక సెప్టెంబరు మొదటి వారంలోనో ఆ తతంగాన్ని పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించినట్టు వినికిడి. మరోవైపు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటి ద్వారా మొన్నటి దాకా పలు బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ రూపంలో కూడా అప్పులు పుట్టే పరిస్థితి కానరావటం లేదు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గటంతోపాటు.. సచివాలయం, అసెంబ్లీ తదితర నిర్మాణాలకు ఎక్కువగా ఖర్చు చేయనున్న నేపథ్యంలో, అప్పులిస్తే తిరిగి ఎలా చెల్లిస్తారంటూ బ్యాంకులు సర్కారును ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కారణంతో రుణాలు ఇచ్చేందుకు వివిధ బ్యాంకులు వెనకాడుతున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మధ్యంతర భృతి (ఐఆర్‌)ని సర్కారు పెండింగ్‌లో పెట్టింది. వేతన సవరణ కూడా 2014 తర్వాత ఇప్పటి వరకూ జరగలేదు. దీనిపై ప్రభుత్వ పెద్దలు.. అప్పుడు, ఇప్పుడూ అంటూ దాటవేస్తూ వస్తున్నారు. పీఆర్సీపై విశ్రాంత ఐఏఎస్‌ సీఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలో కమిటీ వేసి ఏండ్లు గడుస్తున్నా.. ఇంతవరకూ అతీగతీ లేదు. దీంతో కాలయాపన కోసమే కమిటీని వేశారంటూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలు విషయమేమంటే.. నిధుల లేమి వల్లే ఐఆర్‌నూ, పీఆర్సీనీ ప్రకటించటం లేదు.
ఇదే సమయంలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇప్పుడు బిల్లులు విడుదలకాక లబోదిబోమంటన్నారు. వీరిలో కూడా బడాబడా కాంట్రాక్టర్లు.. అటో ఇటో చేసి తమ డబ్బులను విడుదల చేయించుకుంటున్నారు. కానీ చోటా మోటా కాంట్రాక్టర్లు మాత్రం దిక్కుతోచక అల్లాడుతున్నారు. బిల్లుల విడుదలపై అధికారాన్ని మొత్తం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు అప్పగించారు. ఆయన్ను కలిసేందుకు వస్తే కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వటం లేదని ఓ కాంట్రాక్టరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతున్నదని ఆయన తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నూతన భవనాల నిర్మాణాలు, గుళ్లూ, గోపురాలకు విరివిగా విరాళాలివ్వటంపైన్నే సర్కారు దృష్టి కేంద్రీకరించటం గమనార్హం.

 

(Courtacy Nava Telangana)

RELATED ARTICLES

Latest Updates