- 4 గంటలపాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన
- దిగి వచ్చిన యాజమాన్యం.. కొత్త డ్రెస్ కోడ్ విధానానికి స్వస్తి..
- సోషల్ మీడియాతో ఏకమైన విద్యార్థినులు
- మోకాళ్ల కిందకు టాప్ ఉండాల్సిందే..
- గేటు వద్దే యువతుల డ్రెస్సుల తనిఖీ
బేగంపేట: మోకాళ్ల పైకి దుస్తులు ఉంటే ఇంటికే.. ఇలా రెండు నెలలుగా బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల యాజమాన్యం విద్యార్థినులను డ్రెస్ కోడ్ విధానంలో ఇబ్బందులకు గురిచేశారు. మహిళా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేసి చెక్ చేస్తుండడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. సోమవారం వేలాది మంది విద్యార్థినులు గేటు మూసివేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నాలుగు గంటల తర్వాత యాజమాన్యం దిగివచ్చి డ్రెస్‌కోడ్ విధానానికి స్వస్తి పలికింది. వివరాలిలా ఉన్నాయి.
ఒక్క ఇంచు తక్కువ ఉన్నా బయటకే..: బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో ప్రవేశ పెట్టిన డ్రెస్‌కోడ్ విధానం వివాదాస్పదంగా మారింది. వి ద్యార్థినుల టాప్ మోకాలి కింద దాకా ఉండేలా వేసుకురావాలనే నిబంధనపై విద్యార్థినులు ఆగ్రహించారు. యాజమాన్యం ఇటీవల ఈ నిబంధనలను కఠినతరం చేసింది. కళాశాల ప్రారంభ సమయంలో విద్యార్థును లు డ్రెస్‌కోడ్ పాటిస్తేనే లోపలకు పంపుతూ వచ్చారు. మహిళా భద్రతా సిబ్బందిని గేటు వద్ద ఏర్పాటుచేసి మ రీ మోకాలి కింద వరకు టాప్ ఉంటేనే లోపలకు అనుమతించడంతో విద్యార్థులు రగిలిపోయారు. స్వయంగా ప్రిన్సిపాల్ గేటు వద్ద ఉండి కొలిచి లోపలకు పంపడం వారిని మరింత ఆవేదనకు గురిచేసింది. రెండు నెలల నుంచి ఈ డ్రెస్‌కోడ్ విధానం వల్ల చాలా మంది హాజరు తగ్గడంతోపాటు పరీక్షలు కూడా రాయలేదన్నారు.
రోడ్డుపై విద్యార్థుల ఆందోళన.. తొలగించిన డ్రెస్‌కోడ్..: డ్రెస్‌కోడ్ విధానంతో రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థినులు సోషల్ మీడియా ద్వారా గ్రూపుగా ఏర్పడి సోమవారం కళాశాల గేట్లు మూసివేసి ఆందోళనకు దిగారు. రిమూవ్ ది డ్రెస్ కోడ్ … తదితర నినాదాలతో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ వేలాది మంది కళాశాల గేటునుంచి చిన్మయి స్కూల్ ప్రధాన రహదారి వరకు బైఠాయించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీరి ఆందోళన తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఒక దశలో వీరు కళాశాలలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కమిటీ ప్రతినిధులు ఈ విషయంపై సుమారు 2 గంటల పాటు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం పాత డ్రెస్‌కోడ్ విధానమే కొనసాగుతుందని, కొత్త డ్రెస్ కోడ్ విధానాన్ని తొలగిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ శాండ్రా ప్రకటించడంతో విద్యార్థినులు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు.
తక్కువ ఉంటే కిందకు లాగుతున్నారు..: టాప్ మోకాలికి దగ్గరలో ఉన్నా కిందకు లాగి మరీ కొలుస్తున్నారు. ఈ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. మమ్మల్ని అవమానపరిచారు. గేటు వద్దనే ఆపి టాప్‌ను లాగడం బాధకు గురిచేయడంతోనే ఆందోళనకు దిగాం.
– వినీత, విద్యార్థిని.
నిబంధనను తొలగించడం సంతోషం..: సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు పుల్ డ్రెస్ వేసుకుని కళాశాలకు వస్తారు. అయితే టాప్ మోకాలికి ఒక ఇంచు తక్కువ ఉన్నా కొలిచి మరీ బయటకు పంపడం బాధాకరం. ఈ విషయంలో విద్యార్థుల ఆందోళనతో కమిటీ దిగి వచ్చి నిబంధనను తొలగించడం సంతోషం.– విద్యార్థిని.
బాధించింది…: డ్రెస్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చిన కళాశాల యాజమాన్యం ఈ విషయంపై మేల్ ప్రొఫెసర్స్ ద్వారా విద్యార్థినులను అడిగించడం బాధ కలిగించింది. ఈ విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాం. దీంతో మహిళా భద్రతా సిబ్బందితో గేటు వద్దనే టాపును కొలవడం ప్రారంభించారు. ఇది అవమానంగా భావించాం. సోషల్ మీడియా ద్వారా ఏకమై ఆందోళనకు దిగాం. చివరకు కళాశాల యాజమాన్యం డ్రెస్‌కోడ్ విధానాన్ని తొలగించడం హర్షణీయం.
– ఫ్లకార్డుతో విద్యార్థిని.
Courtesy Andhrajyothi…