యురేనియం తవ్వకాలు ఆపేయాలి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రాజెక్టు రద్దుకు సిఎం చొరవ చూపాలి
లేదంటే జాతీయ స్థాయి ఉద్యమం
అఖిలపక్ష నాయకుల వెల్లడి
కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటన

యురేనియం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని, బాధిత గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి పునరావాసాన్ని కల్పించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం టిడిపి, సిపిఎం, సిపిఐ, సిపిఎంఎల్‌, సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసి, జనసేన, అమ్‌ఆద్మీపార్టీల నాయకులు పులివెందుల నియోజక వర్గం, వేముల మండలం పరిధిలో యురేనియం బాధిత గ్రామమైన కనంకిందకొట్టాలను సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో యురేనియం ప్రభావంతో నష్టపోయిన చేమంతి పంటను, టెయిలింగ్‌పాండ్‌ను పరిశీలించారు. ఆ తరువాత కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండంలం ఓబులంపల్లె గ్రామంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. యాదవాడ గ్రామంలో ప్రజలు డ్రిల్లింగ్‌ను అడ్డకోవడం హర్షణీయమన్నారు. యురేనియం తవ్వకాలను అనుమతించబోమని తెలంగాణా అసెంబ్లీలో తీర్మానించారని, ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ఈ విషయంలో ఎందుకు స్పందంచడంలేదో అర్ధం కావడం లేదన్నారు. పులివెందుల ప్రాంతంలో సిఎం రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని వారు సూచించారు. ఇటీవల సిఎం ప్రధానితో సమావేశమైనప్పటికీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని కోరలేదన్నారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని దీన్ని ఐక్యంగా తిప్పి కొట్టాలని వారన్నారు.
కనంకిందకొట్టాలలో బాధిత రైతు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పంట దిగుబడి బాగా ఉండేదని యురేనియం పరిశ్రమ ఏర్పాటు తర్వాత తీవ్ర ప్రభావం పడిందని నాయకుల దృష్టికి తెచ్చారు. నాలుగు నెలలకే చేతికందాల్సిన పంట ఆరునెలలైనా మొగ్గసరిగా తొడగడం లేదని తన గోడును వెల్లబోసుకున్నాడు. సింగంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ యురేనియం పరిశ్రమ కారణంగా గ్రామంలో 13మంది మహిళలకు గర్భస్రావం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, పెద్దలు చర్మవ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు క్యాన్సర్‌, చర్మవ్యాధులతో అనార్యోగ సమస్యలకు గురవుతున్నారనీ, పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయని, పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ప్రజలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ యురేనియం ప్రాజెక్టు నిర్వహణ కారణంగా ప్రజా జీవనం విచ్ఛిన్నమవుతోందన్నారు. ఇప్పటికే అన్ని పక్షాలు తీవ్రంగా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంటే ఒక్క వైసిపి, బిజెపి మాత్రమే దీనిపై నోరుమెదపడం లేదన్నారు. రాబోయే తరాలకు జీవించే అవకాశాన్ని కల్పించాలని ఆయన తెలిపారు. సిపిఎం రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ ఓబులు మాట్లాడుతూ గత పదేళ్లుగా యురేనియం వ్యర్థాలను నిల్వచేయడం ద్వారా అక్కడి ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. గాలి, నీరు, నేల విషతుల్యంగా మారాయని చెప్పారు. ప్రపంచంలో 85 శాతం దేశాలన్నీ యురేనియం ఉత్పత్తిని నిలిపివేశాయని తెలిపారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ యురేనియం పరిశ్రమ భవిష్యత్తు తరానికి భరోసా లేకుండా చేస్తోందని తెలిపారు. ప్రజల బతుకులను ఛిద్రం చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. కన్నకూతుళ్లు సొంత గ్రామంలో పురుడు పోసుకోవడానికి నిరాకరిస్తున్నారంటే పరిస్థితి ఏస్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ యురేనియం సమస్యను రాజకీయ కోణంలో చూడరాదన్నారు. ఓవైపు సమస్యతో తల్లడిల్లుతుంటే మరోవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడలోని పట్టాభూముల్లో ఎవరికీ తెలియకుండా డ్రిల్లింగ్‌ చేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. బాక్సైట్‌ను ఆపడానికి గతంలో ఎలా ముందుకు వచ్చారో అదే విధంగా యురేనియం ప్రాజెక్టును ఆపడానికి వైసిపి ముందుకు రావాలని కోరారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, మాజీ మంత్రి కేయి ప్రభాకర్‌, సిపిఎంఎల్‌ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సిపిఎంఎల్‌ రాష్ట్ర నాయకులు పెద్దన్న, ఆమ్‌ ఆద్మీ సీనియర్‌ నాయకులు పోతిన రామారావు, సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి టి రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Courtesy Prajashakthi…

RELATED ARTICLES

Latest Updates