ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దాం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
తెరాస అధ్యక్షుడుగా కేసీఆర్‌ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను అమలు చేయించవలసిన బాధ్యత యావత్తు తెలంగాణ సమాజం మీద ఉంది. ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేయవలసిన బాధ్యత రాజకీయంగా, రాజ్యాంగపరంగా, నైతికంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ఆర్టీసీ పక్షాన చర్చలోకి, ఉద్యమంలోకి కదలిరావటం తక్షణ చారిత్రక అవసరం.
ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రజారవాణా వ్యవస్థగా కాపాడుకోవడానికి తెగించి సమ్మె చేస్తుంటే మహత్తరమైన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం కళ్ళముందు కదలాడుతోంది. ఆనాడు ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుల మీద నిఘావేసి అక్రమ రవాణామీద, రవాణాదోపిడీ మీద ఎంత పోరాటం చేశారో ఎంతగా కేసులకు గురయ్యారో, జైళ్ళపాలయ్యారో, ఎంత నిర్బంధం అనుభవించారో మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు పోరాటంలోకి రావటంతోనే సకలజనుల సమ్మె ఆనాటి ప్రభుత్వాన్ని వణికించింది. ఆ సమ్మె ఇక తెలంగాణ వచ్చి తీరుతుందనే విశ్వాసం ఇచ్చింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఆర్టీసీని కడుపులో దాచుకుని కాపాడుకుంటామని ఆర్టీసీకి, ఆర్టీసీ కార్మికులకు హామీ పడింది. తెలంగాణ ఉద్యమ హామీలను, ఉద్యమపార్టీగా తనను తాను పొగుడుకునే తెరాస పార్టీ ఆర్టీసీకి ఇచ్చిన హామీలను, తెరాస అధ్యక్షుడుగా ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లుగుచ్చుకుంటే తన నోటితో తీస్తానని కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయించవలసిన బాధ్యత యావత్తు తెలంగాణ సమాజం మీద ఉంది. ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేయవలసిన బాధ్యత రాజకీయంగా, రాజ్యాంగ పరంగా, నైతికంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద ఉంది. ఆర్టీసీ కార్మికులు నడుపుతున్న ఈ ఉద్యమానికి చారిత్రకంగా చాలా ప్రాధాన్యత ఉంది.

తీవ్రమైన అన్యాయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమ పార్టీ ప్రభుత్వం తన హిడెన్‌ అజెండా అమలు కోసం, తెలంగాణ అస్మితను అవమానపరిచే విధంగా, రవాణా వ్యవస్థకు ప్రాణప్రదమైన తెలంగాణ ఆర్టీసీని విధ్వంసం చేసే దుస్సాహసానికి పూనుకోవటం. ఏకంగా దరిదాపు 50 వేల మంది ఆర్టీసీ శ్రామికులు తమను తాము డిస్మిస్‌ చేసుకున్నారని ప్రకటించి ప్రత్నామ్నాయాలకు చూడటం.

ఆర్టీసీ ఈనాటిది కాదు. 1932 నుండి ప్రవర్ధమానమవుతూ వచ్చిన పెద్ద సంస్థ. దేశ ప్రజలలో ఆర్టీసీకి అరుదైన గౌరవం వుంది. అది ఎవరి దయతోనో వచ్చింది కాదు. ఆ శ్రామికులు ఎంతో క్రమశిక్షణతో, వృత్తి నైపుణ్యంతో తమను తాము కరిగించుకుంటూ అహోరాత్రులు శ్రమించి సాధించింది. నిజంగా పని గంటలు, శ్రమ భారాలు, పెరిగిన బస్సులు పరిగణనలోనికి తీసుకుని కార్మికులను నియమిస్తే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య రెట్టింపవుతుంది. ఆర్టీసీలో పదవీ విరమణలే జరుగుతున్నాయి కానీ నియామకాలు లేవు. ప్రపంచీకరణ దుర్మార్గాలను ఆర్టీసీలోకి తెచ్చిన తరువాత ఆర్టీసీకి విపత్తులు ఎదురవుతున్నాయి. సామాన్యుల బస్సులు తగ్గించి సంపన్నుల బస్సులు ప్రవేశపెట్టారు. అద్దె బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీ నడ్డి విరుస్తున్నారు. ఈ భారాలను సామాన్యప్రజలు మోస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అక్రమ, దొంగ రవాణాలో ప్రభుత్వాలను తలదన్నే ప్రైవేటు బస్సుల దోపిడీ ఆగుతుందని, తగ్గుతుందని ఆర్టీసీ శక్తిమంతమవుతుందని ప్రజలనుకున్నారు. ఆర్టీసీ శ్రామికులనుకున్నారు. తెలంగాణ ఉద్యమం సాగుతుండగా ఏర్పడిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఆర్టీసీకి మంచిరోజులు వస్తాయనుకున్నందువల్లనే ఆ శ్రామికులు తెరాస విజయానికి పాటుపడ్డారు. అయినా ఈ ఆరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీనే ధ్వంసం చేస్తూ తలకిందుల పాలన నిర్వహిస్తున్నది.
