
- బిహార్ సర్కార్ దిద్దుబాట
- లేఖ రాయడమే దేశద్రోహమా..?
- అలా అయితే రోజుకొకటి రాస్తాం
- మరో 180 మంది సెలబ్రిటీల తాజా లేఖ
ప్రధానికి లేఖ రాసినందుకు 49 మంది ప్రముఖులపై పెట్టిన దేశద్రోహం కేసును బిహార్ పోలీసులు మూసేశారు. దేశంలో పెరిగిపోతున్న మూకదాడులపై శ్యామ్ బెనగల్, రామచంద్ర గుహ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్ సహా 49మంది ఆ లేఖ రాశారు. ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది స్థానిక కోర్టులో కేసు వేశారు. చీఫ్ మెట్రొపాలిటన్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ నేరశిక్షా స్మృతిలోని సెక్షన్ 156 (3) కింద దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించడంతో పోలీసులు తదనుగుణంగా నమోదు చేశారు. ఇది దేశవ్యాప్తంగా నిరసనకు దారితీసింది. బిహార్ ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వంపైనే దాడి సాగింది. ఈ కేసుకు తమకు సంబంఽధం లేదని బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ వివరణ ఇచ్చాయి. లేఖ రాయడం, ప్రశ్నించడం నేరమా..? అని అనేకమంది తీవ్రంగా స్పందించారు.
ఇది తప్పు… అని భావిస్తే రోజుకొకరం లేఖ రాస్తాం… అంటూ మరో 180 మంది సెలబ్రిటీలు తాజాగా గళమెత్తారు. తొలుత లేఖ రాసిన 49 మందికీ సంఘీభావం ప్రకటిస్తూ రొమిలా థాపర్, హర్ష్ మంధర్, నసీరుద్దీన్ షా, ఆనంద్ ప్రధాన్… మొదలైన 180 మంది తాజాగా ఓ లేఖాస్త్రం సంధించారు. రాజకీయ పక్షాల నుంచి కూడా విమర్శలు శరాలు వచ్చిపడడంతో బిహార్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు పరిచింది. కేసు పెట్టిన లాయర్ సుధీర్ కుమార్‌పై ఎదురుకేసులు పెడుతోంది. పబ్లిసిటీ కోసం, వివాదం రేపడం కోసం ఆయన ఈ పనిచేశారనీ, చట్టాన్ని దుర్వినియోగం చేసే చేష్ట అని పోలీస్ శాఖ కోర్టులో పేర్కొంది.
Courtesy Andhra Jyothy..