భగీరథ, కాకతీయకే 24 వేల కోట్లు కావాలి
- సచివాలయం కోసం బైసన్ పోలో ఇవ్వండి
- నీతి ఆయోగ్ సిఫారసు అమలు చేయండి
- అసెంబ్లీ తీర్మానం మేరకు కోటా పెంచాలి
- హైకోర్టు జడ్జిల సంఖ్యను 42 చేయండి
- ప్రధానమంత్రి మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
- 50 నిమిషాల పాటు ముఖాముఖి చర్చలు
- నదుల సంధానానికి సాయం కోరిన సీఎం
- అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ
న్యూఢిల్లీ/హైదరాబాద్ : రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసిన విధంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు 12 శాతం, బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించాలని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రహదారుల అభివృద్ది, వరంగల్ టెక్స్‌టైల్ పార్కు కోసం రూ.30 వేల కోట్ల నిధులను సమకూర్చాలని కోరారు. హైకోర్టు జడ్జీల సంఖ్యను పెంచాలని, పలు సంస్థలను నెలకొల్పాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మోదీ దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. శుక్రవారం మోదీతో దాదాపు 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. దాదాపు పది నెలల తర్వాత మోదీని కలిసిన కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గతంలో ప్రస్తావించిన 22 అంశాలకు సంబంధించి విజ్ఞప్తి లేఖలను అందించారు. సచివాలయ నిర్మాణం కోసం బైసన్‌పోలో మైదానాన్ని రాష్ట్రానికి ఇచ్చే విషయమై ప్రధాని చొరవ చూపాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గోదావరి-కృష్ణా అనుసంధానం గురించి తాను, ఏపీ సీఎం జగన్ కలిసి జరుపుతున్న చర్చల సారాంశాన్ని కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నదుల అనుసంధానంతో రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాలు సాగుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఏర్పడిందని, ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, కేంద్రం సహకారం అందిస్తే నిర్మాణాత్మక పద్ధతిలో ముందుకు వెళతామని చెప్పారు. ఇందుకు ప్రధాని ఆశీస్సులు కావాలని కోరారు. అయితే, ఉమ్మడి ప్రాజెక్టు అంశాన్ని వినతిపత్రాల్లో చేర్చలేదు.
జోనల్‌కు ఆమోదం తెలపండి : సీఎం తన పర్యటనలో భాగంగా హోంమంత్రి అమిత్‌షాను, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కూడా కలిశారు. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థల మార్పులకు ఆమోదం చెప్పాలని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయనతో 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు. జిల్లాలను పెంచిన నేపథ్యంలో రెండు జోన్లను ఆరు జోన్లకు పెంచామని, దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించారని వివరించారు. తర్వాత కాలంలో మరో 2 జిల్లాలను పెంచినందున వాటిని జోన్లలో అధికారికంగా చేర్చడానికి వీలుగా మరోసారి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అమలు చేయాలని కోరారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు కేంద్రం 60 శాతం కాకుండా వంద శాతం భరించాలని కోరారు. రాష్ట్ర విభజన వివాదాలు, సమస్యలపై ఏపీ సీఎం జగన్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా హోంమంత్రికి వివరించారు. సీఎం వెంట టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ వచ్చారు.
రక్షణ శాఖ భూములు ఇవ్వండి : సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలోని బైసన్ పోలో మైదానం భూములను ఇవ్వాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సచివాలయాన్ని కూల్చివేసి, అదేచోట కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, హైకోర్టు అభ్యంతరం చెప్పింది. ఈ నేపథ్యంలో బైసన్ పోలో మైదానంలో నూతన సచివాలయం నిర్మాణానికి భూములు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. రహదారుల విస్తరణకు, ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని ప్రతిపాదించారు. బదులుగా మరోచోట రక్షణ శాఖకు భూములు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం వెంట కేకే, నామా నాగేశ్వరరావు, రాములు, బీబీ పాటిల్ వచ్చారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.
విజ్ఞప్తి లేఖలో ముఖ్యాంశాలు
- వెనుకబడిన జిల్లాల అభివృద్థి కోసం ఇచ్చే నిధుల్లో రూ.450 కోట్లు పెండింగులో ఉన్నాయి.
- ఆదిలాబాద్ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి.
- తెలంగాణ హైకోర్టులో జడ్డిలను 42కు పెంచాలి.
- తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐఐఎ్‌సఇఆర్) మంజూరు చేయాలి.
- హైదరాబాద్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడి)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌కు కేటాయించిన ఎన్‌ఐడీ విశాఖకు తరలింది.
- మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
- పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. అవసరమైన నిధులు విడుదల చేయాలి
- నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
- తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ప్రకారంచట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
- బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
- జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు విడుదల చేయాలి.
- అసెంబ్లీ తీర్మానం మేరకు ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
- పీపీపీ పద్ధతిలో కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ నెలకొల్పాలి.
- హైదరాబాద్-నాగపూర్, వరంగల్-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి పరచాలి.
- వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల పథకం కింద రూ.4 వేల కోట్లు ఇవ్వాలి
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల ఖర్చు వందశాతం కేంద్రమే భరించాలి.
- కేంద్రం ఖర్చుతో వరంగల్లో గిరిజన వర్సిటీ పెట్టాలి.
- వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు రూ.వెయ్యి కోట్లివ్వాలి.
- రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి
- వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.
Courtesy Andhrajyothi…