బీసీ కార్పొరేషన్కు కేటాయింపులేవీ..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– పి. ఆశయ్య

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసింది. చేతివృత్తుల సంక్షేమం కోసం పాటు పడుతామని, ఆధునిక పద్ధతిలో వృత్తులను మారుస్తామని ప్రగల్భాలు పలికింది. కేసీఆర్‌ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది తిరగకముందే తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో వెనుకబడిన తరగతుల కార్పొరేషన్స్‌కు, వివిధ ఫెడరేషన్‌లకు నిధులే లేకుండా చేశారు. జీఓ190 ప్రకారం బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం ఎన్నికల ముందు పెద్ద ఎత్తున హడావుడి చేసి ప్రతి ఒక్కరికి రూ.లక్ష వరకైతే 80శాతం సబ్సిడీ రూ.2లక్షల వరకైతే 70శాతం సబ్సిడీ 5లక్షల నుంచి 12లక్షల వరకైతే 60శాతం సబ్సిడీతో రుణాలిస్తామని పెద్దపెద్ద ప్రకటనలు చేశారు. ఆశపడ్డ బడుగులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ వృత్తి దారులు సుమారు 5.70లక్షలమంది ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసారు. పోయిన ఐదేండ్ల కాలంలో ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రభుత్వ తీరుచూస్తుంటే ”ఏరుదాటే వరకు ఓడమల్లయ్య,, దాటిన తరువాత బోడి మల్లయ్య” అన్నట్టు ఉన్నది.
యంబీసీ కార్పొరేషన్‌
2017 ఏప్రిల్‌ నెలలో అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ (యంబీసీ) ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌కు రూ.1000కోట్లు కేటాయించారు. యంబీసీ కులాల జాబితా ఇవ్వకుండానే ఛైర్‌మెన్‌ని ప్రకటించారు. ఎంబీసీ సంఘాల ఐక్య ఉద్యమాల ఫలితంగా 26 జూన్‌ 2018 జీఓ16 ప్రకారం 36 సంచార జాతుల వారిని యంబీసీలుగా ప్రకటించి జీఓ ఇచ్చినారు. గత రెండేండ్ల బడ్జెట్‌ని ఖర్చు చేయకుండానే కాలయాపన చేశారు. 2018-19బడ్జెట్‌లో రూ.1000కోట్లు ప్రకటించి రూ.100కోట్లు గుడుంబ బాధితులకు ఇచ్చారు. మరో 150కోట్లు బతుకమ్మ చీరల కోసం నిధులు మళ్లించారు. అత్యంత వెనుకబడిన సంచార జాతులైన మొండిబండ, దొమ్మర, గంగిరెద్దుల, బుడుబుక్కల, పిచ్చకుంట్ల, పరికిమొగ్గల, వీరముష్టితో పాటు 29 కులాలున్నాయి. వీరందరు సంచార జాతులు. ప్రధానంగా బిక్షాటన చేసుకుంటూ జీవించేవారు. వీరందరిని అభివృద్థి చేయాల్సినటువంటి కార్పొరేషన్‌ యింతవరకూ నిధులివ్వలేదు.
13వేల మంది దరఖాస్తు చేసుకోగా నాలుగువేల మందికి రూ.50,000 చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నేటికీ నిర్దిష్టమైన ఎంబీసీ జాబితా తయారు చేయకుండానే కొన్ని కులాలనే గుర్తించి పక్కకు నెట్టారు. సంచార జాతులకు రూ.5కోట్లతో ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేస్తామనే హామీ బుట్టదాఖలైంది. బిక్షాటన చేసే సంచార జాతులు ఆత్మ గౌరవంతో బతకడానికి కొత్తకొత్త పథకాలు పెడతామని, ఎలక్ట్రికల్‌ ఆటోలు, ఇటుక బట్టీల తయారీ, ప్యాసింజర్‌ ఆటోలు లాంటి కొత్త ఉపాధి పథకాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ఐదుకోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌తో అత్యంత వెనుకబడిన వాళ్ళ అభివృద్థి ఎలా జరుగుతుందో ప్రభుత్వమే తెలుపాలి.