ఆర్టీసీ కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేసిన చారిత్రక అనుభవంతో ఒక సుసంఘటిత జెఏసిగా ఏర్పడి తమ తొలి గెలుపు నమోదు చేసుకుని 26 డిమాండ్లతో సమ్మెకు నోటీసు ఇచ్చారు. ఈ డిమాండ్లలో తమ ఉద్యోగాల భద్రత, న్యాయంగా జీతభత్యాల సవరణ అనే రెండు డిమాండ్లు కాక ఇతర డిమాండ్లన్నీ ఆర్టీసీని, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేవి, మెరుగుపరిచేవి. ప్రభుత్వం భేషజాలకు, అహంకారానికి పోకుండా తన శ్రామికుల గౌరవమే తన గౌరవం అనుకుని సమ్మె నోటీసులోని డిమాండ్లన్నీ అమలు పరిస్తే దేశంలో ఆర్టీసీకి గౌరవం పెరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు తమకోసం కన్నా ఆర్టీసీ కోసం ప్రజా రవాణా భవిష్యత్తు కోసం పోరాడుతున్నారనే ఎరుకలో ప్రభుత్వం ఉందా?
కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమకాలంలో ఉపయోగించిన భాషకు పూర్తి స్థాయిలో ప్రజామోదం వుండలేదు. అది ఆయన గుర్తించారో లేదో కానీ ఇప్పటికీ తన భాష మెరుగు పరుచుకోలేదు. ఆర్టీసీలో అహర్నిశలు ఆ సంస్థకోసం పని చేస్తున్న శ్రామికుల వల్లనే ఆర్టీసీ నష్టపోతున్నదని, ఆ శ్రామికులకు క్రమశిక్షణ లేదని అవమానకరంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఎనిమిది గంటలకు మించి పదహారు గంటలదాకా మగవాళ్ళేకాక మహిళా కార్మికులు తమ బిడ్డలకు చనుబాలు తాగించవలసిన వాళ్ళు కూడా పిల్లలను వదిలేసి వచ్చి కష్టపడుతున్నారు. అలాంటివారు ఈ ముఖ్యమంత్రికి మమ్మల్ని అవమానపరచే అధికారం ఉందా అని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది? ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలను తిడుతున్నారు. కార్మికులను రెచ్చగొడుతున్నారని, మీ పాలన వున్న రాష్ట్రాలలో ఆర్టీసీల సంగతేమిటని నిలదీస్తున్నారు. అధికార పార్టీ రాజకీయాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవుకదా! మీరు శ్రద్ధతో, కార్మికుల పట్ల గౌరవంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తే ప్రతిపక్ష పార్టీలకి ఈ పని ఉండదు కదా! అలాగే ప్రజా సంఘాలు మద్దతు పలుకుతుంటే కేసులు పెడుతున్నారని వింటున్నాము. ప్రజాసంఘాలు లేవనెత్తిన ప్రశ్నలలోంచి, నడిపిన పోరాటాలలోంచి మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఆ పునాది మీదనే తెరాస పార్టీ పుట్టింది. ఈ వాస్తవం మరిచిపోతే ఎలా?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో చర్చించకుండా, గడిచిన నెల రోజులుగా కొద్దిపాటి సమయం కూడా ఇవ్వకుండా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇదివరలో మంత్రివర్గ ఉపసంఘాలు పని చేసేవి. అధికారులు రూపొందించిన తక్షణ నివేదికలు, వెలువడుతున్న ప్రకటనలు ఆర్టీసీ భవిష్యత్తు పట్ల చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు నిర్దేశిత ఇంటర్నల్‌ సెక్రటేరియట్‌ ఆదేశాలను ప్రకటిస్తున్నారా అనే అనుమానం కార్మికులలో బలపడుతున్నది. 50% ఆర్టీసీ, 30% అద్దె బస్సులు, 20% పూర్తి ప్రైవేటు అనే ప్రకటనలో ఆర్టీసీని పూర్తి ప్రైవేటు గుంజకు కట్టేసి, ఆకలికి చంపే దుష్టత్వం మాత్రమే వుంది. లాభం వచ్చే 20 శాతం రూట్లను ప్రైవేటు దోపిడీ వర్గాలకు ఇచ్చేసి, 50 శాతం ఆర్టీసీ సంపాదించిన డబ్బును 30 శాతం అద్దెబస్సులకు చెల్లించిన తరువాత ఇక ఆర్టీసీకి మిగిలేదేమీ వుండదు– ఆకలి, అభద్రత తప్ప.
