రోగం మింగుతోంది

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలు ఏటా వైద్యం కోసం చేస్తున్న ఖర్చు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా రూ.7,941 కోట్లు ఖర్చు చేస్తున్నారని జాతీయ ఆరోగ్య అంచనా నివేదిక వెల్లడించింది. ఇది రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 1.4 శాతంతో సమానం. అంటే తలసరి వైద్య ఖర్చు రూ.3,054 ఉండటం గమనార్హం. రాష్ట్రప్రభుత్వం ప్రజారోగ్యానికి చేస్తున్న ఖర్చు రూ.5,148 కోట్లు. ప్రభుత్వం, ప్రజలు కలిపి రాష్ట్రంలో వైద్యానికి చేస్తున్న ఖర్చు మొత్తం రూ.13,089 కోట్లు. ప్రజలు చేస్తున్న ఖర్చులో 70 శాతం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకే వెళ్తోంది. మిగిలిన సొమ్ము మందుల కోసం, ఇతరత్రా ఖర్చవుతోంది. వైద్యం కోసం అవుతున్న ఖర్చులో ప్రజలు తమ జేబులో నుంచే 64.7 శాతం ఖర్చు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 11.2 శాతం, కేంద్రం 8.6 శాతం, ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలు 4.4 శాతం, స్థానిక ఆరోగ్య పథకాల ద్వారా 1.7 శాతం, ఇతర పథకాల ద్వారా 5.2 శాతం, ప్రభుత్వ ఆరోగ్య బీమాల ద్వారా 4.2 శాతం ఖర్చవుతోంది. అంటే ప్రజల జేబులే గుల్లవుతున్నాయని జాతీయ అకౌంట్స్‌–2018 నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ సంపాదనలో 10 శాతం వరకు వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. దారుణమైన పరిస్థితి ఏంటంటే.. వైద్యానికి అవుతున్న ఖర్చు కారణంగా దేశంలో ఏటా దాదాపు 3.5 కోట్ల మంది నిరుపేదలుగా మారుతున్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవడం, కుటుంబ పెద్ద చనిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉందని నివేదిక తెలిపింది.

వ్యాధులు చుట్టుముడుతున్నాయి.. 
బీపీ, మధుమేహం, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధుల వల్ల అనేక ప్రమాదకరమైన వ్యాధులు మున్ముందు పట్టిపీడిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 2016 లెక్కల ప్రకారం దేశంలో గుండె, డయేరియా, రోడ్డు ప్రమాదాలు, నవజాత శిశు మరణాలు, ఎయిడ్స్, టీబీ, ఊపిరితిత్తుల కేన్సర్, డయాబెటిక్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్, లివర్‌ కేన్సర్, బ్రెస్ట్‌ కేన్సర్‌లు వరుసగా ఆయా స్థానాల్లో ఉన్నాయి. 2040 నాటికి వచ్చే సరికి అట్టడుగున ఉన్న భయంకరమైన వ్యాధులు మొదటి స్థానాల్లోకి వచ్చి చేరే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉదాహరణకు 2016 నాటి లెక్కల ప్రకారం 15వ స్థానంలో ఉన్న డయాబెటిక్‌ 2040 నాటికి ఏడో స్థానంలోకి వచ్చి చేరనుంది. 16వ స్థానంలో ఉన్న కిడ్నీ వ్యాధి 2040 నాటికి ఐదో స్థానానికి రానుంది. అల్జీమర్స్‌ 2016లో 18వ స్థానంలో ఉంటే, 2040 నాటికి ఆరో స్థానానికి రానుంది. 20వ స్థానంలో ఉన్న కాలేయ కేన్సర్‌ 13వ స్థానానికి రానుంది. గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోట్లు 2040 నాటికి కూడా మొదటిస్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉండే మలేరియా, 2040 నాటికి 22వ స్థానానికి చేరుకోనుంది. 29వ స్థానంలో ఉన్న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 2040 నాటికి 19వ స్థానానికి రానుంది. రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రస్తుతం 5వ స్థానంలో ఉంటే, 2040 నాటికి 8వ స్థానానికి చేరుకోనుందని అంచనా. ప్రస్తుతం వ్యాధులు వస్తున్న వారిలో 30 శాతం మంది మలేరియా, డెంగీ తదితర సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్నారు. 60 శాతం మంది షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, కాలేయం తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. 10 శాతం మంది వివిధ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌..  
అందరికీ ఉచిత ఆరోగ్యం తీసుకురావాలని న్యూయార్క్‌లో రెండ్రోజుల కిందట జరిగిన అంతర్జాతీయ నేతలు నిర్ణయించారు. దీనిపై భారత్‌ కూడా సంతకం చేసింది. ఈ ప్రకారం ఎవరూ వైద్యం అందక చనిపోవడం కానీ, రోగాల బారిన పడటం కానీ జరగకూడదనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యం. ఆ ప్రకారం తెలంగాణలో చూస్తే కోటి కుటుంబాలు వివిధ ఆరోగ్య పథకాల్లో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 77.19 లక్షల కుటుంబాలు, ఉద్యోగుల పథకం ద్వారా 5.75 లక్షల మంది, సింగరేణి, పోలీసు, ఈఎస్‌ఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మిగిలినవారు వైద్య వసతులు పొందుతున్నారు. అందుకోసం ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. జబ్బు వస్తేనే వైద్యం కాకుండా జబ్బు రాకముందే స్క్రీనింగ్‌ చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

2025 నాటికి.. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 నాటికి తన లక్ష్యాలను నిర్దేశించింది. వాటిని మన దేశం కూడా అనుసరించాలని తెలిపింది. పొగాకు వినియోగాన్ని 30 శాతానికి తగ్గించడం. శారీరక శ్రమ చేసే వారి సంఖ్యను మరో 10 శాతానికి పెంచడం, బీపీ సంఖ్యను 25 శాతానికి తగ్గించడం, స్థూలకాయాన్ని సున్నా శాతానికి చేర్చడం, మద్యం అలవాటును 10 శాతానికి, ఉప్పు తీసుకోవడాన్ని 30 శాతానికి తగ్గించాలని
సూచించింది.

ముందస్తు చర్యలే కీలకం : డాక్టర్‌ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌ 
అందరికీ ఉచిత వైద్యమనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చింది. వైద్యం కోసం ఖర్చు తడిసి మోపెడు అవుతుండటంతో ప్రజలు పేదలుగా మారిపోతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ నేతలు యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌పై సంతకాలు చేశారు. ప్రభుత్వం పెడుతున్న ఖర్చు కంటే ప్రజలు 70 శాతం వరకు ఖర్చు చేస్తున్నారు. ఇది మారాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

వ్యాధులతో మానవ వనరులు వృథా : డాక్టర్‌ కమల్‌నాథ్, హైదరాబాద్‌ 
వ్యాధులు చుట్టు ముట్టడం, ఆసుపత్రుల వైపు జనం పరుగులు తీస్తుండటంతో మానవ వనరులన్నీ వృథాగా పోతున్నాయి. జబ్బులు రాకుండా చేయడం ద్వారానే ఈ పరిస్థితిని మార్చగలం. అందువల్ల ప్రభుత్వం అందరికీ బీపీ, షుగర్, కేన్సర్‌ వంటి స్క్రీనింగ్‌ వైద్య పరీక్షలు చేయాలి. ముందస్తుగా గుర్తిస్తే వాటిని నయం చేయడం సులువవుతుంది.

Courtesy Sakshi…

RELATED ARTICLES

Latest Updates