సేవా వృత్తుల ఫెడరేషన్‌లురజకులు, నాయి బ్రహ్మణుల సంక్షేమం కోసం గత రెండేండ్లలో 250 కోట్లు రజక ఫెడరేషన్‌కు మరో 250 కోట్లు నాయి బ్రహ్మణ ఫెడరేషన్‌కు కేటాయించారు. 2018లో ఖర్చు చేయలేదు. రజకులు 47వేల మంది ఆన్‌లైన్‌ ద్వారా రుణాలు కోసం దరఖాస్తు చేశారు. అందులో ఐదువేలమందికి రూ.50వేలు చొప్పున మాత్రమే రుణాలిచ్చారు. మోడ్రన్‌ దోభీగాట్‌లు 8జిల్లాల్లో నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం సిద్ధిపేటలోనే నిర్మించి చేతులు దులుపుకుంది. నాయి బ్రాహ్మణులకు గత సంవత్సరం రూ.200 కోట్లు ప్రకటించి కేవలం 20కోట్లు విడుదల చేసి 5,600మందికి 50వేల చొప్పున రుణాలిచ్చారు. దరఖాస్తులేమో 40వేలకు పైనే వచ్చాయి. మిగతా వాళ్ళకు రుణాలందియ్యటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎన్నికల ముందు నవీన సెలూన్‌ శాలలు, ఆధునిక లాండ్రీలు నెలకొల్పుతామని, బ్యూటిపార్లర్‌ శిక్షణ ఇచ్చి నాయి బ్రాహ్మణ మహిళలకు ఉపాధి కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. నాగస్వర బృందాలకు శిక్షణ ఇస్తామని చెప్పి మాట తప్పారు. 2019-20 బడ్జెట్‌లో ఈ రెండు తరగతులకు జీరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఆరె కటిక, దూదేకుల, తుర్కకాశలు తదితరులకు ఫెడరేషన్‌ పెడతామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి.
వివిధ ఫెడరేషన్‌లు
రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొనసాగుతున్న వడ్డెర, మేదర, విశ్వకర్మ, వాల్మీకి, బోయ, సాగర ఉప్పర, బట్రాజు, పూసల, గీత కార్మిక, కుమ్మరి పదకొండు ఫెడరేషన్‌లకు గత ఐదేండ్లలో పాలకవర్గాలను ఏర్పాటు చేయలేదు. నిధులు కేటాయించలేదు. రెండు లక్షల మందికి పైగా 190 జీవో ప్రకారం రుణాల కోసం దరఖాస్తు చేశారు. ఒక్కరికి కూడా రుణాలు అందించలేదు. పై ఫెడరేషన్లన్నింటికి 2019 -20లో జీరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.
రజకుల, నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం 2006లో జీవో 9 ప్రకారం అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో గత మూడు నెలలకొకసారి రజకుల, నాయిబ్రాహ్మణుల, ఇతర ఫెడరేషన్‌ కులాల సంక్షేమం కమిటీలపై రివ్యూ మీటింగ్‌లు జరిగేవి. అనేక జిల్లాల్లో యంబీసీలు, సంచార జాతులపైన 22కుల దురహంకార హత్యలు జరిగాయి. 70మంది పైన దాడులు జరిగాయి. 20గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలకు గురైనారు. పై సంఘటనలపైన జిల్లా సంక్షేమ కమిటీలు తగిన విధంగా స్పందించకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఏ ఒక్క ఘటనలోనూ బాధితులకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం ఏ ఒక్క విషయంపైన స్పందించ లేదు. ఈ సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడు?

సెల్‌: 9490098052

RELATED ARTICLES

Latest Updates