ఆర్టీసీ సమ్మెకు బాధ్యులెవరు?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు మొత్తం 26, అందులో ఆరు తప్ప మిగతావి ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ పరిష్కరించదగినవే. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్టీసీ విభజన ప్రక్రియను పూర్తి చేయకపోగా, గత ఐదేళ్ళలో ఎప్పుడూ పూర్తి స్థాయి ఎం.డి.ని నియమించలేదు. ప్రభుత్వానికి ఆర్టీసీ పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు.
రోజుకు 36లక్షల కి.మీ. దూరం బస్సులను తిప్పుతూ సుమారు 97 లక్షల ప్రయాణీకులను, ట్రాఫిక్‌ సముద్రాన్ని దాటుకుంటూ, గుంతల రోడ్ల మీద సాగుతూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ కార్మికుడు ‘బస్‌ కా పయ్యా నహీ చలేగా’ అని ఆందోళనకు దిగిండు. ఆయన అలక బూనింది ప్రజల మీద కాదు. ప్రయాణీకుల మీద ప్రభుత్వం కన్నా కార్మికులకే ప్రేమ ఎక్కువ. ఆర్టీసీ బస్సులో వివిధ మనస్తత్వాలు కలవారు, రకరకాల అవసరాలతో బస్సు ఎక్కుతుంటారు. కార్మికులు వారిని సమాధాన పరిచి, రూల్స్‌ ప్రకారం టిక్కెట్టు ఇచ్చి, వచ్చిన ప్రతి పైసా లెక్కకట్టి డిపోలో జమ చేస్తారు. డీజిలును ఆదా చేయడంలోనూ, కండీషన్‌లో లేని బస్సులను సమర్థంగా నడపడంలోను ఆర్టీసీ కార్మికులు ఆరితేరినారు. వారు తమ కష్టంతో ఆర్టీసీకి దేశంలో మంచి పేరు సంపాదించి పెట్టిండ్రు. ప్రస్తుత సమ్మె కూడా సంస్థను కాపాడుకోవడానికే జరుపుతున్నరు.

ఆర్టీసీ కార్మికులను కష్టాలలోకి, సంస్థను నష్టాలలోకి నెట్టింది ప్రభుత్వమే. బస్సు పాసుల రాయితీల కింద చెల్లించ వలసిన మొత్తాన్ని సకాలంలో చెల్లించదు. రాయితీల కింద 2014–2019 మధ్య కాలంలో 2,822 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించవలసి ఉండగా చెల్లించింది సుమారు రూ.638 కోట్లు. సుమారు రూ.2,200 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బాకీ ఉన్నది. ఈ మొత్తం చెల్లిస్తే ఆర్టీసీకి ఉన్న నష్టాలను చాలా వరకు పూడ్చవచ్చు. డీజిల్‌పైన పన్నును తగ్గిస్తే, వ్యాట్‌ను తొలగిస్తే ఆర్టీసీని లాభాల బాటను నడిపించవచ్చు.