విద్య, వైద్యం, రవాణా కీలక ప్రజాసేవారంగాలు. అనివార్యంగా, అత్యవసరంగా, గొప్ప బాధ్యతతో ప్రభుత్వమే నిర్వహించవలసిన రంగాలు. విద్య వైద్య రంగాలలో ప్రైవేటీకరణ ముఖ్యమంత్రులు మారుతూ వచ్చినపుడల్లా పెరిగిపోయింది. ఆర్టీసీలో అద్దె బస్సులతో, రూట్లలో ప్రైవేటు బస్సుల అనుమతితో ఇది మొదలైంది. ప్రైవేటు శక్తులు మొత్తం రవాణా రంగాన్నే తమ చేతిలోకి తీసుకోవాలనుకున్నాయి. అవి ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా సేవా రంగాలలో లాభ నష్టాల చర్చ పెరిగింది. విద్య, వైద్య రంగాలలో ప్రైవేటు వాళ్ళకి రీయింబర్స్‌మెంటు చేస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వ ప్రకటిత రాయితీలు అమలు చేసినా రీయింబర్స్‌ మెంటు లేదు. ప్రజా సేవారంగాలను ప్రభుత్వం లాభనష్టాలతో కాకుండా సమాజ రవాణా సౌకర్యం పట్ల తన బాధ్యతగా చూడాలి. అలాగే ప్రైవేటు రంగ రవాణాలో అది సరుకుల రవాణాలో అయినా, మానవ రవాణాలో అయినా విపరీతమైన శ్రమ దోపిడీ వుంది. అక్కడ శ్రామికులకు శ్రమగౌరవం లేదు. జీవనగౌరవం లేదు. జీవన భద్రత అంతకన్నా లేదు. అదే పరిస్థితిని ఆర్టీసీ కార్మిక వర్గానికి కల్పించాలనుకుంటున్నారా? ఇంత అన్యాయమైన విధానానికి ప్రభుత్వం పూనుకోవటం ఏవిధంగానూ తగినది కాదు.
ప్రమాదాలు జరగని ప్రజా రవాణాను సాధించిన సంస్థగా ఆర్టీసీకి ప్రజలలో ఎంతో గౌరవం వున్నందువల్లనే ఆర్టీసీ సమ్మెకు పండగ పూట ఇంత ఆదరణ దొరుకుతున్నది. కార్మికవర్గ జీవన భద్రతలోనే సమాజ భవిష్యత్తు కాపాడబడుతుంది. అందువల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు ఆర్టీసీ పక్షాన చర్చలోకి, ఉద్యమంలోకి కదలిరావటం తక్షణ చారిత్రక అవసరం. ఏ కారణాల వల్లనైనా ప్రభుత్వంలోకి మారి సంఘాలను, సభ్యులను, ప్రజాకాంక్షను వదిలేసిన వివిధ సంఘాలు గౌరవప్రదమైన భవిష్యత్తుకోసం, విలువల కోసం ముందుకు వస్తారని ఆర్టీసీ జేఏసీ ఆశించటం తప్పు కాదనుకుంటున్నాను. గత నాలుగైదేండ్లుగా ఆర్టీసి పూర్తి ప్రైవేటీకరణకు మరో పెద్ద ముందడుగుగా రూట్ల ప్రైవేటీకరణ ఆలోచన చేస్తున్నది. దానిని ఈ సమ్మె భుజాల మీంచి అమలు చేసే చర్యకు పూనుకోవటం శతధా ప్రభుత్వ తప్పిదమే అని పోరాడుతున్న కార్మికుల గొంతుగా ప్రకటిస్తున్నాను. ఉద్వేగ పూరితమైన మద్దతు కాకుండా విధానపరమైన స్పష్టతతో ఆచరణలో కార్మికుల వెంట నడవాలని రాజకీయపార్టీలను డిమాండ్‌ చేస్తున్నాను.
ఎం. రాఘవాచారి
పాలమూరు అధ్యయన వేదిక

RELATED ARTICLES

Latest Updates