ప్రభుత్వానికి ఆర్టీసీ 2014–-19 మధ్య కాలంలో 1,052 కోట్ల రూపాయల వాహన పన్ను కట్టింది. ఏటా డీజిల్‌ పైన మరొక 600 కోట్ల రూపాయలు పన్ను చెల్లిస్తున్నది. వాస్తవానికి ప్రభుత్వం, ఆర్టీసీకి చెల్లిస్తున్న దానికన్నా ఆ సంస్థ నుండి ఎక్కువ పొందుతున్నది. ఆర్టీసీ వంటి సంస్థలను లాభాల కోసం కాకుండా ప్రజల అవసరాలను తీర్చడానికి నడిపిస్తారు. ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఆయువుపట్టు. అది పనిచేయకపోతే ఆర్థిక రంగం కుప్పకూలిపోతుంది. లాభమే లక్ష్యమైతే డీజిల్‌ రేట్లు పెరిగినప్పుడల్లా ఎప్పటికప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచితే లాభం వస్తది. కానీ ప్రజారవాణా వ్యవస్థలో ప్రజల అవసరాలు ప్రధానం. ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచితే దాని ప్రభావం ఉత్పత్తి రంగం మీద పడుతుంది. కొన్ని రూట్లలో ప్రత్యేకించి పల్లెలకు నడిచే బస్సుల మీద, సిటీ బస్సుల పైన టిక్కెట్టు విపరీతంగా పెంచితే తప్ప లాభం రాదు. అట్లా పెంచడం అస్సలు సాధ్యం కాదని తెలుసుకున్నం.
బాగా లాభాలు వచ్చే రూట్లలో ప్రైవేటు వాహన కంపెనీలు అక్రమంగా బస్సులను నడుపుతూ ఆర్టీసీకి వచ్చే లాభాలకు గండి కొడుతున్నాయి. ఈ బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది. పన్ను రాయితీలు ఇచ్చి, అక్రమంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను నియంత్రించి ఆర్టీసీని ఆదుకోవాలని ఉద్యమ కాలంలోనే కార్మికులు డిమాండ్‌ చేసినారు. అప్పుడు తెరాస ఈ విషయాలపైన ఆర్టీసీ కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చింది. తెలంగాణ వస్తే కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఇచ్చి, పన్ను రాయితీలు మంజూరు చేసి ఆర్టీసీని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. తెలంగాణ వచ్చిన తరువాత కార్మికుల జీతాలు అనుకున్న స్థాయిలో కాదు గానీ కొంత మేరకు పెరిగినాయి. కానీ, మిగతా హామీలు అమలు కాలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీకి రావలసిన నిధులను నెలనెలా విడుదల చేసి ఆర్టీసీని ఆదుకుంటామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాట తప్పినా కార్మికులు అలుపెరగకుండా పనిచేస్తున్నారు. 2014 తరువాత 6000 మంది కార్మికులు రిటైర్‌ అయ్యారు. ఆ భారాన్ని మిగిలిన 50,000 కార్మికులు మోస్తున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని, మైలేజీని, ఆక్యుపెన్సీ రేటును పెంచినారు. ఇవ్వాళ అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరి ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. పైగా కార్మికులు కేవలం జీతాల కోసమే సమ్మెచేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు జీతభత్యాల పెంపుదల కోసం సమ్మె చేయడం లేదు. వారు ఆర్టీసీ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు. సంస్థకు రావలసిన బకాయిలు ఇవ్వాలని, నష్టం వస్తున్న రూట్లలో నిలదొక్కుకోవడానికి వయబిలిటీ ఫండ్‌ ఇవ్వాలని, పన్ను రాయితీలను జారీ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం శాశ్వతంగా స్వీకరించాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. డిమాండ్ల పరిష్కారానికి జూన్‌ నెలనుండే కార్మికులు యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. డిమాండ్ల సాధనకు రకరకాల రూపాలలో నిరసన తెలిపినారు. కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు సమర్పించినారు. రవాణా శాఖ మంత్రిని రెండు సార్లు కలిసి సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని కోరినారు. ఎన్నికలకు ముందు 2018 ఆగస్టులో ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలను పరిశీలించి, పరిష్కారాలను సూచించాలంటూ నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన రవాణా రంగ నిపుణులు సభ్యులు. 2019 జూన్‌ నాటికి కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వం నివేదికను స్వీకరించలేదు. చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం దొరికేది. ప్రభుత్వానికి ఆర్టీసీని బాగుచేయాలన్న పట్టింపు లేకపోవడంతో జరిగిన ఈ పరిణామాలే సమ్మెకు దారితీసినాయి.
ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే కార్మిక సంఘాలు సమ్మెకు నోటీసు ఇచ్చినాయి. అప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పిలిచి మాట్లాడ లేదు. చివరికు కార్మికుల డిమాండ్లను తెలుసుకోవడానికి ముగ్గురు ఐ.ఎ.ఎస్‌. అధికారులతో ఒక కమిటీని వేసినారు. విలీనానికి అంగీకరించి, అందుకు విధివిధానాలను తయారు చేసే బాధ్యతను కమిటీకి అప్పగిస్తే సమ్మెను ఉపసంహరించుకుంటామని కార్మికులన్నారు. కానీ, హామీ ఇచ్చే అధికారం కమిటీకి లేదు. ఆ విషయం తేల్చగలిగిన వారు చర్చలకు వెళ్ళలేదు. కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు మొత్తం 26, అందులో ఆరు తప్ప మిగతావి ఆర్టీసీ మేనేజ్‌మెంట్‌ పరిష్కరించదగినవే. కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాత ఆర్టీసీ విభజన ప్రక్రియను పూర్తి చేయకపోగా, గత ఐదేళ్ళలో ఎప్పుడూ పూర్తిస్థాయి ఎం.డి.ని నియమించలేదు. ప్రభుత్వానికి ఆర్టీసీ పట్ల ఉన్న నిర్లక్ష్య ధోరణికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు. పన్ను రాయితీలు, విలీనానికి సంబంధించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఆరు డిమాండ్లు పోనూ మిగతా 20 డిమాండ్లను పరిష్కరిస్తే కార్మికులకు సమ్మెను వాయిదా వేయడానికి అవకాశం దొరికేది. కానీ, ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించ లేదు. ప్రజలకు పండుగ పూట సమస్యలు రాకూడదన్న సోయి ప్రభుత్వానికి లేదు.
ఇప్పుడు సమ్మె అక్రమమని, ఒక్క పెన్ను పోటుతో 48,500 కార్మికులను తొలగించడం అన్యాయం. చట్టపరంగా ఇది సాధ్యం కాదు. అయినా అహంకార పూరితంగా నిర్ణయం తీసుకున్నది. గతంలో జయలలిత తమిళనాడులో సమ్మెచేస్తున్న ఉద్యోగులందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేయలేక పోయింది. ఉద్యోగులు యథాతథంగా విధుల్లో కొనసాగినారు. ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్థ పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. చాలా మంది పేద ప్రజలు పనుల్లోకి వెళ్ళడానికి, మార్కెట్‌ చేరుకోవడానికి, విద్యార్థులు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు మాత్రమే ఏకైక మార్గం.
ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను సామాజిక బాధ్యతగా నిర్వహించాలి. అందుకు ఖర్చు చేయడానికి సిద్ధపడాలి. ఆ ఖర్చును అభివృద్ధికోసం చేస్తున్న వ్యయంగా చూడాలి. ప్రజారవాణా వ్యవస్థను మూసివేసిన రాష్ట్రాల్లో ఇవ్వాళ ఆదివాసీ గూడాలకు, పల్లెలకు, పట్టణ పేదలకు రవాణా కల్పించే మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికైనా నిరంకుశ ధోరణిని విడనాడి, ఆర్టీసీ కార్మికుల సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలి. ఆర్టీసీ బాగుపడాలంటే అది కార్మికుల భాగస్వామ్యంతోనే సాధ్యమని తెలుసుకోవాలి.
యం.కోదండరామ్‌
(వ్యాసకర్త తెలంగాణ జన సమితి అధ్యక్షులు)

RELATED ARTICLES

Latest Updates